మెయన్ ఫీచర్

కర్నూలుకు హైకోర్టు తరలింపు సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్య మంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో సంకేతం ఇవ్వడం, ఆ మరుసటి వారమే ప్రభుత్వం నియ మించిన జి.ఎన్. రావ్ కమిటీ ఆ మేరకు సిఫార్సులు చేయడం ఒక రకంగా కలకలం సృష్టించింది. ఈ నిర్ణయం ప్రభావం ఏ విధంగా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రాజకీయంగా వేసిన వ్యూహాత్మక అడుగుగా స్పష్టం అవుతున్నది. అమరావతిలో రాజధానిని కొనసాగిస్తూ, విశాఖపట్నంలో కార్యనిర్వాహక రాజధాని, కర్నూలులో హైకోర్టు (న్యాయపర రాజధాని) ఏర్పాటు చేయడం ద్వారా రాయలసీమ, ఉత్తరాంధ్రలలో తమ పార్టీ బలాన్ని స్థిరీకరించుకొని, విస్తరించుకునే ప్రయత్నం జగన్ చే స్తున్నట్లు వెల్లడవుతోంది. రాజధాని, కార్యనిర్వాహక రాజధానిల ఏర్పాటు విషయంలో ప్రభుత్వమే ఒక నిర్ణయం తీసుకొని అమలు పరచవచ్చు. అందుకు న్యాయ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. అయితే, కర్నూలులో హైకోర్టును ఏర్పా టు చేయడం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం కాదు. ఈ విషయమై రాయలసీమలో భావోద్వేగాలు రెచ్చ గొట్టడం మినహా ప్రభుత్వం మరేమీ చేయలేదు. రాజకీయ కారణాలతో హైకోర్టు మార్పునకు సుప్రీం కోర్టు సుముఖత వ్యక్తం చేసే అవకాశం ఉండదు. అందుకు మరెటువంటి సహేతుకమైన ప్రాతిపదిక కూడా కనిపించదు.
ప్రస్తుతం దేశంలో కొన్ని రాష్ట్ర రాజధానులలో కాకుండా అక్కడక్కడా హైకోర్టులు ఉన్నప్పటికీ అవన్నీ స్వాతంత్య్రానికి ముందు, ఆయా సమయాలలో కొన్ని ప్రాంతాలకు అవి రాజధానులుగా ఉన్నప్పుడు ఏర్పడినవి కావడం గమనార్హం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సం దర్భంగా అవి హైకోర్టు బెంచ్‌లుగా రూపాంతరం చెందా యి. హైకోర్టు బెంచ్‌లు ఏర్పర్చడానికి సహితం కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు అంత ఉదారంగా వ్యవహ రించడం లేదు. అలనాడు ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు గుంటూరులో ఏర్పాటు చేసిన హైకోర్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం హైదరాబాద్‌కు తర లించి, ఆంధ్ర ప్రాంతంలో కనీసం హైకోర్ట్ బెంచ్ ఏర్పాటు చేయాలని ఎన్ని ఆందోళనలు జరిపినా సాధ్యం కాకపోవడం గమనార్హం. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ముఖ్యంగా సమాచార సాంకేతికత, రవాణా సదు పాయాలు విస్తృతంగా అభివృద్ధి చెందిన సమయంలో హై కోర్ట్ బెంచ్‌ల ఏర్పాటుకు సుముఖత వ్యక్తం కావడం లేదు. అటువంటి పరిస్థితులలో హైకోర్ట్ ను అమరావతి నుంచి తరలించి, కర్నూలులో ఏర్పాటు చేయడం అంత సులభమైన వ్యవహారం కాబోదు.
హైకోర్టును తరలించడం ద్వారా ఒక ప్రాంతపు అభివృద్ధికి దారితీస్తామనడం ప్రజలను మోసం చేయడమే కాగలదు. హైదరాబాద్‌లోని పాతబస్తీలో హైకోర్ట్ ఉన్న ప్పటికీ ఆ ప్రాంతం ఏ మేరకు అభివృద్ధి చెందిందో చూడవచ్చు. హైకోర్ట్ రావడంతో అదనంగా జెరాక్స్ కేంద్రాలకు ఉపాధి లభించడం మినహా సాధారణ జనానికి ఏం ఒరుగుతుందని అప్పుడే రాజకీయ వర్గాలు ఎద్దేవా చేయడం చూస్తున్నాం. పాలనాపరమైన కార్యా లయాలు తరలించకుండా హైకోర్టుతో ఒరిగేది ఏమిటని అంటూ రాయలసీమ ఉద్యమకారులు పెదవి విరుస్తున్నారు.
మద్రాస్ రాష్ట్రం నుండి ఆంధ్ర రాష్ట్రాన్ని 1953లో ఆంధ్ర రాష్త్ర చట్టం, 1953లోని సెక్షన్ 3(1) ప్రకారం ఏర్పాటు చేసారు. ఈ చట్టంలోని సెక్షన్ 28 ప్రకారం ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్ట్‌ను 1956 జనవరి 1న గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆ వెంటనే పార్లమెంట్ రాష్ట్రాల పునర్విభజనకు అవసరమైన రాష్ట్ర పునర్విభజన చట్టం-1956ను ఆమోదించింది. ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం అంతకు ముందున్న హైదరాబాద్ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలను ఆంధ్రతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైంది. ఈ చట్టంలోని సెక్షన్ 50 కొన్ని కోర్టులను రద్దు చేసింది. హైదరాబాద్‌లో 1872లో ఏర్పడిన హైకోర్ట్‌ను రద్దు చేసి ఈ చట్టం సెక్షన్ 65 క్రింద ఆంధ్రప్రదేశ్ హై కోర్ట్‌ను ఏర్పాటు చేశారు. నూతన హైకోర్ట్ కు కేంద్రంగా రాష్టప్రతి నిర్ణయించి, నోటిఫై చేసిన ప్రాంతంలో ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ కేంద్రం హైదరాబాద్ అని ప్రకటించారు. దాంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ను గుంటూరు నుండి హైదరాబాద్ కు తరలించారు.
ఇప్పటి వరకు కేంద్రం ప్రకటించిన చోట నుండి ఏ హైకోర్ట్ ను కూడా మరోచోటకు మార్చిన దాఖలాలు లేవు. అయితే ఆయా చట్టాల కింద దఖలు చేసిన అధికారాలను బట్టి కొన్ని చోట్ల హైకోర్ట్ బెంచ్‌లను మాత్రం ఏర్పాటు చేశారు. ఏపీ పునర్విభజన చట్టం-2014 జూన్ 2, 2014 నుండి అమలులోకి వచ్చింది. ఈ చట్టంలోని సెక్షన్ 30(1) ప్రకారం హైదరాబాద్‌లో నెలకొన్న హైకోర్ట్ ఆఫ్ జుడికేచర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఉమ్మడిగా హైకోర్ట్‌గా కొన సాగింది. సెక్షన్ 31(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకంగా హైకోర్ట్ ఏర్పాటు చేసే వరకు ఈ ఏర్పాటు కొనసాగుతుందని చట్టంలో పేర్కొన్నారు. సెక్షన్-31 ప్రకారం రాష్ట్రంలో హైకోర్టు కానీ, దాని బెంచీలు కానీ ఏర్పాటు చేసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది. సెక్షన్-31(1) ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలి. సెక్షన్-31(2) ప్రకారం ప్రధాన హైకోర్టును రాష్టప్రతి ఉత్తర్వులు మేరకు ఏర్పాటు చేయాలి. సెక్షన్ 31(3) ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన హైకోర్టు ప్రాంతంలో కాకుండా, ఇతర ప్రాంతాల్లో అవసరం అనుకుంటే, హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేసుకునే అధికారం, కేవలం రాష్ట్ర గవర్నర్ ఉత్తర్వులు ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం-2014 ప్రకారం కచ్చితమైన విధానం.
సెక్షన్-31(2) ప్రకారం రాష్టప్రతి ఉత్తర్వుల మేరకు, సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా అమరావతిలో ప్రధాన హైకోర్టును ఏర్పాటు చేశారు. ఇక ప్రధాన హైకోర్టు స్థానాన్ని అమరావతి నుంచి కదిలించటం లేదా తరలింపు చేయటం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు, ఎట్టి పరి స్థితిలోనూ కుదరదు. సెక్షన్-31(3) ప్రకారం మాత్రమే ఎక్కడైనా కేవలం హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసుకునే అధికారం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అటువంటి పరిస్థితుల్లో ప్రధాన హైకోర్టుని రాయలసీమలో ఎలా ఏర్పాటు చేస్తారు? చట్టంలోని నిబంధనలు పరిశీలించినట్లయితే ఒకసారి హైకోర్ట్ కేంద్రం ఏర్పడిన తర్వాత గవర్నర్ ఆమోదంతో ప్రధాన న్యాయమూర్తి డివిజన్ కోర్ట్ లను ఇతర ప్రదేశాలలో (హైకోర్ట్ బెంచ్)లను ఏర్పాటు చేయడానికి వీలుంది. కానీ, హైకోర్ట్ కేంద్రాన్ని ఒక సారి నోటిఫై చేసిన తర్వాత దానిని మార్చే సౌలభ్యం చట్టంలో లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్ట్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేయడానికి అనువైన ప్రదేశాన్ని గుర్తించి, హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి తెలుపమని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఒక న్యాయవాది వేసిన పిటిషన్ పై సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం తెలిసిందే. హైకోర్ట్ ఏర్పాటుకు తగిన ప్రదేశాన్ని ఎంపిక చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సంప్రదింపులు జరిపి ఒక నిర్ణయం తీసుకోమని ప్రధాన న్యాయమూర్తిని కోరింది. ఈ అంశం సుప్రీం కోర్ట్ ముందుకు వచ్చింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ఏర్పాటుకు ఉద్దేశించిన ప్రదేశంలో లభించే సదుపాయాల పట్ల అక్కడ న్యాయమూర్తులుగా వెళ్లే వారు సంతృప్తి చెందితే, ఒక న్యాయమూర్తుల కమిటీ తనిఖీ చేసి నివేదిక సమర్పించిన అనంతరం ఆమోదించమని సుప్రీం కోర్ట్ సూచించింది.
రెండు హైకోర్ట్‌లు పనిచేసేలా జనవరి 1, 2019 న ఒక ప్రకటన జారీ చేసే ప్రతిపాదనలను సుప్రీం కోర్ట్ ఆమోదించింది. అప్పటి నుండి రెండు హైకోర్ట్‌లు వేర్వే రుగా పనిచేయవచ్చని పేర్కొన్నది. సుప్రీం ఆదేశాల ప్రకారం జనవరి 1, 2019 నుండి అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ను ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్ట్ డిసెంబర్ 26, 2018న ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రాష్ట్ర పునర్విభజన చట్టం- 2014లోని సెక్షన్ 32(2) ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చట్టం ప్రకారం జారీ చేసిన ప్రకటనను రద్దు చేసే, అదే సెక్షన్ కింద తాజాగా మరో ప్రకటన జారీ చేస్తే గాని హైకోర్ట్‌ను మార్చడం సాధ్యం కాదు. అయితే సెక్షన్ 31 ప్రకారం ఆ విధంగా హైకోర్ట్ కేంద్రాన్ని మార్చే అధికారం ఈ చట్టం కల్పించడం లేదు. కేవలం డివిజనల్ బెంచ్‌లను మరో చోట ఏర్పాటు చేసుకొనే సౌలభ్యాన్ని మాత్రమే కల్పిస్తుంది.
న్యాయపరంగా ఇదొక విచిత్ర పరిస్థితిని సూచిస్తున్నది. తొలుత రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సెక్షన్ 30(1)(ఎ) కింద ఉమ్మడిగా ఒక హైకోర్ట్‌ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఉమ్మడి హైకోర్ట్‌ను సెక్షన్ 31(1) ప్రకారం విభజించి, సెక్షన్ 2 ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ ను అమరావతి కేంద్రంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్రపతి ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టం ప్రకారం ఒకసారి ప్రకటించిన హైకోర్ట్ కేంద్రాన్ని రద్దు చేసే అధికారం లేకపోయినప్పటికీ, తిరిగి రాష్ట్రపతికి మరో ఉత్తర్వు జారీచేసే అధికారం ఉండవచ్చని వాదించవచ్చు. రాష్ట్రపతికి అటువంటి అధి కారం ఉందా? లేదా? అన్నది న్యాయపరమైన చర్చ నీయాంశం కాగలదు. అమరావతి కేంద్రంగా హైకోర్టును ఏర్పర్చడంలో అప్పట్లో ఉమ్మడి హైకోర్ట్ నుండి న్యాయమూర్తుల కమిటీ పరిశీలించి, అక్కడున్న సదు పాయాల పట్ల సంతృప్తి వ్యక్తం చేయడం కీలకమైనది. అటువంటి హైకోర్ట్ కేంద్రాన్ని ఇప్పుడు ఏ ప్రాతిపదికపై కర్నూలుకు మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్ట్ ను గాని, హైకోర్ట్‌ను గాని కోరుతుందన్నది ప్రశ్నార్థకంగా మారనున్నది. కేవలం రాజకీయ కారణాలను ఉటంకించడం న్యాయపరిభాషలో ఏమేరకు ఆమో దయోగ్యం కాగలదో చూడవలసి ఉంది. పైగా, హైకోర్టులో 76 శాతం కేసులు ప్రభుత్వానికి సంబంధించినవే ఉంటాయి. సాధారణ కక్షిదారుల కన్నా ప్రభుత్వ అధికారులు, న్యాయవాదులు ఎక్కువగా తిరగవలసి ఉం టుంది. సచివాలయం విశాఖపట్నంలో పెట్టి, హైకోర్ట్‌ను కర్నూలులో ఏర్పాటు చేస్తే- ఇక పాలన, న్యాయ పక్రియలు పడకేసినట్లే కాగలదు. ఇది అనాలోచిత చర్య అని చెప్పక తప్పదు.
'చిత్రం... అమరావతిలోని హైకోర్టు

-చలసాని నరేంద్ర