మెయన్ ఫీచర్

దేశంలో ఇక పౌర నమోదు వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెండు మూడేళ్లలో భారతదేశంలో పౌర నమోదు వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. ఇది ఆధార్‌కు మరో ముందడుగు. అంటే భారతదేశంలో ఉన్న పౌరులు అందరి జాతకాలు అందులో ఉంటాయి. దేశంలో ఉంటున్న పౌరుల్లో ఎవరు స్థానికులో, ఎవరు ఇతర ప్రాంతాల నుండి వచ్చారో ఈ రికార్డులతో తేలికగా క్షణాల్లో సమాచారం తెలుసుకునే వ్యవస్థ అందుబాటులోకి రాబోతోంది. అనేక మంది ఎలాంటి రికార్డులు లేకుండా దేశంలో అడ్డదారిలో ప్రవేశించి దశాబ్దాల తరబడి నివాసం ఉంటున్నా వారిని అడిగే పరిస్థితే లేదు. స్థానికులుగా భ్రమింపచేస్తూ వారంతా రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు, ప్యాన్ కార్డులు, డ్రైవింగ్‌లైసెన్స్‌లు సంపాదించి, ప్రభుత్వ పథకాలను తేలికగా పొందుతున్నా అడిగేవారే లేరు. అలాంటి పౌరులకు ఈ దేశం పట్ట ఎలాంటి భావన కలుగుతుందో ఊహించవచ్చు.
దేశవ్యాప్తంగా మూడు అంశాలపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), జాతీయ జానాభా పట్టిక (ఎన్‌పీఆర్), జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ). జాతీయ జనాభా పట్టిక వల్ల దేశంలో ప్రజలకు ఇబ్బందులు తప్పవని, కొంత మంది దేశం విడిచి వెళ్లాల్సి వస్తుందని, మరీ ముఖ్యంగా ముస్లింలకు ముప్పుతప్పదనే ప్రచారంతో దేశవ్యాప్తంగా పౌరాగ్రహాన్ని చూస్తున్నాం. వాస్తవానికి ఈ పౌరాగ్రహం వెనుక రాజకీయాలే కనిపిస్తున్నాయి.
మన ఇంటిలోకి అర్ధరాత్రి కిటికీలో నుండో, వెనుక తలుపు పగులగొట్టి తెలియని వ్యక్తి ప్రవేశిస్తే మనం చెబుతాం.. ఒక దొంగ ప్రవేశించాడని చెబుతాం. అవసరమైతే పట్టుకుని ఆయనపై కేసులు పెడతాం, న్యాయవ్యవస్థ ఆయనను శిక్షిస్తుంది. ఆ దొంగ జైలుకు వెళ్లాల్సి వస్తుంది. అదే ఒక చిన్న అపార్టుమెంట్ తీసుకోండి.. అక్కడ మన స్నేహితుడి ఇంటికి వెళ్తాం. వెంటనే అపార్టుమెంట్‌లో ఉన్న సెక్యూరిటీ మనల్ని పేరు, ఫోన్ నెంబర్, చిరునామా, ఎందుకు వచ్చామో, ఎవరిని కలవడానికి వచ్చామో, ఎపుడు వచ్చామో, ఎపుడు తిరిగి వెళ్తున్నామో కూడా లిఖితపూర్వకంగా రాయాలి. ఈ మధ్య కొండాపూర్‌లోని కొన్ని అపార్టుమెంట్లకు మన ముఖం వీడియో తీస్తున్నారు, దానిని ఆ అపార్టుమెంటులోని వ్యక్తులకు చూపిస్తున్నారు. వారు అంగీకరిస్తేనే మనల్ని లోపలికి వెళ్లనిస్తున్నారు. మరి కొన్ని అపార్టుమెంట్లలో బయోమెట్రిక్ సేకరిస్తున్నారు. వెళ్తున్నపుడు మళ్లీ బయోమెట్రిక్ ఇస్తేనే ఆయా ద్వారాలు తెరుచుకునేలా ఏర్పాట్లు జరిగాయి. అలాంటపుడు ఇంత పెద్ద భారతదేశంలోకి ఎవరు వస్తున్నారో, ఎపుడు వస్తున్నారో.. ఎందుకు వస్తున్నారో తెలుసుకోవల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఇంతకాలం ఎందుకు ఊరుకున్నారు.. అది అప్రస్తుతం, ఇపుడైనా ప్రభుత్వం మేల్కొన్నపుడు మనం ఏం చేయాలి? ప్రభుత్వ చర్యలను సమర్ధించాలి. వాస్తవికంగా అన్ని రికార్డులతోనూ, నిజాయితీగా దేశంలో ప్రవేశించేవారికి ఇపుడే కాదు, ఎపుడూ ఇబ్బంది లేదు. ఎన్ని ఆంక్షలు విధిస్తున్నా, పద్ధతి ప్రకారం అమెరికానో, బ్రిటనో భారతీయులు వెళ్లి ఏళ్ల తరబడి నివసించడం లేదా? నకిలీ పత్రాలతో వెళ్లినవారికే భయం, ఆందోళన ఉంటుంది.
ఆ మధ్య ఒక వ్యక్తి తరచూ పాకిస్తాన్‌లో మరో వ్యక్తితో మాట్లాడుతున్నాడనే నిఘావిభాగం సమాచారంతో పరిశీలిస్తే ఆయన భారతీయుడిగా అన్ని రికార్డులూ సమకూర్చుకున్నాడు. చివరికి పాస్‌పోర్టుతో సహా.. కానీ ఆయన పాకిస్తాన్ పౌరుడని గుర్తించి పోలీసులు నాలిక కరుచుకున్నారు. ఇలా లెక్కలు తీస్తే ఈశాన్య రాష్ట్రాల్లోనే కాదు, మైదాన ప్రాంతాలున్న రాష్ట్రాల్లో కూడా లెక్కకు మిక్కిలిగా ఇతర దేశాలకు చెందిన వారు అజ్ఞాతంగా నివసిస్తున్నారనేది నిర్వివాదాంశం. బహిరంగంగానే భారతీయ చట్టాలనూ, సంప్రదాయాలను, సంస్కృతిని వ్యతిరేకిస్తూ, విబేధిస్తూ, నిరసిస్తూ కూడా జీవిస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఏ దేశంలోనూ లేదు. కేవలం మతాన్ని కించపరిచిన కారణంతో ఒక ప్రొఫెసర్‌ను పాకిస్తాన్‌లో ఉరితీయమని అక్కడి న్యాయస్థానం ఆదేశించింది. అలాంటి దారుణమైన ఘటనలు అన్ని దేశాల్లో జరుగుతున్నా, అందర్నీ స్వీకరించి మానవత్వంతో చేర్చుకునే గొప్ప సంస్కృతి భారతీయులను రానురాను ఇబ్బందుల్లో పడేస్తోంది. ఎవరి మతాన్ని వారు గౌరవించుకోవడంపై ఎవరికీ అభ్యంతరాలు లేవు, కానీ మరో మతంపై ఆధిపత్యం సాధించాలనే వ్యూహాత్మక కార్యాచరణతో అశాంతిని రేకెత్తించడం ఈ దేశానికి ఎంత మాత్రం శ్రేయోస్కరం కానేకాదు. దీనిపైన కేంద్రం దృష్టిసారించేసరికి ఇపుడు విపక్షాలు భగ్గుమంటున్నాయి.
పౌరసత్వ చట్టం అంటే ఏమిటి? ఆ చట్టానికి చేసిన సవరణ ఏమిటి? జాతీయ జనాభా పట్టిక అంటే ఏమిటి? జాతీయ పౌర పట్టిక అంటే ఏమిటి ఈ అంశాలపై అవగాహన కొరవడటం కూడా దేశంలో పౌరాగ్రహానికి కారణమైంది. నిజానికి గొడవలు కొన్ని ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. మరింత సూక్ష్మంగా చూస్తే రానున్న రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగే ప్రాంతాల్లో జరుగుతున్నాయి. చెదురుమదురుగా ఒక మతం వారు ఎక్కువ కేంద్రీకృతంగా ఉన్న ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. అంటే దీనివెనుక ఉన్న రాజకీయాలు ఇట్టే అర్ధమవుతున్నాయి.
దేశంలో ఎవరు ఎన్ని నిరసనలు తెలిపినా జనగణన అనివార్యమని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి సుస్పష్టం చేశారు. జనగణన -2021, జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)కు కేంద్రం రంగం సిద్ధం చేసింది. ఎన్‌పీఆర్ అంటే దేశంలోని సాధారణ నివాసుల వివరాలతో కూడిన ఒక రిజిస్టర్. పౌరసత్వం చట్టం 1955 పరిధిలో పౌరసత్వ నిబంధనలను పాటిస్తూ 2003 కటాఫ్‌గా ఈ ఎన్పీఆర్‌ను రూపొందిస్తారు. ప్రతి సాధారణ పౌరుడి వివరాల డాటాబేస్‌ను సిద్ధం చేస్తారు. ఆరు నెలలు లేదా అంతకన్నా ఎక్కువ కాలం పాటు ఒక చోట నివాసం ఉన్న వ్యక్తి లేదా కనీసం రానున్న ఆరు మాసాలు ఒక ప్రాంతంలో ఉండాలని నిర్ణయించుకున్న వ్యక్తిని సాధారణ నివాసిగా పరిగణిస్తారు. స్థానిక గ్రామం, మండలం, తాలూకా, జిల్లా, రాష్ట్ర స్థాయి , జాతీయ స్థాయిలో ఆ వివరాలను అప్‌డేట్ చేస్తారు. పుట్టిన ప్రతి వ్యక్తీ తమ వివరాలను నమోదు చేసుకోవాలి, అలాగే మరణించిన ప్రతి వ్యక్తీ వివరాలు నమోదు కావల్సి ఉంటుంది. ఇపుడు లెక్కలు చూస్తే 68 శాతం మంది మాత్రమే జనన వివరాలు నమోదు చేస్తుండగా, 15 శాతం కూడా మరణాలు నమోదు కావడం లేదు. నివాస స్థితి, కుటుంబ యజమానితో ఉన్న బంధుత్వం, లింగ బేధం, పుట్టిన తేదీ, వైవాహిక స్థితి, విద్యార్హత, వృత్తి, తల్లిదండ్రులు లేదా భాగస్వామ్యుల పేర్లు, జన్మస్థలం, జాతీయత, ప్రస్తుత చిరునామా, శాశ్వత చిరునామా వంటి వివరాలు కూడా ఈ పట్టికకు అందజేయాలి. ప్రతి పౌరుడూ ఈ పట్టికలో నమోదు కావల్సి ఉంటుంది. వారికి జాతీయ గుర్తింపు కార్డులను ఇస్తారు. సాధారణ నివాసుల సమగ్ర వివరాలతో పాటు వారి బయోమెట్రిక్ వివరాలు, ఆధార్‌తో అనుసంథానం అవుతాయి. ఆ వివరాలు పాన్ కార్డుతోనూ, ఇన్‌కం టాక్స్ వివరాలతోనూ లింక్ అవుతాయి. చివరికి మనం వాడే సెల్‌ఫోన్ వివరాలు, రానున్న రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో మన అకౌంట్ల వివరాలు కూడా అందులో చేరుతాయి.
ఇక ఎన్‌పీఆర్‌తో పోలిస్తే జనగణనలో మరిన్ని వివరాలను సేకరిస్తారు. వ్యక్తి గృహ వివరాలు, ఇంటి నిర్మాణం, కుటుంబ సభ్యుల పూర్తి వివరాలు, గృహోపకరణాల వివరాలు, పూర్తి ఆదాయ మార్గాలు, వ్యవసాయ వ్యవసాయేతర ఆదాయ మార్గాలు, వాణిజ్య ఆదాయం, ఎస్సీ, ఎస్టీలైతే ఆ వివరాలు, భాష, మతం, దివ్యాంగులైతే ఆ వివరాలు నమోదు చేస్తారు. జనగణన - 2021 రెండు దశల్లో పూర్తి చేస్తారు. 2020 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకూ తొలి దశ పూర్తిచేస్తారు. ఈ దశలో కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలు నమోదు చేస్తారు. 2021 ఫిబ్రవరి 9 నుండి 28 మధ్య రెండో దశ వివరాలు నమోదు చేస్తారు. ఆ దశలో వర్గాల వారీ మొత్తం జనాభా లెక్కలు తేలుస్తారు.
చట్ట ప్రకారం భారతీయ పౌరులుగా నమోదైన వారి జాబితాను భారతీయ జాతీయ పౌర పట్టికగా వ్యవహరిస్తారు. ఇందులో 1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారతీయ పౌరులుగా అర్హత పొందిన వారి పేర్లతో పాటు వారికి సంబంధించిన ఇతర వివరాలు కూడా పొందుపరుస్తారు. ఈ పట్టికను మొదట 1951లో ప్రభుత్వం రూపొందించింది. ఇంత వరకూ దానిని అప్‌డేట్ చేయలేదు. అయితే అస్సాంలో మాత్రం ఎప్పటికపుడు అప్‌డేట్ అవుతోంది. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం ఈ దేశంలో పుట్టిన ప్రతి వ్యక్తి భారతీయ పౌరుడే అవుతాడు. భారతీయ పౌరసత్వానికి సంబంధించి చాలా స్పష్టంగా రాజ్యాంగంలో లిఖించారు.
జాతీయ పౌరపట్టిక (ఎన్‌ఆర్‌సీ)కీ, జాతీయ జనాభా పట్టికకు (ఎన్‌పీఆర్)కూ మధ్య లంకె లేదని ఇప్పటికే కేంద్ర హోం శాఖ స్పష్టం చేసింది. ఎన్‌పీఆర్ అనేది దేశంలోని సాధారణ నివాసితుల జాబితా మాత్రమేనని, ఇది పౌరసత్వ చట్టం -1955 నిబంధనల కింద సిద్ధం చేస్తారని కేంద్రం వివరించింది. 2011 జనాభా లెక్కల ప్రక్రియలో భాగంగా 2010లోనే ఎన్‌పీఆర్ కోసం డాటా సేకరించారు. 2015లో ఇంటింటి సర్వే ద్వారా వివరాలను అప్‌డేట్ చేశారు. సంబంధిత వివరాల డిజిటలీకరణ కూడా పూర్తయింది. ప్రస్తుతం 2021 జనాభా లెక్కల సేకరణ ప్రక్రియలో భాగంగా వచ్చే ఏడాది ఎన్‌పీఆర్ మళ్లీ అప్‌డేట్ చేస్తారు. పశ్చిమబెంగాల్, కేరళ, రాజస్థాన్, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ఎన్‌పీఆర్‌కు వ్యతిరేకమని చెబుతున్నాయి. వాస్తవానికి ఈ డేటా ప్రజలకు వ్యక్తిగతంగా బహిరంగంగా అందుబాటులో ఉండదు. అవసరమైన వ్యక్తులు, పాస్‌వర్డు సురక్షిత ప్రోటోకాల్ విధానాల్లో మాత్రమే ఈ సమాచారాన్ని పొందగలుగుతారు. దేశ అంతర్గత భద్రతను మెరుగుపరిచేలా , సంక్షేమ పథకాల ప్రయోజనాలను వాస్తవ లబ్ధిదారులకు చేరేలా ఈ డేటా వినియోగించుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. మరో పక్క కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఇప్పటికే 56 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అవి నేడో రేపో విచారణకు రానున్నాయి.
దేశంలో అవాంఛనీయ వ్యక్తుల నిరోధాన్ని అడ్డుకోవాలంటే ఏదో ఒక రూపంలో ఖచ్చితమైన రికార్డులు అందుబాటులో ఉండాల్సిందే. రికార్డులకు ఎక్కని, ఇతర దేశస్థులను ఏం చేయాలనేదానిపై విపక్షాలు సూచనలు సలహాలు ఇస్తే దానివల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

- బి.వి. ప్రసాద్ 99633 45056