మెయిన్ ఫీచర్

ప్రపంచ యాత్రికురాలు నర్మద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె సప్త సముద్రాలను దాటింది..
ఏడు ఖండాలను చుట్టేసింది..
ప్రాచీన, ఆధునిక ప్రపంచ వింతలన్నింటినీ చూసేసింది..
నింగి, నేల, వాయు, జల మార్గాల గుండా అన్నింటిలోనూ ప్రయాణం చేసింది..
అలా..
ఇప్పటివరకు 169 దేశాలను చుట్టివచ్చిన ప్రపంచ యాత్రికురాలు, సాహస మహిళ ఆమె..
పేరు నోముల నర్మదారెడ్డి..
ఇన్ని దేశాలు చుట్టివచ్చిన అనుభవాలతో ‘ఆగదు మా ప్రయాణం, కొలంబస్ అడుగుజాడల్లో..’ అనే రెండు పుస్తకాలను రాసింది నోముల నర్మదారెడ్డి. అసలు ప్రపంచాన్ని చుట్టి రావచ్చనే కోరిక గురించి, ఆ అనుభవాల గురించి ఆమె మాటల్లోనే తెలుసుకుందాం..
ఈమె నేషనల్ బాట్మింటన్ క్రీడాకారిణి కూడా.. స్వతహాగా అడ్వకేట్..
నాకు చిన్నప్పటి నుంచీ రామాయణ, భారతాలు చదివే అలవాటు ఉంది. దాంతో రామాయణంలో హనుమంతుడు ఉఫ్ అంటూ గట్టిగా గాలి పీల్చి పైకి ఎగురుతాడు కదా.. అలా నేను కూడా ఎగరాలని చిన్నప్పటి నుంచీ కలలు కనేదాన్ని. కానీ ఇన్ని దేశాలు చుట్టి వస్తానని అనుకోలేదు. ఎప్పుడూ కొత్త ప్రదేశాలు చూడాలనే కోరిక మాత్రం ఉండేది. చిన్నప్పుడు, యవ్వనం చదువు, ఆటలతోనే గడిచిపోయింది. తరువాత పెళ్లయింది. అదృష్టమేమిటంటే.. నా భర్తకు కూడా ప్రయాణాలంటే చాలా ఇష్టం. మొదటగా మా ప్రయాణం చిన్ని చిన్ని అడుగులతో మొదలైంది. ఊటీ, కొడైకెనాల్, బెంగళూరు, మైసూరు.. ఇలా దగ్గర దగ్గరగా ఉన్న ప్రదేశాలు చూడటం మొదలుపెట్టాము మా జీవితంలో. అలా మొదలైన మా కోరిక.. పది సంవత్సరాల్లో భారతదేశం మొత్తం చుట్టేలా చేసింది. భారతదేశం పూర్తయ్యింది కదా.. సింగపూర్, బ్యాంకాక్ వంటి ప్రదేశాలను చూద్దాము.. వాటికి టికెట్ రేట్లు తక్కువగా ఉన్నాయి కదా.. అని మొదలుపెట్టాము. అలా అలా అడుగులు పడ్డాయి. మొదటగా ఇన్ని యాత్రలు చేస్తామనైతే అనుకోలేదు.
మార్స్‌టైన్ ప్రసిద్ధ సూక్తి ‘ఎక్స్‌ప్లోర్ డ్రీమ్ అండ్ డిస్‌కవర్’ నాకు ఎప్పుడూ స్ఫూర్తి నిస్తుంది. అలా నేను సగం ప్రపంచాన్ని చుట్టి వచ్చాను. అప్పుడే ‘ఆగదు మా ప్రయాణం’ అనే పుస్తకం రాశాను. వాటి గురించి రాసిన తరువాత ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ప్రయాణాల్లో నాకు ఎన్నో కొత్త విషయాలు నేర్పించాయి. అదే నాకు కొండంత సంతృప్తినిచ్చింది. ఎంతోమందికి చూడటానికి సాధ్యంకాని వాటిని కూడా నేను చూశాను అన్న ఆనందం.. ఏదో సాధించాను అన్న నమ్మకం.. ఇంకా అధిగమించాల్సింది, సాధించాల్సింది ఎంతో ఉందన్న ప్రోత్సాహం.. ఇవన్నీ నన్ను నిత్యం హుషారుగా ఉండేలా చేస్తాయి. ఇన్ని దేశాలు తిరిగావు కదా.. ఇంకా ఏదైనా ప్రత్యేక పర్యటనలు చేయబోతున్నావు అని నాతో నేను వేసుకున్న ప్రశ్నకు సమాధానంగా రాసిన పుస్తకమే.. ‘కొలంబస్ అడుగు జాడల్లో..’.
ఈ భూమిపై ఎవరు ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో, ఎలా ఉన్నారో కూడా తెలియని కాలంలో కొంతమంది మనుషులు తమ వ్యయప్రయాసలకోర్చి, వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి, లెక్కలేనన్ని అగాథాలను దాటుకుంటూ అక్కడి మనుషుల గురించి, వారి దేశం గురించి, వారి ఆచార వ్యవహారాల గురించి ప్రపంచానికంతటికీ తెలిపారు. ఆ గొప్ప వ్యక్తుల మూలంగా మనమందరం ఇవాళ ఒకరికి ఒకరం తెలిసిపోయాం. ఒకరితో ఒకరం మాట్లాడుకుంటున్నాం. వారి ఉద్దేశాలు, అవసరాలు ఏమైనప్పటికీ తమ యాత్రల ద్వారా మానవాళికి ఎంతో గొప్ప సేవ చేసిన మార్గదర్శకులు ఫాహియాన్, హుయాన్ త్సాంగ్, మార్కోపోలో, కొలంబస్, వాస్కోడిగామా.. ఇలా ఎంతోమంది. ఆ మహానుభావులు నడయాడిన నేలపై, వారు తిరిగిన మార్గంలో నేను ఎందుకు ప్రయాణించకూడదు అన్న ఒక చిన్న ఆలోచనే నన్ను ఈ దారి గుండా ప్రయాణం చేసేలా చేసింది. మార్కోపోలు ప్రయాణించిన సిల్క్ రూట్ గుండా మంగోలియా, చైనా తదితర దేశాలన్నీ ఇప్పటికే తిరిగొచ్చాను. తరువాత ఉత్తర, దక్షిణ అమెరికా ఖండాల మధ్య ఉన్న దీవుల్ని, లాటిన్ అమెరికా ఖండానికి మార్గాన్ని కనుగొన్న ‘కొలంబస్’ ప్రయాణించిన మార్గం గుండా ప్రయాణించాలని నిశ్చయించుకున్నాను. ఈ మార్గమంతా నాలుగు దఫాలుగా కొలంబస్ నౌకలో చుట్టి వచ్చాడు. కానీ నేనైతే నా సౌలభ్యం కోసం ఎక్కువ యాత్రను క్రూజ్‌లో, ఇంకొంత యాత్రను విమానం ద్వారా ప్రయాణించి వాటినన్నింటినీ చూసి వచ్చాను. వెనిస్‌లో నివసిస్తున్న కొలంబస్ పక్కనే ఉన్న సముద్రం గుండా ప్రయాణించి వాటిని కనుగొన్నాడు. కానీ ఎక్కడో సుదూరాన ఉన్న ఇండియా నుండి అక్కడికి వెళ్ళడమంటేనే ఎంత వ్యయప్రయాసలతో కూడుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పైగా వీటిలో ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళాలంటేనే ఎన్నో వందల, వేల కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఒక్కసారి వీటిని గమనిస్తే అర్థమవుతుంది. హైదరాబాద్ నుండి న్యూయార్క్‌కు, న్యూయార్క్ నుండి పోర్కోరికాకు, పోర్కోరికా నుండి కొలంబియాకు, పనామా నుండి బొగొట్టాకు, బొగొట్టా నుండి కార్టజీనాకు, కార్టజీనా నుండి న్యూయార్కుకు ప్రయాణం. ఇలా మొత్తంగా 35, 600 కిలోమీటర్లు.. దాదాపు 35 రోజుల పాటు ప్రయాణం. ఇన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసింది కొలంబస్ కోసమే.. కొలంబస్ ఎలాగైతే నాలుగు దఫాలుగా యాత్రలు చేశాడో.. నేను కూడా మూడు దఫాలుగా ఈ యాత్ర చేశాను. కొలంబస్ తిరిగిన దేశాలు తిరుగుతుంటే ఆయా ప్రాంతాల సంస్కృతి, అక్కడి ప్రజల ఆచార వ్యవహారాలు, నమ్మకాలు, విశ్వాసాలు అబ్బురపరిచాయి. కొలంబస్‌లా ప్రాణాలను ఫణంగా పెట్టి ఎన్నో సంవత్సరాలు వెచ్చించి గమ్యం తెలియని ప్రయాణంలా నా యాత్ర కొనసాగలేదు. కానీ ఇంచుమించుగా కొలంబస్ నడయాడిన ప్రాంతాలన్నింటినీ తిరిగొచ్చాను. యూరప్, అమెరికా, న్యూజిలాండ్ పర్యటనలు మా కొడుకు, కోడలుతో.. మలేషియా, ప్యారిస్, జార్జియా వంటివి అల్లుడు, కూతురితో కలిసి పర్యటించాను. నా ప్రతి పర్యటనలో మావారు తోడుగా ఉన్నారు. అలా కుటుంబ సభ్యులతో కలిసి పర్యటించిన అనుభవాలు, అనుభూతులు నేను ఎప్పటికీ మరిచిపోలేను. ఇన్ని దేశాలు, ప్రాంతాలు తిరుగుతూ కూడా 95 దివ్యదేశాలు(పుణ్యక్షేత్రాలు) చూసి వచ్చాను. దివ్యదేశాలు అంటే విష్ణు సహస్రనామ ధ్యేయంతో 108 ప్రసిద్ధ దేవాలయాలు నిర్మిస్తే వీటిలో నేను 95 ప్రదేశాలు చూసి తరించాను. ఇక కేవలం 13 మాత్రమే మిగిలిపోయాయి.
నేడు మహిళలు ఏ విషయంలోనూ తక్కువ కాదు. అంతరిక్షంలోకి దూసుకుపోతున్న నేటి తరుణంలో ముందు ముందు మహిళలు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని సాటి మహిళగా నేనెప్పుడూ కోరుకుంటూ ఉంటాను. విదేశాల్లో మహిళలు ఎంతో ధైర్యంగా ఉంటారు. పిల్లలు చిన్నగా ఉన్నప్పటి నుండీ తల్లిదండ్రులు వారిని ఎంతో ధైర్యంగా పెంచుతారు. ముఖ్యంగా ఆడపిల్లలు మరీ ధైర్యంగా ఉంటారు. నేను విదేశాలు తిరిగాను కదా.. ఒక్కో దేశం తిరిగినప్పుడు ఒక్కో స్పందన. నేను ఇటీవల ఖజికిస్తాన్, తురికిస్తాన్.. దేశాలు తిరిగినప్పుడు అక్కడ ఒక లేక్ దగ్గరికి వెళ్లాము. మునుపు అక్కడకు అలెగ్జాండర్ వెళ్లాడట. మరో లేక్‌కు వెళ్లినప్పుడు మరో చరిత్రకు సంబంధించిన సంఘటన. ఇలా ఎన్నో.. ఈ వారంలో మయన్మార్ వెళ్లాను. ప్రపంచంలో ఉన్న గుహలు ఎన్నింటినో చూశాను. కానీ విచిత్రమైన గుహలు మాత్రం బర్మాలో చూశాను. 16 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక ఊరిలో రెండు వేల గుళ్లు ఉన్నాయి. అందులో 600 ప్రసిద్ధమైన గుళ్లు ఉన్నాయి. వాటిని చూశాను. గుహలలో 8,500 బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. అసలు ఎంత ఆశ్చర్యపోయానంటే.. ఎక్కడ చూసినా బుద్ధుడి విగ్రహాలు ఉన్నాయి. అక్కడ పది రోజులు ఉన్నాను. ఆ ప్రదేశం చాలా అందంగా, పవిత్రంగా, ప్రశాంతంగా ఉంది. ఇలా ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది’ అంటూ ముగించింది నర్మదా రెడ్డి.
ఇలా ఇంకా ఇంకా వివిధ దేశాలను చుట్టి రావడానికి ప్రయత్నం చేస్తోంది నర్మదారెడ్డి. మనవలు, మనవరాళ్లు ఉన్న ఈ వయసులో కూడా ఎంతో చలాకీగా, హుషారుగా ఉండే ఈవిడ బాట్మింటన్ క్రీడాకారిణి. 2016లో ‘ఉమెన్ అచీవర్’ అవార్డును అందుకుంది. అలా నర్మదారెడ్డి మరిన్ని దేశాలను చుట్టిరావాలని.. ఆమె ప్రయాణం ఆనందమయం కావాలని ఆశిస్తున్నాం.

- సన్నిధి