మెయన్ ఫీచర్

ఉరిశిక్షతో మార్పు సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక అమాయకుడికి శిక్ష విధించడం కంటే వెయ్యి మంది దోషులను వదిలేయడం మంచిది, మరింత తృప్తికరమైనది అని 12వ శతాబ్దపు సెఫార్టిక్ న్యాయకోవిదుడు మోసెస్ మైమోనిడెస్ పేర్కొన్నారు. దోషిని వదిలేసినా పర్వాలేదు, నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదనే సహజన్యాయ సూత్రం ప్రాతిపదికగా భారత్‌లో న్యాయవ్యవస్థ ఎదిగింది. ఈ సూత్రమే న్యాయప్రక్రియకు అతి పెద్ద ప్రతిబంధకంగా తయారైంది. ప్రతి కేసు ఏళ్లతరబడి విచారణకు కారణమవుతోంది, జిల్లా కోర్టుల నుండి హైకోర్టుకు, హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు వెళ్లే వీలుకల్పిస్తోంది.
స్వతంత్ర భారత్‌లో 1949 నవంబర్ 15న తొలిసారి ఉరిశిక్షను అమలుచేశారు. మహాత్మాగాంధీ హత్యకేసులో నిందితులైన నాథూరాం గాడ్సే, నారాయణ ఆప్టేలకు ఈ ఉరిశిక్ష అమలుచేశారు. అయితే తర్వాతర్వాత ఉరిశిక్ష పడిన కేసులు సైతం ఏళ్ల తరబడి వ్యాజ్యాల్లో మునిగితేలుతున్నాయి. తాజా లెక్కల ప్రకారం దేశంలో ఉరిశిక్ష పడిన నిందితుల సంఖ్య 426. అందులో యుపీ నుండి 66 మంది, మహారాష్ట్ర నుండి 66 మంది , ఎంపీ నుండి 40 మంది, కర్నాటక 25 మంది, బీహార్ నుండి 22 మంది, బెంగాల్ నుండి 20 మంది, జార్ఖండ్ నుండి 18 మంది, కేరళ నుండి 18 మందికి ఉరిశిక్ష అమలుచేయాల్సి ఉంది. ఉరిశిక్ష పడిన వారు తెలంగాణ నుండి ఏడుగురు, ఆంధ్రా నుండి నలుగురు ఉన్నారు.
మనిషి స్వభావం సమాజ నైతికతపై నిర్మితమవుతుందని 13వ శతాబ్దంలోనే థామస్ అక్వినాస్ నిర్వచించారు. ఎవరు ఏం ప్రవచించినా సమాజం మారనిదే మనిషి స్వభావంలో, నడవడికలోనూ ప్రవర్తనలోనూ ఎలాంటి మార్పు రాదని విలియం బ్లాక్ స్టోన్ 1760లోనే చెప్పాడు. అంటే నేర మనస్తత్వాన్ని చూసినపుడు ప్రజలు స్వభావ సిద్ధంగా హేతుబద్ధ జీవులని పేర్కొన్నాడు.
సమాజం ఏం ఆలోచిస్తుందో తెలుసుకుని ఏ ప్రభుత్వమైనా కొత్త చట్టాలను రూపొందించాలి, అపుడే వాటిని అమలుచేయడం సాధ్యమవుతుంది.
ఏదో ఒక సంఘటన జరగ్గానే దానికి అనుగుణంగా వాటి నిరోధానికి చట్టాలు చేసినంత మాత్రాన అవి ఆగిపోతాయనేది నిజం కాదని , అనేక చట్టాలు వచ్చిన తర్వాత కూడా జరుగుతున్న నేరాలే స్పష్టం చేస్తున్నాయి. మారాల్సింది చట్టాలు కాదు, సమాజమే మారాలి. ప్రతి ఒక్కరిలో సున్నితత్వం పెరగాలి. భయం కంటే భక్తి, ప్రేమ పెరగాలి. అపుడు చట్టాలతో పనే్లకుండా సత్ప్రవర్తనతో సమాజం ఉన్నతంగా వ్యవహరిస్తుంది. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాల్సి ఉంది. మరణదండన, శిరచ్ఛేదం వంటి శిక్షలే వద్దనుకుంటున్న సమయంలో ఎన్‌కౌంటర్ల వరకూ దారితీయడం ఈ అంశాలపై మిశ్రమ స్పందన రావడం చూస్తున్నదే. ఎంతటి తీవ్రమైన నేరాలకైనా ఉరిశిక్ష విధించరాదని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ఈ మేరకు చేసిన తీర్మానాన్ని భారత్ వ్యతిరేకించింది. సొంతంగా చట్టాలను రూపొందించుకునే సార్వభౌమాధికారం ఉన్న దేశంగా ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని వ్యతిరేకించింది. ఉరిశిక్ష అమలుపై దేశంలో పెద్దగా వ్యతిరేకత లేకపోయినా, ఉరిశిక్ష నిర్ణయం, తీర్పుల్లో జాప్యం, దశాబ్దాలపాటు కొనసాగే న్యాయప్రక్రియపై మాత్రం భారతీయుల్లో నర్మగర్భంగా వౌనం వ్యక్తమవుతోంది. భారత రాజ్యాంగం ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కును ప్రసాదించినా, నేరపూరిత కుట్ర, ప్రభుత్వానికి వ్యతిరేకంగా యుద్ధం, తిరుగుబాటు, గూఢచర్యం, హత్యతో దురాక్రమణ, ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా వంటి తీవ్రమైన, ఘోరమైన నేరాలకు ఉరిశిక్షను ఉద్ధేశించినా, నేడు కాలక్రమంలో హేయమైన అత్యాచారాలకు పాల్పడిన వారికి సైతం ఉరిశిక్ష విధిస్తున్నారు. నిందితులకు ఉరిశిక్ష నుండి మినహాయింపునిచ్చే అధికారం భారతదేశంలో రాష్టప్రతికి రాజ్యాంగం కల్పించిన హక్కు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 72 ప్రకారం ఏ వ్యక్తి శిక్షనైనా తప్పించడం, మార్పు చేయడం, ఉపసంహరించడం లేదా ఉపశమనం కల్పించే అధికారం రాష్టప్రతికి ఉంది.
అత్యంత కిరాతకమైన అరుదైన కేసుల్లో మాత్రమే ఉరిశిక్షను అమలుచేయాలని బచన్ సింగ్ వెర్సస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1980) కేసులో సుప్రీంకోర్టు పేర్కొంది. జగ్‌మోహన్ సింగ్ వెర్సస్ స్టేట్ ఆఫ్ యూపీ (1973), రాజేంద్రప్రసాద్ వెర్సస్ స్టేట్ ఆఫ్ యూపీ (1979) కేసుల్లో కూడా అత్యంత అరుదైన నేరాలకు పాల్పడిన వారికే మరణశిక్ష విధించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే పరవు హత్యలకు పాల్పడేవారికి, నకిలీ ఎన్‌కౌంటర్లకు పాల్పడేవారికి కూడా మరణశిక్ష విధించవచ్చని వ్యాఖ్యానించింది. ఐపీసీ 364ఏ రాజ్యాంగ చెల్లుబాటుపై 2013లో సుప్రీంకోర్టులో విక్రంసింగ్ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు.
చైనా వంటి కొన్ని దేశాల్లో తీవ్రమైన అవినీతికి పాల్పడిన వారికి సైతం మరణదండన విధిస్తున్నారు. తుపాకులతో కాల్చి చంపడం ద్వారా మరణదండన అమలుచేస్తుంటే మరికొన్ని దేశాల్లో ఉరిశిక్షను విధిస్తున్నారు.
ప్రపంచంలో 95 దేశాలు మరణ దండనను నిషేధించాయి. 58 దేశాల్లో అమలులో ఉంది. అత్యధిక ప్రజలు నివసించే దేశాల్లో చైనా, ఇండియా, యుఎస్, ఇండోనేషియాల్లో ఉరి శిక్ష అమలులో ఉంది. ఆ మాటకొస్తే సంప్రదాయ మరణశిక్షను అమలుచేయడం చరిత్ర ప్రారంభం నుండి అమలులో ఉంది. సభ్య సమాజం తనను తాను రక్షించుకునే సామర్ధ్యాన్ని రుజువు చేసేందుకు నష్టం కలిగించే వ్యక్తిని శిక్షించకుండా వదిలివేయడం ఎన్నడూ జరగదు. చనిపోయేవరకూ మరిగించడం, చర్మం ఊడిపోయేలా తీవ్రంగా కొట్టడం, నిదానంగా కోయడం, కడుపులో ప్రేవులను బయటకు తీయడం, శిలువ వేయడం, ఏనుగులతో తొక్కించడం, రాళ్లతో కొట్టడం, అవయవాలను ఖండించడం, రంపంతో కోయడం, తేనేపూసి కందిరీగలు ఉండే చెట్టుకు కట్టివేయడం, లేదా మెడ కోయడం వంటి ఆదిమజాతుల పద్ధతులను అనుసరించేవారు.
దేవుని భయం నుండి మొదలైన కట్టుబాట్లు, సమాజ ఆమోదంతో అలిఖితంగా ప్రారంభమై, తర్వాతి కాలంలో చట్టాలుగా మారాయి. దొంగతనాలు, ఎదుటివారిని గాయపరచడం, దోపిడీ, హత్యల వంటి కొద్ది రకాల నేరాలు విస్తృతమై హీనమైనవిగా రూపాంతరం చెందాయి.
ఆడమ్ స్మిత్, అమెరికా సమాజ పూర్వ నిర్మాతలు ఎంతో మంది జ్ఞానోదయ ఆలోచనాపరులు, జాన్ ఆస్టిన్ వంటి ప్రకృతి వాదులు చెప్పేదొకటే, నేరత్వం, చట్టవిరుద్ధం రెండు పరస్పర విరుద్ధ భావనలు, చట్టవిరుద్ధం కాని నేరత్వం కంటికి కనిపించదు, చట్టవిరుద్ధమైన ప్రతి చర్యా ఖచ్చితంగా నేరత్వమే అవుతుంది. మొట్టమొదటి నాగరికతల్లో కూడా చట్ట సంకేతాలున్నాయి. వీటిలో పౌర, శిక్షా నియమాలు రెండూ కలిపే ఉన్నాయి. కొన్ని మత సమాజాలు ఆనాడు పాపాన్ని కూడా నేరంగా పరిగణించాయి. పౌరాణిక, ఇతిహాసాల్లో పాపానికి శిక్షకూ సంబంధించిన ఆనవాళ్లున్నాయి. మొట్టమొదటి రాతపూర్వక న్యాయవ్యవస్థ క్రీస్తుపూర్వం 2100లోనే ఉంది. దీనిని ‘ఉర్‌నమ్ముకోడ్’ అని వ్యవహరించారు. అంటే 57 వ్యాసాల్లో నిర్ధిష్ట కేసులకు జరిమానా విధించే అధికారిక వ్యవస్థను తయారుచేశారు. అంతకంటే ముందు క్రీ.పూ 2380లోనే ఉరుకాగిన పేరిట సుమేరియన్లు లిఖిత సంకేతాల న్యాయవ్యవస్థకు బీజం వేశారు. మెసొపొటోమియా సమాజాన్ని ప్రతిబింబిస్తూ, క్రీ.పూ 1790లో బాబిలోనియన్ చట్టం రూపొందింది. చట్టపరమైన మత పరమైన విధులు, ప్రవర్తనా నియమావళి, జరిమానాలు, నివారణ అంశాలు అందుబాటులోకి వచ్చాయి. అంతవరకూ తప్పులను గుర్తించి వాటి నివారణపై ఉన్న దృష్టి తర్వాతి కాలంలో నేరాలపై పడింది. రాచరికం, కూలీలు, అనేక రకాల సామాన్య జనం , బానిసలు వంటి వివిధ తరగతులు సమాజంలో వచ్చాయి. దాంతో పాటే తెగల మధ్య మధ్యవర్తిత్వ వ్యవస్థ ఒక ఏకీకృంత న్యాయవ్యవస్థ కింద రూపాంతరం చెందింది. తెగల మధ్య కాకుండా తరగతుల మధ్య సంబంధాలుగా వర్గీకరణ చెందాయి. అతి పురాతన, ప్రసిద్ధ ఉదాహరణగా చెప్పాలంటే హమ్మురాబీ స్మృతి. తోరా - యూదుల చట్టం, పెంటాట్యూక్గాలను గుర్తుచేసుకోవచ్చు. క్రీస్తుపూర్వం 621లో గ్రీస్‌కు చెందిన అథీనియన్ న్యాయవ్యవస్థలో మరణశిక్ష ఆనవాళ్లున్నాయి. రోమన్లు కూడా అనేక రకాల నేరాలకు మరణ శిక్షలను విధించారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా జరిగే తప్పులు, సహసమాజంపై జరిగే నేరాలకు శిక్షలు ఉన్నా నాడు వ్యవస్థీకృత న్యాయవ్యవస్థ లేదని గుర్తించిన సర్ హెన్రీ మైనీ ఆ దిశగా ఆలోచించడం మొదలుపెట్టాడు. రోమన్ చట్టం అమలులోకి వచ్చింది. మధ్యయుగం, ప్రారంభ ఆధునిక యుగంలో ఐరోపాలో కారాగార వ్యవస్థలు అభివృద్ధి చెందక ముందు శిక్షలను సాధారణ రూపాల్లోనే విధించేవారు.
ఆధునిక సమాజాల్లో ప్రజాస్వామ్యం, న్యాయం , స్వేచ్ఛ అనే భావాలు పురుడుపోసుకున్న క్షణం మాగ్నాకార్టా ఒప్పందం. రాజు సర్వాధికారి అనే వేల ఏళ్ల ఏకాభిప్రాయాన్ని ఆ సంతకం తలకిందులు చేసేసింది. మానవ హక్కులకు ప్రాధాన్యత పెరిగింది. శిక్షలు లేదా మరణం సైతం నొప్పితెలియని రీతిలో ఉండాలనేది మానవతావాదుల డిమాండ్.
శాస్త్ర సాంకేతిక విజ్ఞానంతో దూసుకుపోతున్న నేటి ఆధునిక యుగంలోనూ సమాజ పరివర్తనలో ఉన్న వైరుధ్యాల కారణంగా నేరాలు తగ్గకపోగా, హెచ్చుమీరుతున్నాయి. మనిషి పుట్టుక నుండి ఒకరిపై ఒకరు దోపిడీలు దౌర్జన్యాలకు దారితీసి, చివరికి హత్యలకు ఇతర నేరాలకు ఆజ్యంపోసే రీతిలో మానవ సంబంధాలు దిగజారిపోయాయి. అత్యంత హీనమైన రీతిలో అత్యాచారాలకు పాల్పడుతున్నవారిపై సమాజంలో ఆవేశం ప్రజ్వరిల్లుతున్నా చట్టాలు, న్యాయస్థానాలు అదుపు చేస్తున్నాయి. ఏదో ఒక ఘటన తర్వాత దానిపై పోలీసు విచారణలు, కోర్టులు, చట్టాలు, శిక్షల గురించి యోచించే కన్నా ముందే అలాంటి ఘటనలు జరగకుండా నిరోధించే చర్యలపైనే ఎక్కువ దృష్టిసారిస్తే అసలుసిసలు మానవీయ సమాజానికి నాందిపలికినట్టవుతుంది.

- బి.వి. ప్రసాద్ 99633 45056