మెయిన్ ఫీచర్

ఆంక్షలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పిల్లల పెంపకం విషయంలో పెద్దలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సున్నిత మనస్కులైన పిల్లల్ని అనవసరంగా విసుక్కోకూడదు. అలాగని తప్పులు చేస్తుంటే చూసీ చూడనట్లు వ్యవహరించడం కూడా మంచిది కాదు.
పిల్లలు ఓ వయసు చేరాక వాళ్ళకు పదే పదే అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇలా ఉండాలి, అలా ఉండాలి లాంటి ఆంక్షలు పెడుతుంటే వాళ్లు మొండిగా మారిపోయే అవకాశాలుంటాయి. ప్రీ టీనేజ్‌కి వచ్చిన దగ్గర్నుంచి పిల్లలతో వీలైనంత స్నేహపూర్వకంగా, సరదాగా ఉండాలి కాని నియంత్రణలు పెట్టకూడదు. ప్రతి చిన్న విషయాన్నీ అతిగా పట్టించుకుంటూ, క్రమశిక్షణగా ఉంచుతున్నామని అనుకుంటూ వారి చుట్టూ చట్రం పేరిస్తే లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. కాస్త వయసు పెరిగాక స్నేహితులు, ఫోన్లు, చాటింగలు మామూలే. వద్దంటూ కట్టుదిట్టం చేస్తే అబద్ధాలు అలవడతాయి. ఇంట్లో వాళ్లకు తెలియకుండా చేసే పనులు పెరుగుతాయి. ఇది ఎంతమాత్రం వాంఛనీయం కాదు. వారిపట్ల కఠినంగా వ్యవహరించకూడదు. వారేదైనా తప్పు చేస్తే అది తప్పు అని, అది ఎందుకు చేయకూడదో వారికి వివరంగా అర్థమయ్యేలా, స్నేహపూర్వకంగా చెప్పాలి. వారిపై అజమాయిషీ చేయకూడదు. ఏదైనా పని చెప్పినపుడు అధికారికంగా చెప్పకూడదు. మృదువుగా వారికి విషయాన్ని వివరించాలి.
ఆరుబయట ఆటలు
పిల్లలు మానసిక, శారీరక ఎదుగులకు ఆటలు చాలా అవసరం. మైదానాల్లో ఆడుకునే పిల్లలు చాలా చురుగ్గా ఉంటారని వివిధ అంశాలపై పట్టు సాధించగలుగుతారని, వారిలో మానసిక స్థైర్యం పెరిగి, చక్కగా చదువుతారని పిల్లల మానసిక నిపుణులు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో గుర్తించారు. ఆటల్లో పాల్గొనడంవలన పిల్లల్లో సామాజిక నైపుణ్యం పెరుగుతుంది. మిగతా పిల్లలతో కలివిడి తత్వం మెరుగవుతుంది. ఆరుబయట ఆటలవల్ల మెదుడు అభివృద్ధి చురుగ్గా, వేగంగా ఉంటుంది. ఏ విషయాన్నయినా త్వరితంగా నేర్వగలుగుతారు. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. జయాపజయాలు సహజమని గ్రహిస్తారు. ఒత్తిడిని జయిస్తారు.
ఆరోగ్య జాగ్రత్తలు
చాలామంది పిల్లలు ఆటల్లో పడో, స్కూలు, క్లాస్‌రూమ్‌లో ఇబ్బంది ఉండి మూత్రాన్ని ఆపుకుంటుంటారు. కొంత టీచర్లు కోప్పడతారనే భయం కూడా ఉంటుంది. ఇలా ఆపుకోవడం వల్ల అనేక అనారోగ్యాలకు ఆస్కారం ఉంటుంది. శరీరంలోని మలినాలను మూత్రం పరిశుభ్రపరుస్తుంది. మూత్రాశయంలో 400 నుంచి 600 మి.లీటర్ల మూత్రం నిల్వ ఉంటుంది. ఆ పరిధి దాటితే మెదడుకు మూత్రాన్ని విసర్జించాలన్న సంకేతాలు అందుతాయి. అలా చేయకుండా బంధించి ఉంచినట్లయితే మూత్రాశయంలో మార్పులొచ్చి మెదడుకు సంకేతాలు తక్కువగా అందుతాయి. దీనివలన మూత్రవిసర్జన జరగాల్సిన సమయంలో జరగదు. మలినాలు ఎక్కువసేపు శరీరంలోనే ఉండిపోతాయి. దీనివల్ల మూత్రాశయంపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలా ఒత్తిడి పెరగడంవల్ల మూత్రంలో కొన్ని పదార్థాలు బంకగా మారి అవే క్రమంగా రాళ్ళుగా మారతాయి. ఇన్‌ఫెక్షన్లు కూడా వస్తాయి. పిల్లలకు మూత్రాన్ని ఆపుకోకూడదని, దానివల్ల కలిగే ఇబ్బందులను వివరించాలి.
కోపం తగదు
ఏడవడం, చికాకు, అరవడం, చేతిలో వున్న వస్తువులు విసిరికొట్టడం లాంటివి పిల్లలకు కోపం వచ్చినపుడు చేసే పనులు. కొంతమంది పిల్లలు కోపంలో తమకు తామే కొట్టుకోవడం, గిచ్చుకోవడం, పళ్ళు కొరకడం, ఊపిరి బిగపట్టడం చేస్తుంటారు. వారు ప్రదర్శించే కోపతాపాలు మితిమీరుతుంటే తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా వారి కోపానికి కారణాన్ని, వారి తీవ్ర స్పందన తీరును గుర్తించి వాటిని నియంత్రించే దిశగా ప్రయత్నించాలి. కోపంవల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయని తరచూ చెబుతుండాలి. తగిన చర్యలు తీసుకుని వారిలో మార్పునకు ప్రయత్నించాలి. పిల్లలే కదా అనుకుంటూ వారు కోపాన్ని ప్రదర్శించిన ప్రతిసారీ పెద్దలే సర్దుకుపోతూ, వారడిగినవన్నీ ఇచ్చేస్తుంటే, ఎదిగేకొద్దీ వారిలో తీవ్రత పెరుగుతుంది. ఇది అంత వాంఛనీయ పరిణామం కాదు. అందుకని పెద్దలు ఎప్పటికప్పుడు వారిని గమనిస్తూ వారి కోపాన్ని నియంత్రించే దిశగా ప్రయత్నాలు చేయాలి.

- పి.ఎం. సుందరరావు