మెయిన్ ఫీచర్

వనితల చిత్ర లిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హేమంతం ఆహ్లాదం.. ధనుర్మాసం ఆరంభం.. తెలుగు వాకిళ్ళ అందమే అందం.. తూర్పు తెలతెలవారకుండానే.. వయసు వ్యత్యాసం లేకుండానే.. ఇంతులంతా ఎంతో శ్రమతో, అత్యుత్సాహంతో.. ముగ్గుల రూపంలో పేర్చిన ముత్యాలు, రత్నాలు ఉదయ కిరణాలకు స్వాగతం పలుకుతాయి.
ఒక్క తెలుగు నాటేనా? అంటే.. కాదనే చెప్పాలి. హైందవ సంస్కృతికి సంకేతాలుగా ముగ్గులను చెప్పుకోవచ్చు. ఈ ముగ్గులు భరతభూమిలో అన్ని ప్రాంతాల్లోనూ కనువిందు చేస్తుంటాయి. వీటిని రంగులతో నింపి కళాత్మకంగా తీర్చిదిద్దుతారు కాబట్టి ఈ ముగ్గులను మనం అచ్చ తెలుగులో. రంగవల్లికలంటాం.
తెలుగు నాట ‘రంగవల్లిక’లన్నా.. తమిళులు ‘కోలం’ అన్నా.. బెంగాలీలు ‘అల్వన’లన్నా.. మహరాష్ట్రీయులు రంగోలీ అన్నా.. రాజస్థానీయులు ‘మండనా’లన్నా.. ఎక్కడ ఏదేమన్నా.. ఎవరేమన్నా.. మన దేశంలో ముగ్గు.. ఓ ఆచారం. అందం.. అంతుమించి మంచి ఆరోగ్యం..
కాలంకన్నా వేగంగా పరుగులెట్టే నేటి కంప్యూటర్ యుగంలో కూడా అతివలు ముగ్గువేసే సంప్రదాయాన్ని మాత్రం మరువలేదు సరికదా, ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించేలా.. నేడు వివిధ ప్రాంతాల్లో జరిగే ముగ్గుల పోటీల్లోనూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
అయితే.. అతివలు వారి వారి ప్రతిభా పాటవాలతో అలవాటు ప్రకారం ముగ్గులు వేస్తుంటారు. అక్కడితో ఆ విషయాన్ని వదిలేస్తారు. అందులోని అర్థాన్నీ, పరమార్థాన్నీ పెద్దగా పట్టించుకోరు. లోతుగా ఆలోచించరు. ఈ ముగ్గులనేవి మహిళల సృజన శక్తికి సంకేతం. అరవై నాలుగు కళల్లోనూ ఇదీ ఒక కళ. చిత్రలేఖనంలో ఓ భాగం. స్ర్తిల మనోభావాల్ని ప్రతిఫలింపజేసే ప్రతి ముగ్గు ఓ చిత్రం. అంతకుమించి అద్భుతమైన ‘చిత్రలిపి’గా ముగ్గును చెప్పవచ్చు. సింధు నాగరికతలనూ, రుగ్వేదంలోనూ కనిపించే స్వస్తిక్, చతురస్రం గుర్తులు నేటి ముగ్గుల్లోనూ కనిపిస్తున్నాయి. కాబట్టి చిత్రలిపే రంగోలీలకు మూలంగా పేర్కొనవచ్చు. ఇంతటి ప్రాచుర్యం పొందిన ముగ్గులోని వైశిష్ట్యాన్నీ, విజ్ఞానాన్నీ, దాని కథా కమామీషును తెలుసుకోవాల్సిందే!
ధనుర్మాసం రాగానే.. సంక్రాంతి నెల రోజుల ముందునుంచే తెలుగువాకిళ్లు ముగ్గులతో కళకళలాడుతుంటాయి. అసలు, ఈ ముద్దులొలికే ముగ్గులలోనే సంక్రాంతి శోభంతా ఇమిడి ఉందేమోననిపిస్తుంది. సంధ్యా సమయంలో తెలుగింటి ఆడపడుచులు తలారా స్నానం చేసి, ముగ్గు గినె్నలను చేతబట్టుకొని వాకిళ్లలో ఏకాగ్ర చిత్తంతో ముగ్గులను తీర్చిదిద్దే దృశ్యం కన్నుల పండువుగా వుంటుంది. ముగ్గులు వేయడంలో మగువలది అందెవేసిన చేయి. అందుకేనేమో రంగవల్లుల రమణుల కళానైపుణ్యానికి ప్రతీకలుగా సెలవిచ్చాడో కవీంద్రుడు.
ముగ్గుల విశిష్టత గురించి మన ప్రాచీన గ్రంథాలలో అనేకవిధాలుగా వివరించారు. ముగ్గులు ఉండే లోగిళ్లలో లక్ష్మీదేవి నివశిస్తున్న లక్ష్మీ సోత్త్రంలో పేర్కొనబడింది. వాత్సల్యమూర్తి యగు భగవంతుడు గోవు రూపంలో వచ్చి వాకిట నిలబడినట్లు ప్రతీతి. అందుకే ఆవు పేడతో వాకిళ్లను అలికి ముగ్గులు తీర్చిదిద్దుతారు.
మన దేశం అంతటా ఉపయోగించే ముగ్గుపిండి తెలుపు. స్వచ్ఛతకూ, శాంతికీ సంకేతం. దీని తయారీకి ఉపయోగించే బియ్యం పురోభివృద్ధికి సంకేతం. కొన్ని ముగ్గుల్లో నింపే పసుపురంగు శుభానికీ, కుంకుమ పవిత్రతకూ చిహ్నంగా చెబుతారు. పల్లెల్లోనే కాదు పట్టణం, నగరాల్లో కూడా వాకిళ్ళలో ముగ్గులు వేయనివారు అరుదే. ఇంటి ముంగిట ముగ్గువేశాక మగవారు గడప దాటివెళ్లడం ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కుటుంబాల్లో సంప్రదాయంగా వస్తోంది. ముగ్గులేని వాకిలి అశుభాన్ని సూచిస్తుంది. అందుకే వాకిటముందు ముగ్గువేయడం మహిళలు మానరు. ఉదయవేళల్లో పొడవుగా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తే, సాయంత్రం వేళల్లో అడ్డంగా చిన్న ముగ్గులు వేస్తారు.
ఉదయపు వేళయితే పొడవాటి ముగ్గుల్ని స్వాగతంగా భావించి లక్ష్మీదేవి ప్రవేశిస్తుందనీ, సాయంత్రం ఆమె ఇంటిని విడిచివెళ్లకూడదని అడ్డంగా చిన్న ముగ్గులు వేస్తూంటారు. ఇంటి లక్ష్మిని వాకిలి సూచిస్తుంది. ముగ్గు ఒలికినా అందమే లాంటి నుడికారాలు అందుకే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో సంప్రదాయపరమైన ముగ్గులకన్నా రంగుల ముగ్గులకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు. వాటి రూపం మారిందేగాని ఉనికికి మాత్రం ప్రమాదం ఏర్పడలేదు. ముఖ్యంగా పురుషులతో సమానంగా అన్నిరంగాల్లోనూ రాణిస్తోన్న నేటి మహిళామణులు తమ యాంత్రిక జీవితంలో ముగ్గు ప్రాధాన్యాన్ని ఏ మాత్రం విస్మరించలేకపోవడం హర్షణీయం.
అంతేకాదు చిత్రకారులకూ, కార్టూనిస్టులకూ వస్తువులుగా ఉపయోగపడుతూ వస్త్ర ప్రపంచంలోని ఆధునిక డిజైన్లలో కూడా చోటుచేసుకున్న మన ముగ్గులు అంతర్జాతీయంగానూ ప్రాముఖ్యం చెందాయి. అందుకే మన రంగోలి రేఖ, సంప్రదాయ, ఆరోగ్య రేఖ మాత్రమే కాదు సౌందర్య రేఖ కూడా. ఈ కంప్యూటర్ యుగంలో అమ్మాయిలు సైతం చేతిలో ముగ్గుపిండి పట్టుకుని ఉదయానే్న రంగవల్లికలు అద్దుతున్నారంటే నిజంగా శుభ సంకేతం.. శుభ పరిణామం.
చాలామంది పెద్దవాళ్లు- ‘ముగ్గు గీత గీచిరా; ముగ్గు కర్ర వేసేరా’ అని పిల్లలకు చెబుతుంటారు. అలా చేయడంవల్ల దుష్టశక్తులు లోపలకు రాకుండా ముగ్గులు అడ్డుకుంటాయని విశ్వాసం. చాలావరకూ ముగ్గును రోజూ సున్నపు పొడితేనే వేస్తారు. రాతియుగంలో కూడా రాక్షసి గుళ్లుగా పిలిచే సమాధుల చుట్టూ కూడా సున్నపు గీతలు గీసినా నిదర్శనాలు కనిపిస్తాయి.
ముగ్గులోని చుక్కలూ, గీతలూ భగవంతునికి సంకేతాలుగా చెబుతారు. సమబాహు త్రిభుజాకారం ముగ్గు విష్ణుమూర్తికి, తిరగబడిన త్రిభుజం శివునికీ, పరస్పరం ఖండించుకపోయే రేఖలు బ్రహ్మదేవునికి సంకేతాలుగా నిలుస్తాయి.
‘చుక్కల ముగ్గు’ ద్రవిడ సంప్రదాయం కాగా, రేఖల ముగ్గు ఆర్య సంప్రదాయం. గీతలు (రేఖలు), చుక్కలూ రెండింటిని పుణికిపుచ్చుకుని ముగ్గులు వేయడం మన సంప్రదాయం. చుక్కలతో వేసే ముగ్గుల్లోనూ రకాలున్నాయి. చుక్కల చుట్టూ ముత్యాల్లా వచ్చేవాటిని ముత్యాల ముగ్గులనీ, చుక్కలు కనిపించకుండా రేఖాగణితంలోని కోణాల మాదిరి కనిపించే వాటిని రత్నాల ముగ్గులని అంటుంటారు.
ముగ్గుల్లోని వృత్తాలు, చదరాలు, దీర్ఘచతురస్రాలు, చతుర్భుజాలు, షడ్బుజాలు, త్రికోణాలు.. రేఖాగణితాంశాల్ని సూచిస్తుంటాయి. అలాగే గణితానికి ఆధారాలైన ప్లస్, మైనస్, ఇంటూ గుర్తులు.. కొన్ని ముగ్గుల రూపకల్పనకు మూలాధారాలు. స్వస్తిక్ కూడా ఇంటూ గుర్తుతోనే ఏర్పడుతుంది.
ముగ్గులు - అక్షరాలు
ముత్యాల వంటి తెలుగు అక్షరాలను ఆధారంగా చేసుకుని ముగ్గులు రూపొందించడం కూడా మహిళలకే చెల్లింది. తలకట్టులేని ఎన్నో అక్షరాలు అంచుల ముగ్గుల్లో కనిపిస్తాయి.
రసాయన శాస్త్రంలోనూ ముగ్గులు..
ఇంతులకు నిజంగా రసాయనిక పరిజ్ఞానంతోనే ముగ్గులను రూపొందిస్తున్నారని చెప్పవచ్చు. ఆ శాస్త్రంలోని బెంజిన్, క్లోరోఫిల్, హీమోగ్లోబిన్ నిర్మాణాలు ముగ్గుల్లో కనిపించడం విశేషం. అలాగే తెలుగింట వేసే అతి సామాన్యమైన సరళమైన గీటు ముగ్గులో అణు నిర్మాణం గోరించడం యాదృచ్ఛికమే కావచ్చు. కానీ నాటి మన చరక, శుశ్రుత, నాగార్జున, ఆర్య, దేవ తదితర పండితులు వివిధ శాస్త్రాంశాల్లో ప్రావీణ్యం సంపాదించారని చెబుతారు. ఆ ప్రభావం మహిళలు వేసే ముగ్గులపైన పడి ఉంటుంది.
నేటికీ సంక్రాంతి సమయాల్లో వేసే నెల ముగ్గులతో సహా అనేక ముగ్గులు గృహ, దేవాలయ నగర నిర్మాణాల నమూనాలను పోలి ఉండటం నిశితంగా గమనించవచ్చు. ఇందుకు ప్రసిద్ధి చెందిన ఖజురహో దేవాలయ నిర్మాణాలను పోలిన ముగ్గులు వాస్తు విజ్ఞానాన్ని చెప్పకనే చెబుతున్నాయి.
ఆరోగ్య ప్రదాయిని..
ఔషధ గుణాలు కలిగి వున్న తులసి చెట్టు గాలి ఆరోగ్యానికి ఎంతో మంచిది కాబట్టే దాని ముందు చూడముచ్చటగా ముగ్గులు వేసి, ప్రదర్శనలు చేసే ఆచారం వచ్చింది.
పల్లెల్లో నేటికీ ధాన్యపు గాదెలు, భోజనాలు చేసే ప్రదేశాల్లోనూ, చల్ల చిలికే చోట, విసుర్రాయి దగ్గర, పొయియ గోడల చుట్టూ ముగ్గు గీతలను గీస్తుంటారు. ఇందుకు ముగ్గు పిండినే కాదు ఎర్రమట్టిని, చివరికి పేడనూ ఉపయోగిస్తారు. దీనివల్ల సూక్ష్మజీవులు నశించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయనేదే ఇందులోని అర్థం.. పరమార్థం. యోగవిద్యతోపాటు వైద్యశాస్త్రం కూడా పల్లె పడుచులు చిత్రించే ముగ్గుల్లో స్పష్టంగా కనిపిస్తుంటుంది. ప్రభాత సమయంలో వాకిట్లో కళ్లాపి చల్లి వేసే ముగ్గులో ఆయుర్వేదాంశాలు కనిపిస్తాయి. గోమయం క్రిమిహారి. ఇది మశూచి లాటి వ్యాధుల్నీ, దోమల్నీ నివారిస్తే, కళ్లాపి మీద వేసే తెల్లటి ముగ్గు పొడి సూక్ష్మజీవుల్ని నాశనం చేస్తుంది. ముఖ్యంగా వేకువ వేళనే వాకిలి వంగి ముగ్గులు వేయడం అనేది స్ర్తిలకు మంచి వ్యాయామమే కాదు, వారిలో ఏకాగ్రతనూ, ప్రశాంతతనూ పెంపొందిస్తుంది.
రోజూ సున్నపు రాయితో చేసే ముగ్గు పొడినే వాడినా, పండుగ సమయాల్లో మాత్రం బియ్యం పిండితో వేస్తారు. అలా వేయడంవల్ల ఆ పిండి పక్షులకూ, చీమలకూ ఆహారంగా ఉపయోగపడటంతోపాటు పుణ్యమూ వస్తుందనే భావం చాలాకాలం నుంచి పాదుకొంది.
అలాగే ఆడపిల్లలు ఆడే పచ్చీసు, తాడు ఆట, తొక్కుడుబిళ్ల.. లాంటి ఆటల్ని సూచించే ముగ్గులూ ఉన్నాయి. అందుకే ‘ముగ్గులు’ అనేవి స్ర్తిల మనస్తత్వానే్న కాదు, వారి సృజనాత్మకతకు, విజ్ఞానానికి, సామాజిక వ్యవస్థకు అద్దం పడతాయి.

- కంచర్ల సుబ్బానాయుడు 94926 66660