మెయిన్ ఫీచర్

ధిక్కరణ సాహిత్యంపై మేఘాలు కమ్ముకున్నాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సాహిత్యంలో ధిక్కరణ అక్షరాలు ఎక్కువగా వుండేవి. తెలంగాణ సాహిత్యం ధిక్కరణకు ప్రతీతి. గత ఐదు సంవత్సరాలుగా సాహిత్యంలో ధిక్కరణ గొంతులు వినిపించటంలేదు. ఇపుడు ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు ధిక్కరణ అక్షరాలకు ప్రాణం పోసేవి కావా? దేశంలో జరుగుతున్న మానవత్వం లేని రాక్షస సంఘటనలు ధిక్కరించేవిగా, ప్రశ్నించేవిగా లేవా? రెండు తెలుగు రాష్ట్రాలు ప్రపంచంలో ఒక భాగం.. దేశంలోని సంఘటనలు అన్నీ ఇక్కడ ప్రతిబింబిస్తాయి. ఈ వ్యవస్థ దుర్మార్గంగా ఉన్నపుడు ఎంత మంచి పరిపాలకుడైనా రాష్ట్రంపై పడే ప్రభావం ఆపలేరు. రాష్ట్ర ప్రభుత్వాలు, పరిపాలకులు మంచివాళ్ళు అనుకుంటే చాలా? వ్యవస్థ కర్కశంగా, దుర్మార్గంగా మారుతున్న రోజులలో కవి బాధ్యత ఏమిటీ? తన అక్షరాలను ధిక్కరణ అక్షరాలుగా మార్చుకోవాల్సిన అవసరం లేదా? తన తెలంగాణాయే ప్రపంచమని కవి భావిస్తే ఎలా?
‘్ధక్కరణ’ అంటే విప్లవ పదం కాదు. హింసకు జీవం పోసే పదం కాదు. ధిక్కరణ అంటే ప్రశ్నకు పర్యాయపదం. ధిక్కరణ అంటే జరుగుతున్న సంఘటనలు చెప్పటం కాదు. సంఘటనకు కారణమేమిటో ప్రశ్నించడం ధిక్కరణ. మానభంగాలు జరుగుతున్నాయని చెప్పటం జర్నలిస్టు బాధ్యత. అది వార్త. ఎందుకు జరుగుతున్నాయో ప్రశ్నించడం కవి బాధ్యత? వ్యక్తి చెడిపోవటం కారణమా? సమాజం చెడిపోవటం కారణమా? పాలకుల తీరుతెన్నులు కారణమా? ఆధునిక సాంకేతిక యుగం కారణమా? తేల్చడం కూడా కవి బాధ్యతే. పరిష్కారం చెప్పటం రచయిత బాధ్యత కాదు. దురదృష్టవశాత్తు మన రచయితలలో ఇది కూడా కరువైంది. తెలుగు రచయితలు ముఖ్యంగా తెలంగాణ రచయితలు పాలకుల మంచి పనులను పొగుడుతున్నారు. అది తప్పుకాదు. మంచిని మంచిగా చెప్పాల్సిందే! చెడును దాచిపెడుతున్నారు. ఒక దృశ్యం సామాజిక పరిణామాలపై రాబోవు తరంపై ఎంత నష్టం కలిగిందో చెప్పకపోతే ఎలా? ‘కంటి వెలుగు’ పథకం తప్పు అనలేం. ప్రజలకు తమ కాళ్లమీద తాము నిలబడటం నేర్పాలి తప్ప.. అన్నీ ప్రభుత్వాలే కల్పించాలా? మానవశక్తిని సోమరిగా మారిస్తే ఎలా? సర్కారు ఎప్పటికి వుండేవిధంగా కంటి ఆసుపత్రులను విస్తృతంగా ఏర్పాటుచేయాలి తప్ప ఇలా ఒకేసారి సంతలో సంతర్పణ చేస్తే ఎలా? ఇది ఒక విషయం మాత్రమే! పాలకులను విమర్శించటానికి షోకు పడాల్సిన అవసరం లేదు. అతి ఉత్సాహం ఉండాల్సిన అవసరం లేదు. అలా అని పాలకుల చర్యల ప్రభావాన్ని ప్రజల తరపునుండి, రాబోయే తరాల దృష్టి నుండి ప్రశ్నించకుండా వుంటే నేరమే! ఐదు పది సంవత్సరాల క్రితం ఇది మొత్తం దోపిడీ వ్యవస్థ, ఇది దోపిడీ ప్రపంచం అని వ్రాసిన తెలంగాణ రచయిత అప్పటి సాహిత్యం ఇప్పటికీ శిరోధార్యమే. అదే రచయిత నేడు తెలంగాణ బంగారుభూమి అని వ్రాస్తే ఎలా వుంటుంది?
ప్రజల గూర్చి వ్రాయటం రాజకీయం అనటం పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. ప్రజల సమస్యలను చిత్రించి ప్రశ్నించే సాహిత్యాన్ని రచయితను కమ్యూనిస్టు అనటం పెద్ద జోకుగా మారింది. రాజకీయ పార్టీ వేరు. రాజకీయం వేరు. రాజకీయం లేకుండా ఏ సాహిత్యం వుండదు. రచయిత ప్రతి అక్షరంలో అంతర్లీనంగా రాజకీయం వుంటుంది. రాజకీయం లేని సాహిత్యం వుండదు.
పాలకులను ప్రశ్నించటం, విమర్శించటం రచయిత పనికాదు. రచయిత పాలక పార్టీ సభ్యుడు కాదు. ప్రతిపక్ష సానుభూతిపరుడు కాదు. అటువంటి భావాలున్నవారు రచయిత కారు. అన్నిటికీ నిన్నటి పాలకులు నేటి పాలకుల తప్పుకాదు. తరతరాల తప్పుల ఫలితం. నేటి సమాజం అనుభవించవచ్చు. నేటి పాలకులకు మోయలేని బండగా మారవచ్చు. వీటితో రచయితకు సంబంధం లేదు. ఎవరిమీద సానుభూతి రచయితకు అవసరం లేదు. ప్రజల శ్రమ, చెమట, కన్నీళ్ళు, ఆకలి, అశాంతి, అభద్రత వారి గుండెల్లోని ప్రశ్న వాళ్ల కన్నుల్లోని మంట వ్రాయటం రచయిత బాధ్యత. ఇది ఇప్పటి తెలుగు సాహిత్యంలో కరువైంది. ప్రశ్నించే సాహిత్యమంతా కమ్యూనిస్టు సాహిత్యం కాదు. ప్రభుత్వ వ్యతిరేక సాహిత్యం కాదు. అన్ని ఉద్యమాలు కమ్యూనిస్టు ఉద్యమాలు కావు, కాలేవు. అన్ని ఉద్యమాలు ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు కాదు. రైతులు మద్దతు ధరకొరకు ఉద్యమిస్తున్నారు. అది కమ్యూనిస్టు ఉద్యమమా? నిరుద్యోగులు ఉద్యోగం, ఉపాధి కొరకు ఉద్యమిస్తారు. మహిళలు తమ రక్షణకొరకు ఉద్యమిస్తారు. అణగారిన వర్గాలు తమపై వివక్షతను ప్రశ్నిస్తారు. ఇలా ఎన్నో.. ఇవి అన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు కావు. ఇప్పటి ప్రభుత్వాలు అలా భావిస్తే అంతకంటే సంకుచితత్వం వేరే లేదు. ఆర్థిక అంతరాలు అన్ని రంగాలలో అసమానతలు, అగ్రవర్ణ ఆధిక్యత, పురుషాధిక్యత వున్న వ్యవస్థ ఇది. డబ్బు వెంట పరుగులు తీస్తున్న వ్యవస్థ ఇది. కులం, ధనబలం, మతం ఎన్నికలలో గెలుపు ఓటమిలు నిర్ణయిస్తున్న వ్యవస్థ ఇది. వీటిని రచయిత విమర్శించకూడదా? ప్రశ్నించకూడదా? మార్పు రావాలని ధిక్కరించకూడదా? మార్పు ఎవరికొరకు? ప్రజల కొరకు? రేపటి తరం కొరకు!
పాలకులను పనిగట్టుకొని విమర్శించటమో సమర్థించటమో రచయిత పనికాదు. పాలకులు ఈ దోపిడీ వ్యవస్థ ఒక భాగమని గుర్తించాలి. వాళ్లు ఈ దోపిడీ వరదలో ఒక భాగం.. వరదకు అడ్డంగా నిల్వటం సాధ్యంకాదు. నిల్చినా కొట్టుకుపోతారు. ఈ సత్యం రచయిత తెలుసుకోవాలి. ప్రజలు మాత్రమే నిర్ణేతలు, శక్తివంతులు. అవసరమైతే వరదను అడ్డుకోగలరు. ఆ శక్తిని రచయిత అక్షరం ఇవ్వగలగాలి. ఈ వ్యవస్థలో పాలకులు నిమిత్త మాత్రులు.
మంచి పాలకులైనా, ఉద్యమం నుండి వచ్చిన ఆదర్శవంతుడైనా చేయగలిగిందేమీ లేదు. ఈ వ్యవస్థలో పాలకులు కార్పొరేట్ సామ్రాజ్యనేత కీలుబొమ్మలు. ఎవరూ ఏమి చేయలేకపోవటానికి ఒకే ఒక కారణం. దేశ సంపద మొత్తం ఒకే దగ్గర పోగుపడి వుంది. ఓ పదిమంది కోటీశ్వరుల చేతిలో భారీగా మొత్తం సంపద వుంది. వాళ్ల దయకొరకు పాలకులు ఆరాటపడుతున్న స్థితిని చూస్తున్నాం. ఇది రచయితలు ప్రశ్నించకూడదా? ఆర్థిక అంతరాలు క్రమక్రమేణా తగ్గించగలిగినవాడే నిజమైన పాలకుడు?
ఓటు కొరకు పథకాల ప్రకటనలో పోటీపడుతున్నారు. ప్రజలను బిచ్చగాళ్లుగా భావిస్తున్నారు. ఒక పార్టీవాళ్లు అధికారంలోకివస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తారట. రైతులు అడుగుతున్నదేమిటి? తమ వ్యవసాయం అప్పులపాలు కాకూడదని. కల్యాణలక్ష్మికి కొన్ని వేలు.. వృద్ధులకు పెన్షన్లు.. సమాజంలో మానవతా దృక్పథం పెంచాల్సిన పాలకులు సోమరితనాన్ని, అవినీతిని పెంచుతున్నారు. ఇవి ప్రశ్నించటం రచయిత బాధ్యత కాదా?
ఇలా ఎన్నో.. ఎన్నో దుఃఖాలు.. ఎన్నో చీకట్లు.. ఎన్నో బాధలు.. ఎన్నో ప్రశ్నలు. తెలుగు రచయితల ప్రశ్నలకు ధిక్కరణ అక్షరాలకు దూరం జరిగి తమ చరిత్రను తాము ధ్వంసం చేసుకొంటున్నారు. తెలంగాణ రచయితకు మంచి చరిత్ర, పోరాట చరిత్ర వుంది. సహజంగా తెలంగాణ నేల పోరాట నేల. ధిక్కరణ నేల.. తెలంగాణ రచయిత ప్రజా పోరాటాలు, ధిక్కరణ నుండి తన అక్షరాలకు జీవం పోసుకున్నాడు. ప్రపంచ సాహిత్య చరిత్రలో స్థానం దక్కించుకున్నాడు. ఇప్పుడేమైంది? రాజీ పడుతున్నాడు. రాజ్యంతో, పోరాట భావజాలంతో, ధిక్కరణ అక్షరాలతో రాజీపడుతున్నాడు. రచయిత రాజకీయ పార్టీలకు అతీతుడే తప్ప రాజకీయాలకు అతీతుడు కాదు. రచయితకు అవార్డులు, ప్రశంసలు, సన్మానాలు, శాలువాలు ముఖ్యంకాదు. తన అక్షరం మెరుపును పోగొడుతాయి. వీటితో తన భావాలు కల్తీగా మారిపోతాయి.

- సిహెచ్.మధు