మెయిన్ ఫీచర్

మహిళల ‘రక్షణ’కు కొత్తమార్గాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలి సంఘటనలను, గడిచిన నేర చరిత్రను గమనించినా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు ఎక్కువ శాతం ప్రయాణ సమయంలోనే సంభవిస్తున్నాయి. ముఖ్యంగా కళాశాలు, ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు కనీస రక్షణ లేకుండా పోతోంది. ఈ పరిణామాలతో మగవారిని చూస్తేనే మహిళలు జంకే పరిస్థితి ఏర్పడింది. వీటన్నింటితో పలు రాష్ట్రాల్లో మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి ప్రభుత్వాలు. ఇందులో భాగంగానే హరియాణా ప్రభుత్వం స్ర్తిలకోసం కొన్ని పథకాలను తీసుకొచ్చాయి. అవి మహిళలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక్క హరియాణాలోనే కాదు.. తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్.. ఇలా చాలా రాష్ట్రాల్లో మహిళల రక్షణకు తక్షణ చర్యలు చేపడుతున్నాయి. దేశంలో ఎన్నో విషయాల్లో మార్పు వస్తోంది కానీ స్ర్తిలపై జరిగే అకృత్యాల విషయంలో ఇసుమంతైనా మార్పు లేదు. ఈ క్రమంలో స్ర్తికి భద్రత లేని దేశాల జాబితా తీస్తే అందులో భారతదేశం మొదటి వరుసలో నిలిచింది.
హరియాణాలో..
ప్రపంచ పటంలో భారతదేశ పరిస్థితి ఇలా ఉంటే.. దేశంలో కొన్ని రాష్ట్రాలు మహిళల రక్షణ విషయంలో మరీ అధ్వాన్నంగా ఉన్నాయి. ఈ జాబితాలో హరియాణా రాష్ట్రం కూడా ఒకటి. కానీ హరియాణా ప్రభుత్వం ఇటీవలే కళ్లు తెరిచి మహిళల రక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టి ‘విమెన్ సెక్యూరిటీ ప్రాజెక్ట్’ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే విద్యార్థినుల కోసం ‘్ఛత్ర పరివాహన్ సురక్ష యోజన’ పేరుతో ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో అన్ని స్కూళ్లు, కళాశాలలకు వెళ్లే విద్యార్థినులకు ఇంటి నుంచి విద్యాలయాల వరకు ఉచిత బస్సులను కేటాయించనుంది ప్రభుత్వం. అయితే ఇవి కేవలం విద్యార్థినులకు మాత్రమే.. ఈ పథకాన్ని మొదటిసారి పరీక్షించే క్రమంలో అంబాలా, పంచ్‌కులా, యమునానగర్, కర్నల్, కురుక్షేత్ర జిల్లాల్లోని విద్యార్థినులకు ఉచిత మహిళా బస్సు సదుపాయాన్ని అందుబాటులో ఉంచింది. మొదటగా ఉన్నత తరగతి విద్యార్థినులు ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. తరువాత అన్ని తరగతుల విద్యార్థినులకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. అంతేకాదు విద్యార్థినులందరూ ఎక్కువ దూరం ప్రయాణించకుండా 20 కిలోమీటర్ల లోపే విద్యాలయాలు ఉండేలా విద్యార్థినుల కోసం కొత్త కళాశాలలను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే అక్కడ 22 కళాశాలలను నిర్మించగా, మరో 29 కళాశాలలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతేకాదు గతంలో ఉన్న రహదారులను కాదని అధికారులతో చర్చించిన హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ విద్యార్థినులను గమ్యస్థానాలకు చేర్చేందుకు మరో 113 కొత్త రహదారులను ఏర్పాటు చేయించారు. ‘్ఛత్ర పరివాహన్ సురక్ష యోజన’ పథకంలో భాగంగా విద్యార్థినులు ప్రయాణించే ప్రతి బస్సులో ఒక మహిళా పోలీసును నియమించనున్నారు. ఇందుకోసం పోలీస్ వ్యవస్థలో కూడా మహిళలకు ఉద్యోగాలను పెంచారు. అక్కడ ఇప్పుడు మహిళా పోలీసులు ఆరు శాతం ఉండగా, ఇప్పుడు తొమ్మిది శాతానికి పెంచారు. ముందు ముందు ఇంకా వీరి సంఖ్యను పెంచాలని యోచిస్తున్నారు. అంతేకాదు ‘దుర్గాశక్తి వాహిని’ పేరుతో అన్ని వేళలా మహిళలకు సహకరించేందుకు ప్రత్యేక మహిళా బృందాలను ఏర్పాటుచేశారు.
కోల్‌కతాలో..
భారతదేశంలోని చాలా రాష్ట్రాలు ఫ్రీ రైడ్ స్కీములను ప్రవేశపెడుతుండటంతో కోల్‌కతా పోలీసులు కూడా మహిళలకు ఈ సౌకర్యం ఉందని చెబుతున్నారు కానీ వారు అటువంటి ఏ స్కీమూ ప్రవేశ పెట్టలేదు. కానీ ఎవరైనా స్ర్తిలు ఆపదలో ఉండి, 100కి ఫోన్ చేస్తే.. వెంటనే సదరు మహిళకు సాయం అందిస్తారు. అంతేకాదు.. ఫోన్ చేసి మహిళల పేరు, ఇతర వివరాలను గోప్యంగా ఉంచుతారు. ఇందుకోసం ఆపదలో ఉన్న మహిళే కాదు.. ఆమె భయపడటం, కంగారు పడటం, ఏడవడం చూసిన ఏ వ్యక్తి ఫోన్ చేసినా స్పందిస్తామని కోల్‌కతా కమిషనర్ అనుజ్ శర్మ తెలిపారు. స్ర్తిలపై జరిగే అఘాయిత్యాలకు తక్షణం స్పందించి ఎటువంటి జాప్యం లేకుండా నిందితులపై కేసులు నమోదు చేయాలని ముఖ్యమంత్రి మాయావతి పోలీసులను కోరారు.
తెలంగాణాలో..
దిశ ఉదంతం తరువాత తెలంగాణాలో మహిళలుకానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఫోన్ చేస్తే.. తక్షణమే స్పందించి వారి వద్దకు వచ్చి, ఎటువంటి సహాయం అయినా చేసే సౌకర్యాన్ని పోలీసులు కల్పించిన విషయం అందరికీ తెలిసిందే.. బండి టైర్ పంక్చర్ అయినా, పెట్రోల్ అయిపోయినా తక్షణమే వచ్చి సాయం చేసే దగ్గర నుంచి ఇంటి వద్ద దిగబెట్టే వరకు పోలీసులు స్ర్తిలకు తోడుంటామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో..
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో పోలీసులు మహిళల రక్షణ కోసం ‘ఫ్రీ రైడ్ స్కీము’ను ప్రవేశపెట్టారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరుగంటల వరకు ఈ సౌకర్యం మహిళలకు అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం మహిళలు మాత్రమే పరిమితమైన ఈ సేవను తర్వాత మదనపల్లె, పలమనేరు, పుత్తూరు, శ్రీ సిటీ సబ్ డివిజన్ ప్రాంతాలకు విస్తరించనున్నారు.
కర్ణాటకలో..
మహిళలు ఆపద బారిన పడకుండా సురక్షితంగా ఇళ్లు చేరడానికి డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం నుంచి లైసెన్స్ కూడా తీసుకుంటున్నారు. కానీ కనిపించకుండా మాటువేసే మృగాళ్లను ఏం చేయగలం? అందుకే కర్ణాటక ప్రభుత్వం త్వరలోనే మహిళలకు పోలీస్ ట్రైనింగ్ స్కూల్స్, సెల్ఫ్ డిఫెన్స్ సెంటర్స్ పేరుతో మహిళలకు ఆత్మరక్షణలో శిక్షణ ఇవ్వనుంది. అంతేకాదు ఈ సెంటర్లను అన్ని స్కూళ్లు, కాలేజీలలో కూడా ఏర్పాటు చేయించి స్ర్తిలు శారీరకంగా, మానసికంగా ఎలా ధైర్యంగా ఉండాలో నేర్పుతారు. ఇప్పటివరకూ ఇలా ఆత్మరక్షణలో శిక్షణ ఇచ్చే ప్రైవేటు సంస్థలు ఉన్నాయి కానీ ప్రభుత్వమే ఇలాంటి సెంటర్లను ఏర్పాటు చేయడం జరగలేదు. అధికారులతో చర్చించిన తరువాత ఇది మహిళలకు అందుబాటులో ఉంటుంది. విద్యార్థినులతో పాటు మహిళలందరికీ ఈ ట్రైనింగ్ సెంటర్లను అందుబాటులో ఏర్పాటు చేయనుంది కర్ణాటక ప్రభుత్వం.
అంతేకాదు ఇటీవల జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కర్ణాటకలోని గడగ్ జిల్లా పోలీసులు ‘స్ర్తి డ్రాప్ సర్వీస్’ను ప్రారంభించారు. ఈ క్రమంలో స్ర్తిలు తమకు అందుబాటులో ఉన్న ఏ పోలీస్ స్టేషనుకైనా.. లేదా పోలీసులకు సంబంధించిన ఏ హెల్ప్‌లైన్ నెంబరుకైనా ఫోన్ చేసి తామున్న ప్రాంతం పేరు చెబితే చాలు.. వెంటనే పోలీసులు అలర్టై, వారి సొంత వాహనంలో వచ్చి, ఫోన్ చేసిన స్ర్తి ఎక్కడుంటే అక్కడ దిగబెట్టి వెళ్తారు. అవసరమనుకుంటే ఇంటి గేటు దగ్గరకు వచ్చి మరీ దిగబెట్టడం, తీసుకెళ్లడం చేస్తారు. గడగ్ పోలీసులు ఈ సర్వీస్‌ను రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మహిళలకు అందుబాటులో ఉంచారు.
ఇలా దాదాపు దేశంలోని ప్రతి పోలీస్ శాఖ ఈ రక్షణ సౌకర్యాన్ని కల్పిస్తుండగా యూనివర్సల్ పోలీస్ కంట్రోల్ రూమ్ నెంబర్ 1091కి ఫోన్ చేసినా లేక 78370 18555కు వాట్సాప్ చేసినా కూడా.. వెంటనే పోలీసులు స్పందించి వారి వాహనాల్లో మహిళలు ఎక్కడుంటే అక్కడకు వచ్చి సురక్షితంగా వారిని వారి గమ్యస్థానానికి చేరుస్తారు.

- మహి