మెయిన్ ఫీచర్

స్థిరత్వమే ఆత్మజ్ఞానానికి నాంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగద్గురు శ్రీశంకరాచార్య విరచిత
వివేక చూడామణి
ప్రతిపదార్థ తాత్పర్య వ్యాఖ్యాన సహితము
వ్యాఖ్యాత
ఆచార్య శ్యామశాస్ర్తీ
*
14. అధికారిణమాశాస్తే ఫలసిద్ధిర్విశేషతః
ఉపాయా దేశకాలాద్యాః సన్త్యస్యాం సహకారిణః॥
పురుషార్థములలో పరమశ్రేష్ఠమైనది మోక్షము. అయితే అది అత్యంత దుర్లభము. ఆత్మతత్త్వమును తెలిసికొనే ఏకైక లక్ష్యముతో శ్రవణ, మనన, నిదిధ్యాసనములతో సాధన చేసినవారికి మాత్రమే తత్ఫలసిద్ధి లభించును. అతి దుర్లభమైన బ్రహ్మజ్ఞానప్రాప్తికి అర్హులెవరో ముందు విశదీకరిస్తూ నిత్యానిత్య జ్ఞానముగల వివేకులు, శమదమాది సాధన సంపత్తులు కలిగి ఉండవలెనని సూత్రప్రాయంగా చెప్పబడినది.
సద్గతి పొందటము, దుర్గతి పొందటము అనే రెండునూ మనస్సుపైనే ఆధారితము. శ్రేయోమార్గమునవలంబించిన వివేకులు, ఆత్యంతిక సుఖమును ఆశించే నిశ్చయాత్మకులు. ప్రేమోమార్గములో పోయేవారు నికృష్ట జీవితమును అనుభవించి దుఃఖభాగులై ఎన్నటికీ మృత్యువును అధిగమించలేరు. వారికి దుర్గతి, నరకాది లోకములలో వాసము తప్పదు.
భక్తిమార్గంలో సర్వేశ్వరుని శరణుజొచ్చి నిర్మలమనస్సుతో భగవన్నామ స్మరణతో కాలముగడిపే సామాన్యులకూ సద్గతి ప్రాప్తిస్తుంది కాని, దేశ కాలాది ఉపాయములు సమస్తము కేవలము సహకారితములనే గ్రహించాలి. వాటివలన మోక్షము లభించదు.
15. అతో విచారః కర్తవ్యః జిజ్ఞాసోరాత్మవస్తునః
సమాసాద్య దయాసింధుం గురుం బ్రహ్మవిదుత్తమమ్‌॥
ఆత్మతత్త్వమును తెలిసికొనదల్చిన వ్యక్తి, కరుణామయుడు జ్ఞానియైన బ్రహ్మవేత్తయైన గురువును ఆశ్రయించి ఆత్మపదార్థమునకై సమగ్ర తత్త్వ విచారణ చేయవలెను.
అజ్ఞానమనే అంధకారములో జ్ఞానదీపికను చూపించు సత్పురుషుడు గురువు. కారుణ్యభావంతో, జిజ్ఞాసువునకు విద్యాదానము చేయువాడు గురుశ్రేష్ఠుడు. ఆత్మజ్ఞాన పరాయణుడు, సదాచార సంపన్నుడైన ఉత్తమ గురువును పొందిన సాధకుడు ఆత్మతత్త్వము సమగ్రముగా తెలుసుకొనుటకు నిర్విరామ కృషి చేయవలెను. తత్త్వజ్ఞానము, నిరన్తర ఆత్మపరిశీలనచేసే స్థితప్రజ్ఞుడే పొందగలడు.
భగవద్గీతలో స్థితప్రజ్ఞుడని ఎట్టివానిని అందురో ఇలా బోధించబడినది ‘‘ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మనే్యవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే॥ (అర్జునా! ఎప్పుడైతే మనోజనితములైన సమస్త కోరికలను త్యజించి, ఆత్మద్వారా ఆత్మయందు సంతుష్టుడగునో అప్పుడే వానిని స్థితప్రజ్ఞుడని అందురు- భ.గీ.2-55).
స్థితప్రజ్ఞుడైన ఆచార్యుడే. శ్రద్ధ, భక్తి, బ్రహ్మతత్పరతగల శిష్యుని సన్మార్గములో నడిపించి, ఆత్మజ్ఞానమును బోధించును. గురువు అనుగ్రహించినా, సహనతతో ఆత్మవిచారణ నిశ్చల సమాధిలో ఉపస్థితుడై, నిరంతర ధ్యానముద్వారా ఆత్మైకత్వ సాధనచేయకున్న శిష్యునకు ఆత్మావలోకనము సిద్ధించదు.
16. మేధావీ ఉరుషో విద్వానూహాపోహవిచక్షణః
అధికార్యాత్మ విద్యాయాముక్తలక్షణలక్షితః॥
మంచి ధారణాశక్తి అనగా జ్ఞాపకశక్తిగలవాడూ, కావ్యాదులు పఠించిన విద్వాంసుడూ, వ్యాకరణ, తర్క, మీమాంసా శాస్తమ్రులలో నైపుణ్యమున్నవాడూ, మరియు సాధన చతుష్టయ సంపన్నుడే ఆత్మజ్ఞానము పొందుటకు అధికారి.
నిత్యానిత్య వివేకము, శమదమాది షట్సంపదలు, వైరాగ్యభావన మరియు మోక్షమందు ఆసక్తిగల సాధకుడే సద్గురువుని ఆశ్రయించి, తత్త్వజ్ఞానో పార్జనకు పూనుకొనవలెనని ముందు శ్లోకముల్లో సూచించడమైనది. అయినా, మరల వాటిని రానున్న శ్లోకములలో వివరించనున్నారు.
17. వివేకినో విరక్తస్య శమాదిగుణశాలినః
ముముక్షోరేవ హి బ్రహ్మజిజ్ఞాసాయోగ్యతా మతా॥
పరబ్రహ్మతత్త్వము తెలిసికొని, ఆత్మసాక్షాత్కారము పొందవలననే తీవ్రమైన ఇచ్ఛయే జిజ్ఞాస. జిజ్ఞాసువు యోగ్యతను ఏ గుణములతో పొందునో ఇచ్చట చెప్పబడినది:-
1) వివేకియై ఉండవలెను. 2) వైరాగ్య ప్రవృత్తికల్గి శరీర సంబంధ సుఖములపై ఆసక్తి ఉండరాదు, 3) శమదమాది షట్ సంపదలు అనగా శమము, దమము, ఉపరతి, తితిక్షా, శ్రద్ధా, సమాధానము, మరియు 4) మోక్షేచ్ఛకల్గి ఉండవలెను.
సాధన చతుష్టయము
18. సాధనాన్యత్ర చత్వారి కథితాని మనీషిభి.
యేషు సత్స్వేవ సన్నిష్ఠా యదభావే న సిద్ధ్యతి॥
బహ్మతత్త్వమును తెలుసుకొనగోరే జిజ్ఞాసువులకు నాలుగు విధములైన సాధనములను ప్రాజ్ఞులైన పండితులు నిర్దేశించారు. ఇవియే సాధన చతుష్టయం అని పేర్కొనబడినవి. అవి కల్గినవారే సత్స్వరూపము మరియు సృష్టికి కారణమైన (సత్తా), బ్రహ్మమందు నిష్ఠగలవారగును. సాధన చతుష్టయమందు ఏది అభావమైనా, స్థిరత్వము లేక, ఆత్మజ్ఞానము సిద్ధించదు.
కారణము లేక కార్యము కాదు. మట్టి అభావమైన, ఘటాదులు నిర్మించబడవు. అదే విధముగా, స్వర్ణము లేనియెడల స్వర్ణ్భారణములు చేయబడవు. సాధన చతుష్టయము బ్రహ్మజ్ఞాన కార్యమునకు కారణమని చెప్పబడుతున్నవి.
19. అదౌ నిత్యానిత్యవస్తువివేకః పరిగణ్యతే
ఇహాముత్ర ఫలభోగవిరాగ స్తదనన్తరమ్‌
శమాదిషట్కమత్పత్తిఃముముక్షుత్వమితి స్ఫుటమ్‌॥
నిత్యానిత్య వివేకము తదనంతరము ప్రస్తావించిన శమదమాది సంపత్తుల ప్రాప్తికి కారణము. అందువలన ముందుగా, ఏది సదా ఉండేది, ఏది అనిత్యమనే వివేకము కలగాలి. మానవ లోకంలో పొందే ధన కనక వస్తు వాహనాదులు, తదితర శారీరిక సుఖములన్నీ ఏదో ఒకరోజు నాశనమయేవే. సుదీర్ఘ ఆయువు బాధ కలిగించేదే. ‘‘అతి దీర్ఘే జీవితే కో రమేత’’అని నచికేతుడు మృత్యుదేవతనే అడిగినట్లు శ్రుతిలో విన్పిస్తున్నది (క.ఉ.1-27). ఇక పుణ్యఫలంతో మరణానంతరము స్వర్గలోకానికి పోయినా అదియూ అనిత్యమనే స్మృతి తెలియజేస్తున్నది ‘‘క్షీణే పుణ్యే మర్త్యలోకం విసంతి’’ (పుణ్యములు క్షీణించగానే మర్త్యలోకంలో తిరిగి ప్రవేశింతురు- భ.గీ.9-21). ఈ కారణంగా వివేకులు ఈ లోకంలోనూ, పరలోకంలోను పొందే సుఖాలపై ఆసక్తి చూపరు.
- ఇంకావుంది...