మెయన్ ఫీచర్

పౌరసత్వ చట్టానికి సవరణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు అమలులోకి రావడం ద్వారా నిర్దిష్ట నిబంధనలను పాటించిన కాందిశీకులకు భారతీయ పౌరసత్వం లభిస్తుంది. పౌరసత్వం అనేది కేవలం ఒక గుర్తింపు మాత్రమే కాదు, ఆయా దేశాల్లోని ప్రభుత్వాలతో వ్యక్తులకు ఉండే సన్నిహిత సంబంధానికి ప్రతీక అవుతుంది. పౌరసత్వం సగటు పౌరుడికి ఎన్నో సదుపాయాలు కల్పిస్తుంది. స్వేచ్ఛగా జీవించడం మొదలు, ఓటు ద్వారా తనకు నచ్చిన వ్యక్తులను ఎన్నుకునే సదుపాయం, పన్నుల చెల్లింపు, రాయితీలు, ప్రభుత్వ పథకాలు మొదలు స్వేచ్ఛగా తిరిగేందుకు, వాక్ స్వాతంత్య్రానికి, ప్రజాస్వామ్యయుతంగా సంఘాలు, కమిటీల్లో చేరేందుకు పౌరసత్వం సమాన హక్కులను కల్పిస్తుంది. ఒకపుడు పౌరసత్వం అందరికీ లభించేది కాదు, ధనవంతులకు, ఎంపిక చేసిన వారికి మాత్రమే పౌరసత్వం ఉండేది. వారు నిర్ణయించిన ప్రకారం మిగిలిన సమాజం నడుచుకోవల్సిన పరిస్థితి ఆనాటిది. పౌరసత్వ భావన క్రీ.శ. 212లో ఆరంభమైంది. గ్రీకు, రోమన్ సామ్రాజ్యాల్లో ఇది మొదలైంది. తర్వాతి కాలంలో మధ్యయుగంలో పౌరసత్వం అనేది అదృశ్యమైనా, ఆధునిక యుగంలో ఈ అంశానికి విశేష ప్రాధాన్యత వచ్చింది. 1750 తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికాలు రాజ్యాంగబద్ధంగా పౌరసత్వాన్ని కల్పించే చట్టాలు చేశాయి. ఆ విధంగా చూస్తే అటూ ఇటుగా పౌరసత్వానికి దాదాపు 300 ఏళ్ల చరిత్రే ఉంది.
భారత్‌లో 1947లో స్వాతంత్య్రానంతరం పౌరసత్వ చట్టాలు చేశారు. ఇంతవరకూ పౌరసత్వ చట్టానికి నాలుగు మార్లు కీలక సవరణలు చేశారు. ఐదోమారు చట్ట సవరణకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. ఒక పక్క ఎన్‌ఆర్‌సీ దేశ వ్యాప్తంగా అమలుచేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన తరుణంలోనే పౌరసత్వ సవరణ బిల్లును ప్రతిపాదించింది. పొరుగుదేశాల నుండి వలస వచ్చిన ఆరు మతాల వారికి పౌరసత్వ సవరణ బిల్లు రక్షణ కల్పిస్తుండగా, ఎన్‌ఆర్‌సీ మాత్రం మత ప్రాతిపదికన కాకుండా భారత్‌కు 1971 మార్చి 24 తర్వాత వచ్చి స్థిరపడిన అక్రమ వలసదారులను తిరిగి తమ దేశాలకు పంపించేలా చట్టాన్ని రూపొందించారు. ఇప్పటికే గుర్తించిన అక్రమ వలసదారులను వెనక్కు పంపే ప్రయత్నాలు ప్రారంభించింది. అక్రమ వలసదారుడు ఎవరో తేలాలంటే ముందు భారతీయులు ఎవరో తేలాలి... ఈ చిక్కుముడి విప్పేందుకే కేంద్రం పౌరసత్వ చట్టానికి సవరణలు చేస్తోంది.
ప్రస్తుతం అమలులో ఉన్న పౌరసత్వ చట్టం -1955లోని నిబంధనలను సవరించడమే ఈ బిల్లు ఉద్దేశం. చట్ట నిబందనల ప్రకారం ఎవరైనా వేరే మార్గంలో దేశంలో ప్రవేశిస్తే వారిని చట్ట వ్యతిరేక కాందిశీకులుగా పరిగణిస్తారు. ఎలాంటి పత్రాలు లేకుండా భారత్‌కు వచ్చి నిర్థారిత సమయానికి మించి ఇక్కడే తలదాచుకున్న వారందరినీ అక్రమ వలసదారులుగా శరణార్థులుగా గుర్తిస్తున్నారు. ఇపుడు అలాంటి వారు సైతం భారతీయ పౌరసత్వం పొందేందుకు అర్హులవుతారు. ఇందుకు ఉద్దేశించిన బిల్లు ఆమోదంపై కేంద్ర ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల పార్టీలతో సంథి కుదుర్చుకునే ప్రయత్నం చేసింది. పౌరసత్వం పొందిన వారికి ఈశాన్య రాష్ట్రాల్లో స్థానికత కల్పించబోమని నచ్చచెప్పే ప్రయత్నం కేంద్రం చేస్తోంది. ఈ విషయమై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మూడు రోజులుగా ఆ ప్రాంత నాయకులతో చర్చలు జరిపారు. బిల్లుపై ఆయన లోక్‌సభలో తమ వైఖరిని స్పష్టం చేశారు. బెంగాల్ తూర్పు సరిహద్దు నిబంధనలు -1873 ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ తీసుకోవల్సిన అరుణాచల్ ప్రదేశ్, మిజోరం, నాగాలాండ్ రాష్ట్రాలు, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో వర్తించే ప్రాంతాలు, అసోం, మేఘాలయ, త్రిపురల్లోని స్వయంప్రతిపత్తి ప్రాంతాలను ఈ సవరణల పరిధి నుండి మినహాయింపు ఇచ్చారు. సవరణ బిల్లులోని అంశాలు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయని, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని అసోం మాజీ సీఎం తరుణ్ గొగొయ్ ఇప్పటికే ప్రకటించారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లును ఆమోదించవద్దని సీపీఎం నేత సీతారాం ఏచూరి కూడా కోరారు. సమానత్వ హక్కుకు ఇది వ్యతిరేకంగా ఉందని, రాజ్యాంగంలోని 5,15వ అధికరణానికి కూడా ఇది విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చింది. మైనార్టీల హక్కులకు ఈ బిల్లు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది.
పౌరసత్వంపై రాజ్యాంగం చాలా స్పష్టంగా నిర్వచించింది. రాజ్యాంగం పార్టు -2లో ఐదో అధికరణం మొదలు 11 వరకూ పౌరసత్వ నిబంధనలను వివరిస్తాయి. ఐదో అధికరణం ప్రకారం భారత భూ భాగంలో జన్మించిన వారికి భారత పౌరసత్వం సిద్ధిస్తుంది. వారు భారత భూభాగంలోనే శాశ్వత నివాసం ఉండాలి, ఆ వ్యక్తి తల్లిదండ్రుల్లో ఎవరైనా భారత భూభాగంలో జన్మించి ఉండాలి లేదా భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన నాటికి కనీసం ఐదేళ్ల పూర్వం నుండి ఆ వ్యక్తి భారత భూభాగంలో నివసిస్తూ ఉండాలి. ఇది పౌరసత్వానికి సంబంధించి భారత రాజ్యాంగం చెప్పే నిబంధన. పాకిస్థాన్ నుండి వలస వచ్చిన వారికి కూడా భారత రాజ్యాంగంలో అధికరణం -6లో నిబంధనలు చేర్చారు. ఐదో అధికరణంలో ఏం పేర్కొన్నా, భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేనాటికి పాకిస్థాన్ భూభాగం నుండి భారత భూభాగంలోకి వలస వచ్చిన వారు కొన్ని నిర్దిష్ట అర్హతలు కలిగి ఉండే వారిని సైతం భారత పౌరులుగా పరిగణిస్తారు. భారత ప్రభుత్వ చట్టం -1935లో నిర్వచించిన విధంగానే ఆ వ్యక్తి పాకిస్థాన్ నుండి వలస వచ్చిన వ్యక్తి అయి ఉండాలి, లేదా అతని తల్లిదండ్రులు లేదా వారి తల్లిదండ్రుల్లో ఎవరైనా భారతదేశ భూభాగంలో జన్మించి ఉండాలి. అంతే కాకుండా 1948 జూలై 18వ తేదీ కంటే ముందుగానే ఆ వ్యక్తి భారతదేశానికి వచ్చినట్టయితే ఆ విధంగా వచ్చిన నాటి నుండి వారు భారతదేశ భూభాగంలోనే నివసించినట్టయితే వారు కూడా భారతీయ పౌరులుగానే గుర్తింపు పొందుతారు. ఒక వేళ 1948 జూలై 18వ తేదీ తర్వాత భారత భూభాగంలోకి వలస వచ్చినా, తనను భారత పౌరుడిగా గుర్తించాలని భారత డొమినియన్ ప్రభుత్వం నియమించిన పౌరసత్వ రిజిస్ట్రీ అధికారికి దరఖాస్తు చేసుకుని ఉండాలి, దరఖాస్తు చేయడానికి ఆ వ్యక్తి కనీసం అంతకంటే ముందు ఆరునెలలుగా ఇక్కడే నివసించి ఉండాలి. భారత రాజ్యాంగం అమలులోకి రాకపూర్వమే అతని దరఖాస్తు ఆమోదం పొంది ఉండాలి.
భారత రాజ్యాంగం అధికరణం 7లో పాకిస్థాన్ వలస వెళ్లిన వారి పౌరసత్వాన్ని స్పష్టంగా వివరించింది. ఐదు, ఆరు అధికరణాల్లో ఏం చెప్పినా, 1947 మార్చి 1వ తేదీ తర్వాత భారత భూభాగం నుండి పాకిస్థాన్ భూభాగంలోకి వలస వెళ్లినట్టయితే వారు ఆ భారతదేశ పౌరులుగా పరిగణనలోకి రారని వివరించారు. అయినా ఆ విధంగా వలస వెళ్లిన వారు చట్టబద్ధంగా, అధికారికంగా జారీ చేసిన పునరావాస పత్రం ద్వారా లేదా భారతదేశంలో స్థిరంగా ఉండటానికి అనుమతిచ్చే పత్రం ద్వారా భారతదేశ భూభాగంలోకి ప్రవేశించి 6వ అధికరణంలోని క్లాజు -బీ పరిధిలో ఆ వ్యక్తి 1948 జూలై 18 తర్వాత భారతదేశానికి వలస వచ్చినట్టుగానే పరిగణనలోకి వస్తుంది. భారతదేశం వెలుపల నివసిస్తున్న భారత సంతతి ప్రజల పౌరసత్వం గురించి రాజ్యాంగంలోని 8వ అధికరణం వివరిస్తుంది దాని ప్రకారం చూస్తే ఒక వ్యక్తి లేదా అతని తల్లిదండ్రులు లేదా వారి తల్లిదండ్రుల్లో ఎవరైనా భారతదేశంలో భారత ప్రభుత్వ చట్టం-1935లో నిర్వచించిన విధంగా ఇక్కడే జన్మించి, మరో దేశంలో నివసిస్తూ ఉండొచ్చు, అయినా తనను భారతీయుడిగా గుర్తించాల్సిందిగా ఆ వ్యక్తి తాము నివసిస్తున్న దేశంలోని భారత రాయబారికి లేదా దౌత్య ప్రతినిధికి దరఖాస్తు చేసుకుని, రిజిస్టర్ అయితే ఆ వ్యక్తి భారతీయుడిగానే పరిగణనలోకి వస్తాడు. ఐదు, ఆరు, ఎనిమిది అధికరణాల కింద ఒక వ్యక్తిని భారతీయుడిగా పరిగణించినా, ఆ వ్యక్తి స్వచ్ఛందంగా ఏదైనా విదేశీ పౌరసత్వాన్ని స్వీకరించినట్టయితే, అతడు ఇంకెంత మాత్రం భారతీయ పౌరుడిగా పరిగణించరు. భారతీయుల పౌరసత్వానికి సంబంధించి సవరణలు చేసే అవకాశం రాజ్యాంగంలోని పదో అధికరణంలో కల్పించారు. ఇందుకు సంబంధించి శాసనాల రూపకల్పన అధికారం పార్లమెంటుకు వుంది. రాజ్యాంగంలోని 11వ అధికరణం కింద పౌరులకు పౌరసత్వం కల్పించడం, పౌరసత్వాన్ని రద్దు చేయడం మొదలైన అంశాలకు సంబంధించిన శాసనాలను రూపొందించే విశేషాధికారం పార్లమెంట్‌కు కల్పించారు. ఈ అధికరణం కిందనే భారత పార్లమెంటు పౌరసత్వ సవరణ బిల్లును ప్రతిపాదించింది.
పౌరసత్వ చట్ట సవరణ బిల్లును గతంలో ప్రతిపాదించగా, లోక్‌సభ 2016లోనే ఆమోదించింది. రాజ్యసభలో అది ఆమోదం పొందడానికి ముందే 16వ లోక్‌సభ రద్దవడంతో ఈ బిల్లు మురిగిపోయింది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన పౌరసత్వ సవరణ బిల్లును మరో మారు తాజా సవరణలతో కేంద్రప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
భారత్ పొరుగు దేశాలైన ఆఫ్గానిస్థాన్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుండి మతపరమైన దాడులు, హింస కారణంగా వేరే మార్గాల్లో వచ్చిన హిందూ, సిక్కు, జైన్, బౌద్ధ, పార్శి, క్రైస్తవులకు భారతీయ పౌరసత్వం కల్పించడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ బిల్లులో ముస్లింలను మాత్రం చేర్చలేదు. దానికి కారణం రాజ్యాంగంలోనే వారి ప్రస్తావన స్పష్టంగా ఉండటమే. నేపాల్ , శ్రీలంక నుండి వచ్చే మైనార్టీలపై కూడా ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పౌరసత్వం నిర్ధారణ మతం ప్రాతిపదిక కానేరదని రాజ్యాంగ నిర్మాతలే చాలా స్పష్టంగా చెప్పారు. చట్ట సవరణ ఆమోదం పొంది బయటి దేశాల నుండి వచ్చే వారిని తమ రాష్ట్రాల్లో పౌరసత్వం కల్పిస్తే ఇక్కడే పుట్టి పెరిగిన తమ తెగల మనుగడకే ముప్పు ఏర్పడుతుందని ఈశాన్య రాష్ట్రాలు భయపడుతున్నాయి. కేంద్రం చెప్పిన మూడు దేశాల నుండి ఇంత వరకూ 31,313 మంది భారత్‌కు వచ్చినట్టు లెక్కలు తీశారు. ఇందులో హిందువులు 25,447 మంది, సిక్కులు 5807 మంది, క్రైస్తవులు 56 మంది, బౌద్ధులు, పార్శీలు ఇద్దరు చొప్పున ఉండొచ్చని అంచనా. వారందరికీ స్వేచ్ఛ లభించనుంది.

- బి.వి.ప్రసాద్ 9963345056