మెయిన్ ఫీచర్

శిక్షాస్మృతి మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరాలు జరగని దేశం ప్రపంచంలో లేకపోవచ్చు. అది మనిషి రక్తం, జీవకణాలలో ఒక అంతర్భాగమైంది. ఎక్కువ, తక్కువ తేడాలే మనం గమనించగలం. నేరాలెందుకు జరుగుతున్నాయని వేల సంవత్సరాలనుండి శాస్తజ్ఞ్రులు పరిశోధిస్తున్నారు, చర్చిస్తున్నారు. మనిషికొక విధంగా, దేశానికొకవిధంగా, యుగానికొక విధంగా కారణాలుండవచ్చు. నేరాల మూలాలను నియంత్రించలేకున్నాము.
వేదాలు, కౌటిల్యుని అర్థశాస్త్రం, మనుస్మృతి, యాజ్ఞవల్క్యస్మృతి, నారదస్మృతి, మితాక్షర, ధర్మశాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు, భగవద్గీత, ఖురాన్, బైబుల్ మొదలగు గ్రంథాలన్నీ మనకు ధర్మాలు అధర్మాలు చెప్పాయి. బ్రిటీషువారు మన దేశానికి చట్టాలు, కోడ్‌లు రాసినప్పుడు మన పూర్వ ధర్మశాస్త్రాలు, పురాణాలు, సంస్కృతీ సంప్రదాయాలను అవగాహనకు తెచ్చుకొని వాటి ప్రకారం రాశారు. మరీ ముఖ్యంగా 1860లో వచ్చిన లార్డ్ మెకాలే అధ్యక్షతన రాయబడ్డ భారతీయ శిక్షాస్మృతిలో క్రీ.శ.2/3 శాతాబ్దాలలో భాగవత పురాణంలో పంచమ స్కంధంలో శుకమహర్షి పరీక్షిత్తునకు చెప్పిన పాపములన్నీ రాయబడినవి. ఆ నేరాలే ఇపుడు కూడా మనం చూస్తున్నాము. అప్పటికీ ఇప్పటికీ మానవుడు వాడే, నేరాలు అవే. మానవునిలోని నేర ప్రవృత్తిని అదుపు చేయలేకపోయాము. నేరాలకు నేడు విధిస్తున్న శిక్షల మోతాదు చాలటంలేదనిపిస్తుంది. మంచి ఫలితాలు రాలేదు. శిక్షలకు భయపడి నేరాలు చేయటం మానుకోవటంలేనిది గమనిస్తున్నాము. శిక్షల పరమార్థం నేరాలను ఆపటం మరియు సత్ప్రవర్తన తేవటం. కాని ఈ ఫలితాలు సిద్ధాంత గ్రంథాలలో అలంకారాలుగా మిగిలాయి.
భారతదేశంలో మహిళలపై అత్యాచార నేరాలు, హత్యలు ఇతర నేరాలపై శిక్షల శాతం బహు తక్కువగా ఉన్నవి. 2017 సంవత్సరంలో 1,46,201 కేసులు విచారణ జరిగితే 5822 కేసులలో మాత్రమే శిక్షలు పడ్డవి (జాతీయ నేరాల నమోదు సంస్థ గణాంకాల ప్రకారం). ఎందువలన? దీనికి జవాబెవరు చెప్పాలి? బాధ్యులెవరు? మన న్యాయశాస్త్రంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ (సందేహ ప్రయోజనం) ముద్దాయికివ్వాలనే సూత్రమే గాక బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ (నేర రుజువు భారం) ఫిర్యాదిపైనే ఉండటం, ప్రూఫ్ బియాండ్ రీజనబుల్ డౌట్ (నిస్సందేహంగా నేరం రుజువు కావడం) సూత్రం ఉండటం, ముద్దాయికి కూడా అందరికివలెనే హ్యూమన్ రైట్స్ (మానవ హక్కుల) అమలు సూత్రం రావటం-ఇత్యాది వాదనలవలన నేరం చేసినవాళ్ళు కూడా తప్పించుకొని పోవటం శిక్షల శాతం గణనీయంగా పడిపోతున్నదని, తన్మూలంగా నేరాలు ఆగటంలేదని కొందరు పరిశోధకులు చెబుతున్నదానిలో వాస్తవమున్నది. ఇది న్యాయశాస్త్ర సంబంధమైనది. ఇవన్నీ మారాల్సిందే. మరీ ముఖ్యంగా మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలపై చట్టాలు మార్చి కఠినతరం చేయాలి. ఈ క్రూరత్వాన్ని దేశంలో ఆపాలి. న్యాయస్థానాలు చట్టప్రకారం తీర్పుచెప్పినా చట్టమే మారాలి.
కొన్ని తరహా నేరాలకు ఉరిశిక్షల విధింపు ఉన్నది. కాని ఉరిశిక్ష రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్ (అత్యరుదైన నేరాల)కే విధించాలనే సూత్రాన్ని భారతీయ న్యాయ / ధర్మ శాస్త్రంలో చెప్పబడింది. మహిళలు, బాలికలపై జరుగు లైంగిక నేరాలు, హత్యలు అత్యరుదైన నేరాలుగానే భావించాలి తప్ప మరణశిక్షను మార్చరాదు. సుప్రీంకోర్టు ఆ విధానానినే అవలంభించటంవలన దిగువ కోర్టులో విధించబడిన మరణశిక్ష మూడు, నాలుగంచెల వ్యవస్థలు దాటిన తర్వాత నిర్వీర్యం కావటం జరుగుతున్నది. తీర్పు దశాబ్దాలు పడుతుంది. నిర్భయ కేసులో నేరం 2012, హైకోర్టు తీర్పు 2014, సుప్రీంకోర్టు తీర్పు 2017. ఇంతవరకూ అమలు కాలేదు. ఈ జాప్యానికి బాధ్యులెవరు? విచారణ కోర్టు తీర్పుపై అపీలుగాని, రివిజన్ కానీ, రివ్యూగాని ఏదో ఒకటి మాత్రమే ఉండాలి. దీనికి కాలనియమం ఉండాలి. క్షమాభిక్షలు రద్దుచేయాలి. పినాలజీ మారాలి. కొన్ని దేశాలలో శిక్షలు చాలా కఠినంగా ఉండి ప్రజల సమక్షంలో అమలు జరుగుతున్నవి. ఈ విధానంవలన ప్రజల మనసులలో శిక్ష భయానకంగా నిలిచిపోతున్నది. మనదేశంలో అలా కాదు. మానవ హక్కులున్నై, సంస్కరణ సిద్ధాంతాలున్నై. ఉరిశిక్ష అరుదైన నేరాలకే అనే సిద్ధాంతంనుండి మహిళలు బాలికలపై జరుగు అత్యాచారం, హత్య కేసులను మినహాయించాలి. నేటి సమాజ తీవ్రతలను చట్టాల ద్వారా ప్రభుత్వాలు గుర్తించాలి. న్యాయస్థానాలు గుర్తించాలి. నేరాలు ఆపటం చేతకాదని తేలిపోయింది. నేరగానిని నీవు ఆగు అంటే ఆగడు. శిక్షల అమలుకావడంలేదు. విచారణ ఆలస్యమవుతున్నది. అతి తక్కువ శాతం కేసుల్లో శిక్షలు పడుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వాలపై, న్యాయస్థానాలపై, చట్టాలపై నమ్మకం పోయి నేరగాణ్ణి మాచేతికివ్వండి, మేము చంపేస్తాం, మేమే శిక్షిస్తాం అనే వాదన వచ్చింది. ఇందుకు భారతీయ శిక్షాస్మృతి నేరపరిశోధనా చట్టాలు, నేర విచారణా చట్టాలు, హ్యూమన్ రైట్స్ చట్టం, జైలు మాన్యవల్, జువనైల్ చట్టాలు, శిక్షల అమలు చట్టాలు సమూలంగా మారాలి. నేరం చేయలేదనే రుజువు భారం కోర్టు విచారణలో నిందితుని మీద కూడా ఉండాలి. నియమిత కాలంలో ఈ కేసులపై విచారణ ముగించే చట్టం అమలుకు రావాలి. ముద్దాయికి ప్రజల సమక్షంలో శిక్ష అమలు జరపాలనే డిమాండ్ బలంగా ముందుకు వచ్చింది. ప్రజలకు సమాధానం ప్రభుత్వాలు ఏం చెబుతాయి? ఈ అన్యాయాలను, అఘాయిత్యాలను ఎలా ఎవరు ఆపగలరు? ప్రభుత్వాలు సుదీర్ఘ చర్చలు జరిపి పరిస్థితిని చక్కబెట్టాలి. నేరాలు చేయకుండా సత్ప్రవర్తనను శతాబ్దాల తరబడి ఎవరూ తేలేకపోయారు. ఆ విధానమే కాక ఇతర విధానాలను ఆలోచించి ప్రభుత్వం అమలుకు తేవాలి. ప్రజల తిరుగుబాటును ఆపాలి.
పాతకాలపు శిక్షల మోతాదులు నేటికాలంలో ప్రజల దృష్టిలో లెక్కలోలేనివిగా వున్నవి. వాస్తవం కూడా అంతే. కోట్ల డబ్బు కొల్లగొట్టినా శిక్షాకాలం ఒకటి లేక రెండు సంవత్సరాలే. శిక్షల మోతాదుపై 1860 సంవత్సరం నాటి భారతీయ శిక్షాస్మృతిలో చెప్పబడిన శిక్షల మోతాదుపై సమాజంలో మానవ నైజం, మారిన పరిస్థితులపై ఇంతవరకు చర్చలు జరుగలేదు. జైల్ మాన్యవల్ కూడా చర్చకు రావాలి. బాధితుడైన ఫిర్యాదుదారునికి లేని మానవల హక్కులు నేరస్తునికెలా వుంటాయని వాదనలొచ్చాయి. జైళ్ళపై పెట్టే బడ్జెట్ ఎవరిపై పడుతుందన్న ప్రశ్నకు జవాబు ప్రభుత్వం కూడా ఇవ్వాలి. శిక్షలు అనుభవింపజేయటంలో సంస్కరణలకిచ్చే విలువ నేరాలు జరుగకుండా చేయటంలో లేదు. సమాజంలో వికృతాలను ప్రభుత్వమే తగు చట్టాలను తెచ్చి మార్చాలి.
మరొకవైపు మన దేశ సంపదలో వేల కోట్లు మింగి విదేశాలలో నివశిస్తున్న మాల్యా, నీరవ్ మోడీ మొదలగురిని మన దేశానికి తీసుకొని రాలేకున్నాము. మన ప్రజల డబ్బును తిరిగి మన ప్రజలకు చెల్లింపజేయలేకున్నాము. అంతర్జాతీయ చట్టాలు అందుకు అనుకూలంగా లేవట. ఇట్టి చట్టాలను మార్చటానికి ప్రపంచ దేశాలు సమావేశం కావాలట. ఒక దేశంలో నేరం చేసిన వ్యక్తికి వేరు దేశంలో రక్షణ కల్పించరాదు. అట్టి నేరగాళ్ళు కాజేసిన దేశ సంపద యావత్తు బ్యాంకుల ద్వారానేనని బ్యాంకుల లెక్కలు చెబుతున్నై. ఐనా బ్యాంకులవారిపై చర్యల్లేవు, ఎందుకని? వాళ్ళూ సహముద్దాయిలు కావాలి కదా! ఎవరు వాళ్ళను కాపు కాస్తున్నారు? ఇవన్నీ చట్టాలలోని లొసుగులే. ఈ లొసుగులను నేరగాళ్ళు బాగా ఉపయోగపెట్టుకున్నారు. ఇట్టి పరిస్థితిని అంతర్జాతీయ సమస్యగా చర్చకు తీసుకరావలసిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నది.
వీటన్నిటితోడుగా మన నేర పరిశోధనా యంత్రాంగం నిర్వీర్యంగా వున్నది. నేర పరిశోధనా విభాగం పోలీసులు వేరుగానూ, లా అండ్ ఆర్డర్ పోలీసులు వేరుగాను విభజించాలి. నేరగాళ్ళు నేరం చేసి చట్టాలకు దొరకకుండా తప్పించుకోవటంలోని నైపుణ్యం నేరపరిశోధనలో పోలీసువారికి లేదని అంగీకరించాలి. ఉగ్రవాదం, ఆర్గనైజ్డ్ నేరాలు, ఆర్థిక నేరాలు, లైంగిక నేరాలు, మాదకద్రవ్య వినియోగాలు, హింస మొదలైన నేరాలు పెరుగుతున్న ఈ సమయంలో నేర పరిశోధనా విభాగం శక్తివంతంగా పనిచేయవలసి వున్నది. ప్రత్యేక విచారణా విధానాలతో కొత్త చట్టాలు అమలుకు రావాలి. న్యాయవ్యవస్థనేమందాం? వారిలోని అవినీతిని సుప్రీంకోర్టు న్యాయమూర్తులే గతంలో అంగీకరించారు. వ్యవస్థలో మార్పు రాలేదు.
ప్రభుత్వాలు న్యాయవ్యవస్థ పట్ల ఉదాసీన వైఖరితో వున్నవి. న్యాయస్థానాలు, న్యాయమూర్తులు, వారి విచారణ విధానాలు, ఫలితాల ఆధారాలు, ఫలితాలు పూర్తిగా మార్పు చెందాలి. తగువిధంగా చట్టాలు మారాలి. రుజువుభారం కేవలం ఫిర్యాదిమీదనే వున్నదను సూత్రంపై పునరాలోచన జరగాలి. ప్రపంచంలోని ఇతర దేశాలు కొన్నింటిలో ఇలా లేవు. ముద్దాయిపై కూడా తాను నేరం చేయలేదనే రుజువు భారం ఉండాలి. లైంగిక ఇత్యాది కొన్ని నేరాలకు ప్రిజమ్‌షన్స్ (అసత్యమని ముద్దాయి నిరూపణ చేసుకునే వరకు నిజమని నమ్మే) చట్టాలుండాలి. వీటికి దశాబ్దాల తరబడి విచారణలు అవసరంలేదు. నేరం చేసినవానికి, నేరంలో బాధితునికి మానవ హక్కులొకే విధంగా ఉండే విధానంపై ‘మానవహక్కు’ నిర్వచనం మారాలి.
మరణశిక్ష ఒక కాగితం పులి మాత్రమే. మరణశిక్షలు ఎంత శాతం, ఎంతకాలం తరువాత అమలౌతున్నాయో గణాంక వివరాలు చూస్తే విస్తుపోతాము. మరణశిక్ష ధృవీకరణ, అత్యరుదైన కేసుగా తీర్పు, అప్పీలు, రివిజన్లు, రివ్యూల విచారణ మెర్సీ పిటిషన్, కమ్యుటేషన్ (మార్పిడి) ఇవన్నీదాటి ముందుకు సాగటానికి దశాబ్దాలు పడుతున్నది.
మహిళలు, బాలికలపై సామూహిక అత్యాచారం, హత్యలాంటి కొన్ని నేరాల తీర్పులపై అప్పీళ్ళు, రివిజన్లు, రివ్యూలు రద్దుచేయాలి. విచారణ మొదటి కోర్టు న్యాయవాది తెలివితక్కువవాడా? తర్వాతివారే తెలివిగలవారా? తీర్పుల అమలుపై తక్కువ కాలనియమం తప్పక ఉండాలి. నిష్కారణంగా అమలు ఆగటంపై జవాబుదారితనాన్ని చట్టం ద్వారా తేవాలి. శిక్షల మోతాదును పెంచి, అమలు విధానాన్ని మార్చి, న్యాయవ్యవస్థపై నిఘా వుంచి సమాజాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
*

- బి. హనుమారెడ్డి 94402 88080