మెయిన్ ఫీచర్

మూలాల నుంచే తొలగించాలి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘కుందేలు పోయింతర్వాత బొక్క బూడ్చుకున్నట్టు’ అని తెలుగులో ఒక సామెత ఉంది. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్న నేరాలు, ఘోరాలు, అత్యాచారాలు, హత్యలు.. ఆ తర్వాత జరిగేది జరిగిన తర్వాత టీవీ చానళ్లలో చర్చలు, రోడ్లమీద నిరసనలు, పోలీసులను, ప్రభుత్వాన్ని దుమ్మెత్తిమపోయడం చూస్తుంటే ఈ సామెత నిజం అనిపిస్తుంది ఎవరికైనా. నిర్భయ పాశవిక అత్యాచారం- దాంతో వచ్చిన కొత్త చట్టం, నిందితులకు పడుతున్న శిక్షలు చూసాక కూడా ఇప్పటికీ ఇంకా నేరప్రవృత్తుల మనసుల్లో మార్పు రాలేదు అనటానికి నిదర్శనం మొన్నీమధ్య జరిగిన డా. దిశ మీది అత్యాచారం, హత్య. పశువైద్యం చేస్తూ మూగజీవాల ప్రాణాలు కాపాడుతున్న దిశ క్రూరమృగల్లాంటి నలుగురు నేరస్థుల చేతుల్లో తన మాన ప్రాణాలు పోగొట్టుకుంది. ఎంత హృదయ విదారక దుర్ఘటన అది. తన పనేదో తను చేసుకుంటూ.. తన దారిన తానుపోతున్న ఆ అమాయకురాలు ఏం చేసిందని ఆ దుర్మార్గులు అంతటి ఘాతుకానికి ఒడ్డికట్టారు?
ఈ రోజుల్లో ఎక్కడ ఏ ఘోరం, అకృత్యం జరిగినా అది ఆ వ్యక్తికి సంబంధించిన.. ఆ కుటుంబానికి సంబంధించిన కష్టంగా, నష్టంగా భావించకుండా ఓ సామాజిక సమస్యగా భావించడం ప్రశంసించదగిన విషయం. దిశ కేసు నిందితులను షాద్‌నగర్ స్టేషన్‌కు తీసుకొచ్చినపుడు స్టేషన్ ముందు కనిపించిన ప్రజాచైతన్యం చూస్తుంటే అనిపించింది- సమాజంలో మానవత్వం ఇంకా పూర్తిగా చచ్చిపోలేదని.. అందులో యువతులకన్నా యువకులే వేల సంఖ్యలో కనిపించారు. ఆగ్రహవేశాలతో ఊగిపోతూ ‘నిందితులను బహిరంగంగా ఉరితియ్యాలి.. వుయ్ వాంట్ జస్టిస్..!’ అంటూ జరిగిన ఘోరంపై గర్జించారు. చనిపోయింది నా చెల్లెలో, నా అక్కో కాదు గదా అనో.. మాబ్‌లోకి వెళితే ఏ లాఠీఛార్జిలోనో, ఫైరింగ్‌లోనో చచ్చిపోతామనో.. భయపడి ఇంట్లో కూర్చోకుండా వీధుల్లోకి వచ్చి అన్యాయం మీద పోరాటం చేశారు. ఇలాంటివి చూస్తున్నప్పుడే అనిపిస్తుంది.. కొంతమంది నేరప్రవృత్తి కలిగిన మగాళ్ళ కారణంగా ‘మృగాళ్ళు’ అంటూ యువకులు, మగవాళ్ళు అందరూ మాటపడవలసి వస్తోంది కదా అని..!
నిజానికి చిన్నప్పటినుంచీ తల్లిదండ్రుల అదుపాజ్ఞలలో.. గురువుల శిక్షణలో.. చక్కటి చదువు, సంస్కారాలతో పెరిగి పెద్దయిన యువకులు, మగాళ్ళు ఎవ్వరూ ఇలాంటి తప్పుడు పనులు చేయరు. మంచితనం, మానవత్వం, జాలి, దయ వాళ్లను సాటి మనిషిని మనిషిలా చూసేలా, ఎదుటివాళ్ళకు విలువ ఇచ్చి గౌరవించేలా వాళ్ళను తయారుచేస్తుంది. దురలవాట్లు, చెడు స్నేహాలు, మంచి చెడుల విచక్షణా జ్ఞానం లేకపోవటం, సిక్ మెంటాలిటీ కలిగి వుండటం వంటివన్నీ ఒక యువకుని నేరప్రవృత్తి కలిగివుండేలా చేసి నేరాలకు ప్రేరేపిస్తాయి.
అందుకే పెద్దలు నేరం జరిగిన తర్వాత గుండెలు బాదుకుని.. చర్చోపచర్చలు చేసి, రాజకీయ నాయకులు రాజకీయం కూడా చేసేసి, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని దుయ్యబట్టి నానా హంగామా చేసేదానికన్నా నేరాలు జరుగకుండా ముందుగా తగిన జాగ్రత్తలు తీసుకోవటం.. నేర కారణాలను మూలాల్లోకి వెళ్లి మరీ పరిశీలించడంవల్ల కొన్ని ప్రాణాలు నిలబడే అవకాశం వుంది.. ఇంటి గడప దాటి బయటకు వచ్చిన ప్రతి ఆడపిల్లకి మాన సంరక్షణ లభించే అవకాశం వుంది. చట్టాలను బలోపేతం చేయటం, బాధితులకు సత్వర న్యాయం లభించటం, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూడటంవల్ల కూడా నేరం చేయటానికి నేర స్వభావులు భయపడేలా వాతావరణం సమాజంలో ఏర్పడుతోంది. వీటివల్ల నేరాల సంఖ్య జీరోకు రాకపోయినా కనీసం చాలావరకు తగ్గే అవకాశం తప్పకుండా వుంటుంది.
ఆధునిక టెక్నాలజీ రెండు వైపులా పదునున్న కత్తిలాంటిది. ఈ కాలంలో సెల్‌ఫోన్లు, లాప్‌టాప్‌లు నిముషాలమీద పనులు నిర్వహించుకోవటానికి ఎంతగా ఉపయోగపడుతున్నాయో, అసభ్యకర దృశ్యాలకు, పోర్న్ వీడియోల వీక్షణకు, ఏ నేరం ఎలా చేయాలో నేర్పా పాఠాలకు, సైబర్ నేరాలకు వేదికలవుతున్నాయి. బుద్ధిగా క్లాసులో కూర్చుని పాఠాలు చదువుకుంటూ.. విద్యాబుద్ధులు నేర్చుకోకుండా ఈ రోజుల్లో ప్రతి విద్యార్థి చేతిలో సెల్‌ఫోన్ ప్రత్యక్షమై, పనె్నండేళ్ళ పిల్లాడు ఎనిమిదేళ్ళ క్లాస్‌మేట్ అమ్మయిని రేప్ చేసే దుస్థితికి ఈ సమాజాన్ని దిగజార్చివేస్తోంది. ప్రాణాలు తీసే డెడ్ వీడియో గేమ్స్, లైవ్ ఆత్మహత్యలు, సినీటైప్ కిడ్నాపలు, నిర్మానుష్య ప్రదేశాల్లో రేప్‌లు, హత్యలు నిత్యకృత్యాల్లా మారిపోయాయి. దున్నపోతుల్లాంటి కామాంధులు కొన్ని నెలల పిల్లల్ని, కౌమారదశ వీడని ఏడెనిమిదేళ్ళ ఆడపిల్లల్ని రక్తమోడేలా రేప్‌లు చేయడం.. పళ్ళూడిపోయిన వృద్ధులు కన్నకూతుళ్ళను వదిలిపెట్టకుండా మానభంగం చేయడం- ఈ సమాజ విలువలను అధఃపాతాళానికి చేర్చటానికి కాకపోతే మరేంటి? ప్రేమ పేరిట అసభ్య శృంగార దృశ్యాలను తెరకెక్కించి.. పోస్టర్ల ద్వారా వీధికెక్కించటంవల్ల పదేళ్ళ కుర్రాడి నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధుడివరకూ వయోభేదాన్ని, వావివరుసలను మర్చిపోయేలా అవి ప్రేరేపిస్తున్నాయి. దీనికితోడు తాగుడు అనే వ్యసనం ఒకటి తోడై మనిషిని పశువుగా మార్చటానికి తోడ్పడుతోంది. అసలు ఈ తాగుడు అనేది ఈ సమాజంలో లేకుంటే ఇన్ని అకృత్యాలకు ఆస్కారం ఉండదేమో అనిపిస్తుంది.
నిజానికి నియంత్రణ అనేదాన్ని అసలు ఈ సమాజంలోని పోలీసు వ్యవస్థ, ప్రభుత్వాలు, అధికారులు మర్చిపోవటంవల్లనే నేరస్థులు ఇలా రెచ్చిపోతున్నారు అనిపిస్తుంది ఎవరికైనా. సెల్‌ఫోన్‌లోని పిచ్చి పిచ్చి పోస్టింగ్‌లమీద, సినిమా నగ్న దృశ్యాలమీద, నాటుసారా.. బెల్ట్ షాపుల విక్రయాలమీద నియంత్రణ అనేదే అస్సలు లేకపోవటం ఈ రోజుల్లో జరుగుతున్న నేరాలకు మూల కారణం. ఎక్సైజ్ శాఖ మీదే ప్రభుత్వ ఆదాయం ఆధారపడి వుండటం, వీధివీధిన ప్రభుత్వ సారాయి దుకాణాలు, బెల్టు షాపులు ఏర్పడటానికి కారణం. ఓటు బ్యాంకు రాజకీయాలు ప్రభుత్వ అధికారుల, రాజకీయ నేతల, ప్రతిపక్ష నాయకుల పట్టించుకోనితనానికి, చూసీ చూడనట్టు పోయే తత్వానికి కారణమై నేర స్వభావులకు తలుపులు బార్లా తెరిచి యధేచ్చగా మెలిగేలా చేస్తోంది. ఇలాంటి కారణాలు తవ్వినకొద్దీ ఎన్నో మన ముందు నిల్చి ప్రస్తుత నేరగ్రస్త సమాజానికి అద్దం పడుతూంటాయి. నివారణ అనివార్యం అని హెచ్చరిస్తూ వుంటాయి. రోగం ఇంకా ముదరకముందే సత్వర చికిత్స చేయాలి ఇకనైనా.

- డా॥ కొఠారి వాణీ చలపతిరావు 98492 12448