మెయన్ ఫీచర్

‘ఎమర్జెన్సీ వీరుల’ మరో పోరాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే నిరంకుశమైన పాలనకు వ్యతిరేకంగా, ప్రజా స్వామ్య పునరుద్ధరణ కోసం ఎమర్జెన్సీ సమ యంలో జరిగిన పోరాటం అతిపెద్ద ప్రజా ఉద్యమం. ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేసి, పత్రికా స్వాతంత్య్రాన్ని హరించివేసి, ప్రతిపక్ష నాయకులను జైళ్లకు పరిమితం చేసి, తన పదవిని కాపాడుకోవడం కోసం అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి దారుణమైన అణచివేత పద్ధతులకు పాల్పడ్డారు. పోలీసులు అరెస్ట్ చేస్తే జైళ్లకు వెళ్లడం మినహా నాటి రాజకీయ నాయకులు చాలావరకూ ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించే ప్రయత్నం చేయనే లేదు. కేవలం ఆర్‌ఎస్‌ఎస్ నేతృత్వంలో అసాధారణమైన నిరసన ఉద్యమం జరిగింది. సత్యాగ్రహ మహోద్యమం జరిపి వేలాదిమంది స్వ చ్ఛందంగా అరెస్ట్‌కు గురయ్యారు. సుమారు లక్ష మంది జైళ్లకు వెళ్లారు. ఈ సందర్భంగా అనేకమంది పోలీసుల చిత్రహిం సలకు గురయ్యారు. వేలాదిమంది విద్యార్థులు, యువకులు రహస్య జీవనానికి వెళ్లి నిరసన ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ ఉద్యమం ఫలితంగానే ఇందిరాగాంధీ చివరకు ‘స్వచ్ఛందం’గా అత్యవసర పరిస్థితిని తొలగించి ఎన్నికలు జరిపారు. నాడు ప్రజల వత్తిడి ఫలితంగా విభిన్న రాజకీయ పక్షాలు జనతాపార్టీ పేరుతో ఒక్కటై ఇందిరా గాంధీని ఎన్నికలలో ఓడించి, తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేశాయ. ఆ తర్వాత దేశ చరిత్ర మారిపోయింది. కాంగ్రెస్ ఆధిపత్యానికి గండి పడింది.
1977లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం గాని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన పలు కాంగ్రెసేతర ప్రభుత్వాలు గాని ఎమర్జెన్సీ సమయంలో పోరాటం జరిపిన వారిని గుర్తించే ప్రయత్నం చేయలేదు. ఎమర్జన్సీ సమయంలో భారీ సంఖ్యలో జైళ్లకు వెళ్ళిన జనసంఘ్ (ప్రస్తుత భాజపా) నేతలు అధికారంలో ఉన్న సమయం లోనూ అటువంటి ప్రయత్నం జరగనే లేదు. పలు కాంగ్రెస్సేతర ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన పలు రాష్ట్రాలలో, ముఖ్యంగా సోషలిస్ట్ పూర్వరంగం గల నేతలు ఎమర్జెన్సీ వీరులను స్వతంత్ర పోరాట యోధులుగా గుర్తించారు. ముందుగా ములాయం సింగ్ యాదవ్ ఉత్తర ప్రదేశ్‌లో, లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్‌లో గుర్తించి వారికి పెన్షన్, ఉచిత రవాణా, వైద్య సదుపాయం వంటి వాటిని కల్పించారు. దాంతో క్రమంగా ప్రస్తుతం మొత్తం పది రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి సదుపాయం కల్పి స్తున్నాయి. నెలకు రూ 10,000 నుండి రూ 25,000 వరకు పెన్షన్ సదుపాయం కల్పిస్తున్నాయి. దక్షిణాది, తూర్పు ప్రాంతాలలో ఉన్న రాష్ట్రాలలో ఇటువంటి సదుపాయాలు కల్పించడం లేదు. కేంద్ర ప్రభుత్వమే జాతీయ స్థాయిలో ఈ విషయమై ఒక విధానం తీసుకోవాలని వాజపేయి హయాం నుండి పలువురు సూచిస్తున్నా అది కార్యరూపం దాల్చడం లేదు. వాజపేయి అందుకు సుముఖత వ్యక్తం చేసినా నాటి హోమ్ మంత్రి ఎల్‌కె అద్వానీ విముఖంగా ఉండడంతో కార్యరూపం దాల్చలేదు.
తాజాగా వామపక్షాలు అధికారంలో ఉన్న కేరళలో సహితం ఇటువంటి సదుపాయం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్టల్రో భాజపా ప్రభుత్వం కూడా ఈ పోరాట యోధులకు ఈ మధ్యనే తగు గుర్తింపు ఇచ్చింది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న గుజరాత్ లో మాత్రం అటువంటి ప్రయత్నాలు జరగడం లేదు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆయన మంత్రివర్గంలో పలువురు ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్నవారే. అందుకనే వారి దృష్టికి ఈ అంశాన్ని తీసుకువచ్చి, జాతీయ స్థాయిలో ఎమర్జెన్సీ ఉద్యమకారులను స్వతంత్ర సమర యోధులుగా గుర్తించేటట్లు చేయాలని హైదరాబాద్ కు చెందిన బిజెపి సీనియర్ నేత సి.అశోక్ కుమార్ గత ఐదేళలుగా తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం భారత్ సురక్ష సమితిని ఏర్పాటు చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో పలు సమావేశాలు జరిపారు. పలువురు కేంద్ర మంత్రులను కలసి విన్నవించారు. అందరూ సానుభూతి చూపేవారే గాని ఆచరణకు మాత్రం సాహసించడం లేదు. ప్రతివారూ ప్రధాని మోదీ ఒప్పుకొంటే గాని తామెవ్వరం ఏమీ చేయలేమని నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నారు. దాంతో ఇతర రాష్ట్రాలలోని ఎమర్జెన్సీ పోరాట యోధులను కూడా సమీకరించి జాతీయ స్థాయిలో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అఖిల భారత స్థాయిలో లోక్ సంఘర్ష సమితి పేరుతో పోరాటం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలోని నేతలతో కలసి ప్రస్తుత భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు పలువురు కేంద్ర మంత్రులకు పరిస్థితిని విన్నవించారు. ఎమెర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన యోధుల జాబితాలను కూడా తయారు చేసి అందించారు.
ఎందుకనో ప్రధాని మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా విముఖంగా ఉండడంతో వారి ప్రయత్నాలు ఫలించడం లేదు. ఐదేళలుగా చేసిన ప్రయత్నాలు ఫలించక పోవడంతో వారు సహనం కోల్పోతున్నారు. దాంతో ‘్ఛలో ఢిల్లీ’ పిలుపు ఇచ్చారు. డిసెంబర్ 4, 5, 6 తేదీలలో ఢిల్లీలో మూడు రోజుల ఉద్యమ కార్యక్రమాన్ని ప్రకటించారు. ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారు. ఎమర్జెన్సీ సమయంలో మీసా, డిఐఆర్ చట్టాల కింద అరెస్ట్ అయినవారు, రహస్య జీవనం సాగించిన వారు ఈ ఆందోళనలో పాల్గొనాలని పిలుపిచ్చారు. డిసెంబర్ 4న రాజ్‌ఘాట్ వద్ద మహాత్మా గాంధీ సమాధి ముందు వౌన దీక్ష, 5న జంతర్ మంతర్ వద్ద ధర్నా జరుపుతామని, 6న కేంద్ర మంత్రులను కలసి తమ సమస్యలను నివేదిస్తామని ప్రకటించారు. మేము కేంద్రాన్ని బిచ్చం అడగడం లేదు. దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు పోరాటం జరిపిన మాకు తగు గౌరవం, గుర్తింపు ఇవ్వడం హక్కుగా స్పష్టం చేస్తున్నాం, ఈ హక్కు కోసం పోరాటం జరుపుతున్నాం- అని అశోక్ కుమార్ స్పష్టం చేశారు. తమ త్యాగాలను గుర్తించి, తమను ప్రజాస్వామ్య పరిరక్షకులుగా పరిగణించి, గౌరవించమని కోరుతున్నామని తెలిపారు.
ప్రధానంగా వీరు ఐదు డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందుంచారు. ఎమర్జెన్సీ పోరాట యోధులను స్వతంత్ర సమర యోధులుగా గుర్తించాలి. వారందరికీ తామ్రపత్రాలు ఇవ్వాలి. వారికి కేంద్రం పెన్షన్ సదుపాయం కల్పించడంతో పాటు ఉచిత రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలి. వారు మృతి చెందితే అధికార లాంఛనాలు కల్పించాలని కోరుతున్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలలో ఈ అంశాలను ప్రస్తావింప చేసే ప్రయత్నం చేస్తున్నారు. స్వతంత్రం రాగానే తెలంగాణలో కేవలం నిజాంకు వ్యతిరేకంగానే కాకుండా భారత ప్రభుత్వానికి వ్యతి రేకంగా కూడా, అంతర్జాతీయ కమ్యూనిస్ట్ సామ్రాజ్యవాద ప్రణాళికలో భాగంగా పోరాడి, ఈ ప్రాంతాన్ని ఒక స్వతంత్ర రాజ్యంగా ప్రకటింప చేయడం కోసం ఆరాట పడిన కమ్యూనిస్ట్‌లను స్వతంత్ర సమర యోధులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అటువంటిది ద్వితీయ స్వతంత్ర సంగ్రామం జరిపిన తమ పట్ల ఉదాసీన, నిర్లక్ష్య వైఖరి చూపడం పట్ల ఉద్యమకారులు తీవ్ర అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఎమర్జెన్సీ సమయంలో సుమారు లక్ష మంది జైళ్లకు వెళ్లినా ఇప్పటికే వారిలో మూడొంతుల మందికి పైగా మృతి చెందారు. గత ఐదేళ్ళల్లోనే ప్రతి సమావేశం జరిగే సమయానికి తమ సంఖ్య తగ్గుతూ వస్తున్నదని అశోక్ కుమార్ తెలిపారు. వారిలో కొందరు వ్యాపారాలు, ఉద్యో గాలు చేసుకొంటూ తమ కుటుంబాలకు కొన్ని సౌకర్యాలు కల్పించ గలుగుతున్నా, పలువురు కీలకమైన యవ్వనంలో ఉద్యమంలో పాల్గొనడంతో ఆర్థికంగా చితికిపోయి దుర్భరమైన పరిష్టితులలో చిక్కుకున్నారని విచారం వ్యక్తం చేశారు. వారి పోరాట పటిమను గుర్తించి, భవిష్యత్ తరాలకు ఆదర్శంగా వారిని నిలపాలని ఆయన స్పష్టం చేశారు. పాఠ్యపుస్తకాలలో ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటాన్ని కూడా చేర్చాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ మినహా దాదాపు అన్ని రాజకీయ పక్షాలు తమ డిమాండ్లకు మద్దతు తెలుపుతున్నా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు పట్టించుకొనక పోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. రోజురోజుకూ తమ సంఖ్య తగ్గిపోతున్న సమయంలో 40 ఏళ్ళ తర్వాత కూడా తమ పట్ల ఉదాసీన ధోరణి ప్రదర్శించడం భావ్యం కాదని కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేయదలచిన్నట్లు తెలిపారు. ఎమర్జెన్సీ పోరాట యోధులకు తగు గౌరవం, గుర్తింపు కల్పించడమే కాదని, ఆ సమయంలో తాము ఎటువంటి విలువల కోసం పోరాడామో, అటువంటి విలువలకు దేశంలోని అన్ని రాజకీయ పక్షాలు హామీ ఇవ్వాలని కూడా కోరుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వంలో పారదర్శకత, పత్రికా స్వాతంత్య్రం, రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజా స్వామ్యం వంటి అంశాలు సహితం ఎమర్జెన్సీ సందర్భంగా తెరపైకి వచ్చాయి.
ఇప్పుడు దేశంలో ఎమర్జెన్సీ అంటూ లేకపోయినా, ప్రస్తుత పరిస్థితులు అంతకన్నా దారుణంగా తయా రవుతున్నాయని వీరిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో అన్ని రాజకీయ పార్టీలు కుటుంబ పార్టీలు గానో, ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల ఆధిపత్యంలో ఉన్న పార్టీలు గానో మారాయి. పత్రికలపై అధికారికంగా ఆంక్షలు లేకపోయినప్పటికీ అవి పారిశ్రామిక వేత్తల చేతులలోకి మారడంతో వారు అధికారంలో ఉన్నవారి వత్తిడులకు, బెదిరింపులకు తలవంచక తప్పడం లేదు. కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాలలో కీలక అంశాలపై సరైన చర్చలు జరగడం లేదు. కీలక మైన విధానాలను బాహ్యశక్తులు నియంత్రి స్తున్నాయనే అపవాదు ముఖ్యంగా ఆర్థిక సంస్కరణల తర్వాత పెరుగుతున్నది. అవినీతి వ్యవస్థాగత రూపం సంతరింపచేసుకొంది. అందుకు వివాదాస్పదమైన ఎన్నికల బాండ్లు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి. దేశానికి వెనె్నముకగా భావిస్తున్న గ్రామీణ, వ్యవసాయ రంగాలు తీవ్రమైన నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
ఎమర్జెన్సీ ఉద్యమం ఫలితంగా- ఆ తర్వాత కొత్త రూపం సంతరింప చేసుకున్న హక్కుల కమిషన్లు ఇప్పుడు నిస్తేజంగా తయారయ్యాయి. ఇవి రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయి. ప్రజాబలం చేతే మొదటిసారి బ్రిటిష్ వారి నుండి, రెండోసారి ఇందిరా గాంధీ నుండి దేశానికి స్వాతంత్య్రం సాధించుకున్నాము. కానీ నేడు ప్రజాబలంపై కాకుండా అధికార బలంపై ఎక్కువ విశ్వాసం వ్యక్తం అవుతున్నది.
తాజాగా మహారాష్టల్రో జరిగిన రాజకీయ పరిణామాలు దేశంలో దిగజారుతున్న రాజకీయ ప్రమాణాలను వెల్లడి చేస్తున్నాయి. స్టార్ హోటళ్లలో ఈ దేశ రాజకీయాలు రూపం దిద్దుకొంటున్నాయి. కార్పొరేట్ రంగం తెరవెనుక రాజకీయ నాయకులను ఆడిస్తున్నాయి. మరోసారి స్వతంత్ర పోరాటం- ఈసారి ఆర్ధిక, సామాజిక స్వాతంత్య్రం కోసం పోరాడవలసిన అవసరం ఏర్ప డుతున్నదా? అనే అనుమానం కలు గుతున్నది.

-చలసాని నరేంద్ర