మెయిన్ ఫీచర్

అంత ఉలుకెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక సినిమా విజయం సాధిస్తే -అందుకు కారణంగా ఎన్నో విషయాలు చెప్పడం కనిపిస్తోంది. సినిమా విఫలమైతే మాత్రం -సమీక్షలు దెబ్బతీశాయన్న సింపుల్ రీజన్ ప్రస్తావనకొస్తోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మళ్లీ కొత్తగా వినిపిస్తోన్న వాదనిది. కొంతకాలం క్రితం సమీక్షలు సినిమాలను దెబ్బతీస్తున్నాయన్న వాదన బలంగానే వినిపించింది. అయినా -సమీక్షకులు తమ పని తాము చేసుకుపోయారు. ఇటీవలి కాలంలో మళ్లీ అదే మాట వినిపిస్తోంది. నిజంగానే సమీక్షలు సినిమాను చంపేస్తున్నాయా? వాటికి అంత బలముంటుందా? రెండు గంటలపాటు పెద్ద స్క్రీన్‌పై కనిపించే సినిమా ప్రభావమే జనంపై ఉండదని సినీవర్గం గట్టిగా వాదిస్తోన్న తరుణంలో -రెండు కాలమ్స్‌లో సాగే సమీక్ష సినిమాను చంపేయగలదని ఎలా అనుకోవాలి. ఎంతవరకూ ఇది నిజం.
***
సినిమా ప్రమాణానికి తగిన స్థాయిలో సమీక్షలు రావడం లేదన్న వాదనా లేకపోలేదు. ఏమాత్రం పసలేని సమీక్షలు వస్తున్నాయన్న మాటా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇవన్నీ మంచిదే. ఓ సినిమాను విశే్లషించుకున్నట్టే -ప్రమాణ స్థాయిలేని సమీక్షలను విశే్లషించటంలో తప్పులేదు. కానీ, సమీక్షే సినిమాను చంపేస్తోందన్న మాట సత్యదూరం.
సినిమా నిర్మాణం ఓ యజ్ఞం. ముహూర్తపు షాట్ నుంచి సెన్సార్ వరకు జాగ్రత్త తప్పదు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా -24 క్రాఫ్ట్స్ అభాసుపాలవుతాయి. కథ నచ్చిన తరువాతే -కోట్లు పెట్టుబడి పెడతాడు నిర్మాత. సో, ప్రతీ విషయాన్నీ ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించే తెరకెక్కించే ప్రయత్నం మొదలెడుతుంది చిత్రబృందం. యజ్ఞం పూర్తి చేసిన తరువాత -్ఫలితం అందొచ్చు, అందకపోనూవచ్చు. అంటే -నిర్మాత కోట్లు పెట్టాక.. క్రాఫ్టులన్నీ సినిమాకు రూపమిస్తే ఆడియన్స్ ఆనందిస్తారు. నచ్చితే ఓకే అంటారు. లేదంటే విసిరి కొడతారు. ఒక సినిమా ఆదరణ, నిరాదరణలను విశే్లషించి చెప్పేదే -సమీక్ష.
**
సమీక్ష కారణంగా సినిమా చచ్చిపోతుందటూ కొంతకాలం వినిపించింది. అది సరైన వాదన కాదని చెప్పిన సినిమావాళ్లూ ఉన్నారు. అలాంటి వాదనే మళ్లీ కొంతకాలంగా టాలీవుడ్‌లో వినిపిస్తోంది. నిజానికి అలాంటి కామెంట్లు సొంత అభిప్రాయలే. వాటిని గట్టిగా సమర్థించలేం. సమీక్షల ప్రాతిపదికన చూస్తే -నూటికో కోటికో ఒక్క సినిమా కూడా మూడు దాటిన రేటింగ్ సంపాదించటం లేదు. 95 శాతానికి మించి సినిమాలకు ఒకటి పైన, రెండున్నర లోపే రేటింగ్ ఉంటోంది. అన్ని సినిమాల పట్ల సమీక్షలకు ఎందుకు పార్షియాలిటీ ఉంటుంది? అన్న విషయాన్ని ఒక్కసారి సమీక్షించుకోవాలి. పైగా సమీక్షకులు రెండో రోజునే సమీక్ష ఇస్తుండటం వల్ల.. కలెక్షన్లు తగ్గిపోతున్నాయని వాదిస్తోన్న దర్శక, నిర్మాతలూ లేకపోలేదు. ఇది సమంజసమేనా? అనీ ఆలోచించాలి. ప్రేక్షకుడికి సినిమాపై అభిమానం ఉంటుంది. దాన్ని పైసలిచ్చి కొనుక్కోవాలని అనుకోడు. అలా కొనాలంటే -ప్రేక్షకుడి మనసు గెలవాలి. మానసికానందం ఇవ్వాలి. అప్పుడే -పెద్ద, చిన్న సినిమా అనుకోకుండా, హీరో హీరోయిన్లకు పెద్దగా పట్టించుకోకుండా.. దర్శక, నిర్మాతల్ని చూడకుండా -సినిమాను చూస్తాడు. ప్రేక్షకుడు ఆదరిస్తేనే ఆ సినిమా నిలబడుతుంది. సరైన సినిమా కాదని సమీక్షకుడు తప్పురాసినా -సమీక్షను తిప్పి కొడతారే తప్ప సినిమాను కాదన్న విషయాన్ని సినిమా రంగం ఎందుకు గుర్తించటం లేదు. కేవలం రివ్యూ రైటర్ల కారణంగానే సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చి నిర్మాత నష్టపోయిన సినిమాలు ఎన్నుంటాయి. వాటి లెక్కలెవరు తీస్తారు?
**
ఒకప్పుడు సినిమా నిర్మాణం ఏళ్లుపట్టేది. టెక్నాలజీ పుణ్యంతో అది రోజుల్లోకి వచ్చేసింది. ఏ సినిమా అయినా జస్ట్ టైంపాస్ కనుక, పాజిటివ్, నెగెటివ్ టాక్ కూడా గంటల్లో వచ్చేస్తోంది. మార్నింగ్ షో పూర్తయ్యేసరికే సినిమా బతుకు బట్టబయలవుతోంది. సమీక్షకులూ తొలిరోజే సినిమాను వీక్షించి రివ్యూ చేసి రేటింగ్ ఇస్తున్నారు. మారుతోన్న సినిమా కోణంలో ఇందులో ఎక్కడ తప్పుందని అనగలం. పైగా మీడియా విస్తరించిన తరువాత -సమీక్షలు వ్రాయడం సాధారణ విషయమైంది. ఒకర్నిమించి మరొకరు పోటాపోటీగా సమీక్షలు రాస్తున్నారు. సోషల్ మీడియాలోనూ పబ్లిక్ తరఫున సమీక్షలు పుంఖాను పుంఖాలుగా వస్తున్నాయి. ఇంతమందీ ఒక్కమాటపైకి వచ్చి -సినిమా పోయిందని చెప్తున్నారా? ఏ సమీక్షలోనూ సినిమాకు సరైన మార్కులు పడటం లేదంటే -సినిమా పోయిందన్న విషయాన్ని దర్శక నిర్మాతలు ఎందుకు అంగీకరించలేకపోతున్నారు. బాగలేని సినిమాను బాగుందని సమీక్షకులంతా రాసేస్తే -ప్రేక్షకుడు ఆ సినిమాకు పట్టంగట్టేస్తాడా? అన్న విషయాన్నీ ఇక్కడ ఆలోచించాలి.
**
సమీక్షలు అవసరమే. అది ఎంతమేరకు అవసరం? వాటి ప్రభావం ఎంతవరకు వెళ్తుందనేదీ అవసరమే. ఎందుకంటే కోట్లు ఖర్చుపెట్టిన నిర్మాత పరిస్థితి ఏంటి? అనేదీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలాగని బాగున్నా, లేకపోయినా 3 దాటి 3.5, 4.0 రేటింగ్ ఇవ్వాలని కాదు. సినిమాలోని నెగెటివ్, పాజిటివ్ విషయాలను, పాత్రలను వివరిస్తూనే క్లైమాక్స్ గురించి పూర్తిగా వివరిస్తూ రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటప్పుడు ప్రేక్షకుడికి, సాటి సమీక్షలు వ్రాసేవారికి (రివ్యూ రైటర్స్) కూడా విషయం అర్ధమవుతుంది. ఇటీవలి కాలంలో నిర్మాతలు సమీక్షకులను, మీడియాను విమర్శించటం ఎక్కువ కనిపిస్తోంది. అదెంత మాత్రం సరికాదు. 24 విభాగాలతోపాటు మీడియా, విశే్లషకులు అంతా చిత్ర పరిశ్రమకు సంబంధించినవారే అని ఎందుకు అనుకోరు. మీడియా సపోర్ట్ ఉంటేనే కదా.. సినిమా విషయం ప్రేక్షకులకు అందుతుంది. మా సినిమాలు ఎంత బాగున్నా రేటింగ్ 2 దాటి ఇవ్వడం లేదన్న మాటా అక్కడక్కడా వినిపిస్తోంది. సమీక్షకులు సినిమాకు శత్రువు కాదన్న విషయాన్ని నిర్మాతలు, దర్శకులు గ్రహించాలి. సమీక్షకులు సినిమా చక్రం తిప్పలేరన్న విషయాన్ని గ్రహిస్తే -పరిశ్రమకే మేలు. సమీక్షలు, మీడియా గురించి ఏ కొందరు దర్శకులు, నిర్మాతలు చెడుగా మాట్లాడటం వల్ల సినిమా పరిశ్రమపైనే ప్రభావం పడే ప్రమాదం ఉందని గ్రహించాలి. నిష్పాక్షిక సమీక్షలు ఎవరినీ ఎత్తవు, ఎవరినీ పడేయవు. ఒకవేళ అలాంటివి జరిగినా -సొసైటీ బిలీవ్స్ ఫ్యాక్ట్. ఈ విషయాన్ని విమర్శలు చేస్తున్న వాళ్లు గ్రహించి భ్రమల నుంచి బయటకు రావడం ఎంతైనా శ్రేయస్కరం.

-శ్రీనివాస్ పర్వతాల