మెయన్ ఫీచర్

సిద్ధాంతాలు గాలికి.. పగ్గాలు చేతికి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహారాష్టల్రో తాజా రాజకీయాలు మహాభారత యుద్ధాన్ని తలపించాయి. అధికార దాహంతో మిత్రధర్మాన్ని తుంగలోకి తొక్కి ఆజన్మ శత్రువులైన కాంగ్రెస్, ఎన్సీపీలతో జట్టుకట్టి శివసేన పార్టీ అధికారంలోకి వస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న మాటకు నిదర్శనంగా, అధికార పీఠం కోసం సిద్ధాంత వైరుధ్యాలున్న పార్టీలతో కలసి వెళ్లడం తప్పేమీ కాదని శివసేన భావించింది. ఈ రాజకీయ చదరంగంలో కాంగ్రెస్, బీజేపీలు పావులయ్యాయి. ఎన్సీపీ అధినేత, మరాఠాయోధుడు శరద్‌పవార్ రాజకీయ ఎత్తుగడల ముందు బీజేపీ, కాంగ్రెస్, శివసేనలు చిత్తయ్యాయి. ఎన్నికలకు ముందు హిందుత్వ పార్టీలైన బీజేపీ, శివసేన పొత్తుపెట్టుకుని ఘన విజయం సాధించాయి. ఈ కూటమిలో బీజేపీకి 105, శివసేనకు 56 సీట్లు వచ్చాయి. ఈ కూటమి ఐదేళ్లు పాలించాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. అధికార కాంక్షతో శివసేన బీజేపీకి మద్దతు ఇవ్వకపోవడంతో, మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ పరిణామాల మధ్య సుప్రీం కోర్టుకు చేరి చివరకు నాలుగు రోజుల బీజేపీ ఆధ్వర్యంలోని ఫడణవీస్ ప్రభుత్వం కుప్పకూలింది. మహారాష్ట్ర రాజకీయాలను విశే్లషిస్తే భావసారూప్యత ఉన్న పార్టీలు ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నా, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని, రెండు పార్టీల్లో అధికార దాహం విపరీతంగా ఉంటే, వినాశనం తప్పదని రుజువైంది.
దేశవ్యాప్తంగా ఈరోజు శివసేన పార్టీపేరు మార్మోగుతోంది. శివసేన పార్టీ సిద్ధాంతాలేమిటి ? ఈ పార్టీ ఏ లక్ష్యంతో ఆవిర్భవించింది ? ఈ పార్టీ పితామహుడు ఎవరనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అతివాద హిం దూ జాతీయవాదానికి మారుపేరైన శివసేన ఏ కారణంతో మితవాద హిందుత్వ బీజేపీతో సంబంధాలను తెగతెంపులు చేసుకుందనే దానిపై ఆసక్తి నెలకొంది. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో గురువారం మూడు పక్షాల సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ ప్రభుత్వం ఐదేళ్లపాటు అధికారంలో ఉంటుందా? అనేది రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు శాసిస్తాయి. శివసేన పార్టీ ఆవిర్భావం గురించి తెలుసుకుంటే పలు ఆశ్చర్యకర విషయాలు వెలుగు చూస్తాయి.
1966 జూన్ 19న బాలాసాహెబ్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో మహారాష్ట్రేతరుల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు, స్థానికంగా మరాఠా యువకులకు పరిశ్రమలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపాధి కల్పించేందుకు, తమ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాలన్న లక్ష్యంతో శివసేన పుట్టింది. వటుడింతింతై అన్నట్లుగా ట్రేడ్ యూనియన్ రంగంలోకి శివసేన ప్రవేశించి పలు పరిశ్రమల్లో జెండా ఎగురవేసింది. అయోధ్యలో బాబ్రీ మసీదును తామే ముందుగా కూల్చామని శివసేన ప్రకటించింది. బీజేపీ, శివసేనల మధ్య సైద్ధాంతికంగా పెద్దగా తేడాలేదు. రెండు పార్టీల ‘డిఎన్‌ఏ’ ఒక్కటే. బాల్ ఠాక్రే ఆధ్వర్యంలో ముంబయి నగరపాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేస్తూ తన ఉనికిని పెంచుకుంటూ కార్పొరేషన్‌పై దశాబ్దాలుగా శివసేన తన జెండా ఎగురవేస్తోంది. 1989లో తొలిసారిగా బీజేపీతో శివసేన పొత్తు పెట్టుకుంది. అప్పటి నుంచి కొనసాగుతున్న బంధం 2014 ఎన్నికల వరకు కొనసాగింది. 1998 నుంచి 2004 వరకు వాజపేయి ప్రభుత్వంలో శివసేన కీలక పాత్ర పోషించింది. శివసేనకు బాలీవుడ్ పరిశ్రమపై గట్టి పట్టుంది. ప్రాంతీయతత్వం, తీవ్రవాద హిందుత్వ భావాలతో శివసేన సంచలనమైన ప్రకటనలు చేస్తుంటుంది. ముంబయికి వచ్చే ప్రతి ప్రముఖుడూ ఆ పార్టీ వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రేను సందర్శించుకుని తాను వచ్చిన పనిని ముగించుకుని వెళ్లేవారు. 1970లో బివాండీలో, 1984, 1991-92లో ముంబయి అల్లర్లు, హింసాకాండలో శివసేన పాత్ర ఉందనే అభియోగాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ చీలిపోయి మహారాష్టల్రో ఎన్సీపీ విస్తరించడంతో మరాఠా వర్గానికి చెందిన వారందరూ శివసేనను సొంతం చేసుకున్నారు. 1960 దశకంలో శివసేన ముంబయిలో నివసిస్తున్న దక్షిణాది వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు చరిత్ర చెబుతోంది. భూమిపుత్రులు అనే సిద్ధాంతాన్ని తెరపైకి తెచ్చి శివసేన ఆగడాలు చేసినట్లు రికార్డులు ఉన్నాయి. బీజేపీ, శివసేన కూటమి 1995 నుంచి 1999 మధ్య మహారాష్టల్రో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1999 నుంచి 2014 వరకు శివసేన, బీజేపీలు ప్రతిపక్షంలో కూర్చున్నాయి. 25 ఏళ్ల బంధం 2014లో తెగిపోయాక ఈ రెండు పార్టీలు సొంతంగా పోటీ చేశాయి. ఎన్నికల అనంతరం బీజేపీకి శివసేన మద్దతు ఇచ్చింది. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు తగిన సీట్లు తెచ్చుకున్నాయి.
శివసేనలో అనేకమంది చేరి, ఆ తర్వాత తెగతెంపులు చేసుకున్న ఉదంతాలున్నాయి. 2005 జూన్‌లో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత నారాయణ్ రాణే ఆ పార్టీని వీడారు. అదే ఏడాది బాల్ ఠాక్రే మేనల్లుడు రాజ్ ఠాక్రే పార్టీకి గుడ్ బై చెప్పి మహారాష్ట్ర నవ నిర్మాణ సమితి (ఎంఎన్‌ఎస్) పార్టీని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సమయంలో శివసేన, ఎంఎన్‌ఎస్ మధ్య సంఘర్షణలు చోటు చేసుకున్నాయి. 2012 నవంబర్ 17న బాల్‌ఠాక్రే మరణించాక ఉద్ధవ్ ఠాక్రే ఆ పార్టీ అధినేతగా ఎదిగారు. అంతకుముందు 2004 నుంచి పార్టీలో నాయకుడిగా ఆయన ఉన్నారు. బాల్‌ఠాక్రే ఏ రోజూ పదవులను ఆశించలేదు. మహారాష్టల్రోని స్థానికుల ప్రయోజనాల కోసం పరితపించేవారు. ఆయన కుమారుడు ఉద్ధవ్‌లో అధికారంలోకి రావాలన్న కాంక్ష మొదలైంది. దానికి తగ్గట్టుగా పావులు కదిపి లక్ష్యసాధన దిశగా అడుగులు వేశారు.
ముంబయిలోని దాదర్‌లో సేనాభవన్ ఉంది. 1976లో ఈ భవనాన్ని నిర్మించారు. మహారాష్ట్ర అంతా శివసేనకు శాఖలు ఉన్నాయి. యూపీ, పశ్చిమబెంగాల్, జమ్మూ కశ్మీర్ తదితర రాష్ట్రాల్లో కూడా శివసేన శాఖలు ఉన్నాయి. మహారాష్టల్రో అగ్రవర్ణాలకు చెందిన వారు ఎక్కువగా శివసేనలో ఉంటారు. బ్రాహ్మణులు, పఠారే ప్రభూస్, థాక్రేలు, జోషీ, క్షత్రియులు, మరాఠా, అగ్రి, షింపి, మాలి సామాజిక వర్గానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువ. అగ్రవర్ణాల ఆధిపత్యం ఎక్కువనే కారణంపై భుజ్‌బల్ అనే ఓబీసీ నేత శివసేనను వీడి ఎన్సీపీలో చేరారు. మండల్ కమిషన్ రిజర్వేషన్లను శివసేన వ్యతిరేకించింది. కులాలకు అతీతంగా మహారాష్టవ్రాసులకే ఉద్యోగ, ఉపాధి రంగాల్లో ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్‌తో శివసేన అన్ని వర్గాలకు దగ్గరైంది. మహారాజా ఛత్రపతి శివాజీ ఆశయాలు స్ఫూర్తిగా శివసేన అన్ని వర్గాల్లోకి చొచ్చుకెళ్లింది. ‘స్థానికులకే ఉపాధి’ నినాదంతో బలమైన ఓటు బ్యాంకును ఏర్పాటు చేసుకుంది.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు వీర సావర్కర్‌పై శివసేన ఈగ వాలనివ్వదు. పార్లమెంటులో సావర్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరిస్తే కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శించింది. సావర్కర్‌కు మించిన స్వాతంత్య్ర సమరయోధుడెవరని బాల్‌ఠాక్రే నినదించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి భారత సంస్కృతి ఏమి తెలుసునని సావర్కర్ గురించి మాట్లాడుతారని ఠాక్రే విరుచుకుపడ్డారు. సావర్కర్‌కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని ఇపుడు శివసేన డిమాండ్ చేస్తోంది. భారత్ గడ్డపై పాకిస్తాన్ క్రీడాకారులు క్రికెట్ ఆడితే అంగీకరించమని గతంలో శివసేన హెచ్చరించింది. ఆ హెచ్చరికల ఫలితంగా అప్పట్లో క్రికెట్ మ్యాచ్‌ను ముంబయి నిర్వహించలేదు. 1975లో ఎమర్జన్సీని శివసేన సమర్థించింది. బాల్‌ఠాక్రే జర్మనీ నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ అభిమాని. ‘నేను ఆర్టిస్టును, హిట్లర్ సైతం ఆర్టిస్టు. హిట్లర్ క్రూరమైన నియంత కావచ్చు..’ అని ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో బాల్‌ఠాక్రే పేర్కొన్నారు. 2006లో శివసైనికులు ప్రేమికుల దినోత్సవం రోజు ముంబయిలో వీరంగం సృషించి యువజంటలపై దాడులు చేశారు. 1999 నుంచి ఆరేళ్ల పాటు బాల్‌ఠాక్రే ఓటు వేయకుండా కోర్టు నిషేధం విధించింది. మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ప్రసంగాలు చేశారన్న అభియోగాలపై కోర్టు అప్పట్లో ఆ ఆదేశాలు జారీ చేసింది. హిందూ ఆత్మహుతి మానవ బాంబులు తయారు కావాలని ఆయన ఇచ్చిన పిలుపు సంచలనం సృష్టించింది.
మహారాష్టలో సైద్ధాంతిక దివాలా కోరురాజకీయాలకు అన్ని పార్టీలు పాల్పడ్డాయి. సెక్యులర్ పార్టీకి తామే వారసులమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ నేడు అధికారం కోసం మతతత్వ పార్టీ శివసేనకు మద్దతు ఇచ్చింది. మరాఠాల ఆధిపత్యం ఉన్న ప్రాంతాలతో పాటు మైనారిటీ ఓటర్లలో పట్టున్న ఎన్సీపీ సైతం శివసేనకు అండగా నిలిచింది. శివసేనకు వత్తాసు పలికి ఎన్‌సీపీ తన గోయిని తాను తవ్వుకుంది. శరద్ పవార్ తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసే నేతలు ఎన్‌సీపీలో లేరు. దేశం మర్చిపోతున్న తరుణంలో తన సత్తాను చాటుకుని శరద్ పవార్ మరోసారి జాతీయ స్థాయిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సొంతంగా పోటీ చేసి ఉంటే మెజారిటీకి దగ్గరలో సీట్లు తెచ్చుకునే సత్తా ఉన్నప్పటికీ బీజేపీ మొదటి నుంచి శివసేన పట్ల అనుమానంతోనే ఉంది. చివరి నిమిషంలో బీజేపీ శరద్ పవార్ రాజకీయ ఉచ్చులో చిక్కుకుని అజిత్ పవార్ అనే బలహీనుడిని నమ్మి పాపులారిటీని కోల్పోయింది. ఉద్ధవ్ ఠాక్రే తన తండ్రిలాగా పిడివాది కాదు. ముఖ్యమంత్రి పదవిని తానెందుకు చేపట్టరాదనే కాంక్షను పెంచుకున్నారు. 59 ఏళ్ల ఉద్ధవ్ సీఎంగా రాణించాలంటే రాబోయే కాలంలో పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకోవాల్సి ఉంది. కానీ, వచ్చే ఎన్నికల వరకు శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ సర్కారును భాజపా బతకనిస్తుందా? అనే నమ్మకం లేదు. బీజేపీకి షాక్ ఇచ్చేందుకు ఎదురుచూస్తున్న కాంగ్రెస్‌ను, అధికారం లేక విలవిలలాడుతున్న ఎన్సీపీని కలుపుకుంటే తనకు అధికారం ఖాయమని ఉద్ధవ్ నిర్ణయించుకున్నారు. వచ్చే ఎన్నికల వరకు వేచి చూస్తే సంచలన రాజకీయాలు చేయలేని తనకు రాజకీయంగా ఉనికి ఉండదని గ్రహించారు. అందుకే అదును చూసి పార్టీ సిద్థాంతాలను అటకెక్కించి, మొన్నటి ఎన్నికల్లో తనకు ప్రత్యర్థులైన కాంగ్రెస్, ఎన్‌సీపీలతో చేతులు కలిపి, నేడు సీఎం పదవిని అధిష్ఠించేందుకు ఆయన సమాయత్తమయ్యారు.

-కె.విజయ శైలేంద్ర 98499 98097