మెయిన్ ఫీచర్

పడమటి సినీ’రాగం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాన్ ఇండియా సినిమాలను తెరకెక్కించేందుకు సాహసోత్సాహాన్ని చూపిస్తోన్న టాలీవుడ్ -కంటెంట్‌కు తగిన సరంజామా సమకూర్చుకోవడంపై అంతే ఉత్సాహం చూపిస్తోంది. ఒకప్పుడు లొకేషన్ల కోసం విదేశాలకెళ్లాం. తరువాత కళ్లముందు అద్భుతాన్ని చూపించే ‘గ్రాఫిక్స్’ను ఎరువు తెచ్చుకున్నాం. మానవ నేత్రానికి క్లారిటీ విందు వడ్డించే కెమెరాలు మోసుకొచ్చాం. సాహసాలతో థ్రిల్ చేసేందుకు స్కిల్డ్ యాక్షన్ కొరియోగ్రాఫర్లను ఆశ్రయించాం. క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లుగా విదేశీ నటులను అవకాశాలిచ్చాం. కథానాయకుడి పక్కన ఆడి పాడి మురిపించేందుకు పరదేశీ పిల్లలనూ స్క్రీన్‌కెక్కించాం. అంతర్జాతీయ హీరోలను అతిథి పాత్రలుగా చూపించేశాం. జాకీచాన్‌లాంటి హీరోలతో అడపాతడపా సినిమాలూ చేశాం. ఇక అక్కడి హీరోలతో డైరెక్ట్ సినిమాలు చేయడమే మిగిలివుంది. ఓవరాల్‌గా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లాంటి ‘చెక్క’లన్నీ చెరిగిపోయి -ప్రపంచ సినిమాలో భారత్ భాగమవడమే తరువాయి. ఆ దిశగా ఇప్పటికే ప్రయాణం మొదలైంది.

1974 మే 1న
-అల్లూరి సీతారామరాజు విడుదలైంది. బ్రిటీషర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన మన్యం వీరుడి కథ. దర్శకుడు వి రామచంద్రరావు తెరకెక్కించిన కథలో -బ్రిటీష్ రూలర్ రూథర్‌ఫోర్డ్ స్కాట్ కోవర్డు పాత్రను పోషించింది కొంగర జగ్గయ్య. అద్భుతం అనిపించాడు. కృష్ణకు సమవుజ్జీగా జగ్గయ్య కనిపించి -నిజంగానే బ్రిటీషర్ అన్నంత కలిగించాడు. కంచు కంఠం, కఠిన నిర్ణయాలు తీసుకునే టైంలో హావభావాలు.. వేషం, భాష, అభినయం.. ఆహార్యం.. అచ్చుగుద్దినట్టు బ్రిటీషర్ అని భ్రమింపచేశాడు. విదేశీ నటులను తీసుకొచ్చే అవకాశమున్నా, దూరాభారాల కారణంగా -అలాంటి పాత్రల్లో మనవాళ్లే కనిపించారు, మెప్పించారు.
***
1987 ఏప్రిల్ 11న
-పడమటి సంధ్యారాగం (ఈవెనింగ్ రాగ ఆఫ్ ది వెస్ట్) అనే సినిమా విడుదలైంది. దర్శకుడు జంధ్యాల తెరకెక్కించిన అద్భుతమైన తెలుగు క్లాసిక్. విజయశాంతి లీడ్ రోల్ చేసిన చిత్రంలో ప్రేమికుడి పాత్ర థామస్ జేన్ అనే నటుడిది. తెలుగు స్క్రీన్‌పై కనిపించిన హాలీవుడ్ నటుడిగా మంచి ఆదరణ పొందాడు. తరువాతి కాలంలో బూగీ నెట్స్, ద థిన్ రెడ్ లైన్, డీప్ బ్లూసీ, ద పనిషర్‌లాంటి చిత్రాలతో గొప్ప హాలీవుడ్ నటుడిగా పేరొందాడు. రెండు ఖండాల మధ్య ప్రేమకథగా అప్పట్లోనే సెనే్సషన్ క్రియేట్ చేసింది ఆ సినిమా. కథ డిమాండ్ మేరకు పాత్రోచితంగా హాలీవుడ్ నటుడు అలా స్క్రీన్‌పైకి వచ్చాడు.
**
హాలీవుడ్‌తో భారతీయ సినిమా బాంధవ్యం క్రమంగా పెరుగుతూ వచ్చింది. లోకేషన్ల కోసం ఫారిన్‌కు వెళ్లడం, అక్కడి నటులను ఆయా సన్నివేశాల్లో ప్రత్యేకంగా చూపించటం మొదలైంది. అలానే హాలీవుడ్‌లో ఎక్స్‌పర్ట్ టెక్నీషియన్లను మన సినిమాలకు వాడుకునే ప్రక్రియ మొదలైంది. అలా.. నాలుగైదు దశాబ్దాలుగా మొదలైన ‘సినిమా సంబంధాలు’ ఇటీవలి కాలంలో మరింత సులువైపోయాయి. ఆధునిక ప్రపంచంలోకి అడుగుపెట్టిన తరువాత -అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి రాకపోకలు సులువవ్వడం, హాలీవుడ్ ఆర్టిస్టుల హోదాకు తగిన వసతి ఏర్పాట్లు, తగిన సౌకర్యాలు భారత్ పల్లెల్లోనూ అందుబాటులోకి రావడంతో -తెలుగు, తెలుగేతర స్క్రీన్‌పై కనిపించే హాలీవుడ్ నటుల సంఖ్య పెరుగుతోంది. భారతీయ సినిమాకు పనిచేయడానికి హాలీవుడ్ టెక్నీషియన్లూ ఆసక్తి చూపిస్తున్నారు.
**
ఇటీవలి కాలంలో వచ్చిన, వస్తోన్న అనేక చిత్రాల్లో హాలీవుడ్ ఆర్టిస్టులు ఎక్కువయ్యారు. పాన్ ఇండియా సినిమాగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న అనేక చిత్రాల్లో ప్రత్యేకత చూపించేందుకు హాలీవుడ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్లను మన దర్శక నిర్మాతలు అవకాశమిస్తున్నారు. ప్రపంచ సినిమా స్థాయికెదిగిన భారత్ -క్రమంగా అందులో భాగమైపోతోందన్న మాట. బడ్జెట్ విషయంలో పట్టింపుల్ని పూర్తిగా పక్కన పెట్టేయడంతో -ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతోన్న అనేక చిత్రాల్లో హాలీవుడ్ ఆర్టిస్టులకు అవకాశాలు వస్తున్నాయి. భారీతనంతో తెరకెక్కుతోన్న భారతీయ చిత్రాల్లో నటించేందుకు హాలీవుడ్ ఆర్టిస్టులూ అత్యుత్సాహం చూపిస్తుండటం గొప్ప పరిణామం.
**
టాలీవుడ్ ఇండస్ట్రీనే తీసుకుందాం. ఇటీవల వచ్చిన, రాబోయే తెలుగు చిత్రాల్లో కనిపించే హాలీవుడ్ ఆర్టిస్టుల సంఖ్యేమీ తక్కువేం లేదు. ఒకప్పుడు -విలనిజాన్ని పండించడానికి బాలీవుడ్ ఆర్టిస్టుల్ని సీన్‌లోకి తెచ్చాం. కాలం మారింది. ప్రపంచ సినిమాను ఆకళింపు చేసుకున్న కొత్త దర్శకులు వస్తున్నారు. విదేశాల్లో కోర్సులు పూర్తిచేసి, ప్రపంచస్థాయి సినిమా ఆలోచనలతో స్వదేశంలోకి అడుగుపెడుతోన్న దర్శకులు, టెక్నీషియన్లు పెరిగారు. వాళ్ల ఆలోచనలూ ప్రపంచస్థాయి సినిమాకు పార్లల్‌గా ఉంటున్నాయి. సో, అలాంటి దర్శకులతో ‘పాన్ ఇండియా’ సినిమాలు తీయడానికి నిర్మాతలూ సై అంటున్న సిట్యుయేషన్ కనిపిస్తోంది. రెండు మూడు కోట్ల తెలుగు సినిమా రెండు మూడొందల కోట్లకు విస్తరించిన పరిణామం -ఇందులో భాగమే. సో, కథలోని సన్నివేశ సందర్భాన్ని పండించేందుకు అంతర్జాతీయ నటులు దేశీయ స్క్రీన్‌పైకి వస్తుండటం ఇందులో భాగమే. ఇటీవలే వచ్చిన పీరియాడికల్ చిత్రం సైరాలో కొంతమంది హాలీవుడ్ ఆర్టిస్టులు కనిపిస్తే.. రాజవౌళి తెరకెక్కిస్తోన్న పీరియాడికల్ మూవీ ట్రిపుల్ ఆర్; అనుష్క, మాధవన్‌తో దర్శకుడు హేమంత్ మధుకర్ తెరకెక్కిస్తోన్న మిస్టరీ థ్రిల్లర్ ‘సైలెన్స్’లోనూ హాలీవుడ్ ఆర్టిస్టులు కనిపించనున్నారు.
డీటెయిల్స్‌లోకి వెళ్తే.. దిగ్గజ దర్శకుడు రాజవౌళి తెరెకెక్కిస్తోన్న పీరియాడికల్ ఫాంటసీ -ట్రిపుల్ ఆర్. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ల మల్టీస్టారర్. ఈ చిత్రంలో ముగ్గురు హాలీవుడ్ ఆర్టిస్టులు కనిపించనున్నారు. జూ.యన్టీఆర్ పోషిస్తున్న కొమురం భీమ్‌ని ఇష్టపడే బ్రిటీష్ గాళ్ పాత్ర కోసం బ్రిటీష్ థియేటర్ ఆర్టిస్ట్ ఒలీవియా మోరిస్‌ను ఎంపిక చేశాడు జక్కన్న. మోడలింగ్ ఫీల్డ్‌నుంచి బుల్లితెరవైపు అడుగులేసి సీరియల్స్, షోస్ చేసిన ఫ్రెష్ ఫేస్ ఈమెది. జక్కన్న ఇచ్చిన చాన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా వెండితెరపై సందడి చేయనుంది. ఇక -హీరోలతో తలపడే బ్రిటీషర్ స్కాట్‌గా కనిపించనున్నాడు రేమండ్ స్టీవెన్‌సన్. ఐర్లాండ్‌కు చెందిన ఈ హాలీవుడ్ నటుడు ఔట్‌పోస్ట్, పనిషర్: వార్‌జోన్, బిగ్ గేమ్‌లాంటి చిత్రాలతో మెప్పించాడు. టీవీ సిరీస్‌లతో బిజీగావున్న రేమండ్‌ను ఇండియన్ స్క్రీన్‌కు లాక్కొస్తున్నాడు జక్కన్న. ఇక, ప్రతినాయిక లేడీ స్కాట్ పాత్రలో ఆలియన్ డూడీ కనిపించనుంది. ‘ఏ వ్యూ టు ఎ కిల్’ అనే హాలీవుడ్ చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ ఐర్లాండ్ ఆర్టిస్ట్ నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హాలీవుడ్ ఆర్టిస్టులు ఆసక్తి చూపించే టీవీ మీడియంలోనూ ఈమెది అందెవేసిన చేయి. డాక్యుమెంటరీలూ చేసింది. ఇలా ట్రిపుల్ ఆర్ చిత్రంతో ఫస్ట్‌టైం ఇండియన్ స్క్రీన్‌మీద ముగ్గురు హాలీవుడ్ ఆర్టిస్టులు కనిపించబోతున్నారు.
అనుష్క లీడ్‌రోల్‌లో తెరకెక్కుతోన్న చిత్రం -నిశ్శబ్ధం. సియాటెల్ డిటెక్టివ్ విభాగం పోలీస్ కెప్టెన్ రిచర్డ్ డికెన్స్ పాత్రతో ఇండియన్ స్క్రీన్‌కి వస్తున్నాడు మైఖేల్ మ్యాడిసన్. నటుడు, నిర్మాత, దర్శకుడు, రచయిత, ఫొటోగ్రాఫర్‌గా సుదీర్ఘ అనుభవాన్ని సంపాదించిన హాలీవుడ్ నటుడిగా మంచి పేరుంది. సినిమాల్లో నటిస్తూనే టెలివిజన్ సిరీస్, మ్యూజిక్ ఆల్బమ్స్, వీడియో గేమ్స్‌కు వాయిస్ అందిస్తూ కెరీర్ నడిపించిన మ్యాడిసన్, భారతీయ ప్రేక్షకుల్ని కచ్చితంగా మెప్పిస్తాడన్న నమ్మకమైతే ఉంది.
కొద్దిరోజుల క్రితం వచ్చిన చిరంజీవి సైరా చిత్రంలో బ్రిటీషర్ వాట్సన్ పాత్రను అలెక్స్ ఓ నీల్ పోషించటం తెలిసిందే. అలాగే మరో బ్రిటీషర్‌గా ఆస్కార్ స్కాజెర్‌బెర్గ్ సైతం ముఖ్య పాత్ర పోషించాడు.
**
గతంలోనూ పలువురు హాలీవుడ్ నటులు భారతీయ సినిమాల్లో మెరిశారు. బ్రిటీష్ అడ్మినిస్ట్రేషన్ పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో అమీర్‌ఖాన్ 2001లో చేసిన లగాన్ చిత్రంలో కెప్టెన్ ఆండ్రూ రస్సెల్ పాత్రను హాలీవుడ్ ఆర్టిస్ట్ పాల్ బ్లాక్‌త్రోన్ చేస్తే, ఎలిజిబెత్ రస్సెల్‌గా -డిఫరెంట్ ఫర్ గాళ్స్, ఎల్ వరల్డ్ చిత్రాల నటి రేచల్ షెల్లీ చేసి మెప్పించింది. ఇక 2005లో వచ్చిన మంగళ్‌పాండే చిత్రంలో -కెప్టెన్ విలియం గోర్డాన్ పాత్రను డై అనదర్ డే ఫేమ్ టాబీ స్టీఫెన్స్ చేస్తే, కెన్ట్ పాత్రను కెనె్నత్ క్రెన్‌హామ్ చేసి మెప్పించారు. రంగ్ దే బసంతి చిత్రంలో మెక్ కిన్లీ పాత్రలో స్టీవెన్ మెకెంటోష్, అక్షయ్‌కుమార్ ఖిలాడి చిత్రంలో గూన్ పాత్రను లాస్టెర్ స్పీట్ పోషించటం తెలిసిందే. అక్షయ్‌కుమార్, కరీనాకఫూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ‘కంబక్త్ ఇష్క్ ’ చిత్రంలోనైతే పలువురు హాలీవుడ్ స్టార్స్ అలరించారు. బ్రాండన్ రౌత్, సిల్వస్టర్ స్టాలోన్, డెనిస్ రిచర్డ్స్, వూపి గోల్డ్‌బెర్గ్, హోలీ వాలెన్స్‌లు అతిధి పాత్రల్లో అలరించటం తెలిసిందే. కిస్నా: ది వారియర్ పోయట్ చిత్రంలో పీటెల్ బెకెట్‌గా మిఖాయిల్ మలోని, అక్షయ్‌కుమార్‌కు మంచి పేరు తెచ్చిన చాందిని చౌక్ టు చైనా చిత్రంలో హోజోగా చైనీ ఆర్టిస్ట్ చై హ్యు ల్యు, ఇన్స్‌పెక్టర్ చియాంగ్ కోహుంగ్‌గా రోగర్ య్యువాన్, జోరుూగా కోనన్ స్టీవెన్స్ కనిపించి మెప్పించారు. గాంధీ హాలీవుడ్ చిత్రంలో భారతీయ ప్రేక్షకుల మనసుల్లో స్థిరస్థానం ఏర్పర్చుకున్న ఇంగ్లీష్ నటుడు బెన్ కింగ్‌స్లే -అమితాబ్ కీలక పాత్రగా వచ్చిన తీన్‌పత్తిలో మెరుపులు మెరిపించాడు. ఇక అనురాగ్ బసు దర్శకత్వంలో హృతిక్ రోషన్ చేసిన సినిమా కైట్స్. 2010లో భారీ అంచనాలతో విడుదలైన చిత్రంలో బార్బారా మోరీ హృతిక్‌తో రొమాన్స్ చేసి చూపించింది. అదే చిత్రంలో కాప్ పాత్రను స్టీవెన్ మిఖాయిల్ క్వెజాదా పోషించారు. సూర్య హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన ‘సెవెన్త్ సెన్స్’ చిత్రంలో విలన్ పాత్రను వియత్నాం నటుడు డాంగ్ లీ పోషించి మెప్పించాడు. నమస్తే లండన్ చిత్రంలో ‘చార్లీ’ బ్రౌన్‌గా క్లైవ్ స్టాండన్, సుసాన్ పాత్రలో టిఫనీ ముల్హెరాన్, మై నేమ్ ఈజ్ ఖాన్ చిత్రంలో రీజ్ గారిక్ పాత్రలో కెన్టన్ డ్యూటీ, ప్రెసిడెంట్ బారక్ ఒబామా పాత్రలో క్రిస్ట్ఫోర్ బి డన్కన్, ఇష్క్ ఇన్ ప్యారిస్ చిత్రంలో మారియా పాత్రలో ఇసాబెల్లె అడ్జానీ, మిల్కా భాగ్ చిత్రంలో స్టెల్లాగా రెబెక్కా బ్రీడ్స్, అవుటాఫ్ కంట్రోల్ చిత్రంలో సాలీ టర్నర్ పాత్రలో బ్రాండే రోడ్రెక్.. ఇలా భారతీయ స్క్రీన్‌పైకి అడుగుపెట్టిన హాలీవుడ్ ఆర్టిస్టులు ఎందరో. హాలీవుడ్ టెక్నీషియన్లు, యాక్షన్ కొరియోగ్రాఫర్లు, గ్రాఫిక్స్ ఎక్స్‌పర్ట్స్ లెక్కలేనంతమంది.
*

*చిత్రాలు.. థామస్ జేన్
*ఒలీవియా
*బెన్ కింగ్‌స్లే
*స్టీవెన్‌సన్
*ఆలియన్ డూడీ
*మైఖేల్ మ్యాడిసన్

-మహాదేవ