మెయన్ ఫీచర్

అయోధ్య కేసులో ఇంకెన్ని మలుపులో?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్యలోని ‘రామజన్మభూమి వివాదం’పై న్యా య పోరాటం ఇంకా పూర్తి కాలేదు. ఈనెల 9న సుప్రీం కోర్టు ధర్మాసనం చారిత్రక తీర్పు ఇస్తూ ఈ వివాదానికి న్యాయపరంగా ముగింపు పలికినా, రివ్యూ పిటీషన్లకు కక్షిదారులు సిద్ధమవుతున్నారు. తీర్పు వెలువడిన రోజున దేశమంతా ప్రశాంతంగా ఉంది. హిందువులు, ముస్లింలు సహా అన్నివర్గాల వారూ తీర్పును ఆహ్వానించారు. సుప్రీం తీర్పుపై కొన్ని వర్గాలకు అసంతృప్తి ఉండడంలో తప్పేమీలేదు. ఏ కోర్టు కూడా ఉభయ పక్షాలనూ సంతృప్తిపరుస్తూ తీర్పు ఇవ్వలేదు. అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని నిర్ణయించింది. ఈ చర్య వల్ల మళ్లీ రెండు మతాల మధ్య అగాధం సృష్టించినట్లవుతుందని మైనారిటీల్లో ఎక్కువ మంది భావిస్తున్నారు.
ముస్లిం పర్సనల్ లా బోర్డు రివ్యూ పిటీషన్ ఎప్పుడు దాఖలు చేయనుంది? అందులో ఉండబోయే అంశాలేమిటి? ఏ ప్రాతిపదికన రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేస్తారన్న విషయంలో స్పష్టత లేదు. ముస్లిం పర్సనల్ లా బోర్డు రెండు అంశాలను ఆధారంగా చేసుకుని రివ్యూ పిటీషన్ దాఖలు చేస్తుందని ఆ బోర్డు పెద్దలు చెబుతున్నారు. ‘ఇస్లామిక్ లా’ ప్రకారం బాబ్రీ మసీదు ఉన్న స్థలం ముస్లింలకు సంబంధించినది. దీన్ని ఎవరికీ ఇచ్చే ప్రసక్తి లేదనే వాదనను లా బోర్డు తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. రెండవ అంశం సుప్రీం కోర్టు ఆఫర్ చేసిన ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకోకూడదని బోర్డు నిర్ణయించింది. బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి చెప్పినట్లు ఐదు ఎకరాల స్థలం సుప్రీం సూచించింది. ప్రభుత్వం ఈ స్థలం ఇస్తానని చెప్పలేదు. అయోధ్య పరిసరాల్లో ఎక్కడైనా ఈ స్థలం ఇచ్చే అవకాశాలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయంపై ముస్లిం మతపెద్దలు, మేధావుల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. అయోధ్య వివాదంపై సుప్రీం ఇచ్చిన తీర్పులో లోపాలు ఉన్నాయంటూ బోర్డు రివ్యూ పిటీషన్ దాఖలు చేయవచ్చు. బోర్డు పెద్దలు చెబుతున్న దాని ప్రకారం మసీదు ఉన్న ప్రాంతాన్ని షరియా ప్రకారం ఆ స్థలం అల్లాకు సంబంధించినది. దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ మరొకరికి ఇవ్వడానికి వీలులేదని పర్సనల్ లా బోర్డు కార్యదర్శి జఫర్‌యాబ్ జిలానీ అంటున్నారు. కోర్టు విచారణలో ఇస్లాం మత సంప్రదాయాలను పరిగణనలోకి తీసుకుంది. ఇస్లామిక్ దేశాల్లోనూ అనేక మసీదులను వివిధ కారణాలపై ఇతర ప్రదేశాలకు తరలించిన సందర్భాలు కోకొల్లలు. రివ్యూ పిటీషన్‌ను దాఖలుచేసే హక్కు ముస్లిం వర్గానికి ఉంది. దీన్ని పరిగణనలోకి తీసుకోవాలా? డిస్మిస్ చే యాలా? అనే అంశంపై తుది నిర్ణయం సుప్రీం కోర్టుదే.
అయోధ్య వివాదంలో ముస్లిం పర్సనల్ లా బోర్డు పార్టీగా లేదు. కాని వాదనలు జరుగుతున్నపుడు ముస్లిం కక్షిదారుల ద్వారా బాబ్రీ మసీదు పునర్నిర్మాణానికి, వక్ఫ్‌బోర్డుకు ఆ స్థలం కేటాయించాలనేదానికి బలమైన పాయింట్లను అందించింది. జమాతే ఉలేమా ఈ వివాదంలో ఒక పార్టీగా ఉంది. కానీ ఆ సంస్థ వాదనను కోర్టు తీర్పులో డిస్మిస్ చేసింది. ఈ కేసులో పార్టీగా ఉన్న ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలని సుప్రీం తీర్పు పేర్కొంది. సున్నీ వక్ఫ్‌బోర్డు సుప్రీం తీర్పుకు లోబడి నడుచుకుంటామని, తీర్పును పునస్సమీక్షించాలని పిటిషన్ వేయబోమని ఇప్పటికే ప్రకటించింది. ఈ తీర్పు తమకు అసంతృప్తిని మిగిల్చినా, రివ్యూ పిటిషన్ వేయబోమని పేర్కొంది. కోర్టు తీర్పు ప్రకారం మూడు నెలల్లోగా సున్నీ వక్ఫ్‌బోర్డుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐదు ఎకరాలను కేటాయించాలి. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. సున్నీ వక్ఫ్‌బోర్డు సుప్రీం చెప్పినట్లుగా భూమిని తీసుకుంటుందా? లేక తిరస్కరిస్తుందా? అన్నది వేచి చూడాలి. అయోధ్య వివాదంతో మజ్లిస్ పార్టీకి ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం లేకున్నా , దేశంలో మైనారిటీల సంక్షేమం కోసం పాటు పడుతున్నట్లుగా చెప్పుకుంటున్న మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోర్టు తీర్పు అసంతృప్తిని మిగిల్చిందన్నారు. ఐదు ఎకరాల స్థలాన్ని తీసుకునే ప్రసక్తిలేదన్నారు. కాని తమకు రా జ్యాంగం పట్ల నమ్మకం ఉందని తెలిపారు.
ఇంతకీ ఐదు ఎకరాల స్థలం వద్దని చెప్పే అధికారం, తిరస్కరించే హక్కు ముస్లిం పర్సనల్ లా బోర్డుకు లేదని న్యాయవాదులంటున్నారు. ఈ అధికారం కేవలం ఉత్తరప్రదేశ్ సున్నీ వక్ఫ్‌బోర్డుకు మాత్రమే ఉంది. రివ్యూ పిటీషన్ సంగతిని ఇక్కడ పరిశీలించాలి. ఆ పిటీషన్‌ను ఎవరు వేయాలన్న ప్రశ్న ఉత్పన్నమైతే, దాన్ని ముస్లిం పర్సనల్ లా బోర్డు దాఖలు చేయగలదా? అయోధ్య కేసులో పార్టీగా లేని పర్సనల్ లా బోర్డు పిటీషన్ దాఖలు చేస్తే సుప్రీం స్వీకరించే విషయమై న్యాయ కోవిదులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్య వివాదంలో తాను ‘ఇంప్లీడ్’ కావాలని గతంలో ముస్లిం లా బోర్డు ప్రయత్నించినా, సుప్రీం కోర్టు తిరస్కరించింది. పర్సనల్ లా బోర్డు కంటే, ఈ కేసులో తన వాదనను చివరి దాకా వినిపించి, డిస్మిస్ అయిన జమాతే ఇస్లామ్‌కు రివ్యూ పిటీషన్‌ను దాఖలు చేసే అవకాశం ఉంటుంది.
ఒకవేళ రివ్యూ పిటీషన్‌ను దాఖలు చేస్తే గతంలో ఈకేసును విచారించిన న్యాయమూర్తులే విచారిస్తారు. అ యోధ్య కేసును విచారించిన ధర్మాసనానికి అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ నాయకత్వం వహించారు. జస్టిస్ గగోయ్ పదవీ విరమణ చేశాక, జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. రివ్యూ పిటీషన్‌ను కోర్టు అనుమతిస్తే ముందుగా ఐదుగురు న్యాయమూర్తులు దాన్ని పరిశీలిస్తారు. తీర్పును ఏ ప్రాతిపదికన సమీక్షించాలన్న పాయింట్లను న్యాయమూర్తులు కూలంకషంగా అధ్యయనం చేస్తారు. ఒకవేళ రివ్యూ పిటిషన్‌లో బలమైన పాయింట్లు ఉంటే, సుప్రీం న్యాయమూర్తుల బృందం సంబంధిత పార్టీలకు నోటీసులను జారీ చేస్తుంది. రివ్యూ పిటీషన్‌ను ‘లిస్టు’ చేయాలని సుప్రీం రిజిస్ట్రీని న్యాయమూర్తులు ఆదేశిస్తారు.
రివ్యూ పిటీషన్లను చాలా అరుదుగా సుప్రీం స్వీకరిస్తుంది. రివ్యూ పిటీషన్‌లో ఒక వేళ చుక్కెదురైతే, క్యురేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయవచ్చు. రివ్యూ పిటీషన్లను సమీక్షించే అధికారం హైకోర్టు, సుప్రీం కోర్టులకు ఉం టాయి. తాను ఇచ్చిన తీర్పును సమీక్షించే అధికారం రాజ్యాంగంలోని 145వ అధికరణ కింద సుప్రీం కోర్టుకు ఉంది. రివ్యూ పిటిషన్‌ను తీర్పు వచ్చినప్పటి నుంచి 30రోజుల్లోగా దాఖలు చేయవచ్చు. అయోధ్య కేసులో డిసెంబర్ 9లోగా పార్టీలు రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేయాల్సి ఉంటుంది. రివ్యూ పిటిషన్‌లో వౌఖిక వాదనలు ఉండవు. మన దేశంలో 498ఏ గృహహింస కేసులో సుప్రీం రివ్యూ పిటిషన్‌ను అనుమతించింది. ఈ కేసులో అవసరమైన మార్గదర్శకాలపై చట్టం చేయాలని కోర్టు పార్లమెంటును ఆదేశించింది. 2జీ స్పెక్ట్రమ్ కేసులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంలో రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఇంకా వైద్య విద్య కోర్సులకు నిర్వహించే ‘నీట్’, వోడాఫోన్ హుచిసన్ ట్యాక్స్ కేసు, మాయావతి ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీం రివ్యూ పిటిషన్లను స్వీకరించింది.
సుప్రీం కోర్టు రివ్యూ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తే క్యురేటివ్ పిటిషన్ అనే పద్ధతి ఉంది. సహజ న్యాయసూత్రాలకు విఘాతం కలిగించేలా తీర్పు ఉందని భావిస్తే క్యురేటివ్ పిటిషన్‌ను దాఖలు చేయవచ్చు. రూపా అశోక్ హుర్రా వర్సెస్ అశోక్ హుర్రా కేసులో 2002లో సుప్రీం క్యురేటివ్ పిటిషన్ విధానాన్ని అమలు చేసింది. మన దేశంలో అత్యున్నత న్యాయ స్థానంలో న్యాయం కోసం పోరాడే వారికి ఇది చివరి అవకాశం. అరుదైన కేసుల్లోనే సుప్రీం ఈ పిటిషన్‌ను స్వీకరిస్తుంది. బాధిత పార్టీకి ఉపశమనం కలిగించే మార్గాలేమైనా ఉన్నాయనే విషయాన్ని కోర్టు పరిశీలిస్తుంది. ఈ పిటిషన్‌ను కూడా జడ్జీల చాంబర్‌లో ముగ్గురు న్యాయమూర్తులు విచారిస్తారు. తమకు రాజ్యాంగ ప రంగా లభించిన అధికారాలతో సుప్రీం కోర్టు క్యురేటివ్ పిటిషన్‌ను విచారిస్తుంది. క్యురేటివ్ పిటిషన్‌ను పరిశీలించేందుకు అర్హత ఉందని సీనియర్ న్యాయవాది ధ్రువపత్రం ఇవ్వాలి. తీర్పు ఇచ్చిన ముగ్గురు న్యాయమూర్తులే పిటిషన్‌ను పరిశీలిస్తారు. ఇక్కడ న్యాయమూర్తుల వద్ద వాదనలు వినిపించేందుకు అవకాశం లేదు. ఈ పిటిషన్‌లో లోపాలుంటే భారీ మొత్తంలో పెనాల్టీలను కోర్టు విధించే అవకాశం ఉంది. క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేసేందుకు నిర్ణీత గడువు అంటూ ఉండదు. ఇంగ్లాండ్‌లో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి భారత్‌కు తీసుకువచ్చేందుకు తగిన ప్రయత్నాలు చేయాలని కోరుతూ దాఖలైన క్యురేటివ్ పిటిషన్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లోప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ ఆధ్వర్యంలోని న్యాయవాదుల బృందం తిరస్కరించింది. ఐదుగురు న్యాయమూర్తులు చాంబర్‌లో ఈ పిటిషన్‌ను పరిశీలించారు. ఇతరదేశంలో ఉన్న విలువైన ఆస్తి గురించి ఈ పిటిషన్‌లో పేర్కొన్న అంశాలతో ఏకీభవించబోమని కోర్టు ప్రకటించింది.
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ గత ఏడాది సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 65 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని విచారించిన తర్వాత ఏడుగురు న్యాయమూర్తుల సుప్రీం ధర్మాసనానికి నివేదించిన సంగతి విదితమే. అ యోధ్య కేసులో రివ్యూ పిటిషన్లు డిసెంబర్ 9లోగా దాఖలైతే, ఆ తర్వాత కోర్టు విచారణకు స్వీకరిస్తుందా? లేదా? అన్నది వేచి చూడాలి. జమాతే ఉలేమా హింద్ సంస్థ పూర్వ ప్రధాన కార్యదర్శి ఎం. సిద్ధిఖీ మాట్లాడుతూ- కోర్టు ఇచ్చిన తీర్పుకు ఎలాంటి సాక్ష్యం, లాజిక్ లేదని, రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు. అయోధ్య కేసులో ధర్మాసనంలోని న్యాయమూర్తులు ఏకాభిప్రాయంతో తీ ర్పు ఇచ్చారు. అయోధ్య కేసు ఇంకా రివ్యూ పిటిషన్, క్యురేటివ్ పిటిషన్ల దశలను దాటాల్సి ఉంటుందని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. రామజన్మభూమి చుట్టూ ఉన్న 67 ఎకరాల భూమిలోనే తమకు ఐదు ఎకరాలు కేటాయిస్తే, వివాదాలకు తెరపడుతుందనేది కొంతమంది మైనారిటీ నాయకుల అభిలాషగా కనపడుతోంది. కానీ, భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా అయోధ్యలో ఇంకెక్కడైనా ఐదు ఎకరాలు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. రానున్న రోజుల్లో అయోధ్య కేసు ఎన్ని మలుపులు తిరగనుందో కాలమే చెప్పాలి.

-కె.విజయ శైలేంద్ర 98499 98097