మెయన్ ఫీచర్

పత్రికా స్వేచ్ఛకు అడ్డుగోడలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 31న జీవో 2430 పేరున ఒక జీవో జారీ చేసింది. ఇది పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు అని కొన్ని పత్రికలు ఎడిటోరియల్స్ రాస్తే, ఈ జీవోతో మీడియాను అణగద్రొక్కాలనుకోవడం పిచ్చి చర్య, ఇది జాతీయ సమస్య అని ప్రతిపక్షనేత నారా చంద్రబాబు నాయుడు సెలవిచ్చారు. కలాలకు సంకెళ్లా? అంటూ కొందరు జర్నలిస్టు మిత్రులు ర్యాలీలు, ధర్నాలు ఇవికాక దిల్లీ వరకు పోరాటాలు చేస్తున్నారు. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ చంద్రవౌళి ప్రసాద్ గారైతే ‘ఈ జీవో పత్రికా స్వేచ్ఛకు విఘాతం. కలాలను కోర్టు కీడుస్తారా?’ అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, సుమోటాగా దీనిపై విచారణ చేస్తామని కూడా ప్రకటించారు. ‘ఏ.పి. ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులు దిగ్భ్రాంతికరం’ అని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అనంత్ బగేత్కర్ విమర్శించారు. ఇది దొడ్డిదారి సెన్సార్‌షిప్ అని ప్రెస్ గిల్ట్ అధ్యక్షులు శేఖర్ గుప్తా విమర్శించారు.
ఈ జీవోపై చర్చకు వెళ్లే ముందు పత్రికా స్వేచ్ఛ గూర్చి కాస్త పరిశీలిద్దాం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 (1) (ఎ)లో పత్రికా స్వేచ్ఛ గురించి ప్రత్యేకంగా పేర్కొనలేదు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ - మాట్లాడే స్వేచ్ఛ గూర్చి మాత్రమే పొందుపరచడం జరిగింది. డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ అంబేద్కర్ గారి అభిప్రాయంలో ‘పత్రికా స్వేచ్ఛ’నే ప్రత్యేకంగా పేర్కొనాల్సిన అవసరం లేదు. వ్యక్తి స్వేచ్ఛకెంత ప్రాధాన్యత ఉందో పత్రికా స్వేచ్ఛకూ అది వర్తిస్తుందని పేర్కొనడం జరిగింది. శ్రీమతి గాంధీకి కూడా ప్రెస్ ఫ్రీడంపై అంత నమ్మకం వుండేది కాదు. 1966 సం. నవంబర్ 15న దిల్లీలోని ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆమె ప్రసంగిస్తూ ‘్భరతదేశంలో పోరాటం చేయాల్సిన అంశాలు అనేకం. పేదరిక నిర్మూలన, వెనుకబాటుతనం, మూఢ విశ్వాసాలు మచ్చుకు కొన్ని. పత్రికా స్వేచ్ఛ వారి విజ్ఞతకే వదిలేద్దాం..’ అని పేర్కొన్నారు. ఇది జరిగిన 9 సం.లకు ఎమర్జెన్సీ ప్రకటించడం, పత్రికలపై సెన్సార్‌షిప్ విధించడం అందరికీ తెలిసిందే. ఇకపోతే అమెరికాకు 3వ ప్రెసిడెంట్‌గా ఉన్నట్టి జెఫర్‌సన్ ఆ కాలంలో పత్రికా స్వేచ్ఛ గూర్చి చాలా విలువైన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ‘పత్రికలు లేని ప్రభుత్వమా లేక ప్రభుత్వం లేని పత్రికలా? అనే ఎంపిక చేయమంటే నేను రెండో దానికే ప్రాధాన్యత ఇస్తాను’ అన్నారు. ఇవన్నీ ఆ కాలంనాటి అభిప్రాయాలు. ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు పత్రికలే. అసలు ప్రజలకు ప్రభుత్వానికి పత్రికలు వారధి లాంటివి. ప్రభుత్వ పథకాలు సామాన్యులకు సహితం చేరాలన్నా, వాటి గూర్చి తెలుసుకోవాలన్నా పత్రికలు చాలా అవసరం. పత్రికల్ని వాచ్‌డాగ్‌లాగా కూడా పేర్కొంటారు. ప్రతిపక్షాల నిర్మాణాత్మక సూచనలు, సలహాలతో ప్రభుత్వం తన పంథాని మార్చుకొనే అవకాశం కూడా పత్రికలు కల్పిస్తాయి. వ్యక్తుల స్వేచ్ఛకు ఎలాంటి నిబంధనలున్నాయో అవే నిబంధనలు పత్రికా స్వేచ్ఛకు కూడా వర్తిస్తాయి.
భారతదేశంలో పత్రికా స్వేచ్ఛకు ప్రస్తుతమున్న పరిస్థితులు చాలు. దీనికి ఎలాంటి ఉపద్రవం రాలేదు. న్యూస్ ఛానల్స్, న్యూస్ పేపర్స్ కూడా తమతమ బాధ్యతల్ని దాదాపు 60 శాతం నిర్వహిస్తున్నాయనే చెప్పవచ్చు. భారతదేశంలో 17, 573 న్యూస్ పేపర్లు, 868 న్యూస్ ఛానల్స్ అందుబాటులో వున్నాయి. ఇక మన తెలుగు రాష్ట్రాలకొస్తే దాదాపు 15 న్యూస్ ఛానల్స్, కాస్తా చెప్పుకోదగ్గవి అనే 15 న్యూస్ పేపర్లు వెలువడుతున్నాయి. భారతదేశ పత్రికా స్వేచ్ఛ విశే్లషిస్తే చాలా పెద్ద వ్యాసం అయిపోతుంది. కనుక ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమవుతున్నాను.
పత్రికలు నిజాల్ని నిర్భయంగా రాయాల్సిందే. ఎవరూ అందుకు అడ్డు తగలకూడదు. కానీ పత్రికలు ఎప్పుడైతే తమ స్వచ్ఛతను కోల్పోయాయో అప్పుడే ఇలాంటి సమస్యలన్నీ తలెత్తుతాయి. అవాస్తవాల్ని వాస్తవాలుగా వక్రీకరించే ప్రయత్నం ఏ పత్రిక కానీ, న్యూస్ ఛానల్స్ కానీ చేయరాదు. తాము రాసిందే నిజమని, తాము చూపిందే సత్యమని వాటంతటికి అవి అనుకుంటే ఎవరూ అంగీకరించరు. తాము ఏ పార్టీలకు వత్తాసు పలకకుండా వున్నంతవరకు వాటి వాణికి ప్రాధాన్యత వుంటుంది. ఆ వార్తలకూ విశ్వసనీయత వుంటుంది. అడ్డగోలుగా అసత్యాలు చెపుతూ, ఇది మా హక్కు, మా స్వేచ్ఛ అంటే కుదరదు. ఇదివరకటిలా కాదు. నేడు ప్రజల్లో రాజకీయ చైతన్యం బాగా పెరిగింది. అక్షరాస్యతా శాతం పెరిగే కొద్దీ ఇది మరింత పెరుగుతుంది కూడా! వార్తల్లోని వాస్తవాల్ని పాఠకులు ఇట్టే పసికట్టేస్తున్నారు.
మన రాష్ట్రంలో మరో దుష్పరిణామం చోటు చేసుకొంది. దాదాపు 30 శాతం మంది అధిపతులు ఒకే కులానికి చెందిన వారు కావడమే. ప్రధాన పత్రికలు, ప్రధాన న్యూస్ ఛానల్స్ కూడా వీరి అధీనంలోనే వున్నాయి. పత్రికా రంగంలో నిష్పాక్షికతకు తిలోదకాలు ఇచ్చేశాక వీరు ఏం చెప్పినా ఒక పార్టీకి వత్తాసుగా చెప్పుకొనే సందర్భం వచ్చేసింది. ఇలాంటి దుస్థితి సంభవించినపుడు తమ స్వేచ్ఛకు భంగం వాటిల్లుతున్నదని వారు ఎలుగెత్తి చాటితే మాత్రం ఎవరు విశ్వసిస్తారు?
చెడును చెడుగానే చూపాలి. వాస్తవాలకు కూడా చెదలు అంటకుండా చెప్పగలగాలి. పాఠకుల నమ్మకాన్ని ఎవరూ కోల్పోకూడదు. కులం పరంగా తాము కొన్ని పార్టీలకు కొమ్ము కాయడం తప్పు కాదు. కానీ ఆ అభిమానాన్ని కొలమానంగా వాస్తవాల్ని వక్రీకరించరాదు. అబద్ధాలు రాసే హక్కు, స్వేచ్ఛ ఎవరికీ వుండవు. భారత రాజ్యాంగం కూడా వీరికి ఆ భరోసా ఇవ్వలేదు. 2009 నుండి ఆంధ్రప్రదేశ్‌లో ఈ పెడ ధోరణులు, కలుషితం ఎక్కువయ్యాయి.
నేడు పత్రికా స్వేచ్ఛ మాత్రం పెడత్రోవ పట్టింది. వాస్తవాలు కనుమరుగై, అసత్యాలు వెర్రితలలు వేస్తున్నాయి. పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియాకు తోడు న్యూస్ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా కూడా చెడు మార్గాన పయనిస్తున్నాయనిపిస్తూంది.
కొందరు కుహనా మేధావులంటారు ‘తాము వ్రాసిన వార్తలు అవాస్తవమైతే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసుకోవచ్చు కదా! అంతేకానీ స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తూ జీవో 938, జీవో 2430 లు జారీ చేయడం అవసరమా?’ అంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈ సందర్భంగా ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఔన్నత్యాన్ని గూర్చి కూడా తెలుసుకొందాం. దీనిని 1966లో నెలకొల్పడం జరిగింది. మొట్టమొదటి ప్రెస్ కమిషన్ సూచనల మేరకు భారత పార్లమెంట్ దీనిని ఏర్పరచింది. దీనికి చైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి వ్యవహరిస్తారు. ఇందులో 20 మంది సభ్యులు మీడియా వారు కాగా, 5గురు పార్లమెంట్ సభ్యులు లోక్‌సభ రాజ్యసభల నుండి ప్రాతినిధ్యం వహిస్తారు. పత్రికా స్వేచ్ఛ కొరకు, మరియు పాత్రికేయుల విలువల్ని పరిరక్షించేందుకు దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం అలంకార ప్రాయంగానే అలరారుతున్నది. దీనికి ఎలాంటి శిక్షించే హక్కులు గాని, పెనాల్టీ విధించే అధికారం కానీ లేదు. మరి ఎందులకిది? ఏం తోడ్పడుతుంది ఇది? ఎవరికి న్యాయం చేకూరుస్తుంది?
పత్రికలపై సుప్రీంకోర్టు వివిధ సందర్భాలలో వివిధ రకాలైన తీర్పును వెలువరించింది. మారుతున్న కాలంతోపాటు పత్రికా విలువలు కూడా మారిపోతున్నాయి. వ్యక్తికి స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, బాధ్యతలు కూడా అంతే ముఖ్యం. వ్యక్తులకొక న్యాయం పత్రికలకొక న్యాయం వుండదు. ఒకరి స్వేచ్ఛ మరొకరికి కారాదు శిక్ష. ఏ ఆధారాలు లేకుండా నిందారోపణలు రాజకీయ నాయకులకు చెల్లుబడి అవుతాయేమో కానీ పత్రికలకు, మీడియాకు కాదు.
* * *
ఎన్నికలు ముగిశాయి. కొత్త ప్రభుత్వం అధికారానికొచ్చి 6నెలలు కావస్తోంది. ప్రజల తీర్పుకు ఎవరైనా శిరసావహించాల్సిందే. కానీ దానికే వక్రభాష్యాలు చెప్పడం ఆరంభించారు. ఇది న్యాయమా? ధర్మమా? జగన్ ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణకు తాకట్టు పెట్టేస్తున్నట్లు కూడా వార్తలు రాసి ఇరు రాష్ట్ర సంబంధాలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేశాయి. ఏ ప్రభుత్వమైనా ఆరంభంలో చిన్నచిన్న తప్పులు చేయడం జరుగుతుంటాయి. నిర్మాణాత్మకంగా వేలెత్తి చూపాల్సిన మీడియా విద్వేషాలు, విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయి.
* * *
మితిమీరిన స్వేచ్ఛ ఎంతో అనర్థదాయకం. ఆ స్వేచ్ఛే ఇందిరాగాంధీ గారిని ఎమర్జెన్సీని పెట్టేలా చేసి ఆమె కొంపనే ముంచింది. తప్పు చేస్తే ఎంతటి వారైనా మూల్యం చెల్లించుకోక తప్పదు. కళ్లెం లేకుంటే గుర్రం కూడా మన మాట వినదు.
* * *
ఇక ఇటీవల జగన్‌గారి ప్రభుత్వం ఇచ్చిన జీవో 2430 గూర్చి సర్వత్రా చర్చ జరుగుతోంది. కొందరు విమర్శిస్తున్నారు. కొందరు నాయకులు మొసలి కన్నీరు కారుస్తూ, యుద్ధానికైనా ‘సై’ అంటూ జబ్బలు చరుస్తున్నారు. ఇదేదో పత్రికా రంగానికే ఉపద్రవం ముంచుకొచ్చిందని ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ జీవోలో ఏముంది? అసత్యాలు, ఆధార రహిత వార్తలు, అభూత కల్పనలతో కథనాలు వండితే, దురుద్దేశపూరితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొనే అధికారం ఆయా శాఖాధిపతులకు కట్టబెట్టడం ఈ జీవో ద్వారా జరిగింది. అది వరకు ఆ అధికారం సమాచార శాఖ కమిషనర్‌కు ఉండేది. దానిని కేంద్రీకృతం కాకుండా వివిధ శాఖాధిపతులకు బదిలీ చేయడం జరిగింది. చట్టపరమైన చర్యలు మాత్రమే సుమా! గోరింతను కొండంతగా చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ వ్యతిరేకంగా వార్తలు రాసే వారందరినీ ఎమర్జెన్సీ కాలంలోలా జైల్లో పెట్టమని దీని అర్థం కాదు. కోర్టులు న్యాయాన్యాయాలు పరిశీలించే శిక్షలు విధిస్తాయి. తాము రాసింది న్యాయమైతే, వాస్తవమైతే పత్రికలు ఎందుకు భయపడాలి?
* * *
చివరిగా చెప్పాలంటే ఈ జీవో అంత ప్రమాదకారి కాదు. ఎవరూ భయపడాల్సిన పనిలేదు.

-డా. విజయకుమార్ 8886381999