మెయిన్ ఫీచర్

బావుంది.. వీళ్ల వరస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిర్మాత కొడుకు హీరో అవ్వడం -పాత పద్ధది.
హీరోయే నిర్మాతవ్వడం ఇప్పటి పద్ధతి.
కుర్ర హీరోలంతా -స్క్రీన్ మీదే కాదు బయటా హీరోయిజాన్ని పండిస్తున్నారు. మరుగున పడిన స్టయిల్‌ని మళ్లీ ఇండస్ట్రీకి తెస్తున్నారు.
సూటిగా చెప్పాలంటే- హీరోలు నిర్మాతలవుతున్నారు.
ఆ జాబితాలోకి ఇప్పుడు విజయ్
దేవరకొండ కూడా చేరాడు.
మీకు మాత్రమే చెప్తా -అంటూ థియేటర్లకో సినిమా వచ్చింది. విజయ్ దేవరకొండ సినిమాగా ప్రచారం సాగింది. హీరోగా కాదు, నిర్మాతగా. అంతేకాదు, హీరోగా తను నిలబడేందుకు సహకరించిన దర్శకుడినీ హీరో చేసేశాడు. అది వేరే ట్విస్ట్. కెరీర్ బావున్న టైంలో -ప్రొడక్షన్ పనులెందుకు నెత్తిన పెట్టుకోవడమన్న ప్రశ్న సహజంగానే ఉద్భవించొచ్చు. పైకి చెప్పని సమాధానం ఇక్కడే దాక్కునివుంది. ఇప్పుడు కెరీర్ బావుంది. రేపిలానే ఉంటుందని గ్యారెంటీ ఏమిటి? రేపన్న రోజున మరో విజయ్ దేవరకొండ ప్రొఫైల్ టాప్‌లోకి వచ్చి.. ఇతని కెరీర్ ఢామ్మని కిందపడదని గ్యారెంటీ ఏంటి? సినిమా ప్రపంచంలో దేనికీ గ్యారెంటీ ఉండదు. అందుకే -దీపమున్నపుడు ఇల్లు చక్కబెట్టాలి. కెరీర్ బావున్నపుడే -ప్రత్యామ్నాయ దారులూ వేసుకుంటూ పోవాలి.
కాకపోతే -సిన్సియర్ రౌడీ అన్న పేరు తెచ్చుకున్న విజయ్ చెప్తున్న మాట వేరు. -‘ఒకప్పుడు పెళ్లిచూపులు సినిమాను స్క్రీన్‌కు తేవడానికి మాటీం పడిన కష్టాలు మామూలేం కాదు. కటౌట్ కలిసొచ్చి ఈ రేంజ్‌కి చేరా. వెనక్కి తిరిగి చూసినపుడు.. అలాంటి కష్టాలు దర్శకుడు షామీర్ సుల్తాన్ టీం పడుతున్నట్టే కనిపించింది. మంచి కథ. నేను చేయడానికి అడ్డొస్తున్న ఇమేజ్. అందుకే -ప్రొడక్షన్ వింగ్‌లోకి ఎంటరయ్యా’ అంటూ సింపుల్‌గా తేల్చేశాడు. ఇది పైకి చెబుతున్న మాటేనని కొట్టిపారేయలేం. అలాగని ప్రమోషనల్ ట్విస్ట్ అని కూడా అనలేం. కాకపోతే -రెండో కోణం మాత్రం కచ్చితంగా భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునేనని గట్టిగా చెప్పొచ్చు.
***
ఈ పరిణామం టాలీవుడ్‌లో కొత్తేం కాదు.
ఓ మోస్తరు ఇమేజున్న హీరోనుంచి ‘స్టార్’రేంజ్ హీరో వరకూ ఏంచేసినా- సెనే్సషనే. ఆ సెనే్సషనే్న- స్టార్‌డమ్‌గా మలచుకుని కెరీర్‌ను టాప్‌గేర్‌లో పరిగెత్తించడం నిన్నటివరకూ చూశాం. ఇప్పుడు హీరో అంటే- స్క్రీన్‌మీద నాలుగు ఫైట్లు, ఆరు పాటలతో దుమ్మురేపేవాడే కాదు. నానా పాట్లూపడి... నిర్మాత అవతారమెత్తి.. అష్టకష్టాలకోర్చి.. తన అభిరుచిని సిల్వర్ స్క్రీన్‌పై ఆడియన్స్‌కి రుచి చూపించేవాడు. అలాంటి హీరోలే ఇప్పుడు ఎక్కువ కనిపిస్తున్నారు. స్టార్ స్టేటస్‌తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో గుర్తింపుతెచ్చుకున్న మామూలు హీరోలు సైతం తన అభిరుచిని స్క్రీన్‌పై చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా సంపాదించిన దాంట్లో కొద్దోగొప్పో పెట్టుబడిపెట్టి నిర్మాత అవతారం ఎత్తుతున్నారు. హీరోలు చిత్ర నిర్మాణానికి బ్యానరెత్తడం వెనుక-ఎవరి స్ట్రాటజీలు వాళ్లకు ఉంటున్నాయి.
టాలీవుడ్‌లో ఏటా వెయ్యి కోట్ల టర్నోవర్ నడుస్తుందన్నది ఓ అంచనా. ఇన్ని కోట్ల వ్యాపారం సాగుతోన్న పరిశ్రమలో -స్టార్ హీరోలకు అందుతున్నది తక్కువే. నిజానికి టాలీవుడ్‌లో పెద్ద హీరోల రెమ్యునరేషన్ ఒక్కో చిత్రానికి ఒక్కోలా.. సరాసరిన రూ.20 కోట్ల వరకూ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలు విడుదలవుతూ.. అటు పొరుగు రాష్ట్రాల్లోనూ, ఇటు బాలీవుడ్‌లోనూ, చివరకు ఓవర్సీస్ బిజినెస్ సైతం దుమ్ములేపుతున్న వైనాన్ని చూస్తున్నాం. హీరో రేంజ్‌నిబట్టి సినిమా కోట్ల బిజినెస్ చేస్తున్నా.. -ముడుతున్నది మాత్రం తక్కువేనన్న భావన పెద్ద హీరోల్లోలేదనలేం. సో, నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి.. సొంత బ్యానర్‌ను మొదలుపెట్టి.. తమ రెమ్యునరేషనే పెట్టుబడిగా పెద్ద నిర్మాతలతో భాగస్వామి అయితే చేతికొచ్చే షేరు తక్కువేం కాదు. సినిమా పోయినా పోయేదేంలేదు, ఫణంగాపెట్టిన పరిహారం తప్ప. ఇదీ స్టార్ హీరోల సరికొత్త స్ట్రాటజీ. అలాగని పూర్తిగా ఆర్థికాంశాలపైనే ఈ స్ట్రాటజీ సాగుతుందనలేం. హీరోల అభిరుచులు.. వ్యక్తిగత బడ్జెట్ లెక్కలు.. ప్రాజెక్టులో ప్రాధాన్యతాంశాలు.. ఇవన్నీ పరిగణనలోకి తీసుకునే కొందరు నిర్మాణ రంగంపైకి వస్తున్నారు.
వెటరన్ హీరోగానూ టాలీవుడ్ మన్మథుడు అనిపించుకుంటున్న నాగార్జుననే తీసుకుందాం. అక్కినేని స్థాపించిన అన్నపూర్ణా దినదిన ప్రవర్థమానంగా సాగుతున్నా- ‘మనం’ అంటూ కొత్త
నిర్మాణ సంస్థ మొదలెట్టాడు. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌పై ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఏయన్నాఆర్ అనుసరణను కొనసాగిస్తూనే, చిన్న బడ్జెట్ చిత్రాలను ‘మనం’తో టార్గెట్ చేశాడు. కొత్త టాలెంట్‌ను పరిచయం చేయడమేకాదు, ఆ టాలెంట్‌ను వ్యాపారాత్మకంగానూ మలుచుకుంటున్నాడు.
ఇలాంటి హీరోల సంఖ్య టాలీవుడ్‌లో తక్కువేం లేదు. సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ.. అటు సృజనాత్మకంగానూ, ఇటు వ్యాపారాత్మకంగానూ నిర్మాతల అవతారం ఎత్తుతూనే ఉన్నారు. వరుస పరాజయాలతో కెరీర్ వత్తిడి ఎదుర్కొన్న హీరో నితిన్ -పంథా మార్చి పదునైన ప్రయత్నంతో హిట్టందుకున్నాడు. ఆ ప్రాజెక్టు- ఇష్క్. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన క్యూట్ లవ్ స్టోరీ నితిన్ సొంత బ్యానర్‌లో చేసిందే. అది మొదలు- శ్రేష్ట్‌మూవీస్ ద్వారా నిర్మాతగా గుండెజారి గల్లంతయ్యిందే, చిన్నదాన నీకోసం లాంటి ప్రాజెక్టులు చేశాడు. అంతేకాదు అక్కినేని కుటుంబంపై అభిమానం, అఖిల్‌తో అతనికున్న స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని అఖిల్ తొలి చిత్రం ‘అఖిల్’నూ నిర్మించిన విషయం తెలిసిందే. ఇక స్టార్ హీరో మహేష్‌బాబు ‘శ్రీమంతుడు’తో శ్రీమంతుడయ్యాడు. జి మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరిట సంస్థను నెలకొల్పి ప్రతి సినిమాలో పార్టనర్ అవుతున్నాడు. ప్రతిభావంతుడైన హీరో సిద్ధార్థ్ సైతం ‘లవ్ ఫెయిల్యూర్’తో నిర్మాత అయ్యాడు. ఈకటి పేరిట బ్యానర్ పెట్టి సినిమాలు చేస్తున్నాడు. టాలీవుడ్‌లో మోహన్‌బాబుది సెపరేట్ ట్రాక్. విలన్‌నుంచి హీరోగా మారి బిజీఅయిన తరువాత- లక్ష్మీప్రసన్న పిక్చర్స్ పేరిట ఎన్నో చిత్రాలు నిర్మించాడు. ఆయన కుమార్తె లక్ష్మి -మంచు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ను స్థాపించింది. తెలుగులో ఐదు చిత్రాలు నిర్మించడమే కాదు, సోదరుడు మనోజ్ సినిమాలకు నిర్మాతగా ఉంటోంది. పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ 1994లో విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్ళు’తో నిర్మాతయ్యాడు. అంజనా ప్రొడక్షన్స్ పేరిట అన్న నాగబాబుతో కలిసి పవన్ నిర్మించిన చిత్రమిది. తరువాత డైరెక్షన్ విభాగంలోకీ అడుగుపెట్టి జానీ నిర్మించాడు. గీత ఆర్ట్స్‌తో కలిసి పవన్‌కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పేరిట బ్యానర్ మొదలుపెట్టి, తరువాత సర్దార్ గబ్బర్‌సింగ్ చిత్రానికీ నిర్మాతగా నిలిచాడు. ఇక చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నంబర్ 150’తో స్టార్ హీరో రామ్‌చరణ్ సైతం నిర్మాతయ్యాడు. చిరు రీఎంట్రీ కనుక భారీ చిత్రంగా నిర్మించేందుకు కొణిదెల ప్రొడక్షన్స్ పేరిట సొంత బ్యానర్ పెట్టాడు. ఖైదీ నంబర్ 150, సైరా ప్రాజెక్టులు పూర్తి చేశాడు. నాచురల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నాని ‘అ’తో నిర్మాతయ్యాడు. మొదటి సినిమాతోనే క్రేజ్ కొట్టేసిన నాని, క్రియేటివ్ స్టోరీలను సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తానని చెబుతున్నాడు. కో అంటే కోటితో శర్వానంద్ నిర్మాత అవతారం ఎత్తితే, అటు హీరోగాను, ఇటు నిర్మాతగానూ కళ్యాణ్‌రామ్ దూసుకుపోతుండటం చూస్తున్నాం. నందమూరి తారక రామారావు పేరిట పెట్టిన బ్యానర్‌లో తన సినిమాలతోపాటు సోదరుడు జూ.ఎన్టీఆర్, ఇతర హీరోల చిత్రాలనూ తెరకెక్కిస్తున్నాడు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టి సత్తాచాటుకున్న ప్రకాష్‌రాజ్ నిర్మాతగామారి గగనం, గౌరవం, ఉలవచారు బిర్యానీ, మనఊరి రామాయణం వంటి చిత్రాలు తెరకెక్కించాడు. స్టార్ హీరో అల్లుఅర్జున్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో పలు భారీ చిత్రాలు తెరకెక్కుతున్నప్పటికీ, తన అభిరుచికి తగిన సినిమాలు తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ నిర్మాతగా సక్సెస్ అయితే -మరింతమంది తెలుగు హీరోలు నిర్మాతల అవతారం ఎత్తుతారన్నది కాదనలేని విషయం.
*