మెయిన్ ఫీచర్

మాతాశిశు సంరక్షణే ధ్యేయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గర్భిణులకు, బాలింతలకు ఆరోగ్యంపై అవగాహన ఉందంటే, వారికి వైద్యం తేలికగా అందించవచ్చు. పౌష్టికాహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, ప్రసవానంతరం బిడ్డ సంరక్షణకు కావాల్సిన చిట్కాలు.. ఈ మూడూ చాలా చాలా ప్రధానమైనవి. వీటిని తెలుసుకుంటే చాలు తల్లీ, బిడ్డ సురక్షితంగా ఉంటారు అంటున్నారు డాక్టర్ టి. వింధ్య. ఆవిడ చెప్పిన వివరాల్లోకి వెళితే..
భారతదేశంలో ప్రతి సంవత్సరం సుమారు 56,000 మంది మహిళలు గర్భానికి సంబంధించిన సంక్లిష్టతల వల్ల మరణిస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం 13 లక్షల శిశువులు పుట్టిన సంవత్సరం లోపే మరణిస్తున్నారు. వీటిలో దాదాపు రెండు శాతం శిశువు పుట్టిన మొదటి నాలుగువారాల్లోనే జరుగుతున్నాయి. వీటిలో కూడా సుమారు 75 శాతం పుట్టిన వారం లోపలే జరుగుతున్నాయట. యునిసెఫ్ తాజా నివేదిక ప్రకారం భారతదేశంలో నెలలోపు వయసు పిల్లల మరణాలకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ప్రసవ సమయంలో ఎదురయ్యే రకరకాల సమస్యలు, రెండోది నెలలు నిండకుండానే జరుగుతున్న ప్రసవాలు. ఈ మరణాలన్నీ నివారించగలిగినవే.. మాతాశిశు వైద్య సేవలను మెరుగు పరచాల్సిన అవసరాన్ని గుర్తుచేసేవే.. ఈ లక్ష్యంతోనే 2005లో జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకాన్ని (ఎన్‌ఆర్‌హెచ్‌ఎం) తీసుకొచ్చింది ప్రభుత్వం. గ్రామీణ ప్రాంతాలతో పాటు వైద్య ఆరోగ్య సేవలు, తక్కువగా ఉన్న ఎనిమిది రాష్ట్రాలలో వాటిని మెరుగుపరచడం దీని లక్ష్యం. ఆ ఎనిమిది రాష్ట్రాలు ఏమిటంటే.. బీహార్, ఛత్తీస్‌గడ్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిషా, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌లు. వాటికి ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ రాష్ట్రాలని పేరు పెట్టారు. అక్కడ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు, అంబులెన్సులను అందుబాటులో ఉంచేందుకు, సిజేరియన్ ఆపరేషన్ల సదుపాయాలు కల్పించేందుకు పథకాలను రూపొందించారు. వీటికి తోడు నగదు ప్రోత్సాహక పథకాలను కూడా అమల్లోకి తెచ్చారు. దీనితో పాటు జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ‘జననీ సురక్ష యోజన’ పథకం సురక్షితమైన మాతృత్వం కోసమే రూపొందించారు. గర్భవతి మహిళలలో సంస్థాగత కాన్పును ప్రోత్సహించడం
ద్వారా తల్లి, శిశు మరణాలను తగ్గించే లక్ష్యంతో దీన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం అన్ని రాష్ట్రాలతో పాటు, తక్కువ ప్రదర్శన గల రాష్ట్రాల్లో ప్రత్యేకంగా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఇది అమలవుతుంది. జననీ సురక్ష యోజనను నేషనల్ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్(ఎన్‌ఎమ్‌బిఎస్)ను సవరించడం ద్వారా ఏప్రిల్ 2005లో దీన్ని ప్రారంభించారు. జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాలలో ఒకటిగా నేషనల్ మెటర్నిటీ బెనిఫిట్ స్కీమ్ ఆగస్టు 1995లో అమలులోకి వచ్చింది. ఈ పథకాన్ని 2001-2002 సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నుండి కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖకు బదిలీ చేశారు. రెండు ప్రత్యక్ష జననాల వరకు, దారిద్య్ర రేఖకు దిగువ (బిపిఎల్) ఉన్న కుటుంబాలకు చెందిన, 19 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న మహిళలకు పుట్టిన ప్రతి బిడ్డకు రూ. 500 ఆర్థిక సాయం అందిస్తుంది ఎన్‌ఎమ్‌బిఎస్. ప్రసూతి, శిశుమరణాలను తగ్గించడానికి, ప్రత్యుత్పత్తి, పిల్లల ఆరోగ్య కార్యక్రమాన్ని జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ కింద ప్రారంభించారు. ప్రసవ సమయంలో పిల్లల మరణాలను తగ్గించడానికి సంస్థాగత ప్రసవాలను ప్రోత్సహించడానికి ఇది పనిచేస్తుంది. కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ అనేక కార్యక్రమాలను జననీ సురక్ష యోజన ద్వారా ప్రారంభించింది. దీనివల్ల సంస్థాగత ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పథకానికి దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన గర్భిణీలు అర్హులు. ఇందులో తల్లి వయసు, పిల్లల సంఖ్య సంబంధం లేకుండా ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేటు ఆరోగ్య కేంద్రంలో ప్రసవించవచ్చు. గర్భవతి మహిళలలో సంస్థాగత ప్రసవాలను ప్రచారం చేసే ఆశా కార్యకర్తలకు మహిళల ఆరోగ్య పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలను కూడా ఈ పథకం అందిస్తుంది. ఈ పథకం కింద అర్హత గల గర్భిణీల బ్యాంకు ఖాతాలలోకి నేరుగా జననీ సురక్షా యోజన ప్రయోజనాన్ని చేరుస్తారు.
తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను ప్రోత్సహించడానికి, పేద కుటుంబాల గర్భిణులకు ఆసరాగా ఉండటానికి ‘కేసీఆర్ కిట్’ అనే పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా మాతా శిశు సంరక్షణ కింద రూ. 15 వేల రూపాయలతో పాటు కిట్ కూడా ఇస్తున్నారు. గర్భిణీలకు రూ. 12 వేలు ఆర్థిక సహాయంతో పాటు.. ఆడపిల్ల పుడితే రూ. 1000ను ప్రోత్సాహకంగా ఇస్తున్నారు. దీంతో కేసీఆర్ కిట్స్ దేశవ్యాప్త ప్రచారానికి నోచుకున్నాయి. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ యోజన కార్యక్రమం కూడా 2016లో ప్రారంభమైంది. మాతృత్వం, శిశు సరంక్షణకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తూ శిశువుకు జన్మనిచ్చే సమయంలో ఏ మాతృమూర్తి మృత్యువాత పడకూడదనే ఉద్దేశ్యంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ నిర్ణయించిన లక్ష్యం మేరకు ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోగ్యవంతమైన సమాజం కోసం.. ముఖ్యంగా మహిళలు, శిశువుల ఆరోగ్యం కోసం అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కింద ప్రతీ నెల తొమ్మిదవతేదీన గర్భిణీలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. గర్భిణీలు రెండవ త్రైమాసికంలో ఉన్నప్పుడు, మూడో త్రై మాసికంలో ఉన్నప్పుడు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో అత్యంత ప్రమాదకర పరిస్థితిలో ఉండేవారికి ప్రత్యేక వైద్యసేవలను అందిస్తున్నారు. దీనిద్వారా మాతృమరణాల సంఖ్య తగ్గుతుందని వారు భావిస్తున్నారు.
తల్లికి సూచనలు
* గర్భవతి కాగానే ఆసుపత్రిలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడం, క్రమమైన వైద్య పరీక్షలు చేయించడం, సరైన ప్రసవం వల్ల చాలామటుకు మాతృమరణాలు, శిశుమరణాలను నివారించవచ్చు.
* గర్భిణిగా రిజిస్ట్రేషన్ అయిన తరువాత మహిళలకు నాలుగు ఆంటినెంటల్ చెకప్‌లు, ఆరు ప్రసవానంతర చెకప్‌లు అవసరం అవుతాయి.
* రక్తపోటు, మూత్రపరీక్ష, బరువు కొలవడం, అల్ట్రాసౌండ్ స్కానింగ్, టి.టి. ఇంజెక్షన్, ఐరన్, ఫోలిక్ యాసిడ్ మాత్రలు, హెచ్‌ఐవి పరీక్ష.. ఆంటినెంటల్ చెకప్‌లో భాగంగా ఉంటాయి.
* కడుపుతో ఉన్నప్పుడు మంచి పోషకాహారం తీసుకోవాలి. విశ్రాంతి తీసుకోవాలి.
* మరీ ఎక్కువ బరువున్న వస్తువులు మోయరాదు. సౌకర్యవంతమైన కాన్పు కోసం భాగస్వామితో చర్చించి ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి.
* పోస్ట్‌నేటల్ కేర్‌లో భాగంగా పోషకాహారంపై కౌన్సిలింగ్, ముర్రుపాలకు సంబంధించిన సమాచారం, బిడ్డకు ఇవ్వాల్సిన టీకాల గురించి కూడా సమాచారం ముందుగానే తెలుసుకోవాలి. దీనివల్ల తల్లికి, బిడ్డకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.
* బిడ్డకి, బిడ్డకి మధ్య ఎడం కొరకు ఆరోగ్యకరమైన కుటుంబ నియంత్రణ మార్గాలను అనుసరించాలి.

శిశు సంరక్షణ
* పుట్టిన బిడ్డ బరువు 2.5 కిలోల కంటే తక్కువ ఉంటే, బిడ్డని వెచ్చగా ఉంచడానికి అవసరమైన కంగారూ కేర్‌ని ప్రోత్సహించాలి.
* సాధారణ ప్రసవం అయితే అరగంటలోపు, సిజేరియన్ అయితే మొదటి నాలుగు గంటలలోపు బిడ్డకి చనుబాలు పట్టించాలి.
* మొదటి 48 గంటలు బిడ్డకి స్నానం చేయించకూడదు.
* బిడ్డకి ఆరునెలల పూర్తిగా తల్లిపాలను ఇవ్వాలి. అనుబంధ ఆహారం నాలుగో నెలలోకానీ, ఐదో నెలలో కానీ డాక్టరు సలహాతో అందివ్వాలి.
ఎఫ్‌ఓజిఎస్‌ఐ ముందడుగు
ఫెడరేషన్ ఆఫ్ ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకలాజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా 2019లో ‘వి ఫర్ స్ర్తి అభియాన్’ అనే మిషన్‌ను ప్రారంభించింది. దీనిద్వారా మహిళ ఆరోగ్యమే అజెండాగా ఈ మిషన్‌ను ముందుకు నడిపిస్తున్నారు. ఎందుకంటే మహిళ ఆరోగ్యంగా, తెలివిగా, రక్షణగా ఉన్నప్పుడే భారతదేశం మరింత ముందుకు సాగుతుంది. ఇందులో వీరు పొందుపరిచిన అంశాలేమిటంటే..
* పిండం ఏర్పడినప్పటి నుంచే రక్షణ చర్యలను మొదలుపెట్టాలి తల్లి.
* అధిక ప్రమాదం ఉన్న గర్భాలను గుర్తించి వాటికి సరైన చికిత్సను అందించడం ద్వారా మాతృత్వ మరణాలను తగ్గించాలి.
* సురక్షితమైన, సంతృప్తికరమైన విధానాల ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలను అందించడం.
* తప్పనిసరిగా తల్లిపాలను పిల్లలకు పట్టేవిధంగా ప్రోత్సహించడం.
* సురక్షితమైన గర్భనిరోధక పద్ధతులను ప్రోత్సహించడం.
* గర్భంలో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు సురక్షితమైన గర్భస్రావం చేయించడం..
* కడుపులో ఉన్నది ఆడపిల్లని తెలిసి చేసే భ్రూణహత్యలను ఆపడం..
* మహిళలకు జననేంద్రియ కేన్సర్ల గురించి అవగాహన కల్పించడం..
* కౌమార దశలో ఉన్న అమ్మాయిలకు వ్యక్తిగత ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించడం..
* పునరుత్పత్తి అవయవాలకు ఏవైనా ఇన్‌ఫెక్షన్స్ వచ్చినప్పుడు వాటికి తగిన చికిత్సను అందించడం వంటి పనులను ఈ ఎఫ్‌ఓజిఎస్‌ఐ చురుగ్గా చేస్తోంది. ఇలాంటివన్నీ పాటించడం ద్వారా మహిళలు, పుట్టే పిల్లలు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుంది.

- డాక్టర్ టి. వింధ్య ఆబ్‌స్టెట్రిక్స్, గైనకలాజిస్ట్