మెయిన్ ఫీచర్

దీపావళి కొత్తగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞానానికి చిహ్నం వెలుగు. అజ్ఞానానికి చిహ్నం చీకటి. దీపం చిన్నదైనా చుట్టుపక్కల అంతా వెలుగును నింపుతుంది. అది కళ్లకు మాత్రమే కనిపించే కాంతి కాదు. మనసును నింపే జ్ఞానకాంతి. చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, విజయానికి ప్రతీకగా దీపావళిని జరుపుకుంటారు. దీప మాళికల శోభతో వెలుగొందే గృహాంగణాలు, ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం, నూతన వస్త్రాల రెపరెపలు, పిండివంట ఘుమఘుమలు, బాణసంచా చప్పుళ్లు.. దివ్య దీపావళి సోయగాలు. మనలో ఉన్న అజ్ఞానంధకారాన్ని పారద్రోలి జ్ఞానకాంతులను విరజిమ్మే పండుగ. దేశమంతా ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ. చిమ్మ చీకట్లను కురిపించే అమావాస్య.. రాత్రిని వెనె్నల పిండారబోసిందా అన్నట్లుగా దీపాల వెలుతురుతో నింపేసే పండుగ. ఈ పండుగకు కులమతాలు, వయో బేధాలు ఉండవు.. అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగే నవ్యకాంతుల దీపావళి.. దివ్య జ్యోతుల దీపావళి. ప్రతియేటా ఆశ్వయుజ అమావాస్య రోజునే దీపావళిగా జరుపుకుంటారు. దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వయుజ బహుళ చతుర్దశి. దీనే్న నరక చతుర్దశిగా జరుపుకుంటారు.
పసుపు పచ్చని దీపకాంతులు.. నునువెచ్చని వెలుగులు.. బుజ్జాయి మోములో పసిమిదనం రెట్టింపయ్యేలా చేసే వెలుగుల పండుగ వచ్చింది. కానీ నేటి దీపావళి.. అనే మాటకు రూపురేఖల్ని చెరిపేసేలా ప్రస్తుత మార్కెట్ సంస్కృతి తన విశ్వ రూపాన్ని చూపిస్తోంది. ప్రకృతికీ, పర్యావరణానికి, జీవావరణానికీ, మనిషి ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలిగినా పర్వాలేదు అనేదే నేటి సంస్కృతి. అయితే భారతీయ సంస్కృతిలో కీలకమైన దీపావళి పండుగను పర్యావరణానికి ఎలాంటి నష్టం జరగకుండా కూడా ఆనందంగా నిర్వహించుకోవచ్చు. హరిత దీపావళిగా వచ్చి చీకట్లను పారద్రోలి పచ్చటి సమాజానికి దివ్వెల ముస్తాబు చేసుకోవచ్చు. చిన్న, పెద్దా తేడా లేకుండా జరుపుకునే ఈ ఆనందాల వేడుకను పర్యావరణ హితంగా చేసుకుంటే వెలుగుల వరస మరింత ముందుకు వెళుతుంది. అందరికీ, అంతటికీ వెలుగులు అందించే పర్యావరణ దీపావళిపై రోజురోజుకీ అవగాహన పెరుగుతోంది. దీపావళి అంటే భారీస్థాయిలో మందుగుండు కాల్చి పండుగ చేసుకోవడం కాదు. కాలుష్యం తక్కువగా ఉండేలా, భారీ శబ్దాలు లేకుండా వెలుగులు విరజిమ్మేలా హరిత దీపావళిని నిర్వహించుకుని ప్రకృతికి హాని కలుగకుండా చూడాలి. ఇది మన కనీస బాధ్యత అనే స్పృహ కూడా ఇటీవలి కాలంలో పెరుగుతోంది. పర్యావరణానికి హాని చేయని నూనె దీపాల వెలుగులు, తక్కువ రసాయనాలతో తయారై, పరిధి దాటకుండా సరదాని అందించే బాణాసంచా, ఆకట్టుకునే సహజరంగులతో వేసిన ముగ్గులతో పండుగ చేసుకుని హద్దులు లేని ఆనందాన్ని సొంతం చేసుకోవడానికి ఏకైక మార్గం హరిత దీపావళి. వేలరూపాయలను ఖర్చు పెట్టి మరీ భారీ ఎత్తున పటాసులు కాలుస్తుంటారు చాలామంది. వీటిని పేల్చడం వల్ల ఎన్నో రకాల

రసాయనాలు గాలిలో కలవడంతో పాటు, విపరీతమైన శబ్దకాలుష్యం కూడా. ఇదంతా సహజ వనరుల కాలుష్యానికి దారితీస్తోంది. దీనివల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇలా కాకుండా.. పర్యావరణానికి హితంగా దీపావళిని ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.
నలుగు
దీపావళి రోజు ఉదయమే నిద్రలేచి.. గోరువెచ్చటి నువ్వులనూనెను తలకు, ఒంటికి పట్టించుకోవాలి. ఒక గంట తరువాత నలుగు పెట్టుకుని గోరు వెచ్చటి నీటితో తలారా స్నానం చేయాలి. నువ్వుల నూనె లక్ష్మీదేవికి ప్రతీక. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తాం కదా.. అందుకని ఈ రోజు నువ్వుల నూనెను ఒంటికి రాసుకుని స్నానం చేయాలి. అంతేకాదు నువ్వుల నూనెతో స్నానం చేయడం వల్ల చలికాలంలో వచ్చే చర్మవ్యాధులు దరిచేరవు. తలారా స్నానం చేసిన తరువాత కొత్త బట్టలు ధరించి, పూజ చేసి మిఠాయిలను తిని నోరు తీపి చేసుకోవడం సాంప్రదాయం. ఇలా సాంప్రదాయాలను పాటిస్తూ ఎకోఫ్రెండ్లీ దీపావళిని జరుపుకోవడం వల్ల పర్యావరణానికి, మనకూ ఆరోగ్యానికి ఆరోగ్యం.. అందానికి అందం.
అలంకరణ
దీపావళిలో అలంకరణే ప్రధానం. దీపాలను వరుసగా అలంకరించడమే దీపావళి. ఈ దీపాల అలంకరణ కూడా ఎకోఫ్రెండ్లీగా ఉంటే ఇంకా మంచిది. రసాయన రంగులతో ముగ్గులేయడం వల్ల నీటి కాలుష్యం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సహజ సిద్ధమైన రంగులు, బియ్యప్పిండి, పప్పు ధాన్యాలను ఉపయోగించి రంగవల్లులను తీర్చిదిద్దండి. ఆ రంగవల్లులను బంతిపూలు, గులాబీలతో అలంకరించడం వల్ల వాటికి కొత్త అందం వస్తుంది. అలంకరణల్లో నూనెతో వెలిగించే ప్రమిదలే మంచివి. దీపావళి సందర్భంగా చాలామంది ఇళ్లు, వ్యాపార కార్యాలయాలను విద్యుత్ దీపాలతో పెద్ద ఎత్తున అలంకరిస్తుంటారు. దీంతో విద్యుత్ వినియోగం ఎక్కువ అవుతుంది. అందువల్ల మట్టి ప్రమిదల్లో నూనె వేసి దీపాలు వెలిగించి అలంకరణ చేయడమే ఉత్తమం. దీనివల్ల విద్యుత్ ఆదాతో పాటు అలంకరణ చాలా అందంగా ఉంటుంది. మట్టి ప్రమిదలతో పాటు గోధుమపిండి ప్రమిదలు, కొబ్బరి చిప్పలు, సముద్రపు గవ్వలతో పాటు కొన్ని రకాల పండ్ల తొక్కల్లోనూ దీపాలు వెలిగించొచ్చు. వీటివల్ల ఖర్చు తగ్గడంతో పాటు పర్యావరణానికి కూడా మేలు జరిగి పచ్చని వెలుగులు సొంతమవుతాయి.
పొదుపు..
దీపావళి అంటే క్రాకర్స్ కొనడం మాత్రమే కాదని బంగారు ఆభరణాలు, రకరకాల కొత్త వస్తువులు కొనడమని, విలువైన కొత్త గృహోపకరణాలు కొనడమని.. ఇలా రకరకాలుగా వ్యాపారవర్గాల ప్రకటనలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. కొనుగోలుదారునికి అవసరం లేకపోయినా రకరకాల డిస్కౌంట్లు, ఈజీ ఫైనాన్స్ పథకాల ఎర చూపి ఆకట్టుకుంటుంటారు. సాంప్రదాయం పేరుతో వినిమయత్వం పెంచే ధోరణి ఇది. ఈ మాయలో చాలామంది అమాయకులు సులభంగా పడిపోతున్నారు. ఇప్పుడు ధన్‌తేరస్ కూడా దానిలో భాగంగా మారింది. దీపావళికి ఎంతో కొంత బంగారం కొనుక్కోవాలి. పాత వస్తువులను వదిలేసి, కొత్తవి సమకూర్చుకోవాలి.. ఇలా ఈ ఆలోచన పెంచడం వల్ల వ్యాపారులు లాభాలను పోగేసుకోవడం కోసమే. అందువల్ల వీరి మాయలో పడితే సామాన్య జనానికి దీపావళి వెలుగివ్వడం కన్నా వారి వ్యాపారాన్ని బాగా పెంచుకుంటారు. కాబట్టి ఖర్చును ఆనివార్యంగా పెంచే ఇలాంటి వినిమయ ఆకర్షణలు చాలా కుటుంబాల్లో నిజమైన పండుగ ఆనందాన్ని దూరం చేస్తాయి. అప్పుల ఊబిలోకి నెడతాయి. కాబట్టి దుబారాకు దూరంగా పొదుపు మంత్రంతో, మిఠాయిలతో జరుపుకునేదే అసలు సిసలైన దీపావళి.
బహుమతులు
దీపావళి పండుగకు ఏమీ కొనకపోతే బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం ఎలా? అనుకుంటున్నారు కదూ.. ఇది కూడా పర్యావరణహితంగా, దుబారాకు తావు లేకుండా కొనసాగించవచ్చు. ఈసారి స్నేహితులకు, బంధువులకు మొక్కలను బహుమతులుగా ఇవ్వండి. ఈ సీజన్లో నాటితే బతికే మొక్కలను తెలుసుకుని, మీ బడ్జెట్‌కు అనుగుణంగా మొక్కలను కొనుగోలు చేసి బహుమతులుగా ఇస్తే సరి. వీటితో పాటు పర్యావరణానికి మేలు చేసే జనపనార సంచులు, సౌరశక్తి గ్యాడ్జెట్లు, ఖాదీ దుస్తులు, రీసైకిల్‌కు అవకాశముండే రకరకాల బహుమతులను ఎంచుకోవచ్చు.
ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్
పర్యావరణ స్పృహ ప్రజల్లో పెరుగుతున్న కొద్దీ దీపావళి టపాసుల్లో కొన్ని తమ స్వభావాన్ని మార్చుకుని ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌గా మారుతున్నాయి. దీపావళి అంటే వెలుగుల్ని విరజిమ్ముతూ, పెద్ద శబ్దాలు చేస్తూ అందరినీ ఆకట్టుకోవడం అనే భావన ఇప్పటికే చాలామందిలో ఉంది. దీపావళికి క్రాకర్స్ కాల్చడం తప్పనిసరి అని భావిస్తున్న వారంతా ఈ ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్‌ని ట్రై చేయడం కొంత బెటర్. అలాంటివారి కోసమే ఎకో ఫ్రెండ్లీ క్రాకర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. వీటి ధ్వని కూడా పరిమిత దూరం వరకే వినిపించడంతో పాటు కాలుష్యం కలిగించని రంగురంగుల మెరుపులను వెదజల్లుతాయి. కేవలం గన్‌పౌడర్, ఫాస్పేట్‌ను మాత్రమే ఉపయోగించి ఆధునిక టెక్నాలజీతో ఈ వెరైటీ బాణసంచాను తయారుచేస్తున్నారు. ఇలా దీపావళి రోజు దుబారాను తగ్గించి దీపాలతో, పిల్లల కేరింతలతో, మిఠాయిలతో అందమైన, ఆనందమైన హరిత దీపావళిని జరుపుకోవచ్చు. మరి హరిత దీపావళిని మనమూ మొదలుపెడదామా..

-మహి