మెయిన్ ఫీచర్

ధనత్రయోదశి అంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనుషులకు భౌతికమైన సుఖాలను అందించేది సంపద. సంపద అనగానే తరగనంత ధనం అనుకుంటారు. కానీ కనీస అవసరాలకు లోటు లేకుండా ఉండటం కూడా సంపదే! అందుకే సంపదకు భాగ్యం అన్న పర్యాయపదం కూడా ఉంది. అలాంటి సంపదను మనకు నిరంతరాయంగా ప్రసాదించే తల్లి లక్ష్మీదేవి. ఆ తల్లిని కొలుచుకునే రోజు ఈనాటి ‘్ధనత్రయోదశి’. దీపావళి పండుగ తొలిరోజును ధన్‌తేరస్‌గా జరుపుకుంటారు. ఈ రోజున లక్ష్మీ కుబేర పూజ జరుపుతారు. ధన్‌తేరస్ లేదా ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవిని, కుబేరున్ని విశిష్టంగా కొలుస్తారు. ఇంట్లో ఆయురారోగ్యాలు, సిరిసంపదలు వెల్లివిరియాలని కోరుకుంటారు. ధన్‌తేరస్ రోజు పూజలు చేయడం వల్ల మంచి అవకాశాలు లభిస్తాయని జ్యోతిష్యం చెబుతుంది. పురాణాల ప్రకారం దీపావళికి ముందు వచ్చే ధనత్రయోదశిని చోటీ దివాళీ అంటారు. ధనత్రయోదశి అంటే సంపద, శ్రేయస్సు అని అర్థం. హిందూ పురాణాల్లో చాంద్రమానాన్ని అనుసరించి ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష త్రయోదశికి ధనత్రయోదశి అని పేరు.
దేవతలు, దానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలుకుతున్న సమయంలో పాల సముద్రం నుంచి శ్రీ మహాలక్ష్మి జన్మించింది. అంతేకాదు.. సంపదలను ప్రసాదించే కల్పవృక్షం, కామధేనువు ఆమె. దేవవైద్యుడు ధన్వంతరి కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారు. ఆరోజు ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి. ఎంత చదువు చదివినా.. ఎన్ని తెలివితేటలు ఉన్నా.. శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లేకపోతే జీవితం శూన్యం. అందుకే.. సర్వ సంపద ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం సర్వ మానవాళి ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని ఎంతో భక్తి, శ్రద్ధలతో పూజించి ఆమె ఆశీస్సులు అందుకుంటారు. శ్రీ మహాలక్ష్మి ధనానికి ప్రతిరూపం. అందుకే ఆమె జన్మదినమైన ఈ ఆశ్వయుజ కృష్ణ త్రయోదశిని ‘్ధనత్రయోదశి’ అంటారు.
ధనానికి అధిదేవత ‘శ్రీ మహాలక్ష్మి’.
ధనానికి అధినాయకుడు ఉత్తర దిక్పాలకుడైన ‘కుబేరుడు’.
అందుకే.. ధనత్రయోదశినాడు శ్రీ మహాలక్ష్మితో పాటు కుబేరున్ని కూడా ఆరాధిస్తారు. సాధారణంగా.. ఈ లక్ష్మీపూజను.. సాయం సమయంలో ప్రదోష వేళలో వృషభ లగ్నంలో చేస్తారు. సూర్యాస్తమయం అయిన తరువాత సుమారు 90 నిముషాలు ఈ ప్రదోషకాలం ఉంటుంది. ఈ సమయంలో శ్రీమహాలక్ష్మి పూజను చేసుకుంటే చాలా మంచిది. కొన్ని ప్రాంతాల్లో శ్రీమహాలక్ష్మి, కుబేరులతో పాటు ధన్వంతరిని కూడా పూజిస్తారు. ధనత్రయోదశితోనే దీపావళి పండుగ సంబరం మొదలవుతుంది. లక్ష్మీదేవి ఈ రోజే ఉద్భవించిందని ఓ నమ్మిక ఉంది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి ప్రతిరూపాలైన ఆభరణాలను పాలతో కడుగుతారు. ఈ రోజున వెండి, బంగారు వస్తువులను ఇంటికి తీసుకువస్తే శుభమన్న ప్రచారం కూడా ఒకటి మొదలైంది. కానీ తప్పనిసరిగా వస్తువులు కొనాలని కానీ, ఇంత మొత్తంలో తీసుకోవాలని కానీ శాస్త్రంలో ఎక్కడా లేదు. ఏదైనా విలువైన వస్తువు కొనే ఆసక్తి, స్తోమత ఉన్నవారికి ఇది శుభప్రదమైన రోజు మాత్రమే..
ధనత్రయోదశికి సంబంధించిన మరో గాథ కూడా ప్రచారంలో ఉంది. పూర్వం హిమ అనే యువరాజు జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్యులు, అతను వివాహం జరిగిన నాలుగో రోజు రాత్రి పాము కాటు వల్ల మరణిస్తాడని తేల్చి చెప్పారట. యుక్తవయస్సు వచ్చిన తరువాత అతని వివాహం జరగనే జరిగింది. కొత్తగా అత్తవారింట్లోకి అడుగుపెట్టిన పెళ్లి కూతురు, ఈ వార్త విని అవాక్కయింది. తన భర్తను ఎలా దక్కించుకోవాలో ఆమెకు పాలుపోలేదు. చివరికి ఆ నాలుగో రోజు రానే వచ్చింది. ఎలాగైనా తన భర్తను రక్షించుకోవాలనుకుంది ఆ పెళ్లికూతురు. తనతో పాటు తెచ్చుకున్న రాశుల కొద్దీ ఆభరణాలను తమ కోట గుమ్మం ముందు రాశులుగా పోసింది. అటుపై కోటలోనివారందరినీ పోగేసి వారందరికీ ఏవో కథలు చెబుతూ మెలకువగా ఉంచింది. రాజకుమారుడికి మృత్యు ఘడియలు రానే వచ్చాయి. యముడు పాము రూపంలో కోటలోకి ప్రవేశించేందుకు బయలుదేరాడు. కానీ గుమ్మం దగ్గర ఉన్న బంగారు కాంతులను చూసేసరికి అతని కళ్లు బైర్లుకమ్మాయి. ఎలాగోలా ఆ గుట్ట దిగి వెళ్దామని చూస్తే అంతా మెలకువగా కనిపించారు. ఇక చేసేదేమీ లేక వెనుదిరిగాడు యముడు. సమయస్ఫూర్తి ఉంటే విధిని సైతం ఎదుర్కోవచ్చన్న సూచన ఈ కథలో కనిపిస్తుంది.
ఉత్తరాదిన ఈ పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున తమ ఇంటిని చూసేందుకు సాక్షాత్తు లక్ష్మీదేవి వస్తుందని వారి నమ్మకం. అందుకే ఇళ్లను శుచిగా, శుభ్రంగా ఉంచుకుంటారు. ఆ దేవిని ఆహ్వానిస్తూ సాయంత్రం వేళ ఇంటి ముందు రంగురంగుల ముగ్గులను వేస్తారు. దీపాలను వెలిగించి ఆమెకు దారి చూపుతారు. ఇక ఆమెను స్తుతించి, పూజించి, హారతులిచ్చి తమ ఇంట్లో శాశ్వతంగా నిలిచిపొమ్మని వేడుకుంటారు. ఈ రోజున లక్ష్మీదేవిని మనసారా వేడుకున్నవారికి దారిద్య్రమనేదే ఉండదని భక్తుల నమ్మకం.

విశిష్టత

వాణిజ్య వర్గాలవారికి ధన త్రయోదశి ప్రధానమైన పర్వదినం. ‘్ధన్ తేరాస్’ అని పిలిచే ఆ పండుగనాడు దీపాలు వెలిగిస్తే, ధనరూపమైన లక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. పితృదేవతలు భువికి వచ్చే రోజుగా భావిస్తారు కనుక, వారికి దారి చూపడం కోసం ఆ పవిత్ర దినాన ఇంటి ముందు దీపాలు వెలిగించడం ఓ సంప్రదాయం. స్ర్తి పురుషులు ఈ రోజు బంగారు ఆరణాలు, నూతన పాత్ర సామాన్లు కొంటారు. దీనివల్ల ఏడాది పొడవునా సంపదలు వృద్ధి చెందుతాయని దృఢ విశ్వాసం. ఉత్తర భారతదేశంలో ఈ ఆచారం అధికం. దక్షిణాదిన కూడా ధన త్రయోదశినాడు బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేసే ఆచారం దశాబ్దకాలంగా పెరుగుతోంది. ఆయుర్వేద ప్రవక్త ధన్వంతరి జయంతి కూడా ఈ రోజే. ఆరోగ్యం, బలం, ఆయుర్దాయం కోసం ఈ దినాన ధన్వంతరిని పూజించడం అనాదిగా వస్తోంది. ధనత్రయోదశి పర్వ విశిష్టతలకు సంబంధించిన వివరాలు చతుర్వర్ణ చింతామణిలో కనిపిస్తాయి. బీహార్ సహా ఉత్తర భారతంలో ధన్వంతరిదే ఆరాధన విశేషంగా ఉంది. ఈ పర్వదినాన యమధర్మరాజును పూజిస్తారు. కనుక యమ త్రయోదశి అంటారు. ధనత్రయోదశి నాడు యమధర్మరాజు పరంగా కథ చెప్పుకుంటారు. హేమరాజుకు లేక లేక పుత్రుడు జన్మించాడు. ఆ రాకుమారుడు తన పదహారో ఏట, వివాహమైన నాలుగో రోజున పాము కాటుకు గురై చనిపోతాడని ఆస్థాన జ్యోతిష్కులు చెబుతారు. దాంతో భర్త ప్రాణాలు కాపాడుకొనేందుకై ఆ భార్య వివాహమైన నాలుగో రోజు రాత్రి రాజసౌధాన్ని దీపాలతో అలంకరింపజేస్తుంది. బంగారం, వెండి, రత్నాల్ని రాశులుగా పోసి ఉంచి, ఆ రాత్రి శ్రీహరి వైభవాన్ని కథారూపంలో గానం చేస్తుంది. యువరాజు ప్రాణం కోసం సర్పరూపంలో వచ్చిన యమునికి ఆ దీప కాంతికి బంగారు వెండి ధగధగలకూ కళ్ళు మిరుమిట్లు కొలిపాయి. కళ్లు చెదిరి కదలకండా ఉండిపోయి వచ్చిన పని మరచిపోయాడు. తెల్లారగానే తిరిగి వెళ్లిపోయాడని కథ. స్ర్తిల సౌభాగ్యానికి ఐశ్వర్యానికి ధన త్రయోదశిని సూచికగా భావిస్తాం. ఆయువు, ఆరోగ్యం, సిరిసంపదలు, కార్యసాఫల్యత, సుఖశాంతులు అన్నింటినీ అందించేది ధనత్రయోదశి పూజ. శ్రీమద్భాగతంలో ధనంవల్ల మనుషులలో మొత్తం 15 రకాల అనర్థాలు చేకూరతాయని చెప్పబడింది. దొంగతనం, హింస, అసత్య వచనం, దంభములాడుట, కామ, క్రోధ, గర్వ, మదాలు, శత్రుత్వాలు, అవిశ్వాసం, తగవులు, వ్యసనాలు, జూదం, మద్యపానం వంటి అవలక్షణాలు చేరతాయి. అందుకే ధనసంబంధిత అనర్థాలకు మొదటినుంచి దూరంగా ఉండితీరాలి. ధనసంపాదనతో ముడిపడ్డ పండుగలలో ధనత్రయోదశి ఒకటి. ప్రతి హిందువు పరమ పవిత్ర భావంతో లక్ష్మీదేవిని పూజిస్తారు. వైదిక ఋషులు లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీసూక్తము రాశారు.
‘‘ఓం మహాలక్ష్మీచ విద్మహే విష్ణుపత్నిచ ధీమహి- తన్నో లక్ష్మి
ప్రచోదయాత్’ అని శ్లోకం. బ్రహ్మ వైవర్త పురాణం ప్రకారం ధన్వంతరికి సూర్యుడినుండి ఆయుర్వేద విజ్ఞానం లభించింది. మనిషి అన్ని విధాలుగా సాధించడానికి ఆరోగ్యమే ప్రధానం. ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజు ధన్వంతరి పాలసముద్రంలో ఉద్భవించిందని భారతం చెబుతోంది. పాలసముద్రం నుంచే పుట్టిన లక్ష్మిదేవి ధన్వంతరి సోదరి. అందుకే దేశ వ్యాప్తంగా లక్ష్మీపూజ, కుబేర పూజలు చేస్తారు. సంపదకు మారుపేరైన బంగారాన్ని ధన త్రయోదశి రోజున ధరించడం ఆరోగ్యకరంగా భావిస్తారు. మహారాష్టల్రో ధనత్రయోదశి ఘనంగా జరుపుకుంటారు. ధనత్రయోదశినాడు ఇళ్లను సుందరంగా అలంకరిస్తారు. రంగు రంగు ముగ్గులు చిత్రించి లక్ష్మీదేవికి స్వాగతం చెబుతారు.

-కె.రామ్మోహన్‌రావు 94414 35919