మెయన్ ఫీచర్

ఆశలన్నీ ఆర్థిక సంఘం నివేదిక పైనే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను పటిష్టం చేయడంలో ఆర్థిక సంఘం కీలక పాత్ర వహిస్తోంది. 15వ ఆర్థిక సంఘం గడువు ఈ ఏడాది నవంబర్ 30తో ముగుస్తుంది. ఆలోగా ఆర్థిక సంఘం తన నివేదికను కేంద్రానికి సమర్పించాల్సి ఉంది. ఈ సంఘం ఇచ్చే నివేదిక ప్రాతిపదికగా కేంద్రం వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఐదేళ్ల పాటు రాష్ట్రాలకు నిధులు మంజూరు చేస్తుంది. 14వ ఆర్థిక సంఘాన్ని గతంలో యూపీఏ సర్కారు ఏర్పాటు చేసింది. ఈ సంఘం సిఫార్సులను కేంద్రం అమలు చేస్తోంది. నరేంద్ర మోదీ ప్రభుత్వం 2017 నవంబర్‌లో నియమించిన 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్రం ఎలాంటి సిఫార్సులను అమలు చేస్తుందనే ఉత్కంఠ రాష్ట్రప్రభుత్వాల్లో నెలకొంది.
15వ ఆర్థిక సంఘం చైర్మన్‌గా ఎన్‌కే సింగ్, సభ్యులుగా అజయ్ నారాయణ్ ఝా, అశోక్ లాహిరి, అనూప్ సింగ్ ఉన్నారు. రమేష్ చాంద్, శక్తికాంత్‌దాస్‌లు 2017 నుంచి 2018 డిసెంబర్ వరకు పార్ట్‌టైం సభ్యులుగా సేవలు అందించారు. ఈ ఏడాది జూలైలో ఈ సంఘం నివేదిక ఇవ్వాల్సి ఉంది. కాని ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’లో నిబంధనలను మార్పు చేసి అంతర్గత భద్రత, రక్షణ రంగానికి నిధుల కేటాయింపు, నిధులను నిర్ణీత కాలంలో ఖర్చుచేయని పక్షంలో అనుసరించాల్సిన విధానాలపై కూడా కమిషన్ సిఫార్సులు చేయాలని కేంద్రం కోరింది. దీని కోసం గడువును ఈ ఏడాది నవంబర్ 30వరకు పొడిగించారు.
ఆర్థిక సంఘం సిఫార్సులకు అనుగుణంగా కేంద్రం ఇచ్చే నిధులు రాష్ట్రాల ఆర్థిక విధానాలను ప్రభావితం చేయనున్నాయి. విద్య, ఆరోగ్య రంగాలకు నిధులు కేటాయించాలని అన్ని రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. గతంలో ఎంతగా నిధులను ఖర్చు చేసినా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వాసుపత్రుల పనితీరు అధ్వానంగా తయారైంది. అనేక రాష్ట్రాల్లో వీటి పనితీరు ప్రశ్నార్థకంగా మారింది. పేద రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు, వైద్యులు విధులకు గైర్హాజరయ్యే రేటింగ్ పెరిగింది. విద్య, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తామని ప్రతి రాజకీయ పార్టీ చెబుతున్నా, అధికారంలోకి వచ్చేసరికి ఈ రెండురంగాలపై పట్టు సాధించలేకపోతున్నాయి. నాణ్యమైన సేవలను ప్రజలకు అందించలేకపోతున్నారు. అందుకే ఈసారి రాష్ట్రప్రభుత్వాలు విద్య, వైద్యరంగంలో సాధించే ఫలితాలు, సామర్థ్యం ప్రాతిపదికన నిధులను కేటాయించాలని ఆర్థిక సంఘం యోచిస్తోంది. శిశుమరణాల రేటు, పౌష్టికాహార లోపం ప్రాతిపదికన నిధులు కేటాయించవచ్చు. అక్షరాస్యత, బాలికలు సెకండరీ విద్యను పూర్తి చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటారు. బాల్యవివాహాలు, చిన్న వయసులో సంతానం కలగడం, మాతా శిశువుల ఆరోగ్యం తదితర అంశాలు మహిళా సాధికారత సాధనకు అవరోధాలుగా మారాయి. 15వ ఆర్థిక సంఘం నిధులతో అమలయ్యే పథకాలపై కేంద్రం పూర్తి స్థాయిలో సమీక్షించింది. వీటి అమలు తీరుపై గట్టి సిఫార్సులు చేయనుంది. గతంలో 14వ ఆర్థిక సంఘం- కేంద్రానికి వచ్చే ఆదాయంలో 42 శాతాన్ని రాష్ట్రాలకు ఇవ్వాలని సిఫార్సు చేసింది. వీటిని కేంద్రం అమలు చేసింది. నిధులు, పన్నుల రాబడి పంపిణీకి 15వ ఆర్థిక సంఘం రూపొందించే ఫార్ములాపై ఆర్థిక నిపుణులు, బ్యాంకర్లలో చర్చ జరుగుతోంది.
నిధులు, పన్నుల పంపిణీలో కోతలు విధిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు నిరసన తెలియచేస్తాయి. మరోవైపు రాష్ట్రప్రభుత్వాలు 73, 74వ రాజ్యాంగ సవరణలకు అనుగుణంగా స్థానిక సంస్థలకు విశేషాధికారాలను ఇవ్వడం లేదు. కేంద్రం నుంచి వచ్చే నిధులను స్థానిక సంస్థలకు బదలాయించడం లేదు.
దేశమంతా రెవెన్యూ రాబడి, పన్నుల విధానంలో ఏకీకృత విధానం ఉండాలని, పూర్తి స్థాయి అధికారాలు తమ గుప్పెట్లో ఉండాలని కేంద్రం భావిస్తే రాష్ట్రాలు ప్రతిఘటించే ప్రమాదం లేకపోలేదు. ఏకీకృత విధానమంటే రాష్ట్రాల అధికారాలను హరించాలన్న లక్ష్యంగా ఉండరాదు. మన దేశంలో 28 రాష్ట్రాలున్నాయి. ప్రతి పౌరుడు రాష్టస్థ్రాయిలో తనకు నచ్చిన రాజకీయ పార్టీకి ఓటేసి అధికారం అప్పగిస్తాడు. జాతీయ స్థాయిలో కూడా ఇంతే. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య సమన్వయం లోపిస్తే వ్యవస్థలు కుంటుపడుతాయి. జీఎస్‌టీ ఏకీకృత పన్నుల విధానాన్ని పటిష్టం చేసింది. అదే సమయంలో రాష్ట్రాల పన్నుల ఆదాయం కేంద్రానికి చేరింది. కేంద్రం ఇచ్చే నిధులపై రాష్ట్రాలు ఎక్కువగా ఆధారపడాల్సి ఉంటోంది.
ఒక రాష్ట్రప్రభుత్వానికి ఆదాయం రెవెన్యూ పన్నుల ద్వారా వస్తుంది. ఇందులో ఆదాయపు పన్ను , అమ్మకం పన్ను పరోక్ష పన్నుల ద్వారా వస్తాయి. రాష్ట్రాలకు ఆదాయం పన్నును విధించే అధికారం లేదు. జీఎస్‌టీ కేంద్రం ఆధీనంలోకి వెళ్లడంతో అమ్మకం పన్నుపై రాష్ట్రాలకు నియంత్రణ లేదు. జీఎస్‌టీ కౌన్సిల్ ఇచ్చే నిధుల కోసం రాష్ట్రాలు ఎదురుచూస్తున్నాయి. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన రాష్ట్రప్రభుత్వాలకు ఆదాయం పన్ను, అమ్మకం పన్నును విధించే అధికారాలు లేవంటే, తమ హక్కులను కోల్పోయినట్లే భావించాల్సి ఉంటుంది. రక్షణ రంగానికి ఖర్చుపెట్టే52 శాతం నిధులను రాష్ట్రప్రభుత్వాలు కూడా భరించే విధంగా కేంద్రం అడుగులు వేస్తోంది. 15వ ఆర్థిక సంఘం ఇచ్చే సిఫార్సులను బట్టి ఈ చర్యలు ఉంటాయి. రాష్ట్రాలకు వచ్చే నిధుల్లో మరిన్ని కోతలు విధించే అవకాశం ఉంటుంది. భిన్నత్వంలో ఏకత్వం, జాతీయ వాదం, ఒకే దేశం- ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నికలు వంటి నినాదాల వల్ల దేశానికి లాభాలు చాలానే ఉన్నా, కొన్ని నష్టాలు పొంచి ఉన్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు వీటికి ససేమిరా అనవచ్చు. కేంద్రం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధంగా తన వద్ద విశేషాధికారాలను ఉంచుకుందని, వీటిని రాష్ట్రాలకు ఇవ్వవచ్చని ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నినదించారు. గత అసెంబ్లీ సమావేశాల్లో 2019-20 బడ్జెట్‌పై బదులిస్తూ కేసీఆర్ జాతీయవాదాన్ని బలపరుస్తూనే, రాష్ట్రాల హక్కులను హరించి వేసే విధంగా కేంద్రం దుందుడుకుగా వ్యవహరించడం మంచిది కాదన్నారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు బయటకు వచ్చిన తర్వాత, అవి రాష్ట్రాలకు మింగుడు పడని విధంగా ఉంటే తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, ఏపీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా గళమెత్తే అవకాశాలు లేకపోలేదు.
జీఎస్‌టీ కౌన్సిల్ తరహాలోనే ఖర్చు సెల్‌ను ఏర్పాటు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీని వల్ల వచ్చే ఆదాయం సంగతి సరే. తమకు వచ్చిన నిధులను ఖర్చుపెట్టే విషయమై కూడా రాష్ట్రప్రభుత్వాలు నియంత్రణను కోల్పోనున్నాయా?. ఇంకా ఈ అంశంపై విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది. రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలకు అధినేతలుగా ఉన్న ముఖ్యమంత్రుల విశేషాధికారాలను కత్తిరించే సాహసానికి కేంద్రం దిగుతుందా? అనేది వేచి చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే బ్రిటీష్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ఇప్పుటి రాష్ట్రప్రభుత్వలు ప్రొవిన్షియల్ ప్రభుత్వాలుగా మారుతాయి. సువిశాలమైన భారత్‌లో 28 రాష్ట్రాల్లో రకరకాల సంస్కృతులతోకూడిన ప్రజలు ఉన్నారు. అక్టోబర్ 31తో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం రాష్ట్ర హోదా కోల్పోయి, కేంద్రపాలిత రాష్ట్రంగా అవతరించనుంది. 370వ అధికరణ రద్దు విషయంలో బీజేపీకి ప్రజల నుంచి విశేష మద్దతు లభించింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 370వ అధికరణ రద్దు అనేదిక గొప్ప చారిత్రక నిర్ణయం. ఈ ఘనత ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షాలకు దక్కుతుంది. అదే సమయంలో రాష్ట్రాల హక్కులను క్రమంగా లాక్కొని, మొత్తం కేంద్రం నిర్దేశించే విధంగా దేశమంతా పాలన జరగాలన్న దిశగా తీసుకునే నిర్ణయాలకు రాష్ట్రప్రభుత్వాల ఆమోదం లభించకపోవచ్చు. వాస్తవానికి తమిళనాడులో డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలు బలహీనపడడం వల్ల అక్కడి నుంచి కేంద్రం గుత్త్ధాపత్యాన్ని నిరసించే ధ్వని వినపడడం లేదు. అనేక కారణాల వల్ల బీజేపీతో విభేదించే విపక్ష పార్టీల నేతల్లోని బలహీనతల వల్ల ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగించవద్దని నినదించే గొంతుల తీవ్రత తగ్గింది. ఏకీకృత విధానాలను అమలు చేస్తేనే ఏకత్వం సాధ్యమవుతుందనే ఆలోచనలు భారత్ లాంటి భిన్న సిద్ధాంతాలున్న దేశంలో ఆచరణ యోగ్యం కాకపోవచ్చు. 15వ ఆర్థిక సంఘం నివేదిక వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఆర్థిక విధానాలు, నిధులు, పన్నుల ఆదాయం పంపిణీపై చర్చ జరిగే అవకాశం ఉంది.

-కె.విజయ శైలేంద్ర 98499 98097