మెయిన్ ఫీచర్

తెలుగు సాహిత్య విరాట్ విశ్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శా॥ ‘‘అస్సే! చూస్సివషే! సే! చెవుడషే! అష్లాగషే! ఏమిషే!
విస్సావజల వారి బఱ్ఱినష ఆవిస్సాయ కిస్సారుషే!
విస్సండెంతటివాడె! యేండ్లు పదిషే! వెయ్యేండ్ల కీడే సుమా!
ఒస్సే బుఱ్ఱికి ఈడషే! వయసుకేముంషుందిలే! ఎంత వ
ర్చెస్సే!’ అందురు శ్రోత్రియోత్తమ పద స్ర్తిలాంధ్ర దేశంబునన్‌॥
ఈ పద్యం దాసు శ్రీరాములుగారి ‘‘తెలుగునాడు’’ అను పేరుకలిగిన ఆంధ్ర వీధి కావ్యంలోనిది. ఇద్దరు శుద్ధశ్రోత్రియ స్ర్తిలు- వారివారి భాష- పరిభాషల్లో ఆనాటి బాల్య వివాహాలను గురించి మాట్లాడుకునే తీరును ఈ పై పద్యం అక్షరాక్షరంలోనూ చాటిచెబుతోంది. బాల్యవివాహాల నిరసనే శ్రీరాములుగారి ఉద్దేశ్యం. అయితే- అలా ప్రత్యేకమైన శ్రోత్రియ పరిభాషలో రచించడం ద్వారా శ్రీరాములుగారి సునిశిత లోక పరిశీలనం, పద్య రచనానుభవ పరిజ్ఞానం వ్యక్తమవుతున్నాయి.
సీ॥ ‘‘మెలిపెట్టి విడిచిన మీసాలపై గొప్ప! నిమ్మకాయలు రెండు నిలుపవచ్చు
దేటగా, దెల్లగా తెగకాలు లంకాకు! పొగ చుట్ట జుంజురుఁబోల్పవచ్చు
నడువీథి రెడ్డిగాలిడి రచ్చ దీర్చుచో/ సివిలు జడ్జీలని చెప్పవచ్చు
నసదుగా ఁబొసగించి నొసటఁబెట్టిన బొట్టు/ నొక్క మారుప్ఫనియూదవచ్చు
వడివడిగఁ జిన్ననాఁడైన వడుగునాఁడు/ తడబడుచుఁజెప్పి కొన్నట్టి తప్పు సందె
ముక్కలొక నాల్గునిముసాల ముగియవచ్చు/ బళిర! యనవచ్చు లౌకిక బ్రాహ్మణులన్
ఇది శ్రీరాములుగారి ‘‘తెలుగునాడు’’లోని పద్యం. ఇందులో తమ కాలంనాటి బ్రాహ్మణ వర్గ వేషధారణలో, ఆచార వ్యవహారాల్లోని లోపాలోపాలను సభ్యతా పూర్వక హాస్యచమత్కారంగా హృద్యంగా చెప్పారు. ఈ పై పద్యాన్ని చదివిన వారిలో ఆయా లక్షణాలు కలవారు కూడా హాయిగా నవ్వుకునేంత హాస్య చమత్కారంగా వ్రాశారు. ‘మెలిపెట్టి విడిచిన మీసాలపై గొప్ప! నిమ్మకాయలు రెండు నిలుపవచ్చు’’ అన్న మొదటి పాదం యథాతథంగా ‘కులగోత్రాలు’ సినిమాలో ‘మాయ మీసంపై సీసం’ అన్న పేరుతో మొదటి పాదంగా సీస పద్యంలో ఉందని శ్రీరాములుగారి మునిమనుమడు డా.దాస అచ్యుతరావుగారు తెలిపారు. అంతేకాదు- ‘మంచి మనసుకు మంచి రోజులు’ సినిమాలోని ‘‘్ధరణికి గిరి భారమా? గిరికి తరువు భారమా? తరువుకు కాయభారమా? తల్లికి పిల్ల భారమా?’’ అన్న పాటలోని వాక్యాలకు శ్రీరాములుగారి ‘తెలుగునాడు’ లోని -
ఉ॥ ‘‘తల్లికి భారమా శిశువు? తామరతూటికి పువ్వు భారమా?
విల్లోక భారమా? కడిదివీరునకొంటెకు గూను భారమా?
వల్లికి భారమా ఫలము? బఱ్ఱెకుఁగొమ్ములు భారమా? నుతుల్
చెల్లును లింగధారులకు లింగపుఁగాయలు భారమా? మహిన్‌॥
- అన్న పద్యానికీ పోలికలున్నాయని డా.దాసు అచ్యుతరావుగారే ఓ వ్యాసంలో పేర్కొన్నారు. శ్రీరాములుగారి ఒక జావళి ‘‘షావుకారు’’ సినిమాలో కొద్దిగా ఉందని వి.ఎ.కె.రంగారావుగారు చెప్పారు. అలా హాస్య చమత్కారంగా పై రీతిగా చెప్పడమే కాదు - ‘‘మానంబేనగ, మాటలే కవచముల్ / మర్యాదలే భాగ్యముల్’’ అని ఆ నియోగి బ్రహ్మణ శ్రేణిలోగల ఉదాత్త లక్షణాలను కూడా సగౌరవంగా పేర్కొన్నారు దాసు శ్రీరాములుగారు. ఈయన రచనలలో ప్రముఖమైనదీ, సముదాత్తమైనదీ శ్రీదేవీ భాగవతం- పురాణానువాదం. ఇందలి కవితాశిల్పం అమోఘం- మచ్చునకు అయిదవ స్కంధంలో శుంభునకు ఆయన సేవకులు అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించే సన్నివేశంలోని పద్యం :
చం॥ ‘‘కలువలు కన్నులన్న సరిగాదు సుమా! ‘కుముదా’ఖ్య వానికిన్
గలుగుట- సారసంబుల నందగాదు సుమా! అవి నీరజంబులై
అలరుట- మీలునాగందగద; ప్పులలోనవి మున్గితేలుటన్;
బలుకనిఁకేమి? నేననుపమానములే యనవచ్చు గట్టిగన్‌॥
అమ్మవారి నేత్రాలను కలువపూలనడం సరికాదు. ఎందుకంటే కలువలకు కుముదాలనే పేరుంది. అంటే అవి పగలు కుత్సితములైన సంతోషం కలిగినవి- నేత్రాలను పద్మాలనడం కూడా తగదు. ఎందుకంటే అవి నీరజాలు. అంటే పద్మాలు రాత్రిపూట నిర్ణీతమైన పుప్పొడిగలవై ముడుచుకొనిపోతాయి. నయనాలను చేపలనడం కూడా తగదు. కారణం- అవి అప్పులలో (అంటే నీళ్లలో) మునిగితేలుతూ ఉంటాయి. ఇంతకూ అమ్మవారి నేత్రాలకు పోలికలే లేవని గట్టిగా చెబుతున్నానని భావం. ఈ పద్యం కదళీపాకం, పైదర్ఛీరీతి, కైశికీ వృత్తిలో నడిచింది. ఇందులో శే్లష, హేతూత్ప్రేక్ష, అనన్వయాలంకారం ఉన్నాయి. పై పద్యంలో ‘‘అనుపమానములే’’ అని ఉండడంవల్ల ముద్రాలంకారం ఉందనవచ్చు. తిరుగులేని కారణాన్ని ఇందులో ప్రతిపాదించడంవల్ల కావ్యాలింగాలంకారం ఉంది. వ్యాజస్తుతి కూడా ఉంది. మరి శ్రీరాములుగారు ‘‘తెలుగునాడు’’ కావ్యంలో కవితా స్వరూపాన్ని చెబుతూ ‘‘సంకరాలంకార సరణిఁగనక’’ అని అన్నారు- కానీ- అలంకారాల సాంకర్యం రసోపస్కారకమైతే అది ఉత్తమ రచనయే అని సంభావించవచ్చు. ఈ పై పద్యంలో వివక్షితాన్య పరవాచ్యధ్వని ఉంది. ‘‘గట్టిగన్ అని చివరలో అనడంలో ‘గన్ను’పేల్చినట్లుగా దృఢంగా చెబుతున్నారు- కవిగారు పై అంశాన్ని. శ్రీరాములుగారి రచనల్లో చెప్పుకోదగింది- అభిజ్ఞాన శాకుంతలం నాటకం- అచ్చతెలుగు అనువాదం. నాటకంలో కణ్వమహర్షి స్వగతోక్తిగా ప్రసిద్ధమైన ‘‘యాస్యత్యద్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా...’’ అన్న శ్లోకానికి శ్రీరాములుగారి అచ్చతెలుగు అనువాద పద్యమిది :
ఉ॥ ‘‘గుండెలు జల్దరించెను శకుంతల యేగెడి- గ్రుక్క మ్రింగి గొం
తెండిన మాట బొంగురగు నేడువనేడువఁ జూపుమ్రాన్పడెన్;
దండిగఁగాన కాపునయి దగ్గరఁదీసిన నాదుపాట్లె యి
ట్టుండగఁగన్న గేస్తులకెటో? తొలిసారిగ బిడ్డ నంపుచోన్‌॥
ఈ సందర్భంలో వడ్డాది సుబ్బారాయ కవిగారు ‘‘అరణ్యౌకసః’’ అనుదానికి తమ అనువాద నాటకంలో ‘‘కానలో బ్రదికెడు నాకె’’ అని కణ్వుని నోట పలికించారు. ఇక్కడ శ్రీరాములుగారు, ‘‘కానఁగాపున యిదగ్గరందీసిన నాదు పాట్లు’’ అని కణ్వనిచే పలికించారు. ‘‘కానఁగాపునయి’’ అన్నది అంతగా భావయుక్తంగాలేదని పరిశీలకుల అభిప్రాయం. ‘ఈ కానకు నేను రక్షకుడను’ అనడంలో మహర్షిలో కొంచెం గర్వం పొడచూపుతోంది. ఋషులకు అహంకారం తగదుగదా! అని పరిశీలకుల ఉద్దేశం. ‘‘కంఠస్తంభిత బాష్పవృత్తి కలుషం చింతాజడం దర్శనం’’ అన్న దానికి శ్రీరాములుగారు ‘‘గొంతెండిన మాట బొంగురగున’’ని అన్నారు. వికృతి పదాలుకాక- దేశీయమైన తెలుగు పదాలు వాడారు- శ్రీరాములుగారు- బాగుంది వసుదాయకవిగారు ‘‘కన్నకూతులనే వదలుట’’ అని కుణ్వునిచే పలికించారు. దీనికంటే శ్రీరాములుగారు ‘తొలిసారిగ బిడ్డ నంపుచోనౌ’ అన్న వాక్యం బాగుంది. వాళ్లంతట వాళ్ళు బిడ్డలనెవ్వరినీ తల్లిదండ్రులు వదలరు గదా! బిడ్డలను అత్తవారింటికి పంపిస్తారు. కనుక శ్రీవసురాయ కవిగారి అనువాదం కంటే శ్రీరాములుగారి ఈ అచ్చతెలుగు అనువాదమే బాగుంది. ఇక శ్రీరాములుగారి సూర్య శతకానువాదం గూర్చి- మయూరుని సంస్కృత సూర్య శతకంలోని ‘‘శాతశ్శ్యామలతాయాఃపరశురివ...’’ అన్న శ్లోకానికి శ్రీరాములుగారి ఆంధ్రానువాద పద్యమిది:-
ఉ॥ ‘‘రేయను తీగ కుంబరశురీతి, తమోటవి కర్చి భౌతిఁ,బ్రా
క్తోయజనేత్ర కల్వలను గోయిక రాగ్రగతిం- జగత్యు బో
ధాయతి ధాత పద్ధతి, వియద్భువులేర్పడఁదొల్చునట్టి మేల్
లూ (రా)యి స్థితిన్ దలిర్చెడు ద్యురత్నము సారథి మీకొలార్చుతన్‌॥
ఈ అనువాదం సంక్షిప్తం. మూల విధేయం. ‘‘శాశ్శ్యామలతాయాః పరశురవ’’అన్న సంస్కృత వాక్యానికి ‘‘రేయను తీగ కుంబరశురీతి’’ అని అచ్చ తెలుగులో పద్యారంభంచేయడం ముచ్చటగా ఉంది. ‘‘కార్కొన్న నిబిడాంధకార ధారచ్ఛటా సత్త్రవాటికి వీతి హోత్ర జిహ్వ’’ అని శ్రీనాథకవి తన కాశీఖండ కావ్యంలో విస్తృతి రూపంలో గంభీర సమాసంతో భావానువాదం చేస్తే - శ్రీరాములుగారు ‘‘తమోటవి కర్చ్భితి-’’ అని - అంటే చీకటి అనే అరణ్యానికి అగ్నివలే అని సంక్షిప్త సుందరంగా ఆంధ్రీకరించారు. శ్రీరాములుగారి పద్యంలో ‘‘కొలార్చుతన్’’ అన్న ముగింపు మనోహరం. ‘కొల’ అంటే లేమి, పాపం, బాధ-అన్న అర్థాలున్నాయి. ఈ మూడింటినీ ఆర్పేది సూర్యోదయం. ఇచట ‘కొల’అనే అచ్చ తెలుగును సాభిపాయపద ప్రయోగంగా భావించవచ్చు. ఇట్టి పదప్రయోగం శ్రీరాములుగారికి వెన్నతోపెట్టిన విద్య- తమ రచనల్లో తమ కాలంనాటి సంఘాన్ని మరువలేదు. లోకంపోకడను చెప్పడం మానలేదు. విగ్రహారాధనం సంఘానికి అవసరం అని అన్నారు- అన్నీ సీస పద్యాలే కలిగిన ‘‘విగ్రహారాధన తారావళి’’ అన్న గ్రంథంలో. అలాగే ‘‘కురంగ గౌరీశంకర’’మన్న నాటికలో కథ పౌరాణికమైనా - స్ర్తి విద్యావశ్యకతను గౌరీవకుళ మాలతీ సంభాషణల ద్వారా నొక్కివక్కాణించారు.
పైన ఉదాహరించిన రచనలేకాక- దాసు శ్రీరాములుగారి- కామాక్షి శతకం, చిలుకలకొలికి, ముద్దుగుమ్మ శతకం, చక్కట్లు దండకం, లౌకిక నీతిమాలిక, సంస్కృతంలోని రామభద్ర దీక్షితుని జానకీ పరిణయానువాదం, భవభూతి మాలతీ మాధవ, మహావీర చరిత్ర, ఉత్తర రామచరిత్ర నాటకానువాదాలు, మహాలక్ష్మీ విలాపం, సీతాకల్యాణం నాటకాలు, మంజరీ మధుకరీయం,- నాటిక, విక్టోరియారాణి నిర్యాణం సందర్భంగా పద్యాలు, అభినవ గద్యప్రబంధం, అభినవ కౌముది, తర్కకౌముది, వైశ్యధర్మ ప్రదీపిక, సారసీల గ్రహగణితము, అభినయ దర్పణము (నాట్యశాస్త్రం), దురాచార దిశాచ భంజని, ఆచార నిరుక్తి, శ్రాద్ధసంశయ విచ్ఛేది (ఇవన్నీ)తెలుగు వచన గ్రంథాలు), వితంతువులకు కేశఖండన ‘్ధర్మశాస్త్ర విరుద్ధమని నిరూపిస్తూ, దండాముండన ఖండనము (వ్యాసం) ఆదినాథ సిద్ధుని సంస్కృత వైద్యశాస్త్ర శ్లోకాలకు భంగ రాజ మహిమ పద్యానువాదం, ‘‘అనల్ప జల్పితాకల్పవల్లి’’ అన్న పత్రికా నిర్వహణం, స్ర్తి విద్యావశ్యకతను తెలియజేస్తూ, వితంతు వివాహాలను ప్రోత్సహిస్తూ, అనేక తెలుగువ్యాసాలు పద కవితలు, జావళీలు, స్వరజతులు, లక్షణావిలాసం, సాత్రాజితీ విలాసం అనే యక్షగానాలు మున్నగువానిని రచించారు. శ్రీరాములుగారు గొప్ప సంఘసంస్కర్త. ఆనాడు స్ర్తిలు సంగీతం నేర్చుకోవడం నిషేధం. కానీ వీరు తమ కుమార్తె శారదాంబకు సంగీతం నేర్పడమేకాక- బెంగుళూరులో కచేరీ చేయించారు. ఆమె ప్రముఖ వీణా విద్వాంసురాలే కదా- తెలుగు కవయిత్రి. ‘‘నాగ్వజితీ పరిణయ’’ దృశ్యకావ్యాన్ని వ్రాశారు. ఆనాడు సభలకూ సమావేశాలకూ స్ర్తిలను తీసుకువెళ్ళడం నిషేధం. కానీ- శ్రీరాములుగారు తమ శ్రీమతి జానకమ్మను సభలకు తీసుకువెళ్లేవారు. వీరు కందుకూరివారి మెప్పును పొందినవారు. సంఘసంస్కరణ విషయాల్లో ఒక వ్యక్తి- వితంతు వివాహాల్ని చేసికొనక- తాను ప్రేమించిన అమ్మాయిని పెండ్లి చేసుకోడానికై ప్రాయశ్చిత్తం నిమిత్తం శృంగేరీ పీఠాధిపతులనాశ్రయించగా వారు నిదర్శకపత్రాన్ని తెమ్మన్నారట. అప్పుడు శ్రీరాములుగారు నిదర్శక పత్రాన్ని ఇచ్చారట. వీరు గొప్ప న్యాయవాది కూడ. బందరులో వీరిని బ్రహ్మసంఘంవారు బంగారుపూలతో అర్చించి బ్రహ్మరథం పట్టారు. సర్వశ్రీ చెళ్లపిళ్ల, నిడదవోలు మున్నగు పండితుల మెప్పుపొందినవారు. అటువంటి వీరు 1846 ఏప్రిల్ 8వ తేదీన కృష్ణాజిల్లా కూరాడలో శ్రీమతి కామమ్మ, నన్నయ్య దంపతులకు జనించి, 1908 మే నెల 16వ తేదీన కీర్తిశేషులైనారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆంధ్ర సాహిత్య విరాట్ విశ్వరూపులు- దాసు శ్రీరాములుగారు.

*చిత్రం... దాసు శ్రీరాములు

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ 9866944287