మెయన్ ఫీచర్

జాతీయవాదమే జనం జెండా, అజెండా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ దేశంలో ఇంతవరకూ లౌకికవాదం పేరున సాగుతున్న కుల, కుటుంబ రాజకీయాలకు కాలం చెల్లిందా? అంటే- నడుస్తున్న చరిత్ర అవుననే అంటోంది. నిజానికి 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే ప్రాంతీయ,కుల,కుటుంబ రాజకీయాల నిజరూపాన్ని, హిందూ వ్యతిరేక లౌకికవాదం వికృత స్వరూపాన్ని ప్రజలు గుర్తిస్తూ వచ్చారు. అందుకే ఆ ఎన్నికల్లో హిందూ జాతీయవాదం జెండా రెపరెపలాడింది. 2014 ఎన్నికలు దేశ రాజకీయ ముఖచిత్రాన్ని మాత్రమే కాదు, రాజకీయ చరిత్ర గతినే మార్చి వేశాయి. ఈ మార్పుకు మూల కారణం మోదీ. మరో కారణం హిందూ వ్యతిరేకతే లౌకిక వాదంగా ప్రచారం సాగించి ప్రయోజనం పొందిన కాంగ్రెస్, కమ్యూనిస్టు ఇత్యాది కుహనా లౌకికవాద రాజకీయ పార్టీలు. సోనియా, రాహుల్,ఏచూరి, మాయావతి, మమతా బెనర్జీ ఇత్యాదిగా గల రాజకీయ నాయకులు.
భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది మొదలు- ఆయనను ప్రజల ముందు హిందూ మతోన్మాదిగా చూపించే ప్రయత్నంలో కుహనా లౌకికవాదులు గీత దాటారు. అలాగే, కొంతవరకు కొన్ని రాజ్యాంగ సంస్థలు, వ్యవస్థలు కూడా మోదీని హిందూ మతోన్మాదిగా చిత్రించే ప్రయత్నం చేశాయి. మోదీ టార్గెట్‌గా రాజకీయ ప్రత్యర్ధులు సాగించిన విష ప్రచారం నిద్రావస్థలో ఉన్న హిందూ జాతీయవాదాన్ని నిద్రలేపి పుణ్యం కట్టుకుంది. అంతవరకు కాంగ్రెస్, కమ్యూ నిస్టు, ప్రాంతీయ కుటుంబ పార్టీలు కప్పుకున్న కుహనా హిందూ వ్యతిరేక లౌకిక వాద ముసుగు తొలిగి పోయింది. హిందూ జాతీయ వాదానిది పైచేయి అయింది. ఆ విధంగా బీజేపీని గెలిపించడంలో హిందూ వ్యతిరేక కుహనా లౌకికవాదులు కూడా కీలక భూమికను పోషించారు. అందుకే ఆ తర్వాత రాహుల్ గాంధీ వేసిన పగటి వేషాలను ప్రజలు విశ్వసించలేదు. ఆయన కాషాయం కట్టినా, కమండలం పట్టినా, గుళలూ, గోపురాల చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆయన్ని చూసి ప్రజలు నవ్వుకున్నారే గాని, నమ్మి ఓట్లు వేయలేదు. కుహనా హిందూ వ్యతిరేక లౌకిక వాద పార్టీలకు 2019లో వరసగా రెండవ సారి శృంగభంగం తప్పలేదు.
ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలలో వచ్చిన మార్పును, ప్రజల ఆలోచనలో వచ్చిన పరివర్తనను పరిశీలిస్తే పార్టీల జెండాలు, అజెండాలు ఏవైనా హిందూ జాతీయ వాదమే జనం జెండా, అజెండాగా మారి పోయింది. భారతీయ జనతా పార్టీని జనం హిందూ జాతీయ వాదానికి ప్రతిరూపంగా చూస్తున్నారు. బీజేపీయేతర పార్టీలు ఇప్పడు అవసరార్థం హిందూ జాతీయ వాదాన్ని తలకెత్తుకున్నా ప్రజలు, ముఖ్యంగా మెజారిటీ హిందూ సమాజం, ఈ పగటి వేషగాళ్ళ కపట నాటకాలను విశ్వసించే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో జరుగుతున్న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలలో బీజీపీ విజయం ఖరారైనట్లే కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో విజయం కంటే, కుహనా లౌకిక వాదం ముగింపునకు చేరుకోవడం మోదీ సారథ్యంలో హిందూ సమాజం సాధించిన చారిత్రక విజయంగానే సమకాలీన చరిత్రకారులు చూస్తున్నారు. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి కుహనా లౌకికవాదానికి కాలం చెల్లిందనే సత్యాన్ని నిరూపించబోతున్నాయన్న విశ్వాసాన్ని విశే్లషకులు వ్యక్తపరుస్తున్నారు.
మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరకొచ్చించి. మరి కొద్ది గంటలలో పోలింగ్ ఘట్టం పూర్తవుతుంది. పోలింగ్ తేదీ దగ్గరవుతున్న కొద్దీ రాజకీయ పార్టీలలో ఉద్రిక్తత, ఉత్కంఠ పెరగడం సహజం. కానీ, మహారాష్ట్ర, హర్యానాలో మాత్రం అలాంటి పరిస్థితి ఉన్నట్లు కనిపించడం లేదు. అందుకు విరుద్ధంగా ఎన్నికల ఫలితాల విషయంలో మరింత స్పష్టత వస్తోంది. మిత్ర పక్షాలు చేదోడుగా నిలిచినా, ఈ రెండు రాష్ట్రాలలోనూ బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీపడుతున్నాయి. చిత్రంగా రెండు రాష్టాలలో పోలింగుకు ముందే బీజేపీ గెలుపు, కాంగ్రెస్ ఓటమి ఖరారైపోయినట్లుగానే, రాజకీయ విశే్లషణలు వినిపిస్తున్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయి కాంగ్రెస్ నాయకులకు కూడా గెలుపు మీద ఆశలు ఉన్నట్లుగా లేవు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం లోక్ సభ ఎన్నికల ప్రచారానికి కొనసాగింపుగా, కాదంటే అంతకంటే దిగదుడుపుగా సాగుతోంది. లోక్‌సభ ఎన్నికలలో ఘోర పరాజయం అనంతరం అధ్యక్ష పదవిని వదులుకుని పలాయనం చిత్తగించిన రాహుల్ గాంధీ మళ్ళీ తెర మీదకు అయితే వచ్చారు గానీ, తీరు మాత్రం మారలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు ఛీ’ కొట్టిన పాత పాటలే పాడుతున్నారు. ప్రజలు విస్పష్టంగా తిరస్కరించిన పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ వ్యతిరేక ప్రచారం, మోదీపై వ్యక్తిగత ఆరోపణలు మినహా కాంగ్రెస్ ప్రచారంలో కొత్తదనం లేదు. రాహుల్ ప్రసంగాలలో లోక్‌సభ ఎన్నికలనాటి ‘జోష్’ కూడా కనిపించలేదు. రెండు రాష్ట్రాలల్లోనూ రాహుల్ ప్రచారం ఎదో మొక్కుబడి తంతుగానే సాగింది. ‘‘పార్టీని గెలిపించాలానే విశ్వాసం ఆయనలో కనిపించేలేదు. రాహుల్ తమను గెలిపించగలరన్న విశ్వాసం పార్టీ అభ్యర్ధులు, కార్యకర్తలలో లేదు. కాంగ్రెస్ ఏదో సాధిస్తుంది అని ఆశించలేం’’ అని ఆ పార్టీ స్థానిక నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నిజానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రచార అస్త్రాలు మాత్రమే కాదు, ప్రచార సారథులు కూడా లేకుండా పోయారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ప్రచారంలో పెద్దగా ఉత్సాహం చూపలేదు. ఆమె ప్రచారంలో పాల్గొన లేదు. ప్రియాంక కూడా ప్రచారానికి దూరంగానే ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకులు కూడా ప్రచారాన్ని అంతగా పట్టించుకోలేదు. ఎటూ ఓటమి తప్పదని నిర్ణయనికి వచ్చినట్లుగా ప్రచారానికి సీనియర్లు దూరంగా ఉన్నారు.
సోనియా గాంధీ హర్యానా ప్రచారానికి ఆదిలోనే అవరోధాలు ఎదుర య్యాయి. మహేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన సభకు ఆమె హాజరు కాలేదు. అనారోగ్యం కారణంగా ఆమె రాలేదని పార్టీ ప్రకటించినా, అసలు కారణం అది కాదు. మహేంద్రనగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి దాన సింగ్ రావ్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయని పేర్కొంటూ, ప్రచారానికి రావద్దని రాష్ట్ర పార్టీలోని ఒక వర్గం ‘హెచ్చరించడం’తో ఆమె ఆఖరి క్షణంలో పర్యటన వాయిదా వేసుకున్నారు. ఆ విధంగా హర్యానాలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రచారం ప్రారంభం కాకుండానే ముగిసిపోయింది.
హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలా ఉంటే, మాజీ ఉప ప్రధాని చౌదరి దేవీలాల్ స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ (ఐఎన్‌ఎల్డీ), మహారాష్టల్రో మరాఠా యోధుడిగా పేరొందిన మాజీ ముఖ్య మంత్రి, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ సారథ్యంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) వంటి ప్రాంతీయ పార్టీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఐఎన్‌ఎల్డీకి ఒకప్పుడు మాజీ ఉప ప్రధాని, రైతు నాయకుడు దేవీలాల్ పార్టీగా మంచి పేరుంది. ఆయన కుమారుడు చౌతాలా సైతం రాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్పారు. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆయన అవినీతి ఆరోపణలపై జైల్లో ఉంటే ఆయన కుమారులు ‘వారసత్వ సంగ్రామం’ లో రెండుగా చీలిపోయారు. ఆ విధంగా ‘ఐఎన్‌ఎల్డీ’ ఓటమిలో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతోంది. మహారాష్టల్రో కాంగ్రెస్, ఎన్సీపీల కూటమి పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకున్న ఎన్సీపీకి ‘సహగమనం’ తప్పేలా లేదు. పవార్ ఫ్యామిలీ పార్టీ ఎన్సీపీలో పెద్ద ఎత్తున పవర్ వార్ సాగుతోంది. పవార్ మేనల్లుడు అజిత్ పవార్, కుమార్తె సుప్రియా సోలెల మధ్య విభేదాలు వారసత్వ హక్కుల పోరాటంగా రూపాంతరం చెందింది. మరో గత్యంతరం లేక సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్ష పదవిని చేపట్టిన విధంగానే శరద్ పవార్ పార్టీ బాధ్యతలను మోస్తున్నారు. వయసు మీద పడినా ‘నేనూ యూత్‌నే’ అని ప్రకటించుకుంటూ పార్టీని బతికించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుటుంబ కలహాలతో పాటుగా బిగుసుకుంటున్న అవినీతి కుంభకోణాల నేపధ్యంలో ఎన్సీపీకి భవిష్యత్ లేదన్న వాస్తవాన్ని గుర్తించిన నాయకులు బీజేపీ, శివ సేన పార్టీలలోకి క్యూ కట్టి వెళ్లి పోతున్నారు.
మహారాష్ట్ర, హర్యానాలలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా- హిందూ జాతీయ వాదాన్ని జీర్ణించుకోలేని రాజకీయ శక్తులు మనుగడ సంక్షోభాన్ని ఎదుర్కుంటున్నాయి. ఎంతో కొంత సైద్ధాంతిక పునాదులున్న వామపక్ష పార్టీలు ఇంచు మించుగా అంతరించి పోయాయి. కాంగ్రెస్ పరిస్థితి సరే సరి. ప్రాంతీయ పార్టీలుగా చెలామణి అవుతున్న కుటుంబ పార్టీలు కుటుంబ కలహాల కారణంగా, అవినీతి, అక్రమాలలో కూరుకుపోయి కనుమరుగయ్యే పరిస్థితి గోచరిస్తోంది. ఉత్తర ప్రదేశ్‌లో ఇటు ఎస్పీలో, అటు బీఎస్పీలో అంతర్గత కుమ్ములాటలు నిత్యాగ్నిహోత్రంలా రగులుతూనే ఉన్నాయి. ఎస్పీలో ములాయం శకం ముగిసిపోయింది. ములాయం మెల్ల మెల్లగా క్రియాశీల రాజకీయాలకు దూరం అవుతున్నారు. మరో వంక వరస ఓటముల నేపథ్యంలో అఖిలేష్ యాదవ్’నాయకత్వం సవాళ్ళను ఎదుర్కొంటోంది. అఖిలేష్ నాయకుడిగా నిలదొక్కుకోలేక పోతున్నారు. పార్టీలోనే కాదు, కుటుంబంలోనూ కలహాలు కదం తొక్కుతున్నాయి. బాబాయి శివపాల్ యాదవ్, అబ్బాయి అఖిలేష్ మధ్య కుటుంబ రాజకీయం రెండుగా చీలిపోయింది. బీఎస్పీలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. పార్టీ మీద మాయావతి పట్టు కోల్పోతున్నారు.
వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే, రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధి నాయకురాలు మమతా బెనర్జీ పరిస్థితి ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దీన స్థితికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది. కేంద్రంతో కయ్యానికి కాలుదువ్వి కష్టాలు కొని తెచ్చుకున్నామని బహిరంగంగా చంద్రబాబు చెంపలు వేసుకున్నారు. మమతా బెనర్జీ కొద్దిగా బెట్టు పోతున్నారు. ఇద్దరిమధ్యా అంతే తేడా. లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 18 స్థానాలు గెలుచుకున్న బీజేపీ వచ్చే సంవత్సరం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పకడ్బందీ వ్యూహంతో కదులుతోంది. పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా బెంగాల్‌లో కాషాయ జెండా ఎగురుతుందని ఖాయంగా చెపుతున్నారు. బెంగాల్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని సంపూర్ణ విశ్వాసం ప్రకటించారు. క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న పరిస్థితులు, మమతా బెనర్జీలో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న కలవరపాటు, ఆమె వేస్తున్న పిల్లి మొగ్గలను గమనిస్తే అంతరించి పోతున్న ప్రాంతీయ పార్టీల జాబితాలో తృణమూల్ కాంగ్రెస కూడా చేరిందని అనుకోవచ్చును. అన్నిటినీ మించి గతంలో వామపక్ష కూటమి ప్రభుత్వం సాగించిన అరాచక పాలననే మమతా బెనర్జీ కొనసాగిస్తున్నారని ప్రజలు ఒక నిశ్చిత అభిప్రాయానికి వచ్చారు.
మమతా బెనర్జీ ప్రభుత్వం ఓ వంక అవినీతి, అక్రమాల కుంభకోణాల్లో మునిగిపోయింది. మరో వంక హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందన్న అభిప్రాయం బలపడుతోంది. ఆర్‌ఎస్‌ఎస్ వంటి హిందూ జాతీయవాద సంస్థల కార్యకర్తలే లక్ష్యంగా కేరళలో వామపక్ష ప్రభుత్వం కంటే అత్యంత కిరాతకంగా సాగుతున్న హత్యా రాజకీయాలను మమతా బెనర్జీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇటీవల ముషీరాబాద్‌లో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త గోపాల్ కుటుంబాన్ని తృణమూల్ కార్యకర్తలుగా అనుమానిస్తున్న గుండాలు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఎనిమిదేళ్ళ గోపాల్ కొడుకును, గర్బవతి అయిన భార్యను కూడా తృణమూల్ గుండాలు హత్య చేశారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతుండడంతో ప్రజలు- అమిత్ షా చెప్పినట్లుగా తృణమూల్ ప్రభుతాన్ని శీఘ్రంగా ఇంటికి పంపించాలనే నిర్ణయానికి వచ్చారు. ఇలా కారణాలు వేరైనా, హిందూ జాతీయవాద శక్తులు ఒకటొకటిగా రాలి పోతున్నాయి. హిందూ వ్యతిరేక కుహనా లౌకిక వాదానికి కాలం చెల్లింది. హిందూ జాతీయవాదమే జనం జెండా, అజెండాగా మారే రోజులు వచ్చాయని అనిపిస్తోంది.

-రాజనాల బాలకృష్ణ 99852 29722