మెయిన్ ఫీచర్

రేస్ మొదలైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి సినిమా మీద ఆడియన్స్‌కి ఎప్పుడూ స్పెషల్ ఫోకస్ ఉంటుంది. రేసులో ఏయే సినిమాలుంటాయన్న విషయంపై అప్‌డేట్ న్యూస్ కోసం ఆడియన్స్ ఆసక్తి చూపటం సహజం. పండుగ స్పెషల్‌గా ఏటా ఒకరిద్దరు పెద్ద హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాగూ పోటీ పడతాయి. కొనే్నళ్లుగా పెద్ద చిత్రాలతో చిన్న సినిమాలూ పండుగ పోటీని ఎదుర్కోవడం మొదలెట్టాయి. పెద్ద సినిమా దారి పెద్ద సినిమాదే. మాదారి మాదేనంటూ మీడియం రేంజ్, చిన్న సినిమాలు సైతం పండగ ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేయడానికి ఆసక్తి చూపించిన సందర్భాలు ఇటీవలి కాలంలో అనేకం. నిజానికి అక్టోబర్ ముగిస్తేకానీ.. పండుగ రేసులో ఫైనల్ ఫైట్‌కు ఏయే సినిమాలు ఉన్నాయన్నది తెలిసేది కాదు. ఈసారి మాత్రం -పెద్ద పండుగను టార్గెట్ చేస్తూ సిద్ధమైన కొన్ని సినిమాలు అటూ ఇటూ జరుగుతుంటే.. సంక్రాంతిని టార్గెట్ చేసి మొదలైన రెండు పెద్ద చిత్రాలు స్లాట్‌లను కన్ఫర్మ్ చేసేశాయి.
ప్రత్యేకతలున్న పెద్ద ప్రాజెక్టులతో మహేష్‌బాబు, అల్లు అర్జున్ ఇప్పటికే రేసులోకి వచ్చేశారు. జనవరి 12న పండుగ సినిమాలుగా -సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో కన్ఫర్మ్ అయిపోయాయి. రెండు నెలలముందే విడుదల తేదీలు ప్రకటించటంతో.. పండుగకు వద్దామనుకున్న సినిమాలు వీలున్న స్లాట్స్ చూసుకుంటున్నాయి. హ్యాట్రిక్ సక్సెస్‌పై ఆశతో అల్లు అర్జున్ -త్రివిక్రమ్ శ్రీనివాస్‌లు అల.. వైకుంఠపురములో చిత్రంతో సంక్రాంతిని టార్గెట్ చేశారు. జవాను పాత్రలో ఆడియన్స్‌ని ఎంటర్‌టైన్ చేసి హిట్టందుకోడానికి మహేష్‌బాబు- అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో వస్తున్నారు. బన్నీ సినిమాకు సీనియర్ హీరోయిన్ టబు ఓ స్పెషల్ అట్రాక్షన్. మహేష్ సినిమాలో ఒకప్పటి లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఓ ప్రత్యేకత. బన్నీతో రెండోసారి పూజాహెగ్దె తెరను పంచుకుంటోంది. మహేష్‌తో తొలిసారి రష్మిక మండన్న కెమిస్ట్రీని పీక్స్‌లో చూపించాలని కష్టపడుతోంది. నాపేరు సూర్యతో సినిమాతో భారీ వైఫల్యాన్ని చవిచూసిన అల్లు అర్జున్ చాలా గ్యాప్ తీసుకుని ఆచితూచి కథను ఎంచుకున్నాడు. పైగా సక్సెస్‌ఫుల్ దర్శకుడు త్రివిక్రమ్‌తో జోడీ కట్టడంతో -అల.. వైకుంఠపురములో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచితే, ‘నీ కాళ్లను పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు’ అంటూ విడుదలైన పాట బన్నీ అభిమానులను ఊపేస్తోంది. పైగా త్రివిక్రమ్ సినిమా అంటే ఆడియన్స్‌లో ప్రత్యేక ఆసక్తి ఉండటం సహజం. దీనికితోడు బన్నీతో రెండు హిట్టు సినిమాలు ఇచ్చి ఉన్నాడు కనుక -హ్యాట్రిక్ సినిమాను ఆషామాషీగా తీసుకోడన్న టాక్ నడుస్తోంది.
మరోపక్క మహేష్ సైతం తన లెక్కలతో తనొస్తున్నాడు. ఈ ఏడాది సంక్రాంతి సినిమాల్లో ఏకైక హిట్టు ఎఫ్-2. దాన్ని తెరకెక్కించింది కుర్ర దర్శకుడు అనిల్ రావిపూడి. వరుస హిట్లుతో ఊపుమీదున్న దర్శకుడితో జర్నీ చేస్తున్నాడు మహేష్. పైగా ఈ ఏడాది మహర్షి హిట్టుతో ఊపుమీదున్నాడు. ఈ సక్సెస్‌ఫుల్ ఈక్వేషన్స్ -మహేష్ సినిమాపైనా అంచనాలు పెంచేశాయి. రెండు ప్రాజెక్టులూ భారీ బ్యానర్లపైనే నిర్మితమవుతున్నాయి. అల.. వైకుంఠపురములో చిత్రాన్ని హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ బ్యానర్ల్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రాన్ని ఏస్ నిర్మాత దిల్‌రాజు సమర్పణలో పెద్ద నిర్మాతలు రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర తీసుకొస్తున్నారు. రెండు ప్రాజెక్టుల్లోనూ భారీ తారాగణం, భారీ సాంకేతికవర్గానికి చోటుదక్కింది. సో, ఎవరి ప్రత్యేకలతో వాళ్లు పండగపై నమ్మకంతో ఒకేరోజున థియేటర్లకు వస్తుండటంతో ఆడియన్స్‌లో అప్పుడే ఆసక్తి మొదలైంది.
హీరో బాలకృష్ణకు సంక్రాంతి ఓ సెంటిమెంట్. ప్రతి పండగకూ ఓ సినిమా ఉండేలా చూసుకుంటాడు. ఈ ఏడాది సంక్రాంతికీ ఎన్టీఆర్ బయోపిక్‌లోని తొలి భాగం ‘కథానాయకుడు’ విడుదలైంది. అయితే అది ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో -వచ్చే సంక్రాంతికి కసితో రావొచ్చన్న అంచనాలు వినిపిస్తూ వచ్చాయి. అందులో భాగంగా కెఎస్ రవికుమార్‌తో చేస్తున్న ‘రూలర్’ సినిమాను సంక్రాంతికి తెచ్చే అవకాశం ఉందంటూ నిన్నటి వరకూ వినిపించింది. తాజా సమాచారం ప్రకారం -పండుగ రేసునుంచి బాలయ్య తప్పుకుంటున్నాడని. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో -ఫెస్టివ్ సీజన్‌కు ముందే ఈ సినిమాను థియేటర్లకు తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. పండుగ రేసులో మహేష్, అల్లు అర్జున్ సినిమాలు ఉండటం, మధ్యలో చిన్నచితకా సినిమాలు సైతం దూరే అవకాశం ఉండటంతో -బాలయ్య కాస్త వెనక్కి తగ్గాడన్న టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ మూడు, నాలుగు వారాల్లోనే సినిమాను థియేటర్లకు తెచ్చే యోచనలో చిత్రబృందం ఉందట. ఆ టైంలో థియేటర్ల కొరత ఉండే అవకాశం ఉండదు కనుక -అప్పుడు సినిమాను తేవడమే మంచిదన్న నిర్ణయానికి నిర్మాత సి కళ్యాణ్ వచ్చాడని వినిపిస్తోంది. ఈ చిత్రంలో బాలయ్యతో సోనాల్ చౌహాన్, వేదిక జోడీ
కడుతున్నారు. బాలకృష్ణకు 105వ ప్రాజెక్టుగా వస్తున్న చిత్రంలో ఆయన గెటప్ ఇప్పటికే హాల్‌చల్ చేస్తోంది. అయితే, అధికారికంగా ఏదోక ప్రకటన వచ్చేవరకూ విడుదల తేదీ ఏమిటన్నది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి.
ఇక సంక్రాంతి రేసులో ఉన్నట్టు వినిపించిన రెండు మూడు మీడియం రేంజ్ సినిమాలు -సీజన్‌కు అటూ ఇటూ సర్దుకున్నాయన్న టాక్ సైతం వినిపిస్తోంది. ముఖ్యంగా సాయితేజ్‌తో మారుతి చేస్తున్న సినిమా -ప్రతిరోజూ పండగే. క్యాచీ టైటిల్, డెత్ సెలబ్రేషన్ కానె్సప్ట్‌తో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కనుక పండుగనే వస్తే బావుంటదన్న ఆలోచనను చిత్రబృందం ముందు చేసింది. పెద్ద సినిమాల విడుదల తేదీలు ఖరారై ప్రకటనలు చేసుకోవడంతో -పోటీకంటే పక్కకు జరగడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఈ సినిమా ఫెస్టివ్ సీజన్‌కు ముందు అంటే డిసెంబర్ 20నే థియేటర్లకు రావొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇక కల్యాణ్‌రామ్‌తో దర్శకుడు సతీష్ వేగెశ్న తెరకెక్కిస్తోన్న చిత్రం -ఎంత మంచివాడవురా. సంప్రదాయ కుటుంబ చిత్రంగా వస్తోన్న ఈ చిత్రాన్నీ పండుగకే తేవాలనుకున్నారు. ఎన్ని పెద్ద చిత్రాలొచ్చినా -సంక్రాంతికే వస్తానంటూ హీరో కల్యాణ్‌రామ్ సైతం చెబుతూ వచ్చాడు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్దుబాటే మంచిదన్న ఆలోచనకు చిత్రబృందం వచ్చినట్టు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ పూరె్తైన తరువాత -్ఫబ్రవరిలో ఈ సినిమా థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపిస్తోంది. ఇక రవితేజ ఎన్నో ఆశలు పెట్టుకున్న డిస్కోరాజా సైతం పండుగ పోటీలో ఉండే అవకాశం లేదు. అలాగే నితిన్‌తో వెంకీ కుడుముల తెరకెక్కిస్తోన్న భీష్మ చిత్రాన్నీ పండుగకు తేవాలనుకున్నా, అంత సాహసం చేయడం లేదని తెలుస్తోంది. ఈ రెండు సినిమాలూ సంక్రాంతి దాటిన తరువాతే రావొచ్చు. అలాగే అఖిల్ చేస్తున్న ప్రాజెక్టు, శేఖర్ కమ్ములతో నాగచైతన్య చేస్తున్న సినిమాలు వాలెంటైన్స్ డేను టార్గెట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఎటోచ్చీ వెంకీ-నాగచైతన్య కాంబినేషన్‌లో వస్తున్న ‘వెంకీమామ’ చిత్రమే ఇంకా ఊగిసలాటలో ఉంది. రియల్ లైఫ్ మామా అల్లుళ్లు రీల్ లైఫ్‌లోనూ అలరిస్తారన్నది -వెంకీ మామ చిత్రంపై ఉన్న అంచనాలు. దర్శకుడు కెఎస్ రవీందర్ (బాబీ) తెరకెక్కిస్తోన్న చిత్రానికి డి సురేష్‌బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలు. గత ఏడాది సంక్రాంతికి ఎఫ్2తో హిట్టందుకున్న వెంకటేష్ ఈసారీ -సంక్రాంతినే టార్గెట్ చేస్తున్నట్టు కథనాలు వినిపించాయ. పండుగ రేసులో పెద్ద సినిమాలు వస్తున్నా -వెంకీ, చైతూ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ సినిమాలకు ఒక రోజు ముందుగానే సినిమాను థియేటర్లకు తెచ్చే ఆలోచన చేస్తున్నారన్నది కథనాల సారాంశం. తాజాగా, మళ్లీ డిసెంబర్ డేట్స్‌కే వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నా.. అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఏ విషయాన్ని తేల్చలేం. ఇప్పటికే దసరా సీజన్ మిస్సయ్యామని ఆలోచిస్తున్న చిత్రబృందం.. విడుదల తేదీ విషయంలో మాత్రం ఆచితూచి అడుగులేస్తోంది. ఇదిలావుంటే, సందట్లో సడేమియా అన్నట్టు -రజనీకాంత్ సినిమా ‘దర్బార్’ సైతం పండుగకే థియేటర్లకు వస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘పేట’ తెచ్చి భారీ సక్సెస్ అందుకున్న రజనీ -ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ సంక్రాంతికే ‘దర్బార్’తో వస్తున్నాడు. రజనీ -మురగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కనుక ఈ సినిమాపైనా భారీ అంచనాలే ఉన్నాయి. పైగా రజనీతో చాలాకాలం తరువాత నయనతార చేస్తున్న చిత్రం కావడంతో -స్ట్రెయిట్ తెలుగు సినిమాలకు గట్టి పోటీ ఇస్తాడనడంలో సందేహం లేదు.
అయితే పెద్ద హీరోల చిత్రాలు ఒకేసారి థియేటర్లకు వస్తే నష్టాలు తప్పే పరిస్థితిలేకున్నా.. ఫెస్టివ్ సీజన్‌కు వదులుకోడానికి సిద్ధంగా లేకపోవడంతో చివరి క్షణంలో విడుదల తేదీలు మారే అవకాశాలూ లేకపోలేదు. పండుగ సీజన్‌లో వచ్చే సినిమాలో -ఎవరు నిలబడతారో.. ఎవరు కిందపడతారో అన్నది మాత్రం ఆసక్తికరంగానే ఉండొచ్చు.