మెయన్ ఫీచర్

సావర్కర్‌కి ‘భారతరత్న’ అంటే ఉలుకెందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్ర సమరంలో సాటిలేని వీరోచిత పో రాటం, త్యాగాలకు ప్రతీకగా నిలిచి, అసమానమైన రీతిలో చిత్రవధలను, కఠి నమైన నిర్బంధాలను ఎదుర్కొన్న వీర సావర్కర్ తాను మృతి చెందిన 53 ఏళ్ళ తర్వాత- ఇప్పుడు మరోమారు రాజకీయ సంచలనం సృష్టిస్తున్నారు. మహా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ ఎన్నికల ప్రణాళికలో సావర్కర్‌కు అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న’ లభించేటట్లు చేస్తామని భాజపా హామీ ఇవ్వడంతో మరోసారి సావర్కర్ వారసత్వం దేశ ప్రజల ముందుకు వచ్చింది. వాస్తవానికి అంతటి మహావీరుడి వారసత్వాన్ని సంకుచితమైన రాజకీయ ప్రయోజనాల కోసం, ఓట్ల రాజకీయాల కోసం వాడుకొనే ప్రయత్నం చేయడం ద్వారా ఒక విధంగా భాజపా నాయకత్వం అపరాధం చేసినట్లు చెప్పవలసిందే. సుదీర్ఘకాలం ప్రజల మనసులలో నెహ్రూ కుటుంబం తప్ప ఇతర జాతీయ వీరులెవరూ లేకుండా చేయడం కోసం విఫల ప్రయత్నం చేస్తూ వస్తున్న కాంగ్రెస్ నాయకత్వానికి సహజంగానే ఇటువంటి ప్రయత్నం ఉలిక్కి పడేటట్లు చేసింది. తామింతకాలం నిర్మించుకున్న అందాల అబద్ధాల మేడ కూలిపోతున్నదని కాంగ్రెస్ భయపడుతున్నట్లున్నది.
సావర్కర్‌కి భారతరత్న’ ఇవ్వాలంటే ఆయనతో పాటు గాడ్సేకు కూడా ఇవ్వమని అవహేళనగా మాట్లాడటం గమనిస్తే భారత దేశ ప్రజలు గర్వించదగిన ఘనమైన తమ వారసత్వాన్ని స్మరించుకొంటుంటే- కాంగ్రెస్ వారెంతగా కంగారు పడుతున్నారో అర్థం అవుతుంది. సావర్కర్ ను ఈ దేశ ప్రజలు మరచిపోయేటట్లు దేశంలో తిరుగులేని రాజకీయ శక్తిగా అధికారం చెలాయించినంతకాలం కాంగ్రెస్‌కి, వారికి ఈ విషయంలో వంతపాడుతున్న వామపక్షాలు ఎంతగా ప్రయత్నం చేసినప్పటికీ సావర్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్న భావజాలం, జాతీయవాదం నేడు మొత్తం భారత దేశం ప్రజలను ఉత్తేజితుల్ని కావిస్తున్నది. అంతేకాదు మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నది.
సావర్కర్‌ను బ్రిటిష్ వారి ఏజెంట్‌గా, స్వతంత్ర పోరాటానికి వెన్నుపోటు పొడిచిన ద్రోహిగా- ఈ దేశంలో మరే మహాపురుషుడిపై వ్యాపింప చేయలేనని ఘోరమైన అసత్యాలను ప్రచారం చేస్తూ వచ్చారు. అయినప్పటికీ ఆయన పేరు చెబితేనే నేటికీ ఎందుకు కొన్ని వర్గాలలో వణుకు పుడుతున్నది? ఎనిమిదేళ్ల వయస్సులోనే తమ కులదైవం దుర్గామాత విగ్రహం ముందు ఈ దేశాన్ని బానిస సంకెళ్ళ నుండి విముక్తి చేస్తానని ప్రతిజ్ఞ చేసిన నిష్కళంక దేశభక్తుడు, నిఖార్సైన జాతీయవాది సావర్కర్. అంతేకాదు ఆయన స్పష్టమైన హేతువాది. ఒక అంతర్జాతీయవాది కూడా.
చరిత్రపై సాధికారితతో కూడిన అవగాహన గల నేత కావడంతో పాటు చరిత్రలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రత్యామ్నాయ పరిష్కారాలను సూచించిన గొప్ప అధ్యాయనశీలి కూడా. ప్రాథమికంగా స్వతంత్ర పోరాడురు. ఆ తర్వాత కూడా షరతులతోనే స్వేచ్ఛ పొందారు. ఆయన స్నేహితులు ఆయనను మృతుంజయుడిగా అభివర్ణిస్తుంటారు. అయితే రాజకీయ ప్రత్యర్థులు మాత్రం వాస్తవాలను కప్పిపుచ్చి ఆయన తనను జైలు నుండి విడుదల చేయమని బ్రిటిష్ వారికి క్షమాపణ లేఖలు రాసినట్టు దుష్ప్రచారం దీర్ఘకాలంగా చేస్తూ వచ్చారు. ఈ మధ్యనే ఆయన జీవితంపై ఇద్దరు ప్రముఖులు- విక్రమ్ సంపత్, వైభవ్ పురంధరే రెండు గ్రంధాలు వ్రాసారు. ఈ గ్రంధాలు రెండు కూడా సుమారు శతాబ్దకాలంగా ఆయనపై సాగిస్తున్న దుష్ప్రచారాలు పచ్చి అబద్ధాలని స్పష్టం చేస్తున్నాయి. ఆయన దేశభక్తిగల ఒక వ్యూహాత్మక నేతగా ఈ గ్రంధాలు వెల్లడి చేస్తున్నాయి.
1913లో క్షమాపణ కోరుతూ సావర్కర్ దరఖాస్తు చేసుకున్నారనే అంశంపై లోతయిన పరిశోధన చేసిన సంపత్ అండమాన్ జైలు పత్రాలను పరిశీలిస్తే కనీసం రెండు సార్లు మాట విననందుకు కఠిన శిక్షకు ఆయన గురయ్యారని తెలుసుకున్నారు. 1913 డిసెంబర్ 16న- జైలు అధికారులు చెప్పిన పని చేయనందుకు నెల రోజులపాటు ఏకాంతవాస జైలు శిక్షకు గురయ్యారు. తిరిగి 1914 జూన్ 8న వారం రోజులపాటు చేతులకు బేడీలతో నిలబడి ఉండే శిక్షను అనుభవించారు. బ్రిటిష్ వారితో కుమ్మక్కయిన వారికి ఇటువంటి కఠిన శిక్షలు పడతాయా? పైగా, 1917లో రాసుకున్న క్షమాపణ దరఖాస్తులో- జైలులో ఉన్న ఖైదీలందరినీ విడుదల చే యమని కోరారు. విడుదల చేసే స్వతంత్ర యోధులలో తన పేరు లేకపోయినా దేశ స్వతంత్రం కోసం తానేమాత్రం బాధపడనని కూడా అందులో స్పష్టంగా పేర్కొన్నారు. దేశ స్వతంత్రం కోసం పోరాడుతున్న విప్లవకారుల పట్ల సావర్కర్ ఎల్లప్పుడూ సానుకూల ధోరణినే ప్రదర్శించారని పురంధరే తన గ్రంధంలో పేర్కొన్నారు. షరతులతో తనను జైలు నుండి బ్రిటిష్ వారు విడుదల చేయడంతో ఎప్పుడైనా తిరిగి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నప్పటికీ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ వంటి విప్లవకారుల గురించి స్ఫూర్తిదాయక వ్యాసాలు రాశారు.
మార్క్సిస్ట్ అనుకూల ఆలోచనాధోరణిలో భగత్ సింగ్ స్థాపించిన రెవల్యూషనరీ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసి యేషన్ సంస్థ ఉన్నప్పటికీ నాడు దేశంలో విప్లవకారులందరికీ ఇతర అంతర్జాతీయ విప్లవకారుల సాహిత్యంతో పాటు సావర్కర్ రాసిన హిందూ పాద్ పాదుషాహి అనే గ్రంథం ప్రధానమైన పఠనాంశంగా స్ఫూర్తి కలిగిస్తూ ఉండేది. ఆ ప్రభావంతోనే భగత్ సింగ్ తన జైలు నోట్‌బుక్‌లో- బలవంతపు మతమార్పిడులకు ప్రతిఘటన గురించి ప్రస్తావించారు. పైగా, ఉరికంబం వద్దకు లౌకిక మార్కిస్టుగా కాకుండా గర్వపడే సిక్కుగా నడిచారు. సావర్కర్ ప్రభావంతోనే జాతీయ ప్రయో జనాలను పణంగా పెట్టే మార్కిస్టు అంతర్జాతీయవాదానికి కొట్టుకు పోకుండా మాతృభూమితో భగత్ సింగ్ ప్రభావితం అయ్యారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన భారత జాతీయ సైన్యం (ఎన్‌ఐఎ)పై కూడా సావర్కర్ విశేషమైన ప్రభావం చూపారు. అయితే ఆయన వహించిన పాత్ర గురించి ఇప్పటికీ స్పష్టంగా తెలియదు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో రాస్ బిహారి బోస్‌తో సావర్కర్ సంబంధాలు కలిగి ఉన్నారని, జాతీయ సైన్యం లో పెద్ద సంఖ్యలో చేరమని యువకులను ప్రోత్స హించారని మాత్రం ఆధారాలు ఉన్నాయి.
అయితే తాను ఆధారపడిన దేశాలు యుద్ధంలో ఏ మేరకు విజయం సాధిస్తాయో? అనే విషయమై తొలినుండి నేతాజీ అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. జర్మనీకి నేతాజీ మద్దతు విషయమై ఆధారమైన బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా- ‘శత్రువుకు శత్రువు మనకు మిత్రు డు’ - అనే విదేశాంగ విధానంతో పాటు ‘బ్రిటిష్ వారి ఇబ్బందులు మనకు అవకాశాలు’ అనే ప్రత్యామ్నాయ విదేశాంగ విధానాన్ని సావర్కర్ ప్రతిపాదించడం గమనార్హం. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్గ్ రూజ్వెల్ట్‌కు పంపిన టెలిగ్రామ్‌లో తమ ఆధీనంలో ఉన్న ప్రజలకు తమ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొనే హక్కును గౌరవిస్తాం... అనే ప్రఖ్యాతి పొందిన అట్లాంటిక్ చార్టర్ హామీ ఇవ్వడాన్ని ప్రస్తావిస్తూ అందులో భారత ప్రజల హక్కులను కూడా జత చేర్చాలని సావర్కర్ స్పష్టం చేశారు. లేని పక్షంలో గతంలో జరిగిన ఆంగ్లో-జర్మన్ యుద్ధం వలే ఇదొక్క యుద్ధపు ఎత్తుగడగా మిగిలి పోతుందని పేర్కొన్నారు.
వివిధ వనరుల నుండి, చివరకు బ్రిటిష్ వారి రికార్డుల నుండి కూడా సేకరించిన ఆధారాలతో బ్రిటిష్ వారు ‘ సిపాయిల తిరుగుబాటు’ అని చులకనచేసి కొట్టిపారవేసిన యుద్దాన్ని ‘మొదటి స్వతంత్ర పోరాటం’ అంటూ సిద్ధాంతకరించి సాధికారికంగా ఒక చారిత్రక గ్రంధం వ్రాసారు. అద్భుతమైన హిందూ, ముస్లింల సంఘీభావాన్ని ఈ గ్రంధంలో సావర్కర్ ప్రస్తావించిన తీరు గమనిస్తే ఆయన ముస్లిం వ్యతిరేకి అంటూ జరిగిన ప్రచారం అసత్యమని స్పష్టం అవుతుంది. అయితే, విదేశీ పాలకుల వలే ముస్లింలు ఇక్కడ నివసిస్తూ ఉంటే వారిని తమ సోదరులుగా పరిగణించలేరని స్పష్టం చేశారు. దేశంలో ముస్లిం పాలన అంతం కావడంతో ఇప్పుడు హిందూ, ముస్లింల మధ్య ద్వేష భావనను గతంగా భావించాలని, వారిద్దరి మధ్య సంబంధం ఇప్పుడు పాలకులు- పాలించేవారి మధ్య, విదేశీ ఆక్రమణ దారులు-స్వదేశీయుల మధ్య ఉండేది కాదని, విభిన్న మతాల మధ్య ఉన్న బంధం సోదరభావం వంటిదని సావర్కర్ పేర్కొనడం గమనార్హం. హిందూ, ముస్లింల పేర్లు వేరయినా వారి తల్లి ఒకటిదే అని, వారిద్దరూ ఒకే తల్లి సంతానం అని కూడా చెప్పారు. ఆయన రచనలను పరిశీలిస్తే సావర్కర్ ముస్లిం వ్యతిరేక భావాలు వ్యాప్తి చేశారనడం కేవలం దుష్ప్రచారమే అని వెల్లడి అవుతుంది.
జీవితం చివరి దశలో వ్రాసిన ‘్భరత చరిత్రలో ఆరు అద్భుతమైన యుగాలు’ అనే గ్రంథంలో హిందూ జాతి చరిత్రలో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఏ విధంగా మనుగడ సాగించి, వికాసం చెందినదో సాధికారికంగా సావర్కర్‌వివరించారు. మనదేశంలో నెలకొన్న కుల వ్యవస్థ, శారీరక కాలుష్యం, ఆహారపు అలవాట్లు వంటి పలు సాంప్రదాయాలు ఈ దేశ సమగ్రతకు అడ్డుగా ఉంటున్నాయని కొట్టిపారవేసారు. అదే విధంగా ముస్లిం సంతృప్తికరణను కూడా డా. బీఆర్ అంబెడ్కర్ వలె తీవ్రంగా ఎండగట్టారు. దేశ సమగ్రతకు అదొక కీలకమైన అవరోధమని స్పష్టం చేశారు. భారత స్వతంత్ర పోరాటంలో మహర్షి అరవింద్ తర్వాత గాంధీజీ మినహాయించి నేతలందరూ విదేశాల నుండి అరువు తెచ్చుకున్న మార్క్సిజం, సోషలిజం దృష్టి కోణంలో చారిత్రక సంఘటనలను అర్థం చేసుకొనే ప్రయత్నం చేయగా, సావర్కర్ మాత్రం భారతీయ ఆధ్యాత్మిక విలువల దృష్టి కోణంలో విశే్లషించారు.
గాంధీజీ వలే సావర్కర్ సహితం మతాన్ని హేతువాద, శాస్ర్తీయ ధోరణిని జోడించి చూసారు. హిందూ మతాన్ని మానవాళికి అందించిన వరం అంటూ చెప్పుకొచ్చారు. అత్యున్నత ఆనందం అందించే హిందూ జాతి కనుగొన్న ఈ సైన్స్ మొత్తం మానవాళికి ప్రయోజనం చేకూర్చడం కోసమే గాని, హిందువులకో, ముస్లింలకో, క్రైస్తవులకో పరిమితం కాదని స్పష్టం చేశారు. విదేశాలలో ఎంతో పేరొందిన మానవతావాదులు సహితం రక్తసంబంధం, జాతిసంబంధ స్వచ్ఛత, ఆధిపత్యాలను కాలదన్నలేని సమయంలోనే 1920 ప్రాంతంలోనే సావర్కర్ ఆ విధానాలను తిరస్కరించిన గొప్ప అంతర్జాతీయ వాది.
1857 పోరాటం తర్వాత బ్రిటిష్ పాలకులు మత విశ్వాసాలతో జోక్యం చేసుకోవడాన్ని మానుకున్నారు. అయితే క్రైస్తవ మిషనరీలు మాత్రం పెద్ద ఎత్తున మత మార్పిడులకు పాల్పడుతూ వచ్చాయ. అండమాన్ జైలులో హిందూ ఖైదీలను ముస్లిం ఉద్యోగులు ఆ విధంగా ప్రలోభాలకు గురిచేసి మతమార్పిడికులకు ప్రోత్సహిస్తూ ఉంటే సావర్కర్ తీవ్రంగా ప్రతిఘటిస్తూ వచ్చారు. అంతే కాదు మతం మారిన వారిని తిరిగి హిందూమతంలోకి మార్చే ప్రయత్నం చేశారు. బ్రిటిష్ వారి ప్రాపకం కోసం ప్రయత్నించేవారు ఆ విధంగా చేయగలరా? ఇతర రాజకీయ ఖైదీలు ఎవరూ మతమార్పిడులను అడ్డుకొనే ప్రయత్నం చేసినవారు కాదు.

-చలసాని నరేంద్ర 98495 69050