మెయన్ ఫీచర్

అణు సిద్ధాంతానికి ఆద్యుడు.. కణాదుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రాచీన భారతీయ వాంఙ్మయాన్ని పరిశీలించిన వారినెవరినైనా సరే- ఎన్నో సిద్ధాంతాలు, అద్భుత విశేషాల ప్రతిపాదనలతో కూడిన మహోజ్వల భారతీయ వైజ్ఞానిక వారసత్వం తప్పక ఆశ్చర్యపరుస్తుంది. మన ఋషులు, తత్త్వవేత్తలు, ఖగోళ శాస్తజ్ఞ్రులు, గణిత శాస్తజ్ఞ్రులు ఇంకా ఎంతోమంది మహనీయులు వివిధ రంగాలలో తమ యోగదానంతో అద్భుత ఆవిష్కరణలు చేశారు. అనేక వినూత్న సిద్ధాంతాలను ప్రతిపాదించారు. దురదృష్టవశాత్తూ ఈ మొత్తం ఘనత నేడు పాశ్చాత్య దేశాల వారికి ఆపాదించబడుతోంది.
అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్తవ్రేత్తగా జాన్ డాల్టన్ (క్రీ.శ. 1766-1844) పేరును ఆధునిక రసాయన శాస్త్రంలో పేర్కొంటారు. కానీ- 2,600 సంవత్సరాలకు పూర్వమే భారతీయ రుషి, తత్త్వవేత్త అయిన కణాద మహర్షి అణు సిద్ధాంత రూపకల్పన చేసాడన్న విషయం మనందరినీ ఆశ్చర్యపరుస్తుంది.
భారతదేశపు అణువిజ్ఞానం అత్యంత ప్రాచీనమైనది. అలనాటి మన ఋషులు పదార్థాన్ని విశే్లషించడంలో ఎంత లోతుకు వెళ్ళారంటే- పదార్థమనేది ఇక విభజించడానికి వీలుకాని అణువుల సముదాయమనీ, ఈ అణువులే విశ్వమంతటా ఆవరించి ఉన్నాయనీ, ఎన్నివిధాలుగా ప్రయత్నించినా ఈ అణువులను విధ్వంసం చేయడం ఎవరితరమూ కాదనీ పేర్కొన్నారు. మన ఋషులు ఈ విషయాన్ని ఒక ఆధ్యాత్మిక భావనగా ప్రస్తావించారు. అయితే విశ్వం గురించి భౌతికపరంగా విశే్లషించేటప్పుడు అణువులు ఒకదానితో మరొకటి ఎలా సంయోగం చెందుతాయన్న విషయాలన్నీ వివరంగా చర్చించిన మొట్టమొదటి వ్యక్తి కణాదుడు.
మనలో కణాదుని గురించి ఎంతమందికి తెలుసు? ఆయన ఒక ఋషి, తత్త్వవేత్త, అన్నింటికీ మించి ఒక విజ్ఞాన శాస్తవ్రేత్త. ఈ అనంత విశ్వం ఆవిర్భావము, వికాసములను వివరించే క్రమంలో ఆయన అణు సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.
కణాద మహర్షి క్రీస్తు పూర్వం 600 సంవత్సరంలో గుజరాత్‌లోని ద్వారకలో జన్మించారు. ఆయన అసలు పేరు కశ్యపుడు. అతడి తండ్రి ఉలూక ముని గొప్ప తత్త్వవేత్త. బాల్యంలోనే కశ్యపుడిలో సేవాభావం తొణికిసలాడేది. చాలా చిన్నచిన్న విషయాలు కూడా అతడి దృష్టిని అపరిమితంగా ఆకర్షించేవి.
కణాదునికి ఆ పేరు రావడం వెనుక ఒక విచిత్రమైన ఉదంతం ఉంది. ఒకసారి అతడు తీర్థయాత్రలకు వెళ్తున్నాడు. గంగానదీ తీరానగల ఆలయాలను దీపాలతో చక్కగా అలంకరించారు. దారులన్నీ పూలతో, బియ్యపు గింజలతో అలంకారంగా నింపేశారు యాత్రీకులు. తీర్థయాత్రకు వచ్చిన యువకుడైన కణాదుడు కిందన ఉన్న బియ్యపు గింజలను ఒక్కొక్కటిగా ఏరుతున్నాడు. అది చూసినవారంతా అతడికి పిచ్చి పట్టిందేమోననుకున్నారు. కానీ అతడు గొప్ప పండితుల కుటుంబానికి చెందినవాడు. వారు అతడిని ‘బియ్యపు గింజలు ఎందుకు ఏరుతున్నావ’ని అడిగారు. అందుకు ఆయన బదులిస్తూ ‘‘నేను ఏరుతున్నది బియ్యపు గింజలుగానే మీకు తోచవచ్చు. కానీ ఇవన్నీ కలిపితే కొందరి ఆకలి తీర్చే అన్నంగా వండవచ్చు. నా దృష్టిలో గొప్ప ధనవంతుని సంపదలకు ఎంత విలువ ఉందో ఈ బియ్యపు గింజలకు కూడా అంతే విలువ ఉంది’’అని అన్నాడు. చాలా చిన్నచిన్న విషయాల పట్ల కూడా అతడికి గల సునిశిత దృష్టిని, ఆసక్తిని తెలుసుకుని అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు. నాటి నుంచి అతడిని అందరూ ‘కణాదుడు’అని పిలవసాగారు. ‘కణము’అంటే అత్యంత సూక్ష్మ పదార్థము అని అర్థం.
తీర్థయాత్రలో రహదారిపై తాను ఏరిన బియ్యపు గింజలను ఇంటికి తీసుకువచ్చాడు కణాదుడు. వాటిని తిరిగి చిన్నచిన్న భాగాలుగా విడగొడుతుండగా చివరికి ఇక విభజించడానికి వీల్లేని బియ్యపు గింజ స్థితి వచ్చింది. అప్పుడే అతడి మెదడులో ‘అణువు-పరమాణువు’ సిద్ధాంతం మెదిలింది.
ప్రపంచంలో అణువుల గురించి, కణాల గురించి వివరించిన మొట్టమొదటి వ్యక్తి కణాదుడు. పరమాణువు అన్నది విభజించడానికి వీలులేని అత్యంత సూక్ష్మ పదార్థమని మొదటగా చెప్పినది కణాదుడే. ఒక పదార్థాన్ని విభజించుకుంటూ పోయినప్పుడు ఒక దశలో ఇక విభజించడానికి వీల్లేని స్థితి వస్తుంది. ఆ దశలో విభజించడానికి వీలుకాని పదార్థమే పరమాణువు. ఈ అతి సూక్ష్మ పదార్థమైన పరమాణువు మానవుని కళ్ళకు గోచరము కాదని కణాదుడు వివరించాడు.
పరమాణువులను ఒకదానికొకటి సంయోగం చెందించవచ్చనీ, సమాన లక్షణాలు కలిగిన పరమాణువులను రెండింటిని కలిపితే ‘ద్వ్యణుక’ అవుతుందనీ, మూడింటిని కలిపితే ‘త్య్రణుక’అవుతుందనీ కణాదుడు చెప్పాడు. పరమాణువుల సంయోగం సరిక్రొత్త రసాయనిక చర్యలకు దారితీస్తుందని కూడా కణాదుడు చెప్పాడు. కంటికి కనపడని పరమాణువుల కలయిక వల్లనే మనం చూడగలిగే పదార్థాలు ఏర్పడుతున్నాయని కణాదుడు అన్నాడు.
తత్త్వశాస్త్రానికి సంబంధించి వైశేషిక విద్యాలయాన్ని స్థాపించాడు కణాదుడు. పరమాణువుల గురించి, విశ్వం లక్షణాలను గురించి తన ఆలోచనలను విద్యార్థులకు బోధించేవాడు. కణాదుడు ‘వైశేషిక దర్శనం’అనే గ్రంథాన్ని రచించాడు. ప్రజలు ఆయనని అణుశాస్త్ర పితామహునిగా గౌరవిస్తూ ‘ఆచార్య’ అని పిలిచేవారు.
ఏ పదార్థమైనాసరే అది పరమాణువుల సముదాయమే అన్న ఆలోచన బౌద్ధుల, జైనుల వాంఙ్మయంలో కూడా కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 5,4 శతాబ్దాలకు చెందిన, గౌతమబుద్ధుని సమకాలీనుడు అయిన మరొక తత్త్వవేత్త పాదుక కాత్యాయన కూడా పరమాణు నిర్మాణాన్ని గురించి కొన్ని సిద్ధాంతాలను ప్రతిపాదించాడు.
ప్రాచీన భారతీయ వైదిక తత్త్వ చింతనలో ఆరు ప్రధాన అంగాలున్నాయి. అవి: న్యాయ, సాంఖ్య, యోగ, మీమాంస, వైశేషిక, వేదాంతములు. వీటిని దర్శనములుగా పేర్కొంటారు. వీటిలో వైశేషిక దర్శనాన్ని అందించినవాడు కణాదుడు.
కణాదుని వైశేషిక దర్శనము అణు సిద్ధాంత ప్రతిపాదన ద్వారా సృష్టి ఆవిర్భావము, అస్తిత్వము, వికాసముల గురించి వివరిస్తుంది. ‘‘తర్కము-వాస్తవిక విశే్లషణ’’ పద్ధతిలో ఇక్కడ సిద్ధాంత ప్రతిపాదన జరుగుతుంది. మానవజాతి చరిత్రలో అస్తిత్వ శాస్త్రానికి పునాదులు కణాదుని వైశేషిక దర్శనంలోనే ఉన్నాయని చాలా తక్కువ మందికి తెలుసు. పదార్థ అణు సిద్ధాంతం గురించిన తన వివరణలను కణాదుడు ‘‘వైశేషిక సూత్ర’’అన్న సంస్కృత గ్రంథంలో పొందుపరిచాడు. ఈ గ్రంథమునే ‘‘కణాద సూత్రాలు’’అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ గ్రంథము ఆధ్యాత్మిక, తాత్త్విక, శాస్ర్తియ విషయముల మిశ్రమం.
కణాద మహర్షి పదార్థాన్ని గురించి ఆరు లక్షణాలను ప్రతిపాదించాడు. అవి ద్రియము (ప్రధానమైనది), గుణము, చలనము, వైశ్వికము, విశేషము, సమావయము (వారసత్వం). ఈ విశ్వములో దేని గురించైనా పరిపూర్ణంగా తెలుసుకోవాలంటే ఈ ఆరు లక్షణాలను అధ్యయనం చేస్తే చాలు.
కణాదుని అణు సిద్ధాంతం ఇలా చెబుతోంది...
1. ఈ విశ్వంలోని ప్రతిదీ విభజింపబడుతుంది. ఈ విభజింపబడడం అనేది పరమాణు స్థాయి వరకు కొనసాగుతుంది.
2. పరమాణువు అన్నింటికన్నా సూక్ష్మమైనది. కంటికి కనబడనిది.
3. పరమాణువును విభజించలేము.
4. పరమాణువు శాశ్వత అస్థిత్వము కలది. విధ్వంసము చేయబడనిది.
5. భౌతిక తత్వం అస్తిత్వానికి పరమాణువే మూలము.
6. పరమాణువుకు ప్రత్యేకమైన లక్షణము, గుర్తింపు ఉంటాయి.
7. ఒక పరమాణువు లక్షణాలు, దాని మూలకము లక్షణాలు ఒకటే.
8. కొన్నిరకాల ఉష్ణ ప్రక్రియలను ఉపయోగించి అణువులను సంయోగం చేయవచ్చు. ఇది కొన్నిరకాల రసాయనిక చర్యలకు కారణవౌతుంది.
9. పరమాణువుకు రెండు స్థితులు ఉంటాయి. అవి- చలనస్థితి, అచలస్థితి.
డాల్టన్ అణు సిద్ధాంతం ఇలా పేర్కొంటోంది...
1. అన్ని పదార్థాలూ అతి సూక్ష్మమైన పరమాణువుల సంయోగం చేతనే ఏర్పడ్డాయి.
2. పరమాణువును విభజించలేం.
3. పరమాణువువిధ్వంసం కానిది.
4. ఒక పదార్థానికి చెందిన పరమాణువులన్నీ సమాన భారాన్నీ, లక్షణాలను కలిగి ఉంటాయి.
5. రెండు లేక అంతకన్న ఎక్కువ పరమాణువుల సంయోగంతో ఒక కొత్త పదార్థం ఏర్పడుతుంది.
6. రసాయనిక చర్య అంటే పరమాణువులలో సంభవించే మార్పే.
క్రీ.శ.18-19 శతాబ్దాలలో డాల్టన్ తన రసాయనిక పరిశోధనల ద్వారా అణువుల గురించి దేనిని ప్రతిపాదించాడో అదే క్రీ.పూ. 6వ శతాబ్దానికి చెందిన కణాదుడు ప్రతిపాదించాడు. ఎటొచ్చీ కణాదుడు ఆ విషయాలను తాత్త్విక దృష్టితో వివరించాడు.
గ్రీకులు, రోమనుల కన్నా శతాబ్దాలకు పూర్వమే భారతదేశంలో అణు విజ్ఞానశాస్త్రం రూపుదిద్దుకుంది. మన దేశంపై అలెగ్జాండర్ దండయాత్ర చేసిన సమయంలో అణు విజ్ఞానశాస్త్రం ఐరోపా దేశాలకు చేరింది. గ్రీకులు భారతదేశంలో క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలోనే అడుగుపెట్టారు. దీనినిబట్టి గ్రీకు అణువిజ్ఞానాన్ని భారతదేశం నుండే పొందారని అవగతమవుతుంది. గ్రీకు తత్త్వవేత్తలైన ల్యూసిపస్, డెమోక్రిటస్ అణు సిద్ధాంతం గురించి చేసిన వివరణలను అనుసరించి డాల్టన్ అణు సిద్ధాంత రూపకల్పన చేశాడు. కాని కణాద మహర్షి అందించిన అణు సిద్ధాంతం ఇంతకన్నా ఎంతో మేలైనది.

-ప్రొ. దుగ్గిరాల రాజకిశోర్ 80082 64690