మెయన్ ఫీచర్

ఎంతమంది పోర్‌బందర్ వెళ్లారు..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతిపిత మహాత్మా గాంధీని సొంతం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు పోటీపడుతున్న తీరు గాంధేయవాదులకు సంతోషం కలిగిస్తుంది. గాంధీజీ 150 జయంతి సందర్భంగా అధికార, విపక్ష పార్టీలు పోటాపోటీగా పలు కార్యక్రమాలు నిర్వహించాయి. అందుకే గాంధీ అందరివాడు. ప్రపంచంలోని అన్ని దేశాలు, జాతులు, వర్గాలు గాంధీని సొంతం చేసుకున్నాయి. ప్రజాస్వామ్యం, సత్యం, అహింస, సత్యాగ్రహం పట్ల నమ్మకం ఉన్న ప్రతి పౌరుడూ గాంధీ ఆశయాలకు ఆకర్షితులవుతాడు. భారత్‌కు జాతిపిత అయినందున ప్రతి భారతీయుడికి గాంధేయవాదంపై మాట్లాడే హక్కు ఉంటుంది. ఏటేటా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. పల్లె నుంచి ఢిల్లీ వరకూ గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నాం.
గాంధీ తన జీవిత కాలంలో సర్వోదయ, సామాజిక, రాజకీయ నాయకుడిగా చెరగని ముద్ర వేశారు. మరణించిన తర్వాత జాతిపిత అయ్యారు. ప్రపంచంలో గాంధీ అంతటి మహత్తర శక్తి ఉన్న నేత మరొకరు లేరని చెప్పవచ్చు. స్వాతంత్య్ర ఉద్యమాన్ని నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీని ఆయన వేదికగా చేసుకున్నారు. గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయలేదు. తను ఆలోచనలను, ఆశయాలను ఆచరించి చూపిన మహనీయుడు. భారత స్వాతంత్య్ర ఉద్యమం అంతా మహాత్మాగాంధీ కేంద్రంగా తిరుగుతుంటుంది. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్య్రానికి పూర్వం గాంధీతో పాటు మితవాదులు, అతివాదులు, జాతీయవాదులు, తీవ్ర జాతీయ వాదులకు నిలయం. సిద్ధాంత రీత్యా విభేదించినా అందరి లక్ష్యం భారతదేశాన్ని బ్రిటిష్ కబంధ హస్తాల నుంచి విముక్తి చేయడమే.
గాంధీ 150వ జయంతి సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీపడ్డాయని చెప్పవచ్చు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సమయంలో బీజేపీ లేదు. కాంగ్రెస్‌లోనే జాతీయవాదంలో తీవ్రవాద స్వభావం ఉన్న నేతలకు కొదవలేదు. కాలక్రమంలో గాంధీ జయంతి ఒక తంతుగా మారింది. గాంధీ జయంతి అంటే మద్యం షాపులకు, మాంసాహార దుకాణాలను మూసివేస్తారు. జాతీయ సెలవుదినం గనుక ఆ రోజు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు మూసివేస్తారనే విషయం మాత్రమే ఈ రోజుల్లో యువకులకు తెలుసు. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్చ్ భారత్ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. 2014 ఆగస్టు 15వ తేదీన గాంధీ ఆకాంక్షలకు అనుగుణంగా స్వచ్చ్ భారత్ అభియాన్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఇపుడు ఆ నినాదం ఉద్యమంగా మారింది. అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ కూడా దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఉపాధి కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేసింది. ఈ కార్యక్రమాన్ని రద్దు చేసే సాహసం ఏ ప్రభుత్వం చేయలేదు.
మహాత్మాగాంధీ జయంతి వేడుకలను నిర్వహించిన తీరు చూసి కచ్చితంగా గాంధేయవాదులు ఆశ్చర్యం చెందుతున్నారు. గాంధీ పేరుతో జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబంలో ఇందిరాగాంధీ 16 ఏళ్ల పాటు, రాజీవ్ గాంధీ ఐదేళ్ల పాటు ప్రధానమంత్రి పదవిలో రాణించారు. సోనియాగాంధీ పదేళ్లపాటు యూపీఏ చైర్‌పర్సన్‌గా ఉండి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపారు. బీజేపీ, కాంగ్రెస్‌లు పరస్పరం చేసుకునే విమర్శలు ఎలా ఉన్నా, మహాత్మాగాంధీ చరిత్రను యువకులు తప్పనిసరిగా అధ్యయనం చేయాలి. యూ ట్యూబ్‌లో గాంధీ జీవితంలోని కీలక ఘట్టాలను చూడవచ్చు. సత్యమేవ జయతే అంటే ఏమిటో గాంధీజీ ఆచరించి చూపించారు. గాంధీ జన్మస్థలం పోర్‌బందర్‌ను ఒక పవిత్రమైన యాత్రా స్థలంగా తీర్చిదిద్దడంలో దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ విఫలమైంది. సిద్ధాంతపరంగా గాంధేయవాదంతో అనేక అంశాల్లో పొసగకపోయినా, గాంధీ ద్వారా తనను తాను బలంగా మార్కెటింగ్ చేసుకోవడంలో బీజేపీ ముందు అన్ని పార్టీల తీరు బలాదూర్ అని చెప్పవచ్చు. అందులో గుజరాత్ వాసులైన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షాలు గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన తీరు, జనంలోకి గాంధీయవాదాన్ని ప్రచారం చేసేందుకు ఎన్నుకున్న విధానం అమోఘమైంది. ప్రతి బీజేపీ ఎంపీ తన నియోజకవర్గం పరిధిలో 150 కి.మీ సంకల్ప్‌యాత్రను చేపట్టారు.
ప్రతి భారతీయుడు తన జీవితకాలంలో తప్పనిసరిగా సందర్శించాల్సిన పట్టణం పోర్‌బందర్. మహాత్మాగాంధీ జన్మించిన ఇంటిని చూసి, అక్కడ కొంత సేపు గడిపితే చాలు పునీతమవుతాం. గాంధీ ఇంటి చుట్టూ సాధారణ వాతావరణమే ఉంటుంది. ప్రతి రోజూ దేశం నలుమూలల నుంచి గాంధీ ఇంటిని చూసేందుకు ఎంతోమంది ఆసక్తిగా వస్తుంటారు. అహ్మదాబాద్‌లో సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించాలి. దురదృష్టమేమిటంటే మనం అనేక పుణ్య క్షేత్రాలకు, పవిత్ర మందిరాలకు, స్వాముల ఆశ్రమాలకు, విదేశాల్లోని పవిత్రస్థలాలకు లక్షల రూపాయలు కుమ్మరించి వెళుతుంటాం. పోర్‌బందర్‌కు ఎంత మంది వెళ్లారంటే సరైన సమాధానం ఉండదు. మన ప్రజాప్రతినిధులు, మంత్రులు,ముఖ్యమంత్రులు, ఉన్నతకాధికారులు ఎంత మంది పోర్‌బందర్‌కు వెళ్లారో గుండె మీద చేయి వేసుకుని చెప్పగలరా? గాంధీ జన్మస్థలం పోరుబందర్‌కు వెళ్లినంత మాత్రాన గాంధేయవాదులుగా మారాలనే నిబంధన ఏమీ లేదు. మన జాతిపిత జన్మస్ధలం, సబర్మతి ఆశ్రమం, మహారాష్టల్రోని వార్ధా ఆశ్రమం ఇవన్నీ చూస్తే కచ్చితంగా మనలో దుర్గుణాలు పూర్తిగా కాకపోయినా, కొంతమేరకు తగ్గుతాయని చెప్పవచ్చు. వీటిని చూసే ఓపిక లేకపోతే కనీసం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న సీతానగరం గౌతమీ సత్యాగ్రహాశ్రమాన్ని సందర్శించినా చాలు.
19, 20 శతాబ్దాల్లో మన మధ్యనే ఉంటూ రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మహాత్మాగాంధీ అసలు సిసలైన హిందువు. గాంధీజీ వాస్తవవాది. మహాత్మాగాంధీ నిజంగా కనిపించే దేవుడు. దాపరికం లేకుండా అన్ని విషయాలను ఆత్మకథలో రాశారు. గాంధీజీ తన జీవిత కాలంలో పెద్దగా దేవాలయాలు, ప్రార్థనామందిరాల చుట్టూ తిరగలేదు. ఆయన మతగ్రంథాల పఠనానికి ప్రాధాన్యత ఇచ్చారు. భగవద్గీతలో శ్రీకృష్ణ్భగవానుడు చెప్పిన కర్మ సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన మహనుభావుడు. గాంధీజీని వ్యక్తిగతంగా ఆయన సమకాలీనులు ద్వేషించలేదు. గాంధీజీ సిద్ధాంతాలతో మాత్రమే సుభాష్ చంద్రబోస్, వీర సావర్కర్ తదితరులు విభేదించారు.
గాంధీజీకి, ఆంధ్రప్రదేశ్‌కు గట్టి అనుబంధం ఉంది. గాంధీజీ నడిపన మహా ఉద్యమం సందర్భంగా 1921లో ఆంధ్ర రాష్ట్రంలో 300 మంది జైళ్లపాలయ్యారు. చౌరీచౌరా ఘటనలో గాంధీజీకి ఆరేళ్ల జైలు శిక్షపడింది. స్వాతంత్య్ర ఉద్యమం, గాంధేయవాదం చల్లారకుండా ఉండేందుకు సరిగ్గా 97 ఏళ్ల క్రితం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి 30 కి.మీ దూరంలో గోదావరి నదీ తీరాన డాక్టర్ బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం అనే స్వాతంత్య్ర సమరయోధుడు గౌతమీ సత్యాగ్రహాశ్రమాన్ని స్ధాపించారు. భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో సీతానగరం ఆశ్రమం నిర్వహించిన పాత్ర అద్వితీయం. గోదావరి నదీ తీరాన ఆశ్రమం ఏర్పాటుకు 14 ఎకరాలను ఆ రోజుల్లో మూడు వేల రూపాయలకు కొనుగోలు చేశారు. సేట్ జీవన్‌లాల్ ఆశ్రమానికి పది వేల రూపాయలు విరాళంగా ఇవ్వడమే కాకుండా ఏటా 2,500 రూపాయలు ఇచ్చేవారు. మహర్షి బులుసు సాంబమూర్తి ఆశ్రమం ట్రస్టీగా ఉన్నారు. గ్రామ పునరుద్ధరణ, నూలు వడకడం, పర్యావరణ పరిరక్షణ ఆశయాలతో ఎంతోమంది ఆశ్రమంలో చేరారు.
1929 మే 9,10 తేదీల్లో గాంధీ ఈ ఆశ్రమానికి వచ్చారు. రాజమహేంద్రవరం నుంచి లాంచీలో గాంధీజీ, కస్తూరిబా సీతానగరం వచ్చారు. గాంధీజీని చూసేందుకు రోజుకు 60 వేల మంది జనం వచ్చారు. ఈ ఆశ్రమ ఔన్నత్యంపై యంగ్ ఇండియా పత్రికల్లో గాంధీజీ గొప్పగా రాశారు. 1933లో గాంధీజీ రెండవసారి ఈ ఆశ్రమానికి వచ్చారు. 1932 జనవరి 7వ తేదీన ఆనాటి పోలీసులు సీతానగరం ఆశ్రమంపై దాడి చేశారు. కాని స్వాతంత్య్ర స్ఫూర్తిని ఆనాటి వీరులు విడవలేదు. క్రొవ్విడి లింగరాజు, బులుసు సాంబమూర్తి, మద్దూరి అన్న పూర్ణయ్య, శ్రీరామచంద్రుని వెంకటప్పయ్య, ధరణీప్రగడ శేషగిరి రావు, దుర్గాబాయి దేశ్‌ముఖ్, డాక్టర్ కేఎల్ నరసింహారావు, బారు రాజారావు, గరిమెళ్ల సత్యనారాయణ, డాక్టర్ ఏబీ నాగేశ్వరరావు, పాలకోడేటి గురుమూర్తి, తల్లాప్రగడ ప్రకాశరాయుడు ఇంకా ఎంతో మంది మహానుభావులు ఈ ఆశ్రమంలో ఉన్నారు. ఈ ఆశ్రమాన్ని పలుసార్లు సందర్శించి గాంధీజీ జ్ఞాపకాలను, ఆశ్రమ వైభవాన్ని పరిరక్షించేందుకు మంతెన వెంకట సుబ్బరాజు చేసిన కృషి నిరుపమానం. ఆయన ఐదుసార్లు చట్టసభలకు ఎన్నికయ్యారు. డాక్టర్ నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి లాంటి రాజకీయ దురంధురులను సీతానగరం ఆశ్రమానికి తెచ్చి మహాత్మాగాంధీ ఆశయాలను యువతరానికి చాటిచెప్పేందుకు పాటుపడ్డారు.
మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీతానగరం ఆశ్రమానికి పూర్వ వైభవం తెచ్చేందుకు తమ వంతు కృషి చేయాలి. పోర్‌బందర్ వెళ్లలేనివారు సీతానగరం ఆశ్రమానికి వెళ్లినా చాలు. గ్రామస్వరాజ్యం గురించి కలలు కన్న గాంధీజీ ఆశయాల సాధనకు ప్రతి సర్పంచ్ ఈ ఆశ్రమాన్ని సందర్శించడం అవసరం. మంత్రులు, ప్రజాప్రతినిధులు కదలాలి. విద్యార్థులు తప్పనిసరిగా ఈ ఆశ్రమాన్ని చూసి అలనాటి మహనీయులు చేసిన పోరాటాలను స్మరించుకోవాలి. మహాత్మాగాంధీ జయంతి 150 జయంతి సందర్భంగా ఆర్భాటంగా శిలా విగ్రహాలను ఆవిష్కరించినంత మాత్రాన సరిపోదు. అలనాడు గాంధీజీ మన ప్రాంతాలకు వచ్చినప్పుడు ఎక్కడ నివసించారు? ఆనాడు గాంధీ ఉపన్యాసాలు, ముచ్చట్లపై పాఠశాలలు, కాలేజీల్లో చర్చ జరగాలి. హైదరాబాద్‌తో మహాత్మాగాంధీకి ఉన్న అనుబంధం గొప్పది. గాంధేయవాదంతో అందరూ నూటికి నూరుపాళ్లు ఏకీభవించకపోవచ్చు. కాని ప్రపంచమంతా గాంధీ గొప్పతనం గురించి మాట్లాడుతోంది. మనం మాత్రం గాంధీ నివసించిన ప్రదేశాలు, ఉపన్యాసాలను పట్టించుకోవడం లేదు. గాంధేయవాదంపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే బదులు గాంధీ జన్మస్ధలం, నడయాడిన ప్రదేశాలను సందర్శించడంపై ప్రభుత్వం ప్రోత్సాహక యాత్రలను చేపట్టాలి. ఈ రోజు కొన్ని మతాల వారికి పార్థనా స్థలాల సందర్శనకు సబ్సిడీలు ఇస్తున్నారు. ఈ పద్ధతిని రద్దు చేసి గాంధీ సందర్శన యాత్రలను ప్రభుత్వం నిర్వహించాలి. ఆధునిక సమాజంలో అన్ని రకాల సామాజిక, మానసిక అశాంతులకు విరుగుడు గాంధేయవాదమే పరిష్కారం.

-కె.విజయ శైలేంద్ర 98499 98097