మెయన్ ఫీచర్

రుణమాఫీ.. రణఘోష..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్షేమం పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అంతకు ముందు ఎన్టీఆర్, ఆయన కంటే ముందు ఆ తర్వాత కాంగ్రెస్, తెలుగు దేశం ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేశాయి. ఎన్టీఆర్ ప్రవేశ పెట్టిన కిలో రెండు రూపాయల బియ్యం పథకాన్ని ఆ తర్వాత- చంద్రబాబు కూడా అమలు చేశారు. ఆయన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు దీన్ని అమలు చేశాయి. పథకాలు పేర్లు మార్చుకున్నా పేదలకు సబ్సిడీ బియ్యం అయితే ఇప్పటికీ అందుతూనే ఉన్నాయి. వైఎస్ ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయం బర్స్‌మెంటు, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలు రాష్ట్రం విడిపోయినా, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అమలవుతూనే ఉన్నాయి. కానీ, మాట తప్పని,మడమ తిప్పని వంశంలో పుట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం రైతు రుణ మాఫీ విషయంలో మడమ మాత్రమే కాదు మొత్తంగా శరీరానే్న వెనక్కి తిప్పేశారు.
నిజానికి రైతుల సమస్యలకు రుణ మాఫీ పరిష్కారం కాదు. ఆర్థిక వేత్తలు అందరిదీ ఇదే మాట. రాజకీయ పార్టీలు కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూనే ఉంటాయి. అయినా, ఎన్నికలకు ముందు అన్ని రాజకీయ పార్టీలు రైతు రుణ మాఫీ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత, సవాలక్ష సాకులు చూపి రైతులను మోసం చేస్తూనే ఉన్నాయి. ఏపీ విషయానే్న తీసుకుంటే 2014 ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు రైతు రుణ మాఫీ పైనే తొలి సంతకం అన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రుణ మాఫీ అమలు చేస్తామని వాగ్దానం చేశారు. రుణాలు చెల్లించవద్దని రైతులకు పిలుపు నిచ్చారు. అయితే, అధికారంలోకి వచ్చాక ప్రజల ముందు శే్వత పత్రాలు పెట్టి, కోటయ్య కమిటీతో తొలి సంతకానికి తూట్లు పొడిచారు. కాగల కార్యం కోటయ్య చేత కానిచ్చారు. మొత్తం రూ.87,612 కోట్లుగా ఉన్న మాఫీ చేయవలసిన రుణాలను వడపోసి, రూ. 24,500 కోట్లకు కుదించారు. అందులోనే రూ.7500 కోట్లు ఇంకా చెల్లించవలసి వుంది. ఇప్పుడు ఈ మొత్తం చుట్టూనే వివాదం తిరుగుతోంది.
2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ రైతు రుణ మాఫీతో పాటుగా ఇంకా చాలా చాలా ఉచిత వరాలను ప్రకటించింది. డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామని, ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి ఇస్తామని అనేక ఉచితాలను ఓటరుకు ఎరగా వేసింది. ఆ ఉచిత వరాలు మరీ ముఖ్యంగా రుణ మాఫీ మంత్రం ఓటర్లపై బాగా పని చేసింది. ఆ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీని గెలిపించింది. అప్పట్లో వైసీపీ రుణమాఫీ సాధ్యం కాదని తెగేసి చెప్పింది. 2004లో ఉచిత విద్యుత్ అసాధ్యం, ఉచిత విద్యుత్ ఇస్తే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవలసిందే అని చంద్రబాబు స్పష్టం చేశారో, 2014లో జగన్ మోహన్ రెడ్డి రుణ మాఫీ విషయంలో అంతే క్లియర్ స్టాండ్ తీసుకున్నారు. 2004లో ఉచిత ‘విద్యుత్ షాక్’కు చంద్రబాబు ఓడిపోయారు, 2014 రుణ మాఫీ దెబ్బకు జగన్ ఓడిపోయారు. అందుకే, 2019 కి వచ్చే సరికి వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ‘నవరత్నాల’ పేరిట తొమ్మిది ఉచిత వరాల ‘జంబో ప్యాక్’ ను ప్రజల ముందుంచి ఎన్నికల బరిలో గెలిచారు. అయితే, ఆ నవరత్నాలలో రుణమాఫీ రత్నం లేదు. గత ప్రభుత్వ హయాంల ప్రారంభమైన పథకాన్ని కాదనడం కుదరదు కాబట్టి, ప్రభుత్వాలు మారినా పథకాలు, ముఖ్యంగా ఒక ప్రభుత్వం ప్రారంభించి మిగిల్చిన బకాయిలను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చెల్లించడం ఇక్కడే కాదు, ఎక్కడైనా ఉన్నదే. అలా కాదని ప్రభుత్వాలు మారినప్పుడల్లా కొత్త ప్రభుత్వం పాత పథకాలను రద్దు చేసుకుంటూ పోతే, ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా ప్రగతి ప్రస్థానం ఆగిపోతుంది. ముఖ్యమంత్రులు, మంత్రులు వస్తుంటారు పోతుంటారు. కానీ, ప్రభుత్వం నిరంతరంగా కొనసాగుతుందని రాజ్యాంగం నిర్దేశించింది. ప్రభుత్వం అనేది ఒక నిరంతర ప్రక్రియ కాబట్టి, గత ప్రభుత్వం రైతులకు బకాయి పడ్డ మాఫీ మొత్తాలను చెల్లించవలసిన నైతిక బాధ్యత ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్ మీద ఉంది. ఇందులో మరో అభిప్రాయానికి తావు లేదు.
రైతు రుణ మాఫీకి సంబంధించి వౌలిక ప్రశ్నలు చాలానే ఉన్నాయి. ఈ విషయమై ఇటు ఆర్థిక వేత్తల్లో, అటు రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. రైతు రుణమాఫీ ఎవరికోసం?వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు రుణమాఫీ పరిష్కారం చూపుతుందా? వ్యవసాయ రంగం సమస్యలకు రుణ మాఫీ పరిష్కారం కాదని గత అనుభవాలు స్పష్టం చేస్తున్నాయి. 2008లో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో రుణ మాఫీ అమలు చేసిన నేపథ్యంలో భారతీయ రిజర్వు బ్యాంకు రైతు రుణ మాఫీని చెల్లని నోటుగా పేర్కొంది. ‘‘2008 లో కేంద్ర ప్రభుత్వం, ఆతర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన రుణ మాఫీ వలన రైతు కుటుంబాల రుణ భారం తాత్కాలికంగా తగ్గిందే గానీ, వ్యసాయ పెట్టుబడులు ,కుటుంబ ఆదాయం పెరగలేదు. రైతులు, రైతు కుటుంబాలకు అప్పులు, వడ్డీల చక్రబంధం నుంచి విముక్తి లభించలేదు’’ అని రిజర్వు బ్యాంకు పేర్కొంది. ‘‘రుణ మాఫీ వలన ప్రభుత్వాలపై ఆర్థిక వత్తిడి పెరుగుతోంది.ప్రభుత్వాల మూలా ధన వ్యయం తగ్గుతోంది. రుణ మాఫీతో పాటుగా సంక్షేమం గీత దాటి రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ఉచిత వరాల వలన ప్రభుత్వాలు ఆర్థిక క్రమ శిక్షణ తప్పుతోంద’’ని కూడా రిజర్వు బ్యాంకు నివేదికలో పేర్కొంది. రాజకీయ పార్టీలు కూడా ఓ వంక రుణ మాఫీ రైతు సమస్యలకు పరిష్కారం కాదని ప్రకటిస్తూనే ఉన్నాయి, మరో వంక పోటీలు పడి రైతు రుణ మాఫీని పెంచుకుంటూ పోతూనే ఉన్నాయి.
గత సంవత్సరం జరిగిన తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష రూపాయల రుణ మాఫీ ప్రకటిస్తే, కాంగ్రెస్ సారథ్యంలోని మహా కూటమి తాము అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించిది. రైతులను రుణ విముక్తులను చేస్తామంటే కాదనేది ఏముంది? కానీ, రైతు రుణ మాఫీతో ఓట్ల పంట పండినంతగా రైతుల బాధలు తీరడం లేదు. రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. చివరకు రైతు రుణ మాఫీ పథకం, ‘పేరొకరిది, నోరొకరిది’ అన్నట్లుగా ఓట్ల రూపంలో రాజకీయ పార్టీలకు, బకాయిల వసులు రూపంలో బ్యాంకులకు మేలు చేస్తున్నాయే గానీ, రైతు రుణ బాధలు తీరడం లేదనేది అందరికీ తెలిసిన వాస్తవం. ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను సకాలంలో అమలు చేయక పోవడం వలన రుణ మాఫీ వరం రణంగా మారుతోంది. ప్రభుత్వం ఇచ్చే సాయం వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. చివరకు రుణ బాధలు తీరక పోగా, కొత్త సమస్యలు ఉన్నాయని క్షేత్ర స్థాయి అనుభవాలు చెపుతున్నాయి.
రైతుకు మేలు చేయక పోయినా రాజకీయ పార్టీలకు మాత్రం రుణమాఫీ తారక మంత్రంగా పనిచేసింది. అందుకే 2004 తర్వాత ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి విస్తరించింది. అందుకు ప్రధానంగా పది సంవత్సరాల పాటు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడానికి ఉచిత విద్యుత్ వాగ్దానంతో పాటుగా, రైతు రుణ మాఫీ వాగ్దానం కూడా కారణమన్న అభిప్రాయం కాంగ్రెస్ పార్టీలో విశ్వాసం కలిపించింది. నిజానికి ఒక్క కాంగ్రెస్ పార్టీలో మాత్రమే కాదు, చాలా పార్టీలలో అదే విశ్వాసం బలంగా నాటుకుపోయింది. 2014- 2018 మధ్య కాలంలో పార్టీలతో సంబంధం లేకుండా 11 రాష్ట్ర ప్రభుత్వాలు రైతు రుణ మా ఫీ ప్రకటించాయి. రైతు రుణ మాఫీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీఎన్నికల లాలీపప్ గా వర్ణించారు. అయినా, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర సహా బీజీపీ పాలిత రాష్ట్రాలు కూడా నలుగురితో పాటు నారాయణ, గుంపులో గోవింద అన్నట్లుగా రైతు రుణ మాఫీ ప్రకటించాయి. గత సంవత్సరం మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో రుణమాఫీ ప్రధాన అస్త్రంగా గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఆ పథకాన్ని అమలు చేయడంలో విఫలమైంది. తమ పార్టీ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన పదిరోజుల్లో రుణ మాఫీ చేస్తామని చెప్పిన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఫలితాలు వెలువడిన అనంతరం, వ్యవసాయ రంగం సమస్యలకు రైతు రుణ మాఫీ పరిష్కారం కాదని చావుకబురు చల్లగా చెప్పారు. అనేక మంది నాయకులు మేధావులు,ఆర్థిక వేత్తలు ఎవరికి వారు అందరూ, రైతు రుణ మాఫీ పథకం నిష్ఫల పథకం అని చెపుతూనే ఉన్నారు. అయినా, ఒక పార్టీని మించి ఇంకొక పార్టీవారు ఉచిత వరాల జాబితాలో రుణ మాఫీకి పెద్ద పీట వేస్తున్నారు.
ఇంతవరకు ఉన్న అనుభవాలను బట్టి చూస్తే రైతు రుణ మాఫీతో రైతులు ఆర్థిక సంక్షోభం నుంచి బయట పడిన సందర్భం లేదని చెప్పడానికి సందేహించవలసిన అవసరం లేదు. రైతుల ఆత్మ హత్యలకు రుణ భారమే కారణమని అనుకోవడంలోనూ వాస్తవం లేదు. ఒక్క మహారాష్ట్ర విషయానే్న తీసుకుంటే, 2014-18 మధ్య కాలంలో 14,034 మంది మహా రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే అందులో 30 శాతం మంది 2017లో మహారాష్ట్ర ప్రభుత్వం రైతు రుణ మాఫీ అమలుచేసిన తర్వాతనే జరిగాయి. అంటే,రుణ మాఫీ ఆత్మహత్యలను నివారిస్తుంది అనేది వాస్తవం కాదని తేలిపోయింది. ప్రభుత్వాలు మళ్ళీ మళ్ళీ రుణ మాఫీ చేస్తాయన్న ఆశతో రైతులు బ్యాంకులకు రుణాలు తిరిగి చెల్లించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా బ్యాంకుల రికవరీ రేటు తగ్గిపోతోంది. దీంతో బ్యాంకులు రైతులకు రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్నాయి. మరో వంక బ్యాంకు రుణాలు పొందిన వారికి మాత్రమే రుణ మాఫీ కలిపించడం వలన మాఫీ ప్రయోజనం చేకురుతోంది, బ్యాంకు రుణాలు రాక ఇతర మార్గాలను ఆశ్రయించిన వారికి రుణ మాఫీ ప్రయోజనం అందకుండా పోతోంది.
జాతీయ స్థాయిలో రైతు రుణ మాఫీ చేయాలని వామపక్ష పార్టీల అ నుబంధ రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.అయితే అది అయ్యే పని కాదు. కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ అంచనా ప్రకారం దాదపు మూడు లక్షల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అంటే, ఇతర సంక్షేమ పథకాలు అన్నిటినీ చాప చుట్టేస్తేనే గానీ, రైతు రుణ మాఫీని అమలు చేయడం కుదరదు. అలా చేసినా రైతుల సమస్యలు తీరిపోవు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుంటే, రైతు రుణ మాఫీ కంటే, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ సన్మాన్ యోజన, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు, ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన రైతు భరోసా కొంత వరకు మెరుగైన పథకాలు. అయితే వీటిలోనూ లోపాలు చాలానే ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించేది లేదని , భూస్వాములకు మాత్రమే రైతు బంధు పథకం వర్తిస్తుందని కుండబద్దలు కొట్టింది. స్వయంగా ముఖ్యమంత్రి శాసన సభలోనే, కౌలు రీతులను గుర్తించేది లేదని కరాఖండిగా చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఐదు ఎకరాలకు లోపు భూములు ఉన్నవారికి మాతమ్రే ప్రధానమంత్రి కిసాన్ సన్మాన పథకం వర్తిస్తుందని పేర్కొంటే, తెలంగాణ ప్రభుత్వం వందల ఎకరాలున్న భూస్వాములకు కూడా ఎకరాలు పదివేల వంతున పంపకం చేస్తోంది. కొన్ని మార్పులు చేర్పులతో రైతులకు పెట్టుబడి సహాయం అందిచడం అభిలషణీయమే. వీటితో పాటుగా పండిన పంటకు గిట్టుబాటు ధర, మార్కెట్ సదుపాయాలు, సాగు నీటి సదుపాయం, సబ్సిడీ పై విత్తనాలు, ఎరువుల సరఫరా చేయడం ఇలా.. అనేక సందర్భాలలో అనేకానేక కమిటీలు చేసిన సిఫార్సులను అములు చేస్తేనే రైతాంగానికి మేలు జరుగుతుంది. ఓట్ల కోసం చేసే రుణమాఫీ రణ ఘోషల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇది సత్యం.

-రాజనాల బాలకృష్ణ 99852 29722