మెయిన్ ఫీచర్

సిరులనిచ్చే శ్రీ మహాలక్ష్మి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరాకార, పరబ్రహ్మతత్త్వాన్ని పురుష దేవతామూర్తుల స్వరూపంగాను, స్ర్తి దేవతా స్వరూపాలుగాను కూడా పూజిస్తారు, ఆరాధిస్తారు, ఉపాసిస్తారు- ఇది భారతీయ తత్వం, పద్ధతి, ఆచారం. మాతృమూర్తిగా కరుణామయిగా, దుష్టజన సంహారిణిగా, శిష్టజన రక్షణిగా, దారిద్య్ర నాశినిగా, ఐశ్వర్యప్రదాయినిగా, శాంతి సౌఖ్యముల్ని, సిరిసంపదలను ప్రసాదించే దేవతగా, స్ర్తి స్వరూపంగా పూజలందుకునే మాతలలో మహాలక్ష్మీదేవిది అగ్రతాంబూలం. మహాలక్ష్మీ ఆలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి. అయితే, పూనె నగరానికి దగ్గరగా వున్న ‘కరవీరపురం’ అనగా నేటి కొల్లాపురి (కొల్లాపూర్)లో వెలసిన మహాలక్ష్మీదేవి ఆలయం ప్రసిద్ధిగాంచింది. ఇక్కడి జగన్మాతను అగస్త్య మహర్షి, దత్తాత్రేయ స్వామి మరెందరో మహర్షుల మహనీయులు, మహోదాత్తులు అర్చించారని స్థలపురాణం చెపుతోంది. ఆశ్వయుజ మాసంలో శ్రీ దేవీశరన్నవరాత్రి మహోత్సవములలో, మహాలక్ష్మీదేవి, పూజ, సర్వపాపహరం, సకల పుణ్యప్రదం అని భక్తులు విశ్వసిస్తారు. పద్మపురాణంలోని కరవీర ఖండంలో, కొల్లాపూర్ ప్రాశస్త్యం వివరించబడింది. మహాలక్ష్మీదేవిని ఆరాధించినవారికి, తాము కోరుకునే ప్రాపంచిక కోరికలన్నీ నెరవేరుతాయని, ఉపరి, క్షేత్ర మహిమ వలన ఇక్కడ కోరుకునే ఆధ్యాత్మిక కోరికలు కూడా నెరవేరతాయని పేర్కొనబడింది.
భారతీయులం గదా మనం. భా అంటే కాంతి, వెలుగు, దీప్తి, దీపము, అగ్ని అనే అర్థాలున్నాయి. దీపమునకు అనగా అగ్నిని ఆరాధించువారు భారతీయులు. భారతదేశంలో దీపారాధన చేయని ఇల్లు ఉండదు. ప్రతి కార్యమునకు ముందుగా దీపారాధన చేసి, ఆ పనిని ప్రారంభించటం మన అలవాటు, పద్ధతి. దీపారాధన ఒక యజ్ఞమే. యజ్ఞమునకు సూక్ష్మరూపం- దీపారాధన. దీపమున్న ఇంట్లో మహాలక్ష్మి ఉంటుంది. బహిర్ముఖంగా దీపారాధనకు నమస్కరిస్తాం. మన లోపల కూడా ఒక జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అదే చైతన్యం. అందరిలో ఉన్నది ఒకే చైతన్యం. కనుక, మానవుల దేహంలో ఉండే చైతన్యము కూడా ‘దీపము’ అని తెలియపరచబడింది. ఎక్కడ? దక్షిణామూర్తి స్తోత్రంలో. ‘‘నానా ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప ప్రభా భాస్వరం, జ్ఞానం యస్వతు చక్షురాది కరణ ద్వారా బహు స్పందతే’ చాలా చిల్లులున్న కుండలో నుండు దీపకాంతులెలా ఆ చిల్లుల ద్వారా బయటకు వస్తాయో, ఆ విధంగానే, మన శరీరమందుగల నవరంధ్రముల ద్వారా చైతన్యస్ఫూర్తి, జ్ఞానము బయటకు ప్రసరించునని తెలియపరుస్తోంది. అనగా, శరీరాంతర్గత పరమాత్మ ప్రకాశము, దీపములాగా ఉంటుంది. ఆ దీప ప్రకాశమే శ్రీ మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మీస్వరూపులే గృహిణులు. అందుకే ‘ఇంటి దీపం ఇల్లాలు’ అన్నారు.
ఈ విషయాన్నే శ్రీసూక్తము కూడా విశదీకరించింది. ‘‘లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగధామేశ్వరీం, దాసేభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురమ్’. పరాదేవియైన జగన్మాత కూడా దీపమే. పరంజ్యోతి స్వరూపమే. ఆ జ్యోతి స్వరూపమే శ్రీమహాలక్ష్మి. వేదములు కూడా ఈ విషయాన్నే స్పష్టం చేసినాయి. ‘‘ఉత్తిష్ఠత మాస్వప్త అగ్నిమిచ్ఛ ధ్వం భారతాః’’- భారతీయులారా లేవండి, నిదురించవద్దు (ఇక్కడ నిదురించవద్దు అంటే ఏ సమయంలో నిద్రించరాదో, ఆ సమయంలో నిదురించవద్దని, అంతేకాని అసలు నిద్రపోవద్దనికాదు) అగ్నిని ఆరాధించండి అని చెప్పింది, యజుర్వేద తైత్తిరీయ ఆరణ్యకం. అగ్ని ఆరాధనకు ప్రతీకయే దీపారాధన. దీపారాధనే, మహాలక్ష్మీ ఆరాధన. ‘ఉద్దీప్యస్వ జాతవేదో పఘ్నిన్ నిర్ ఋతిం మమ’’- దీపారాధన చేసి ఈ మంత్రాన్ని ఉచ్ఛాటన చేస్తూ దీపానికి నమస్కరిస్తాం. అంటే ‘‘నా పాపములను పోగొట్టి నాకు వెలుగును, వివేకాన్ని ప్రసాదించమని’’ ప్రార్థిస్తున్నాం. ఎవరిని? దీపారాధన జ్యోతి స్వరూపిణి అయిన మహాలక్ష్మీ మాతను, దీపమున్న ఇంటిలో లక్ష్మి ఉంటుంది.
చంద్రాం హిరణ్మరుూం లక్ష్మీం జాతవేదో మ మావహః
సూర్యాం హిరణ్మరుూం లక్ష్మీం జాతవేదో మ మావహః
సూర్యచంద్రుల యొక్క హిరణ్య రూపమైన లక్ష్మీదేవి కృపను మాకు ప్రసాదింపజేయమని ప్రార్థిస్తున్నాం.
‘‘సా హి శ్రీరమృతా సతామ్’ అన్నది శ్రుతి. అమృత స్వరూపిణియైన వేదవాణియే, వేదవాక్కులే మహాలక్ష్మీ స్వరూపం.
మంచి పనులకు మంచి ఆలోచనలకు- మహాలక్ష్మి కటాక్షం ఎప్పుడూ ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి ఎప్పుడూ చిఱునవ్వు చిందించే ప్రసన్నవదన. పంచమినాటి చంద్రకళలో మహాలక్ష్మీ వైభవం కనపడుతుంది. శ్రీపంచమి ఒక పర్వదినం. ఐదు సంఖ్య జీవితంలో ప్రాముఖ్యత వహిస్తుంది. అందుకే జగన్మాతను పంచహారతులతో అర్చిస్తారు. ఐదు సంఖ్యకు అధిపతి, బుధుడు. బుధుడు విష్ణుపాదోద్భవుడు. విజ్ఞానకారకుడు బుధుడు. వ్యాపార వాణిజ్యకారకుడు కూడా బుధుడే. అందుకే బుధగ్రహ అనుగ్రహం ఉన్నవారు ఉన్నత వ్యాపారం చేస్తారు. శ్రీ మహాలక్ష్మి కటాక్షం పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలందరూ, ప్రతి శుక్రవారం మహాలక్ష్మీ పూజలు తప్పక చేస్తారు.
‘కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతి, కరమూలేతు శర్వాణీ, ప్రభాతే కరదర్శనమ్’- మన చేతి వేళ్ళు ఐదు. ఈ ఐదు వ్రేళ్ళలో పంచబ్రహ్మలు, పంచభూతములు, పంచతన్మాత్రలు పంచేంద్రియములు ప్రతినిహితమై ఉంటాయని చెప్తారు. అరచేతిలో సరస్వతి, వేళ్ళలో మహాలక్ష్మీ ముంజేతిలో పార్వతి నివసిస్తారని, కనుక ఉదయాన్నే, నిద్రలేవగానే, చేతులు చూసుకొని, జగన్మాతను తలచుకొని, రెండు చేతులూ కలిపి నమస్కారం చేస్తే ఆ రోజంతా శుభంగా జరుగుతుందని, త్రిమాతలే ప్రభాత సమయంలో కొలిచిన బిడ్డలకు రక్షణ యిస్తారని చెప్తారు. ఈ విశ్వమంతా విష్ణుమయం- విశ్వేశ్వరి - శ్రీమహాలక్ష్మి. విశ్వానికి విష్ణువునకు భేదం లేదు. అలాగే శ్రీమహావిష్ణువుకి, శ్రీమహాలక్ష్మికి తేడా లేదు. శ్రీమహాలక్ష్మి- భోగరూపంలో భవానిగా, రణరంగంలో దుర్గగా రౌద్రంలో మహాకాళిగా, పుంభావ రూపంలో విష్ణువుగా భాసిల్లుతుంది.
‘‘అశ్వపూర్వాం రధ మధ్యాం హస్తినాద ప్రబోధినీమ్ శ్రీయం దేవీ ముపహ్యయే శ్రీర్మాదేవీర్జుషతామ్’’- శ్రీసూక్తం.
గుఱ్ఱాలు ముందుంటే రథాలు మధ్యలో ఏనుగులు ఘీంకారం చేస్తూ వాటి వెనకాల నడుస్తుంటాయి. ‘‘ఇంద్రియాణి హయా నాహః అన్నది కఠోపనిషత్. ఇంద్రియాలే అశ్వాలు. ఆశుగచ్ఛతీతి అశ్వః అతి వేగంగా పరుగెత్తేదేదో అది అశ్వం. అవి ఇంద్రియాలే. గుఱ్ఱాలు ఈడ్చుకుపోతుంటే ఇది కదిలిపోతుంది. రథమంటే మన శరీరం. ‘శరీరం రథమేవతు’ ఇంద్రియాలనే గుఱ్ఱాలీడ్చుకుపోతుంటే, ఇది కదిలిపోతుందని చెప్పుకున్నాం కదా. అందుకే వాటి వెనకాలే మధ్యలో ఉంటుంది శరీరం. ‘హస్తినాద ప్రబోధినీం’ శరీరం కన్న వెనకాల ఉన్నది హస్తి, అనగా ఏనుగు. ఏమిటది? మన అహంకారం. శరీరాన్ని మమకారంతో చూస్తోంది. దానికంటె ముందున్న ఇంద్రియాలనే అశ్వాలు. దాన్ని రుూడ్చుకుపోయి విషయానుభవమిస్తున్నాయి, జీవులకు. ఇది జీవుడికి వున్న సంసార బంధం. అహంకారమనే ఏనుగు ఆక్రందన చేస్తుంటే, దాన్ని ప్రజ్వలింపజేస్తుంది మాయాశక్తి. అదే ‘హరిణి’. మనలను సంసారాభిముఖంగా హరిస్తుంది. అలా కాకుండా సాయుజ్యం వైపు తీసికెళ్ళాలి. దీనికి ‘శ్రీ’ కావాలి. కనుక ఆ శ్రీదేవినే ‘ఉపహ్వయే’ మనలోకి ఆవాహనం చేసికోవాలి. శరీరమనే రథమధ్యస్థయగు లక్ష్మియే చైతన్యలక్ష్మి. చెవులు మూసుకుంటే వినపడే నాదమే హస్తినాదం- అదే వేణునాదం- వీణానాదం- వేదనాదం- శంఖనాదం. ఆ నాదం చేత నిరంతరం బోధింపబడుతున్న చైతన్యలక్ష్మిని ఆరాధిస్తే పరమాత్మను చేరుకునే సన్నిధి మార్గాన్ని దర్శింపజేస్తుంది.
ఈ ఆరాధనతో మానవుడు ఇంద్రియాలను, తను చెప్పినట్లు నడుచుకొనేటట్లు చేసికొని, మనస్సును అదుపులో ఉంచుకొని, తన శరీర రూప రథాన్ని భగవంతునివైపుత్రిప్పుకుని, సన్మార్గం వైపు మరలి పవిత్రులు అవ్వాలని హితవు చెపుతోంది- శ్రీమహాలక్ష్మి. సూర్యతేజముగల లక్ష్మీదేవి తప్ఫఃలంగా, పుష్పించకుండానే ఫలించే మారేడు వృక్షం పుట్టింది. అంతరింద్రియ, బాహ్యేంద్రియములను, దారిద్య్రాన్ని నశింపచేసే బిల్వ వృక్ష ఫలములు, శ్రీదేవి అనుగ్రహము మారేడు దళములు లక్ష్మీప్రదం. ‘ప్రకృతి’ అన్న మాటను పదిహేను తత్త్వములుగల శ్రీమాతగా భావించి ఆధ్యాత్మిక సాధనలో, శ్రీమాతను ఉపాసించి, తల్లి కటాక్షసిద్ధిని పొందిన మహనీయులు శ్రీ విద్యారణ్యస్వామి. సమాజ సేవలో భాగంగా ఎప్పుడు తలిస్తే అప్పుడు తన చేయూతనందిస్తానన్నది శ్రీ మహాలక్ష్మి. శ్రీ విద్యారణ్యస్వామి ఆశీస్సులతో, సంకల్పంతో స్థాపించబడినది విజయనగర సామ్రాజ్యం. శ్రీవిద్యోపాసనాసిద్ధుడై, శ్రీమహాలక్ష్మీ కటాక్షమును పొందిన, శ్రీవిద్యారణ్యస్వామి ప్రజల కష్టాలను చూచి, కలత చెంది, శ్రీమహాలక్ష్మిని అనుగ్రహించమని ఇది ఆపత్సమయమని, బిడ్డలను రక్షించమని, సమాధి నిష్ఠతో ఉపాసించాడు. ఆర్తితో, స్వార్థరహితంగా అర్థించాడు. సమాజ హితానికి సంకల్పించిన శ్రీవిద్యారణ్యస్వామి కోర్కెను మన్నించి క్షణకాలం సువర్ణవృష్టిని కురిపించింది శ్రీ మహాలక్ష్మి. ఇది శ్రీ విద్యారణ్యస్వామి జీవితంలో అత్యద్భుత ఘట్టం. శ్రీమహాలక్ష్మి పూజకు, తల్లి అనుగ్రహానికి స్ఫూర్తినిస్తుంది. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి స్తోత్రంలో మొదటి నామమైన ‘ఓం ప్రకృత్యై నమః’ అన్న నామములోని ప్రకృతి తత్త్వం- శ్రీమహాలక్ష్మి పరతత్త్వాన్ని విశదపరుస్తుంది.
జగన్మాత ప్రేమామృతమే, ఆమె భక్తులకు మహదానందాన్నిస్తుంది. లక్ష్మీదేవి కరుణా కటాక్షంతో అదృష్టం అర్ణవంలా పొంగుతుంది. సారహీనమైన ప్రపంచాన్ని అర్థవంతం చేసి, అర్థాన్ని ధర్మంతో అనుసంధానం చేస్తే, మోక్షాన్ని ప్రసాదించే ముక్తిప్రదాయిని, మోక్షలక్ష్మి శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీదేవి చంద్రసహోదరి కనుక, తనను భక్తితో, శ్రద్ధగా కొలిచేవారికి మానసిక ప్రశాంతతను ప్రసాదిస్తుంది. అందుకే, జాతకభాగంలో, చంద్రమహర్దశ జరుగుతున్నప్పుడు గాని, చంద్ర అంతర్దశ నడుస్తున్నపుడుగాని, చంద్రుడు సరియైన స్థానంలో లేకపోతే, లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమపూజ చేసి ఆ కుంకుమను నుదుట పెట్టుకోమంటారు. సూర్యచంద్రాగ్ని సమాన ప్రకాశ తేజోరాశి- శ్రీమహాలక్ష్మి. జగన్మాత, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములనే అరిషడ్వర్గములను అణచి, భక్తులకు పుత్ర పౌత్రాభివృద్ధిని, ధనమును, ధాన్యాన్ని పశుసంపదను అనుగ్రహించి, దీర్ఘాయుష్మంతులుగా చేయు కరుణామయి- శ్రీ మహాలక్ష్మి. లక్ష్మీదేవిని ‘కనకధారాస్తవం’తో స్తుతించి, పుణ్యసతి దారిద్య్ర బాధను నివారించారు జగద్గురు శంకరాచార్యులు. తండ్రితో కార్యం నెరవేరాలంటే తల్లిని ప్రార్థించాలి. ఎందుకంటే, వాక్కు అర్థంలాగా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. అందుకే పద కవితాపిమహుడు అన్నమాచార్యులు ‘కమలజు కన్నతల్లి కాముని గన్నతల్లి, అమరుల గన్న తల్లి ఆదిమలక్ష్మి, విమలపు నీ పతికి విన్నపము సేసి, మమ్ము నెమకి యేలితి దయ నీకే తగునమ్మా’’అని మహాలక్ష్మీ కటాక్షాన్ని తన పద కవితలతో స్తుతించాడు.
‘‘మా జానకి చెట్టబట్టగా మహారాజువైతివి’’ అని లక్ష్మీతత్త్వాన్ని ప్రస్ఫుటించాడు. ‘మా’ జానకి అనటంలో లక్ష్మీ స్వరూపురాలైన జానకి అనే భావాన్ని తెలియజేశాడు- శ్రీ త్యాగరాజస్వామి.
‘‘రాఘవత్వా భవత్సీతా రుక్మిణీ కృష్ణజన్మనీ’ బ్రహ్మం కాధీశ్వరి యగు శ్రీమహాలక్ష్మియే, రామావతారమున సీతగా, కృష్ణావతారమున రుక్మిణిగా అవతరించెనని భావము. అదేవిధముగా ‘మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి...’ అని ఆర్తితో మహాలక్ష్మీ స్వరూపిణియైన సీతమ్మ తల్లికి విన్నపము చేశాడు భక్తరామదాసు. మూలాధార నిలయుడు- గణపతి. మూలాధార ఛక్రాధిదేవత లక్ష్మీదేవి. కనుక, శ్రీగణపతిని అనగా లక్ష్మీయుక్తుడైన మహాగణపతి సర్వదేవతలకు మూలాధారము. సకల సంపదలను శీఘ్రగతిని నిర్విఘ్నంగా భక్తులకు యిచ్చేవాడు ‘లక్ష్మీ గణపతి’ అని సౌరాష్ట్ర రాగంలో ఆది తాళ నిబద్ధనలో ‘శ్రీగణపతిని సేవింపరారే శ్రీతమానవులార’ అని లక్ష్మీయుక్తుడైన గణపతిని ప్రార్థిస్తూ కీర్తించాడు, ‘ప్రహ్లాద భక్తి విజయం’ అనే సంగీత రూపకములో నాదయోగి సద్గురు త్యాగరాజస్వామి. ఈ కీర్తన మహాలక్ష్మి పూజ రోజున కీర్తిస్తే, ఇహపర సౌఖ్యములు కలుగుతాయి.
'ధనమగ్నిర్థనం వాయుః ధనం సూర్యోధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వ రుణం ధనమశ్నుతే’ అన్నది శ్రీసూక్తం. అగ్ని, వాయువు, సూర్యుడు, వసువు, ఇంద్రుడు, బృహస్పతి, వరుణుడు అను ఏడుగురు 'ధన’ శబ్దముచే చెప్పబడ్డారు. ధన శబ్దానికి అధిపతి శ్రీమహాలక్ష్మి. లౌకికమైన ధనముతోపాటు, అగ్ని మొదలగు వారి తేజోరూపమున ధనాన్ని కూడా ప్రసాదించే శక్తి శ్రీమహాలక్ష్మి. ‘ఆయుర్దా అగ్నే, అగ్నిర్మే వాచిశ్రీతః’ అనే వేదవాక్యముల వలన, అగ్ని-ఆయుర్దాయాన్ని ఐశ్వర్యాన్ని, బలము, వాక్కును చేకూర్చేవాడు. ‘వాయుర్మే ప్రాణేశ్రీతః’ వాయువు ప్రాణశక్తిని ప్రసాదిస్తాడు. ‘సూర్యోమే చక్షుషిశ్రీతః- సూర్యుడు దర్శనశక్తిని హృదయ శక్తిని ప్రసాదిస్తాడు. ‘వసువు’ శారీరక తేజస్సును యిస్తాడు. ‘ఇంద్రోమే బలేశ్రీతః’ ఇంద్రుడు బలాన్నిస్తాడు. బుద్ధికి అధిపతి బృహస్పతి. కనుక, బుద్ధిబలముతో జ్ఞాన సంపదను అనుగ్రహించేవాడు బృహస్పతి. వరుణుడు - జలాధిపతి, శతృసంహారకుడు. కనుక వరుణునిచే జలశక్తి, శతృసంహార శక్తి లభిస్తాయి. ఈ అగ్ని వాయు సూర్య వసువు బృహస్పతి వరుణులందరూ- ఆ మహాలక్ష్మీ అంశే. కనుక, శ్రీమహాలక్ష్మి కటాక్షసిద్ధితో ఇవన్నీ లభిస్తాయి. ఆ దేవతల అనుగ్రహమును పొందినవాడే అసలైన ధనవంతుడు.
‘ఈశానాం జగతోస్య వేంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీ.. వందే జగన్మాతరమ్’- కన్ను, చెవి, నాసిక, నోరు, మనస్సు, మానవ దేహంలో శిరస్సులో కేంద్రీకృతమై ఉన్నాయి. అదే మూలపదార్థం. అక్కడే వున్న సహస్రార చక్రంలో కుండలినీ యోగశక్తి ప్రస్ఫుటమవుతుంది. సహస్రారాంతర్గత చంద్రమండలంలో ప్రవేశించగా అమృతధారలు వర్షిస్తాయి. ఇదే జీవ బ్రహ్మైక్యస్థితి. ఈ స్థితిని ప్రసాదించే శ్రీశక్తి- శ్రీమహాలక్ష్మి. శ్రీమంతమైన శ్రీగిరి శిఖరవాసియై, సాత్వికేంద్రియాలన్న లక్ష్మీసంపదకు రమణుడై, జ్ఞాన ఇచ్ఛాశక్తులను నిండుగా ప్రవహింపజేసి, నిద్రాణమైన శక్తిని ప్రకటింపజేసి, ఉద్ధరించి, భక్తుల పాపములను పోగొట్టువానిగా భక్తుల యిష్టార్థాలను ప్రసాదించువానిగా ఈశుడైన వేంకటేశుని వక్షస్థల నివాసియై, స్వామిని శక్తివంతునిగా జేసింది శ్రీమహాలక్ష్మి. శ్రీవేంకటేశ ప్రపత్తిలో, లక్ష్మీదేవిని ప్రస్తావించి, శ్రీ వేంకటేశ్వర సుప్రభాత సేవలో, శ్రీమహాలక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాం. తనను నిశ్చలభక్తితో కొలిచేవారికి సత్య వాక్యమును పాడి పంటలను ఇచ్చి, వారి కోర్కెలను తీర్చే విష్ణుపత్ని శ్రీమహాలక్ష్మి. అటువంటి జగన్మాతను ‘మహాలక్ష్మీ కరుణారసలహరి మామవ మాధవ మనోహరి, మహావిష్ణు వక్షఃస్థలవాసిని, మహాదేవ గురుగుహ విశ్వాసిని, మహాపాప ప్రశమని, మనోన్మణి మారజనని, మంగళప్రదాయిని క్షీరసాగర సుతే, వేదనుతే, క్షితీశాది మహితే, సురహితే, భారతీ, రతీ, శచీ పూజితే భక్తి యుక్త మానస విరాజితే’ అన్న ముత్తుస్వామి దక్షితులవారు మాధవ మనోహరి రాగంలో కీర్తించిన రుూ కీర్తన, మహాలక్ష్మి పూజకు స్ఫూర్తినిస్తుంది. అర్థాన్ని ధర్మంతో పొంది, మరల ఆ అర్థాన్ని అర్థవంతం చేయటానికి ధర్మంతో కలిపి, లోక కల్యాణార్థం ధర్మకార్యాచరణ చేసి జీవితాన్ని సార్థకం చేసికోవాలని హెచ్చరిస్తోంది శ్రీమహాలక్ష్మీ పూజ.

-పసుమర్తి కామేశ్వరశర్మ 9440737464