మెయన్ ఫీచర్

గాంధీ ఆలోచనలు నేటికీ శిరోధార్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వలస పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరా టాలకు 20వ శతాబ్దం ప్రసిద్ధి గాంచింది. వలస పాలనను వ్యతిరేకించి పోరాడిన అనేక మందిలో గాంధీజీ సుప్రసిద్ధులు. ఆయన మార్గం ఎందరినో ప్రభా వితం చేసింది. మార్టిన్ లూదర్ కింగ్‌కు, నెల్సన్ మండేలాకు మార్గ దర్శకమైంది. ఈ ఇద్దరి పోరాటాలు హింసాత్మకంగా ఉండి ఉంటే వాటిని అణ చివేయటం శే్వత జాత్యంహంకారులకు తేలికయ్యేది. కాని గాంధేయ మార్గంలో వారు చేసిన పోరాటాల వల్ల అటు అమెరికాలో నల్లజాతీయులకు సమానహక్కులు లభిం చాయి. దక్షిణాఫ్రికాకు శే్వతజాతీయుల నిరంకుశ పాలన నుండి విముక్తి లభించింది. గాంధీజీ 150వ జయంతి సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించడం హర్షణీయం. గాంధీజీని మహా త్ముడుగా అభినందించేవారు ఎంత మంది ఉన్నారో, జిత్తులుమారిగా ద్వేషించేవారు కూడా అంతేమంది ఉన్నారు. ఆయన ఆలోచనల బలం కారణంగానే ఈనాటికీ ప్రజల స్మృతిలో నిలిచి ఉన్నారు. గాంధీ మార్గం నుండి మనం దూరంగా జరిగినా, ఆ ఆదర్శాలను, విలువలను ఆయన అనుచరులే పాతిపెట్టినా, ఆయన భావజాల ఔచిత్యం కారణంగానే ఆయనను జయంతి నాడో, వర్థంతి నాడో గుర్తుకుతెచ్చుకుంటున్నాం. గాంధీ అనుచరులలో కొందరు ఆశ్రమాలకే పరిమితమై ఆయన రచనలను అచ్చువేసే పనిలో నిమగ్నమయ్యారు. ఆశ్రమ జీవితం గడుపుతూనే ప్రజాబాహుళ్యంతో ఆయన విస్తృతంగా సంబంధం పెట్టుకున్నారు. ఆనాటి రాజకీయాల్లో ప్రత్యక్షంగా పాల్గొనటమే కాక తనే కేంద్రబిందువయ్యారు.
స్వావలంబనే లక్ష్యం
గాంధీ పేరు చెప్పగానే మనకు చప్పున గుర్తుకు వచ్చేది ఖాదీ, చేతితో ఒడికిన నూలుతో మగ్గాలపై తయారయ్యే వస్త్రాలు. భూతాపం పెరుగుతున్న కొద్దీ ఖాదీకి, నూలు వస్త్రాలకు డిమాండ్ పెరుగుతున్నది. ఖాదీ గురించి ఆయన అంత విస్తృతంగా ఎందుకు ప్రచారం చేశారో ఈతరంలో చాలా మందికి తెలియక పోవచ్చు. అది ఆయన చేతిలో ఒక పెద్ద ఆయుధం. స్వాతంత్య్రేచ్ఛ రగిలించటానికి దాన్ని ఒక సాధనంగా వాడారు. తరతరాల గ్రామీణ సంస్కృతికి మూలాధారమైన రాట్నాన్ని తన శాంతియుత సత్యాగ్రహ పోరాటంలో ఒక అస్త్రంగా మలిచారు. బ్రిటీష్ వారి నుండి స్వేచ్ఛ కోసం మాత్రమే కాదు. స్వావలంబనకు సాధనగా ఖాదీని వెలుగులోకి తెచ్చాడు. ఖాదీ అంటే లక్షలాది మంది గ్రామీణ ప్రజలకు నిరంతర ఉపాధి కల్గించేది. ఆంగ్లేయులు మన దేశానికి తీసుకొని వచ్చిన పత్తి వంగడాల నుండి నూలు తీయటానికి లాంక్ షైర్ యంత్రాల వల్లే సాధ్యవౌతుంది. యంత్రాలకు పని కల్పించే పత్తి వంగడాలను వారు తీసుకొచ్చారు. అది ప్రపంచీకరణకు తప్ప స్థానికీకరణకు దారీ తీసేది కాదు. స్థానికంగా దొరికే పత్తి వంగడాలను, అదీ ఎక్కువ నీరు అవసరంలేని, తరచూ చీడలకూ, పీడలకూ లోను కానీ మన పర్యావరణానికి అనుకూలమైన వంగడాన్ని గాంధీ పట్టుకున్నారు. రైతు ల ఆత్మహత్యలకు దారితీసే వంగడం కాదు ఆయన ఎన్నుకొన్నది. స్వతంత్ర ఉత్పత్తి దారుల అభివృద్ధి పైనే దేశాభివృద్ధి ఉంటుం దని ఆయన ఎలుగెత్తి చాటా రు. పాశ్చాత్య ప్రభావంతో కేవలం కొన్ని వర్గాలకే సామాజిక భద్రతను ఆనాడు కల్పించారు. రైతుల, చేతి వృత్తుల వారి అవసరాలును నిర్లక్ష్యం చేశారు. సామాజిక, ఆర్థిక న్యాయాల సాధనకు రైతులు, చేతివృత్తుల వారు పెట్టని కోటని, వారిని నిర్లక్ష్యం చేయటం తగదని గాంధీ హెచ్చరించారు. మనం దాన్ని నేడు పట్టించుకోలేదు.
ఉపాధికల్పన, వాతావరణ సమతుల్యత మన ముందున్న రెండు పెద్దస మస్యలు. ఈ సమస్యలను పరిష్కరించటంలో కమ్యూనిజం, పెట్టుబడిదారీ విధానం ఘోరంగా విఫలమయ్యాయి. పెట్టుబడీదారి విధానం మరింత యాంత్రీకరణ వైపు పరుగులు తీస్తోంది. కారల్‌మార్క్స్ చెప్పిన మరో ప్రపంచం ఎక్కడా కనపడటంలేదు. ఉద్యోగ సంఘాలు, ధర్నాలు దాటి ముందుకు వెళ్ళడంలేదు. వారు ద్వేషిస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి నమూనా వారిది కూడా. ఉపాధి కల్పన స్వతంత్రంగా పనిచేసే ఔత్సాహికుల చేతుల్లోనే ఉంటుంది. గాంధీ ఔత్సాహికులను ప్రోత్సహించి, వివిధ రంగాలలో దేశీయ సంస్థలు నెలకొల్పడానికి కారణమయ్యారు. స్వయం ఉపాధి పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వం పై భారం తగ్గుతుంది. స్వయం ఉపాధి అవకాశాలను గణనీయంగా పెంపుచేయాలని గాంధీ పదేపదే చెప్పారు.
పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
పర్యావరణ విషయానికి వస్తే పెట్టుబడిదారీ దేశాలు, సామ్యవాద దేశాలు రెండూ ఒకలాగే వ్యవహరించాయి. విచక్షణా రహితంగా సహజవనరులను కొల్లగొట్టాయి. భూతాపం పెరగటానికి, ఓజోన్ పొర చిల్లు పడటానికి పోటాపోటీగా అమెరికా, రష్యా, చైనా ఇతర దేశాలు అనుసరించిన పారిశ్రామికీకరణ, నగరీకరణ, మార ణాయుధాల తయారీ విధానాలు కారణం. ప్రపంచంలోని ప్రతిమూల ప్రకృతి వనరులను కొల్లగొట్టంలోనూ వారు పోటీపడ్డారు. స్థానికుల హక్కులను కాలరాచి, వారి వనరులను దోచు కోవడం లో ఎవరికి ఎవరూ తీసిపోరు. ప్రకృతికి దూ రంగా జీవనం గడపటమే వారి దృష్టిలో అభివృద్ధి. పరిమితులు లేని ప్రాశ్చాత్య జీవన పోకడలను గాంధీ వ్యతిరేకించారు. పర్యా వరణ స్పృహ గాంధీకి చాలా ఎక్కువ. మన అవస రాలమేరకే ప్రకృతి వనరులను ఉపయోగించుకోవాలని, కోరికలు తీర్చుకోటానికి, విలాసవంతమైన జీవితాలు గడపటానికి ఆ సంపదను వాడుకుంటే తరు వాతి తరాలవారు వాటికి దూరం అవుతారని హెచ్చరించారు.
ఎక్కువ ఉత్పత్తి చేయడం, ఆ ఉత్పత్తులను అమ్ము కోడానికి మార్కెట్లను హస్తగతం చేసుకోవడం, తద్వారా ఎక్కువ లాభాలు ఆర్జించటం, ఆక్రమంలో ప్రకృతి వనరులను కొల్లగొట్టటం ప్రస్తుతం జరుగుతున్న ఆర్థిక వ్యవహారాల తీరు. తక్కువ వనరులతో ఎక్కువ మందికి ప్రయోజనం కల్గించే ఉత్పత్తి ప్రక్రియల కోసం శాస్తస్రాంకేతిక పరిశోధనలు దోహదపడాలని గాంధీజీ ఆశించారు. సాంకేతిక పరిజ్ఞాన ఆవిష్కరణల లక్ష్యం సామాన్య మానవుడే కావాలని ఆయన నిర్దేశించారు. లాభార్జనే ధ్యేయంగా సాగుతున్న ప్రస్తుత ఉత్పత్తి ప్రక్రియలకు ఇది పూర్తిగా భిన్నమైన ప్రణాళిక. అందరికీ భారీ పరిశ్రమలు కావాలి. భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కావాలి. ప్రపంచంలోకెల్లా పెద్ద రాజధాని నగరాలు నిర్మాణం చేయాలి. కానీ అందుకు చెల్లించే పర్యావరణ, ఇతర మూల్యాల గురించి ఎవరికీ పట్టటం లేదు. స్థానిక వనరులతో, స్థానిక సాంకేతికతో, స్థానిక ప్రజల భాగస్వామ్యంతో ఉత్పత్తులు జరగాలని ఆయన ఆశించారు.అవి శాస్ర్తీయ, సాంకేతిక పరమైనవైనా, పాలనా పరమైనవైనా, అవి జరిగినప్పుడే మానవాళికి మేలు జరుగుతుందని ఆయన నమ్మకం.
భాగస్వామ్య ప్రజాస్వామ్యం
ప్రజాస్వామ్యం విషయంలోనూ ఆయన అభిప్రా యాలను, ఆలోచనలను మనం అమలు చేయలేదు. గాంధీ వలస పాలన అనంతర భారతదేశం ఎలా ఉండాలో కూడా ఆలోచించారు. పెట్టుబడి దారీ, సామ్యవాద వ్యవస్థలకు ప్రత్యామ్నాయంగా, వాటి కారణంగా ఏర్పడే ఆర్థిక, రాజకీయ, అధికార కేంద్రీకరణలకు బదులుగా ఒక వికేంద్రీకృత వ్యవస్థను నెలకొల్పాలని ఆశించారు. దేశీయ విద్యావిధానానికి, స్వావలంబనే లక్ష్యంగా ప్రకృతితో సహజీవనం చేసే జీవన ప్రత్యమ్నాయాన్ని రూపకల్పన చేశారు. ప్రతి గ్రామాన్ని ఒక స్వయం పోషక గణతంత్రంగా మార్చాలన్నది ఆయన ఉద్దేశం. కానీ నేడు చట్టబద్ధమైన పాలన ఎక్కడాలేదు. చట్టం ముందు ప్రజలు, ప్రజాప్రతినిధులు ఒకటికాదు. ప్రజాప్రతినిధులను ప్రశ్నించకూడదు. ప్రశ్నించే ధైర్యం కూడా ఎవరికీ లేదు. ప్రజాస్వామ్యాన్ని శక్తి వంతం చేయడటం అంటే ప్రజలను శక్తివంతులను చేయ్యడం. భాగస్వామ్య ప్రజాసామ్యం గురించి గాంధీ మాట్లాడితే, మనం ప్రాతినిధ్య ప్రజా స్వామ్యాన్ని జనం మీద రుద్దాము. ప్రజాప్రతినిధులు స్థానిక నియంతలుగా ప్రజల మీద పెత్తనం చేస్తున్నారు. వారి ముందు సార్వభౌమాధికారం ఉన్న ప్రజలు నిస్సహయులుగా చేతులు కట్టుకొని సాగిల పడుతు న్నారు. ప్రజాస్వామ్యం బతికిఉంది. కానీ ప్రజలకున్న పాత్ర ఓటువేయటం తప్ప- ఇంకేమీ లేదు. గాంధీ కోరుకున్న ప్రజాస్వామ్యం ఇది కాదు. భాగస్వామ్య ప్రజాస్వామ్యం అంటే ప్రజలను అభివృద్ధి ప్రక్రియలో నిరంతర భాగస్వాములను చేయడమే. తమ సమస్యలను గుర్తించి పరిష్కరించుకొనే సాధికారత, వనరులు ప్రజలకున్నప్పుడే అది సాధ్యం అవుతుంది.
అహింస, సమానత్వం, న్యాయం పట్ల ఆయనకున్న విశ్వసాలు రాజీలేనివి. ప్రస్తుత కాలమానాలకు తగ్గట్టుగా ఆయన ఆలోచనలను ఎలా అమలుచేయాలో మనమే ఇంకా తేల్చుకోలేకుండా ఉన్నాం. ఆయన ఆలోచనల్లోని హేతుబద్ధతను, అవసరాన్ని గుర్తించబట్టే ప్రపంచం అంతా ఆయనకు నివాళి అర్పిస్తున్నది. అందరిలాగానే ఆయనకూ కొన్ని బలహీనతలు ఉన్నాయి. అనేక రాజకీయ తప్పిదాలు కూడా ఆయన చేశారు. అయితే అవేవి ఆయన మన ముందు ఉంచిన ఆదర్శాల గొప్పతనాన్ని కానీ, మానవాళి సమష్టి ప్రయోజనానికి చేసిన మార్గదర్శకత్వం విలువను కానీ తగ్గించేవి కావు.

-డా॥ బి. సారంగపాణి