మెయన్ ఫీచర్

మానవత్వమా.. వెళ్లిపోకు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ధనమే పెరిగి, మమతే తరిగి మనిషే ఈనాడు దానవుడైనాడు..’- ఇది ఓ సినిమా గీతం. అయినా మానవ నైజాన్ని గురించి చక్కగా రాసిన అలనాటి పాట ఇది. కాలం మారుతున్నకొద్దీ మనుషుల్లో రానురానూ మానవత్వం అడుగంటి పోతోంది. ప్రేమ, అనురాగం, వాత్సల్యం, ఆప్యాయతలు అంతరించి పోతున్నాయి. నిజంగానే మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలై పోతున్నాయి. చంద్రమండలంలోకి అడుగిడుతూ కొద్దిలో విఫలమైన మన చంద్రయాన్-2 గురించి, శాస్తవ్రేత్తల గొప్పతనాన్ని గురించి ప్రపంచమంతా ప్రశంసిస్తుంటే- మనం ఎంత గర్వపడ్డాం! ఎన్ని గంతులేశాం! ఎన్ని కేరింతలు కొట్టాం! సంతోషమే.. ఇదే ఆధునిక కాలంలో మానవత్వం అడుగంటి, రాక్షసత్వం కరాళ నృత్యం చేసిన కొన్ని సంఘటనలు నా మనసును కకావికలం చేశాయి. హృదయంలో అలజడి రేపాయి. ఆలోచనలో పడేశాయి. మనం ఇంతలా దిగజారి ఎందుకు బతుకుతున్నామో..? -ఇది జవాబు దొరకని ప్రశ్న. నిస్సిగ్గుగా తల వంచుకొనే జవాబు!
ఇటీవల కర్నూలు జిల్లాలో ఓ సంఘటన జరిగింది. ఓ వ్యక్తి తన దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న తన అనుచరుడిపై ఓ బీమా సంస్థలో రూ. 40 లక్షలకు పాలసీ చేయించాడు. కొన్ని నెలలు ప్రీమియం కూడా తానే కట్టాడు. ఎంత మంచివాడో కదా! కానీ విచారించాల్సిన విషయం ఏమంటే ఆ పాలసీలో- ఎంతో తెలివితేటలతో నామినీగా తన పేరే రాయించాడు. అమాయకుడైన ఆ అనుచరుడు నమ్మేశాడు. అంతే- యజమానిలో రాక్షసత్వం నిద్ర లేచింది. ఇంకేం! పథకం ప్రకారం ఆ అనుచరుణ్ణి ట్రాక్టర్‌తో తొక్కించేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించి, అధికారులను నమ్మించి ఆ 40 లక్షల రూపాయలను కాజేశాడు. డబ్బు కోసం తన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న అనుచరుణ్ణే చంపేశాడు. చివరకు దొరికిపోయి జైలుపాలయ్యాడు. కానీ చనిపోయిన ఆ వ్యక్తి తిరిగి రాలేడుగా! ఎంత క్రూరం!
ఆ మధ్య కేరళలో ఓ వ్యక్తి తన భార్య హాస్పిటల్‌లో చనిపోతే, డబ్బు లేక, అంబులెన్స్ లేక ఆమె మృతదేహాన్ని కర్రకు కట్టేసి భుజంపై మోసుకొంటూ దాదాపు 12కి.మీ. నడచి తన స్వగ్రామం చేరుకొన్నాడు. దారిన వెళ్ళే వారంతా ఈ ఉదంతాన్ని వేడుకగా, సినిమాలా చూశారేగానీ ఎవరూ సహాయం చేయలేదు. అందరిలోనూ మానవత్వం ఎందుకని చచ్చిపోయింది? ఇటీవల హైద్రాబాద్ దగ్గర ఓ వ్యక్తి తన భార్యను చంపి, తల నరికి చేతితో పట్టుకొని నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయాడు! ఏమిటి ఈ క్రూరత్వం? ఏమైంది మానవత్వం? పెళ్లి చేసేముందు ఆ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో తమ కుమార్తెను ఈ దుర్మార్గుడికి కట్టబెట్టి ఉంటారు. అయితే ఆ అల్లుడు చేసిన పనేంటి? ఎంత కోపమైనా చంపడం తప్పుకాదా? మనిషి మృగంగా ఎందుకు మారుతున్నాడు?
ఇంకో హృదయ విదారక సంఘటన..! మూడేళ్ల వయసున్న పసిపాపను చెరిచిన ఓ వృద్ధుడు.. ఇలాంటి విషయాలను వినడానికైనా మనస్కరించడం లేదు. ఏమిటీ నీచం? వృద్ధాప్యంలో అతనికి ఇంతటి పశువాంఛ ఎందుకు కలిగింది? వృద్ధురాలైన తల్లిని శ్మశానంలో వదిలేసిన ఓ పుత్రరత్నం! ఈ దుర్మార్గుణ్ణి పెంచేందుకు ఆ తల్లి ఎంతో కష్టపడుంటుంది! గుండెలోని ప్రేమనంతా రంగరించి పెంచుంటుంది. మరి వీడికేమైంది బుద్ధి? మనిషేగానీ రాక్షస పుట్టుక కాదుగా! మరి ఎందుకలా చేశాడు? ఇటీవల తమిళనాడులో ఓ విచిత్ర ఘటన జరిగింది. ఒక వివాహిత మహిళ మరొక యువకుడితో సంబంధం పెట్టుకొంది. కొన్ని రోజుల తర్వాత ఆ ప్రియుడికి పెళ్ళి నిశ్చయం అయింది. వాడిని ఎలాగైనా పోగొట్టుకోకూడదని, పెళ్ళి చెడగొట్టాలని, చివరికి తన కూతుర్ని ఇచ్చి పెళ్ళిచేయాలని పోలీసుస్టేషన్‌లో రభస చేసింది. పోలీసులు తమదైన శైలితో విచారించగా గుట్టుబయటపడింది.
ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో.. ఎనె్నన్నో గుండెల్ని పిండేసే గాథలు. మనల్ని మనం తిట్టుకొనే కథలు.. వ్యధలు. ఏమైంది ఈ మనుషులకు? రాళ్లను దేవుళ్ళుగా పూజించే మనం ఎనె్నన్ని దండాలు పెడుతాం? ఎన్ని రకాల పూజలు, నైవేద్యాలు పెడతాం? మరి- సాటి మానవులపై మనం ఎందుకు ప్రేమాభిమానాలు చూపడం లేదు? దేవాలయలు కళకళలాడాలి. దేవుళ్లకు మొక్కాలి. హుండీల్లో డబ్బులు వేయాల్సిందే! కానీ సాటి మనుషులకు రవంత ప్రేమను ఎందుకు పంచలేకపోతున్నాం? మనుషులంతా ఒక్కటే! ప్రేమ, వాత్సల్యాలు అనేవి కుటుంబంలోనే కాదు. అందరిపైనా చూపాలి. బాధల్లో ఎవరున్నా మనం వారికి సహాయపడాలి. అందుకు మనదగ్గర డబ్బు లేకపోవచ్చు! కానీ కొండంత ప్రేమే మన గుండెల్లో దాగివున్న ఆస్తిపాస్తులు. ప్రేమను పంచుదాం! అందర్నీ అక్కున చేర్చుకొందాం!
సామాజిక శాస్త్రం చదివేటప్పుడు అర్బన్ రిలేషన్స్ గురించి తెలిశాక- మానవ సంబంధాలు ఇలా వుంటాయా? అని అనుకొనేవాణ్ణి. పల్లెనుండి 30 సంవత్సరాల క్రితం హైద్రాబాద్‌లో అడుగుపెట్టాను. అందరి అంతరంగాలు చదవగలిగాను. ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక’ అని ఓ కవి చాలా కరెక్ట్‌గా రాశాడు. సంవత్సరాల కొద్దీ ఒకేచోట కాపురాలు చేస్తున్నా కొన్ని అపార్ట్‌మెంట్స్‌లో ఎవరికెవరో తెలియదు. ఏ ఇంట్లో ఎవరుంటున్నారో తెలియదు. ఎవరేం చేస్తున్నారో తెలియదు. ఎవరికెవరు తెలీకుండానే ఒకే ప్రాంగణంలో బతికేస్తుంటారు. తలచుకొంటేనే ఇది చాలాబాధ కల్గిస్తుంది. ఏం చేద్దాం? రానురానూ మనుషులు యాంత్రిక జీవనానికి అలవాటుపడుతున్నారు.
నేను కొంతకాలం కూతురి దగ్గర అమెరికాలో ఓ అపార్ట్‌మెంటులో వుండాల్సొచ్చింది. అక్కడ మాపై ఫ్లోర్‌లో ఓ నార్త్ ఇండియాకు చెందిన ఓ జంట, వాళ్ళకో చిన్న పిల్లాడు వుండేవాడు. రాత్రుళ్ళూ ఆ ఇంట్లోనుండి కొన్ని శబ్దాలు, ఆ అమ్మాయి ఏడుపులూ వినిపించేవి. ఏంటో అని కాస్తా శోధిస్తే తేలిందేంటంటే ఆ మగాడు ప్రతిరోజు రాత్రిపూట బాగా తాగి వచ్చి, పెళ్ళాన్ని కొట్టేవాడు. ఆ ఇల్లాలి ఏడుపురాగాలు ఎలాగో ఓలాగా తలుపుసందుల్లోనుండి బైటకొచ్చి అక్కడి వారి గుండెల్ని కోత కోసేవి. ఊరుగాని ఊరు. దేశం కాని దేశం. అల్లుడు అమెరికాలో వుద్యోగం అని ఆ అమ్మాయి తల్లితండ్రులు ఆ దుర్మార్గుడికి కట్టబెట్టి పంపేశారు. ఏం చేద్దాం? ఎవరు తీర్చగలం? ఆ కన్నీళ్ళని ఎలా ఆపగలం? ఆ మూగ రోదన రాగాల్ని నిలిపివేయలేమా? రోజూ వింటూ గడిపేస్తున్నాం! ఇలాంటి రోదనలు ఇంకెన్ని కుటుంబాల్లో దాగివున్నాయో? ఆ మహిళ, ఆ కన్నీళ్ళు అలా అలా ప్రవాహంలా నిత్యమూ దొర్లిపోతూనే వుంటాయి. మానవ సంబంధాలు ఎలా మారిపోతున్నాయో అనడానికి ఇటువంటి ఉదంతాలెన్నో.
ఒక్కోసారి 24 గంటలకు పైబడి రైలులో ప్రయాణిస్తుంటాం. ఐనా వొకర్నొకరు కనీసం పలకరించుకోం. చివరికి గమ్యం రాగానే ఎవరికివారు దిగి వెళ్ళిపోతుంటాం. మానవ సంబంధాలు కూడా కాలగర్భంలో కలసిపోతుంటాయి. గతంలో గ్రామ ప్రాంతాల్లో మనుషులు వొకర్నొకరు ఎంతబాగా పలకరించుకొనేవాళ్ళు! గ్రామంలోకి ఎవరైనా కొత్తవాళ్లు అడుగిడితే ‘నాయనా! ఎవరింటికి?’అని ఆప్యాయంగా పలుకరించేవాళ్ళు. ఏవీ ఈనాడు ఆ పిలుపులు? ఇప్పుడైతే గ్రామాల్లోనూ అలాంటి పలకరింపులు తగ్గాయి. రాజకీయాలు గ్రామాల్ని కలుషితం చేశాయి. వర్గాలు, కులాలు, మతాలు అంటూ గ్రామాల్లో కుంపట్లు రగిలించాయి. ఆప్యాయతలు అంతరించి కలహాలు చోటుచేసుకున్నాయి. ఈనాడు గ్రామాలు మనకి హాయిగా నవ్వుతూ కనిపించవు. ఆ గాలిలో స్వచ్ఛత అంతరించి, అక్కడి వాతావరణం కలుషితమైంది.
‘్ధనం’ అనే కార్చిచ్చు ఈనాడు మనుష్యుల మధ్య అనుబంధాల్ని దహించి వేస్తోంది. కాలం కంటే వేగంగా మనుషులు ధనార్జన వ్యామోహంలో పడి పరుగులు తీస్తున్నారు. డబ్బు సంపాదనలో అన్ని బంధాల్ని వదిలేసుకొంటున్నారు. కొందరైతే అన్నాచెల్లెలు, అక్కా తమ్ముడు, అమ్మానాన్నా వంటి బంధాలను సైతం విస్మరిస్తున్నారు. ఎవరేమైతేనేం.. సంపాదనే ధ్యేయంగా పరుగెత్తుతున్నారు. విలువలు, న్యాయం, ధర్మం, నీతి అన్నిటిని తుంగలో తొక్కేస్తున్నారు.
అంత పరిజ్ఞానం పెరిగినా, అందనంత ఎత్తుకు ఎదిగినా, బంధాలను మరచిపోతున్నారు. చివరికి చనిపోతే ఎవరూ ఏమీ తీసుకెళ్ళలేరు. ఏవీ మనవెంట రావు. భూగర్భంలో కలసిపోవడమో, కట్టెలపై కాలిపోవడమో జరుగుతుంది. జీవితమంతా తమని అలసట లేకుండా పరుగెత్తేలా చేసిన కరెన్సీ నోట్లు చివరిరోజు తమ వెంబడి రావు. మనం వేసుకొనే బట్టలు, మోజుగా కోరి కొనుక్కొన్న చెప్పులు కూడా మనతో చివరికి రావు. అందరూ ఎందుకో ఈ సత్యాన్ని విస్మరిస్తున్నారు. ప్రపంచాన్నంతా జయించాలని అహర్నిశలు పోరాటం చేసిన అశోక చక్రవర్తి చివరికి సమాజానికి కనువిప్పు కలిగేలా సందేశం ఇస్తూ, రెండు చేతులూ ఖాళీగా చూపిస్తూ సమాధి అయ్యాడు. తాను ఈ లోకం విడిచి ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతున్నానని, తన వెంట తాను సంపాదించిన మణిమాణిక్యాలు, వజ్ర వైఢూర్యాలు, అంతులేని సంపద.. ఇవేవి కూడా తాను తీసుకెళ్ళడం లేదని సందేశం ఇచ్చాడు. ఎంతో అద్భుత జీవన సత్యం ఇది. ఇది అందరికీ తెలిసినా పాపిష్ఠి డబ్బుకోసం ఒకర్నొకరు చంపుకొంటున్నారు. కిరాతకంగా ప్రవర్తిస్తున్నారు.
నేటి సమాజంలో చాలామందిలో నైతిక విలువలు ఏ కోశానా కనపడడం లేదు. మనం ఏదైనా హోదాలో వున్నప్పుడు చాలామంది స్వార్ధపరులు మనతో అన్ని పనులూ చేయించుకొంటారు. మనం ఆ హోదా కోల్పోగానే వాళ్ళెవ్వరూ మనకు కనిపించరు. కనపడినా పలుకరించరు. విలువలు కోల్పోయి, మానవత్వం మరచి, ధన సంపాదనే వీళ్ల ధ్యేయంగా వుంటుంది. మనతో ఏ పనీ లేనపుడు కొందరు స్నేహానికి, అనుబంధాలకు ఏ మాత్రం విలువ ఇవ్వరు. మనల్ని ఎరగనట్టే ప్రవర్తిస్తారు. మనం ఎదురుపడినా కనీసం పలకరించరు. స్వార్థంతో ఏదైనా ఆశించినపుడే వారికి స్నేహం గుర్తుకొస్తుంది.
తరాలు మారుతున్నాయి, అంతరాలు పెరిగిపోతున్నాయి. ఒక తరం మరో తరానికి ఆస్తిపాస్తులు పంచి పెడుతోందే తప్ప , ఎలాంటి ప్రేమాభిమానాల్ని పంచలేకపోవడం దారుణం. ప్రేమాభిమానాలను పంచాలని మనకు ఉన్నా, వాటిని అందుకొనే తీరిక కొందరికి ఉండదు. ఆస్తిపాస్తులపైనే ఆసక్తి. ఆప్యాయతలకు, అభిమానాలకు మంగళం పాడేయడమే మానవ విలువల పతనానికి నిదర్శనం. స్నేహాన్ని, రక్తసంబంధాలను చిన్నచూపు చూస్తున్న ఉదంతాలు నిజంగా గుండెలను పిండేసేలా ఉంటాయి. కానీ ఆ కథనాలు నేడు ఎవరినీ కదిలించడం లేదు.
మారిన కాలంలో మనుషులు కొత్త రంగుల్ని ముఖాలకు వేసుకొంటున్నారు. ఒకప్పుడు కిరాతకులు, దౌర్జన్యాలు చేసేవారు, అవినీతిపరులు విచ్చలవిడిగా డబ్బు సంపాదించేవారు. ఇప్పుడు రాజకీయ నాయకులు, కాంట్రాక్టర్లు, చివరికి ఐఎఎస్ ఆఫీసర్లు ఎవరూ ఇందుకు అతీతులు కారు. చదువులు పెరిగేకొద్దీ కొంతమంది మరీ దిగజారుతున్నారు. విజ్ఞానంతో వికసించాల్సిన మనసులు కులం అని, గోత్రం అని, మతం అని వికృతంగా ప్రవర్తించడం బాధాకరం. లంచాలు తీసుకోవడం, నాసిరకంగా పనులు చేసి కోట్లు ఆర్జించడం, ఎన్నికలవేళ డబ్బు తీసుకొని వోట్లువేయడం, ఇతరుల సంపాదనపై ఆధారపడి బతకడం, నమ్ముకున్న వాళ్ళను మోసం చేయడం, తల్లిదండ్రుల భారం ఎప్పుడు తగ్గుతుందా? అని ఎదురుచూడడం, నిత్యావసర సరకులను కల్తీ చేయడం.. ఇలాంటివన్నీ అనైతిక పనులే! పాడైపోయిన అన్నాన్ని పనిమనుషులకు ఇవ్వడం అనైతికమే గాని అది దానం కాదు. మనం అన్నం తినేముందు ఒక్కసారి ఆలోచించాలి. అన్నం తినలేని కుటుంబాలు ఎన్ని వుంటాయో అని. మనం తినాల్సిందే. కానీ అది మన ధర్మపరమైన సంపాదనే అయివుండాలి. ఇతరుల నోరుకట్టి మనం కడుపు నింపుకోవాలనుకోవడం దుర్మార్గం.
మనిషిని మనిషి గౌరవించడం అవసరం. ప్రేమానురాగాలు పంచుకోవాలి. మనం సత్ప్రవర్తనతో మెలగడమే కాకుండా మన పిల్లలకు కూడా మంచి అలవాట్లు, మంచి నడవడి, నైతిక విలువలు నేర్పించాలి. మానవత్వం పరిమళించాలి. ఎంతసేపూ ఎదుటివాడిని ఎలా మోసం చేయాలన్న దుర్బుద్ధికి స్వస్తిపలకాలి. అప్పుడే మన సమాజం హాయిగా వుంటుంది. ఓ మానవత్వమా నీకు జోహార్లు! నువ్వు మానుండి దూరం కావొద్దు. అందరిలోనూ విలువలు నిండాలి. మంచి సమాజాన్ని నిర్మించాలి. అందరూ హాయిగా జీవించాలి.

-సమ్మెట 88863 81999