మెయిన్ ఫీచర్

విషాదాంత నవ్వు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గొప్పగా నవ్వించినోళ్లంతా -కష్టంగా కన్నుమూస్తున్నారు. ఏనాటి శాపమో.. తరాలు మారుతున్నా తెలుగు కమెడియన్స్ అంతిమ ఘడియలు మాత్రం విషాదాన్ని దాటలేకపోతున్నాయి.
‘నవ్వించినంత కాలం నవ్వించాడు. సంతృప్తిగా కనుమరుగయ్యాడు’ అని చెప్పుకోడానికి ఓ ఒక్క కమెడియన్ లైఫ్‌నీ ఎగ్జాంపుల్ చేసుకునే
అవకాశం లేకుండాపోతోంది. ఏళ్లనాటి శనికూడా ఏడేళ్ల తరువాత ఉపశమిస్తాడు. కానీ -మన
కమెడియన్స్‌ని మాత్రం మృత్యువు సంతృప్తిగా తీసుకెళ్లడం లేదు. అర్థాంతరంగా
పట్టుకుపోతోంది. చాలామంది కమెడియన్స్ అలా మాయమైనోళ్లే. ఇప్పుడు -వెనె్నల నవ్వులు కురిపించిన వేణువూ మూగబోయింది.
వేణమాధవ్‌దీ విషాదాంత
మరణంగానే మిగిలింది.
నవరసాల్లో హాస్యానిది ప్రత్యేకస్థానం. జీవితంలో ఒక్కసారీ నవ్వనోడు నవ్వులపాలవుతాడన్నట్టు.. మనిషికి నిత్యం ఆనందం కావాలి. చలన చిత్రాల్లో ఆనందాన్ని అందించే కమెడియన్ల పాత్ర తక్కువేంకాదు. అప్పట్లో ఎన్టీఆర్, నాగేశ్వరరావు హీరోలుగావున్న చిత్రాల్లో కమెడియన్స్ ఎవరని ఖచ్చితంగా పంపిణీదారులు చూసేవారట. హీరోతోపాటుగా హాస్యనటుడికి కూడా సమానమైన ప్రాధాన్యత వుండేది. స్వర్ణయుగంలో హాస్యనటులుగా చెలామణి అయిన కస్తూరి శివరామ్, రేలంగి, రమణారెడ్డి, అల్లురామలింగయ్య, రాజబాబు, పద్మనాభం, పేకేటి శివరామ్, చదలవాడ, నల్లరామూర్తి, సీతారామ్‌లాంటివారు పేరెన్నికగన్నారు. ముఖ్యంగా రేలంగి, రాజబాబు, అల్లు రామలింగయ్యలది ఒక్కో శకంలా చరిత్ర సృష్టించారు. వారంతా వెళ్లిపోయాక వచ్చినవారు నూతన్‌ప్రసాద్, బ్రహ్మానందం, బట్టల సత్తిగాడుగా పేరొందిన మల్లికార్జునరావు, ఎంఎస్ నారాయణ, కొండవలస, ధర్మవరపు సుబ్రహమణ్యం, ఏవిఎస్, గుండు హనుమంతరావు, ఆహుతిప్రసాద్, వేణుమాధవ్ ఆ లోటు భర్తీ చేయడానికి వచ్చారు. అంతా వారివారి పాత్రల్లో రాణించినోళ్లే. ముఖ్యంగా బ్రహ్మానందం దాదాపు వెయ్యిపైగా చిత్రాల్లో నటించి గిన్నిస్‌బుక్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ఈ కమెడియన్స్‌లో అధికభాగం వెండితెరపై ఎన్ని నవ్వులు పండించినా వారి జీవితాలను విషాదమే వెన్నాడింది. ముఖ్యంగా వారి జీవితాల్లో నవ్వులు పూయడానికి బదులు చీకటితెరలు అలముకున్నాయి. ఒక్కొక్కరినీ ఒక్కో ఇబ్బంది వెంటాడింది. గత దశాబ్దకాలంలో అనేకమంది హాస్యనటులను తెలుగు పరిశ్రమ దూరం చేసుకుంది. వీళ్లంతా దాదాపు అర్థాంతరంగా దూరమైనవాళ్లే తప్ప సంతృప్తికర మరణం కాకపోవడం మరింత బాధాకరం. తెలుగు హాస్యానికి వెన్నుదన్నుగా నిలిచిన మంచి నటులు దూరమవ్వడంతో చిత్రాల్లో మంచి హాస్యమే మృగ్యమైంది. ధర్మవరపు సుబ్రహ్మణ్యం టీవీ షోలనుండి గ్రీన్‌కార్డ్‌తోనే తెలుగు తెరపైకి వచ్చారు. అద్భుతమైన టైమింగ్‌తో నవ్వులు పూయించడంలో అందెవేసిన చేయిగా అనేక పాత్రలు చేసి మెప్పించారు. అప్పటి అధికార పార్టీకి ఆమోదయోగ్యుడవ్వడంతో రవీంద్రభారతికి ప్రధాన కార్యర్శిగానూ సేవలందించారు. ఆయనకు ఆరోగ్యం బాగాలేదన్న విషయం కూడా దాచిపెట్టారు. అనుకోకుండా ఓ రోజు ఆయన మరణవార్త వినాల్సి వచ్చింది. రాజకీయ ప్రవేశం చేసి ఊరూరా తిరిగి అనేక స్కిట్స్ చేసి ప్రజలకు సేవ చేయాలని వచ్చిన మంచి నటుడు మల్లికార్జునరావు కూడా అనుకోకుండా దూరమవ్వడం విషాదం విశేషమేమిటంటే వీళ్లందరూ 60ఏళ్లు నిండనివారే. బ్రహ్మానందానికి పోటీగా ఏ పాత్రలోనైనా ఇమిడి నవ్వులు పూయించిన నటుడు ఎంఎస్ నారాయణ. ఒకానొక సమయంలో పేరడీ పాత్రలకు ఎంఎస్ నారాయణ తప్ప మరెవరూ పనికిరారు అన్న మాట పరిశ్రమలో వినిపించింది. అందుకు తగినవిధంగా ఆయన కూడా ఏ పాత్రవేసినా అందులో ఒదిగిపోయేవారు. చారిత్రక పురుషులు, ప్రస్తుతంవున్న హీరోలు, రాజకీయ నాయకులు.. ఇటువంటి ఎవ్వరిపాత్రలోనైనా ఎంఎస్ ఒదిగిపోయేవారు. మొదటిసారి మృత్యువును ఎదిరించినా రెండోసారి మాత్రం ఆయన తప్పించుకోలేకపోయారు. ఆయనతో ప్రారంభమైన ఆమ్ ఆద్మీ నాయకుడు కేజ్రీవాల్ పాత్రలో ప్రేక్షకులకు కనిపించకుండా దూరమవ్వడం తెలుగు ప్రేక్షకులను బాధించింది. మంచి ఫామ్‌లో వుండగానే దూరమవ్వడం విషాదం. మొదట విలన్ పాత్రల్లో మెప్పించి, ఆ తరువాత కమెడియన్‌గా ప్రేక్షకులను అలరించిన ఆహుతి ప్రసాద్ కూడా దూరమయ్యారు. ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ ప్రేక్షకుల నాలుకలపై ఆడుతున్నాయి. బాపు పరిచయం చేసిన హాస్యనటుడు ఏవిఎస్. ఒక్క సినిమాతోనే స్టార్ కమెడియన్‌గా వెలిగిపోయారు. ‘తుత్తి’ అన్న డైలాగ్‌తో ఆయన చేసిన మేనరిజమ్ ప్రేక్షకులపై మాజిక్ చేసింది. పరిశ్రమకు ఆయన పరిచయమైన 10, 15 సంవత్సరాలు ఒక్క రోజుకూడా ఖాళీ లేకుండా పనిచేశారు. లివర్ ఫంక్షన్ సరిగా లేకపోవడంతో ఆయన కుమార్తె దానం లివర్‌ను దానం చేశారు. ఆ తరువాత కొన్నాళ్లు తన వెలుగులు పంచినా ఆ తరువాత చీకటిలో కలిసిపోయారు. మరొక లేడీ జేమ్స్‌బాండ్ కమెడియన్ తెలంగాణ శకుంతల. తన టైమింగ్‌తో ధాటి అయిన మాటలతో ఆమె హాస్యం ప్రేక్షకులను అలరించింది. చిన్న పాత్రలైనా సరే ఆమె తన ముద్రను వేసింది. మంచి ఫామ్‌లో వున్న సమయంలోనే హార్ట్ ఎటాక్‌తో దూరమయ్యారు. తెలంగాణ శకుంతల ఏంటి? చనిపోవడం ఏంటి అని ప్రేక్షకులు నివ్వెరపోయారు. గయ్యాళి గంగమ్మలా ప్రేక్షకులను భయపెట్టిన ఆమె మరణం నుంచి తేరుకోవడం అంత సులభం కాలేదు. గుండు హనుమంతరావు తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో సరికొత్త మానరిజమ్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆయన చేసినది కొనే్న పాత్రలు అయినా ప్రేక్షకులు ఆదరించారు. అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొని పాటలు పాడి ప్రేక్షకులను అలరింపజేసేవారు. ఓ చిన్న సమస్యతో ఆస్పత్రిలో చేరారంటూ వార్తలు వచ్చాయి, ఆ తరువాత ఆయన దూరమయ్యారన్న వార్త వచ్చింది. పరిశ్రమ మొదట నమ్మకాదు, కానీ నిజాన్ని ఒప్పుకోక తప్పదు. తొలినాళ్ళనుంచి చిన్న చిన్న పాత్రలు వేసిన లక్ష్మీపతి కూడా స్నానాలగదిలో హార్ట్‌ఎటాక్‌తో చనిపోవడం విషాదకరం. అయితే ఓకె! అన్న ఒకే ఒక్క డైలాగ్‌తో వంశీ పరిచయం చేసిన కొండవలస లక్ష్మణరావుకూడా అనారోగ్య సమస్యలతో దూరమయ్యారు. లేట్ వయసులోవచ్చినా ఆయన కొన్ని పాత్రలతోనే ప్రేక్షకుల హృదయాలలో రిజిస్టర్ అయ్యారు కొండవలస. ముఖ్యంగా ఉత్తరాంధ్ర మాండలికంలో ఆయన చెప్పిన డైలాగులు ప్రేక్షకులను ముగ్ధులను చేశాయి. అనేక నాటకాల్లో విలన్‌గా భయపెట్టిన కొండవలస, వంశీ మార్క్ నేపథ్యంతో కమెడియన్‌గా మారి నవ్వులు కురిపించడం ఓ వైవిధ్యమైన విషయమే.
వీరందరిదీ ఒక గాథ అయితే 101 జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్‌ది మరో బాధాకరమైన విషయం. ‘బామ్మమాట బంగారుబాట’ చిత్రం షూటింగ్ జరుగుతుండగా క్రేన్ విరిగిపోవడంతో గాలిలో వున్న కారుతోపాటుగా నూతన్‌ప్రసాద్ క్రిందడిపోయాడు. అప్పుడు విరిగిన నడుము చివరివరకూ ఆయనను ఇబ్బందిపెట్టింది. నడవలేని పరిస్థితి. నటించలేని పరిస్థితి. అయినాకానీ దేవుడుపెట్టిన పరీక్షను ఎదుర్కొన్నాడు. వీల్‌ఛెయిర్‌కే పరిమితమై అనేక పాత్రల్లో నటించాడు. ముఖ్యంగా అనేక చిత్రాలకు ఆయనచెప్పిన డబ్బింగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేది. అలా జీవితంలో పోరాడి చివరిశ్వాస విడిచారు.
స్వర్ణయుగంలో కూడా గొప్ప హాస్యనటులుగా పేరొందిన కస్తూరి శివరావు, వంగర వెంకట సుబ్బయ్య, రాజబాబు లాంటివారు కూడా మధ్యస్థంగానే దూరమయ్యారు. తొలి స్టార్ స్టార్ కమెడియన్‌గా అందరి చేత మన్ననలు అందుకున్న కస్తూరి శివరామ్ చరమాంకం చాలా విషాదకరం. తినడానికి తిండి లేని పరిస్థితిలో ఆయన ప్రాణాలు వదిలారు. సినిమాలు లేక చేతిలో సంపాదన చాలక వృద్ధాప్యంలో ఆదుకునేవారు లేక వంగర వెంకట సుబ్బయ్య తెనాలి దగ్గర సంగం జగర్లమూడిలో కన్నుమూశారు. రాజబాబు స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగినా చివరి రోజుల్లో అనేక ఇబ్బందులు పడ్డారు. నిర్మాతగా బాబ్ అండ్ బాబ్ మూవీస్ పతాకంపై అనేక ఉత్తమ చిత్రాలు నిర్మించిన ఆయన స్వయంకృతాపరాధంతోనే చేతిలో చిల్లిగవ్వ లేనివాడిగా తయారయ్యాడు.
ఇలా హాస్యనటులంతా సంపాదన అనే విషయాన్ని పక్కనబెడితే ఏదోఒకవిధంగా దూరమవ్వడం విషాదం. ఇటీవల తన అద్భుత స్వరంతో తొలిరోజుల్లో ఆకట్టుకున్న హాస్యనటుడు వేణుమాధవ్ కూడా దూరమవ్వడం పరిశ్రమకు పెద్ద లోటే. హైపిచ్‌లో పలికే మిమిక్రీ కళాకారుడు ఎవరూ అంటే అందరూ వేణుమాధవ్ పేరే చెబుతారు. అది డాన్సులు కానీ, మెలో డ్రామా కానీ, ఫైట్స్ కానీ.. ఏవైనా సరే తనదైన శైలిలో చేసి మెప్పించగలవాడు వేణుమాధవ్. అటువంటి నటుడు దూరమవ్వడం కూడా పరిశ్రమకు లోటు. కొంతమందికి పారితోషకం తక్కువ ఉండచ్చు, కొంతమందికి ఎక్కువ వున్నా అది దుబారా కావచ్చు. మరికొంతమందికి దర్శకత్వం చేయాలన్న దురద ఉండొచ్చు, ఇంకొందరు సినిమాలు తీసి చేతులు కాల్చుకోచ్చు. ఇవన్నీ ఒక ఎతె్తైతే పక్కనున్న మరొక నటుని ప్రోత్సాహంతో మరోవైపు సినిమాలలో చేతులు, కాళ్ళు పెట్టేసి అవకాశాలు లేకుండా చేసుకోవచ్చు. పక్కవాడు తనకన్నా పెరిగిపోతున్నాడన్న అక్కసుతో ఏదోవిధంగా వాణ్ణి తగ్గించే ప్రయత్నమూ చేసే హాస్యనటులూ ఉన్నారు. అది ఏ పాత్ర అయినా పరిశ్రమలో వున్నపుడు కెరీర్‌ను జాగ్రత్తగా తీర్చిదిద్దుకుంటూనే ఆయా నటులు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు.
ప్రస్తుతం బ్రహ్మానందం, అలి, పోసానికృష్ణమురళి, తా.రమేష్, వెనె్నల కిషోర్, సునీల్ లాంటివాళ్ళు అక్కడక్కడా చిన్న తారలుగా కనిపిస్తున్నారు. వీరందరిదీ ఒక్క ఎత్తయితే ప్రస్తుతం జబర్దస్త్‌గా వస్తున్న హాస్యనటులు అనేకమంది కళ్ళు తెరుస్తున్నారు. వీరందరూ గత కాలపు వైభవాన్ని తెలుగుతెరపైకి తీసుకురాగలరా? కాలమే సమాధానం చెప్పాలి!

-జి రాజేశ్వర రావు