మెయిన్ ఫీచర్

సాహితీ విరిమల్లి.. అద్దేపల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కృష్ణా - గోదావరుల సారస్వతవేది అద్దేపల్లి. సముద్రమంటే నదుల పవిత్ర సంగమం. అందుకే ఎక్కడో బందరు తీరంలో జన్మించి కడలితీరం కాకినాడలో తన ఉద్యోగ సాహిత్య ప్రస్థానం సాగించడంతో బాటు, ఆయన అంకితభావం, ప్రాకృతిక ఆరాధనత్వం ఎన్నో కవిత్వోద్యమాలకు ఆలంబనలై నిల్చాయి. కవిత్వంలోని స్ఫూర్తి - దీప్తి ఆత్మద్రవ్యంగా ఆవిష్కరింప చేసుకున్నారు. సాహిత్యం విశ్వజనహితం కావాలన్న సందేశాలు ఎన్నో రూపాల్లో పద్యం, గద్యం, కవిత, నాటకం, గజళ్ళు, రుబారుూలు, నానీలు, రెక్కలు - యిలా ఒకటేమిటి, అన్ని ప్రక్రియల పట్ల ఆయన తనదైన శైలిని నిర్దేశించుకుంటూనే వచ్చారు. ముఖ్యంగా మానవసంబంధాల విలువల్ని, వలసవాదనల్ని, ప్రపంచీకరణల్ని, స్వావలంబన దశల్ని, స్వర్ణకరచాలనాల కోసం అర్రులు చాచి సంతకాలు పెట్టిన వేళ్ళని కూడా కవితా సారాంశాలుగా సారభూతమైన వస్తువులుగా రూపుకట్టించారు. అందుకే అద్దేపల్లిని అందరూ ‘‘కవుల కర్మాగారం’’గా ఆత్మీయంగా పిల్చుకునేవారు. అయినా ధైర్యంగానే సంపుటమైనా, పొగచూరిన ఆకాశమైనా, సమకాలీనతలు అంతరంగ అక్షరాల్లోని మధనాలు ఆయన పలుకులకు పసిడి పాళీల్లోంచి పదారువనె్నలుగా రూపాంతరం చెందాయి. అది మినీకవిత, రెక్కలు రూపం నుంచి వైవిధ్యభరిత వస్తు - ప్రతీకలు - భావచిత్రణలు సూచ్యంగానూ, వాచ్యం గానూ అక్షరీకరించారు. అద్దేపల్లి అక్షరాల్లో - ఆకాశాన్ని, ఆకుపచ్చని నేలను, సముద్రాన్ని మృత్యుధూళుల నుంచి కాపాడే అణుయుద్ధాల నిలువరింతల్ని భీకర యుద్దపోకడల్కి ఎదురునిల్చే రచనలు చేసారు. అలాగే ప్రపంచ విపణి మాయాజాలం, మనిషి వస్తువుగా మారిపోవడం నుంచి విస్కృత సంస్కృతి వింతపోకడలు, ఆయుధ వ్యాపారం, స్ర్తిలను విచక్షణ మర్చేలా చూపించి దుర్నయాలు, నియతి లేని సంగీతధోరణులు, వినిమయ పోకడల్ని అన్నింటినీ నిర్జించారు. అందుకే ‘‘నే సలాం చేస్తా ఈ జనానికి పేదవాడి కోసం పోరు చేసేవాడికి’’ అన్నారు. బాల్యం గురించి ‘‘ఈ ధనమంతా పోనీ యవ్వనమంతా పోనీ ఆనాటి బాల్యాన్ని ఒకసారి రానీ’’ అని ఆలపించారు.
అద్దేపల్లి అంతర్జ్వాల కవితాప్రస్థానం, రక్తసంధ్యల మెరపుపువ్వులు ఒక ఎతె్తైతే ‘‘శ్రీశ్రీ పై వ్రాసిన కవితాప్రస్థానం - అగ్నిశిరస్సున వికసించిన వజ్రమన్నది’’ సాధికారిక అభిప్రాయం. యింకా చెప్పాలంటే ఆయన అగ్నిశిఖల్లాంటి రచనల్లో సామ్మవాదం, సాంస్కృతిక పరారుూకరణులు, వలస పెట్టుబడుల పరిష్వంగాలు, విష సంస్కృతులపై నిరసనలు పలు సంపుటాలుగా వచ్చి చేరాయి.
డా॥ అద్దేపల్లి రామమోహనరావు - ఆరున్నర దశాబ్దాల సాహితీ సంచారి. ‘‘కవిత్వం కంటె జీవితం గొప్పది - కవిత్వం పోరాటగీతం రాయకముందే జీవితం పోరాటంగా మారిపోతుంది’’ యివి విలువైన ఆచరణీయ సత్యాలుగా తన సాహితీ ప్రస్థానం ప్రారంభించిన 1960 ల నుంచి 2016 వరకు తన సాహితీ సృజనను - నిబద్ధతను ఆదర్శనీయం చేసిన ప్రజాకవి అద్దేపల్లి. ఎందరో సమకాలీనులకు కవిగా, దృష్టిపథకునిగా, సమీక్ష - విమర్శనాల సమతుల్యం పాటించిన సౌజన్యతామూర్తి. యిక ఆంధ్ర, ఆంధ్రేతర ప్రాంతాలవారు నిర్వహించే సభలలో సాహితీ సంచాలనాల కోసం నిరంతరం అవిశ్రాంతంగా పర్యటించేవారు. వేలాది కవులకు దిక్సూచి గా నిలిచారు.
ఈ పరిణామక్రమంలో ‘పొగచూరిన ఆకాశం’, ‘అయినా ధైర్యంగానే’, ‘ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల’, సాహిత్య సమీక్షలు, కుందుర్తి, జాషువా, బుద్ధం శరణం గచ్ఛామి, స్ర్తివాద కవిత్వం, గీటురాయి వంటివెన్నో ఉన్నాయి. అద్దేపల్లి అక్షరాల్లో ఆనందానుభూతి ఉంటుంది. నిరంతర అధ్యయనం అంతరంగాల్లో జ్ఞానసంపన్నునిగా చేసింది.
ఒక ప్రవాహవేగం, పరిణతితో తన సాహిత్య సర్వస్వం పరమార్థం సమాజచేతనే - మార్పు పురోగమనానికి కరదీపిక కావాలన్న తన ఆశయం అని ప్రకటించేవారు. మనిషి కేంద్రబిందువుగా భావవిప్లవం వస్తేనే, అది నవసమాజానికి నాందీవాచక వౌతుందన్న అద్దేపల్లి వాక్యాలు ఆచంద్రార్కం తెలుగు సాహితీఆకాశంలో నిల్చేఉంటాయి.
అద్దేపల్లి వారిలోని ఇంకొక లక్షణం అనుభూతి, సౌందర్య భావనలతో బాటు ప్రతీకల్ని, భావచిత్రాల్ని సామాజికాంశాలతో జోడించటమూ చూస్తాము. సాధారణంగా అనుభూతిని వైయక్తకం అంటుంటాము. అది సమాజ చలనశీలత ను సంతరించు కున్నప్పుడు సమగ్ర పరిపుష్టతకే పట్టం కట్టినట్లవుతుందంటారు. 1971లో గడియారం స్తంభం సెంటర్లో జ్వాలాముఖి సమక్షంలో అందుకున్న పాట ఎందరికో మంచి మాట పాట విన్నామన్న అనుభూతి ని మిగిల్చింది.
‘‘ఏంచెయ్యాలేం చెయ్యాలి - ఇందిరమ్మకు భజన చేయాలి’’ - ఇవి ఆనాటి దేశ వ్యవస్థలో ఇందిర శకాన్ని గురించిన ఆలోచన, ఆవేశం, వివేచన తెలియజేసాయి. తన దృక్పథాన్ని వివరించడంలో - విశదీకరణల్లో విమర్శ విమర్శే, మనిషి మనిషే అంటాడు. తన విమర్శనా శైలిలో టి.ఎస్. ఎలియట్, ఎఫ్.ఆర్. సెరల్స్ ప్రభావ చైతన్యం - ఒక విశిష్ట జీవన సిద్ధాంతం, ఒక భావనా స్రవంతి, ఆధునికతల నుంచి ఆవిష్కరించారు. దీనికి పదునైన శిల్పరీతి అలవర్చుకున్నారు. మొత్తం కవితల్లోంచి నూతన భావ ప్రాతినిధ్యం కల్పించారు. ఒక మహోదరణ కావ్యం కావాలంటే మరో ప్రపంచపు ఆద్యంతాల సృష్టిని శ్రీశ్రీ భావాభివ్యక్తిని ఆలంబనలుగా చేసుకున్నారు. శ్రీశ్రీ శిల్పశక్తిని తెల్పారు. శ్రీశ్రీని సరిగా ఆవిష్కరించగల్గనప్పుడు ఎందరో క్రూర విమర్శకుల భావాలకు సముచితంగా తెల్పిన జవాబులున్నాయి. శ్రీశ్రీని నూతన చైతన్య ప్రతినిధిగా ఆయన రాసిన మహాప్రస్థానంపై తొలి విమర్శనా గ్రంథమే దీనికి సాక్ష్యం. భావాల్ని బలంగా చెప్పటం, అక్షరాలకు విశ్వరూప ప్రదర్శన, అలంకారాల్ని మనఃపూర్వక పదాల సృష్టిలోంచి అర్థవంతమైన సమాలోచనలే చేసారు.
1970ల అంతర్జ్యావల లోంచి తపన, కవితావేశం, మనిషికి కావలసిన గుర్తింపు లభింపచేసారు. కవిత్వంలో ఎముకలు బయటపడ్డ గోవుల రక్త మాంసాల నుంచి డబ్బులు పిండే మనిషిని తలచుకుని, బాధలు పడే మనిషిని చూపారు. కవిగా నిగ్గు తేల్చే నిజాల్ని ఆవిష్కరించే ప్రయత్నంలో ‘నోటిలో సత్యం, చేతల్లో హింస’ గల మనుషుల నైజం సిగ్గులేనితనాన్ని నిగ్గదీసిన ధీశాలి తిరగబడి గుండె దిటవు - తిరుగుబాటు హేతువుగా రచన లందించారనే చెప్పాలి.
ఈ దశలో మనిషిని ఇలా హెచ్చరించారు. ‘‘దైవమా నిద్ర లే’’ శీర్షికలో అతికాల దుర్వార ధూమగీతికల్నీ ఆలపించారు. తను విన్పించే ప్రళయధ్వనుల్ని గుండె గోడకు చేర్చి వినండని - విన్పించారు.
ఇలాగ ‘కళల్లో మేలుకొని, హృదయంలో నిద్రపోయి, సంఘపు రైలింజను వదిలే రాక్షసి బొగ్గు రగులుతున్న కళ్లల్లో మంటలు లేచి, ప్రపంచమంతా ఒకే ఒక్క పీడకల లాగ, పీక పిసుకుతున్న హృదయానికి నిప్పు ముట్టించి, గాలి మరల్లో, కమ్ముకున్న ధూళిపొరల్లో, అతి వికార భీకర అగ్ని తాండవం చేస్తున్నాను. అంతే సొంత ఇంటికి నిప్పంటించుకున్నా’ వాళ్ల పట్ల ఆవేదన గుండె లోతుల్లోంచి విన్పించేట్లు చేసారు. లేవాలని స్పందించారు. జన జీవనానికి తరాల వెలుగు శిఖరంగా, సాహితీ నిత్య సంచారిగా ఎన్ని కంప్యూటర్లనైనా మోసుకుపోదాం, మాతృభాషకే నాలుక చివర ఇల్లు కట్టుకుందాం. కవిత్వం వ్రాసిన క్షణాల్నించి ‘‘దశాబ్దాలు గడిచినా పాఠకుల హృదయాల్లో నీ అక్షరాలు వెంటాడుతున్నపుడు మాత్రమే నువ్వు కవిగా జీవించినట్లు’’ అన్నది ఆచరణీయం చేసిన మేధో ప్రగతిశీల కవి అద్దేపల్లి.
అద్దేపల్లి జీవన రాగోదయ సరళిలో - శ్రుతిలయల రవళులుగా ఆయన షష్టిపూర్తి, సప్తతి, అశీతి వేడుకల్లో ప్రత్యక్ష, పరోక్ష అనుభూతులు - సాహితీవేత్తలందరికీ అనుభవేకవేద్యాలు. (సెప్టెంబర్ 6, 1936 నుండి జనవరి 13, 2016). ఆరు దశాబ్దాల సాహితీ స్పర్శానుభూతి సార్వజనీన జీవనగమనం, ప్రగతిశీలతల పరుసవేది, సాక్షరతా తీరంలో అశీతి ఆకుపచ్చని సంతకంగా సభలు - సన్మానాలు అందుకున్న సంరంభం తీరకుండానే తను మిగిల్చివెళ్ళిన కాలం వెంబడి పోరాటాలు, ప్రవాహిమ స్పాంటినిటీలు - స్పార్క్‌లు తీపి చేదు జ్ఞాపకాలుగా కాలం సంపుటాల్లో మిగిల్చి వెళ్ళిపోయారు.
సముద్రాన్ని, ఆకాశాన్ని అమితంగా ప్రేమిస్తూ ఆకుపచ్చని సజీవ సముద్రం నా నేల అన్నా, పొగచూరిన ఆకాశంలోని కాలధూమాల్ని కలంతో ఎదిరించినా అద్దేపల్లి అక్షరాల ప్రగతిశీలత, సమకాలీనతల అభ్యుదయ పథికుడు.
అక్షరాలే అద్దేపల్లి శ్వాస - అభ్యుదయం నా పదం అని ఉభయ రాష్ట్ర - రాష్ట్రేతర ప్రాంతాలలోని సభల్లో ప్రకటించేవారు. అద్దేపల్లి మాటల్లో చెప్పాలంటే ‘అంతరాలు అంతరించిన అంతరంగాల్లో చరిత్ర కొత్త శిశువును ప్రసవిస్తుంది’ ‘ఎన్ని భాషల ఎన్ని కంప్యూటర్లనైనా మోసుకుపోదాం - తెలుగు భాషకి మాత్రమే నాలుక చివర ఒక ఇల్లు కడదాం’ - ఈ వాక్యాలు చాలు మాతృభాషపై ఆయనకు గల ప్రేమ తెల్సుకోవడానికి. నిజాయితీగా కవులెప్పుడూ ఆచరణీయ సత్యాల్నే చెప్పాలన్న భావన తెలుస్తుంది. ఎన్నో సందేశాత్మక రచనల్లో - జీవనమూల్య రుచులు వెలార్చిన సాహితీవేత్త.

- వి.యస్.ఆర్.ఎస్. సోమయాజులు 9441148158