మెయన్ ఫీచర్

371వ అధికరణం.. ఓ తేనెతుట్టె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యాంగంలోని 371వ అధికరణం జోలికెళ్లేప్రసక్తి లేదని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణాన్ని ఇటీవల కేంద్రం రద్దు చేసిన సంగతి విదితమే. 370వ అధికరణం రద్దుతో 72 ఏళ్లుగా దేశాన్ని పట్టి పీడిస్తున్న కశ్మీర్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. దీంతో 371వ అధికరణను సైతం రద్దు చేస్తారనే వదంతులు వచ్చాయి. చాలామందికి 371వ అధికరణ గురించి సమగ్రంగా తెలియదు. ఈ అధికరణ వల్ల ప్రయోజనాలు ఏమిటి?, ఏయే రాష్ట్రాల్లో ఇది అమలవుతోందన్న విషయమై చర్చ జరుగుతోంది. 368వ అధికరణ ద్వారా కేంద్రప్రభుత్వం 371వ అధికరణకు సవరణలు చేసి 371ఏ, 371బీ, 371సీ, 371డీ, 371ఈ, 371 ఎఫ్, 371 జీ, 371 హెచ్, 371ఐ, 371 జే అనే ప్రత్యేక అంశాలను చేర్చింది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల వారు 371వ అధికరణను రద్దు చేస్తారనే ఆందోళన వ్యక్తం చేయగా, దీనిపై వచ్చే వార్తలను నమ్మరాదని అమిత్ షా ఈశాన్య రాష్ట్రాల మండలి 68వ ప్లీనరీలో స్పష్టం చేశారు. ఈ అధికరణ జోలికి తమ ప్రభుత్వం వెళ్లదని, ఒక శరణార్థి కూడా ఈశాన్య రాష్ట్రాల్లో తిష్టవేసేందుకు అనుమతించబోమని ఆయన ప్రకటించారు. ఆశ్చర్యకరమైన విషయమేమంటే- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు మూలకారణమైన అనేక అంశాల్లో ఒకటైన 371 డీని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు పట్టించుకోవడం లేదు. 371 అధికరణ తమకు సంబంధంలేని అంశంగా చాలా మంది పరిగణిస్తున్నారు. 371వ అధికరణను రద్దు చేసే ప్రసక్తి లేదని, దీని గురించి ఊహాగానాలకు తావులేదని అమిత్ షా పార్లమెంటులో స్పష్టం చేశారు.
371వ అధికరణ కింద రాష్ట్రాలకు ప్రత్యేక అంశాల కింద అధికారాలను కల్పించారు. మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు 371వ అధికరణ కింద అధికారాలు ఇచ్చారు. విదర్భ, మరాఠ్వాడా, సౌరాష్ట్ర, కచ్‌ల అభివృద్ధికి ఏటా నిధుల విడుదల చేయడమే గాక, వాటి వ్యయంపై అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టాలి. బొంబాయి రాష్ట్ర పునర్విభజన చట్టం 1960 కింద 371(2)కు సవరణ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలకు ఈ సవరణ వర్తిస్తుంది. విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాలకు, మహారాష్టల్రో ఇతరప్రాంతాలకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసేందుకు వీలు కల్పించారు.
371ఏ అధికరణలో నాగాలాండ్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించారు. నాగాల మత, సామాజిక, సంప్రదాయాల్లో జోక్యం చేసుకునేందుకు వీలు లేదు. నాగాలాండ్ ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం ఆమోదిస్తే తప్ప ఆ రాష్ట్రంలోని భూవనరులపై ప్రభుత్వానికి సర్వాధికారాలు ఉంటాయి. శాంతి భద్రతలపై గవర్నర్‌కు సర్వాధికారాలు ఉంటాయి. 13వ రాజ్యాంగ సవరణ ద్వారా 371ఏ అధికరణను పార్లమెంటు ఆమోదించింది. కేంద్రం, నాగా పీపుల్స్ కనె్వన్షన్ మధ్య 16 సూత్రాల పథకం కింద ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందానికి అనుగుణంగా 1963లో నాగాలాండ్ ఏర్పడింది. ట్యూన్‌సాంగ్ జిల్లా కోసం 35 సభ్యులతో కూడిన రీజనల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు. ఈ 35 మందిలో ఒకరిని రాష్టమ్రంత్రివర్గంలోకి తీసుకోవాలి. ట్యూన్‌సాంగ్ వ్యవహారాల్లో గవర్నర్ నిర్ణయమే ఫైనల్. 371 బీ అధికరణ కింద అస్సాంకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి. అస్సాంలో గిరిజన ప్రాంతాల నుంచి ఎన్నికైన సభ్యులతో కూడిన కమిటీకి రాజ్యాంగాధికారాలను రాష్టప్రతి ద్వారా కల్పిస్తారు. కొండప్రాంతాల పరిపాలన, నిధుల విడుదల, ఖర్చు అంశాలపై గవర్నర్ రాష్టప్రతికి నివేదిక ఇవ్వాలి. 371సీ అధికరణ మణిపూర్ కోసం నిర్దేశించారు. మణిపూర్ అసెంబ్లీకి ఎన్నికైన గిరిజన ఎమ్మెల్యేలతో కూడిన కమిటీకి రాజ్యాంగాధికారాలను కల్పిస్తారు.
371 డీ,ఈ అధికరణల గురించి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. 1960,70 దశకంలో ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర ఉద్యమాలు వచ్చాయి. 1969లో ముల్కీ రూల్స్‌ను అమలు చేయాలంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చింది. అనంతరం 1972లో ముల్కీ రూల్స్‌ను రద్దు చేయాలంటూ ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం ఎగసిపడింది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర ఉద్యమాల్లో పెద్ద సంఖ్యలో ఉద్యమకారులు నేలకొరిగారు. 1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం అదే ఏడాది అక్టోబర్ 1వ తేదీన కర్నూలు రాజధానిగా అవతరించింది. 1956 నవంబర్ 1వ తేదీన మిగులు హైదరాబాద్ (తెలంగాణ ప్రాంతం)తో ఆంధ్రరాష్ట్రం విలీనమై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. ఆంధ్ర ప్రాంతం కలవడం వల్ల విద్య, ఉద్యోగాల్లో తమకు అన్యాయం జరుగుతోందని తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1972లో ఆ నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజనకు ససేమరా అన్నారు. ఆమె ఆరు పాయింట్ల ఫార్ములా తెరపైకి తెచ్చారు. దీని ప్రకారం 371 డీ,ఈ అధికరణలు అమలులోకి వచ్చాయి. ఆంధ్రా ప్రాంతంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒకటవ జోన్‌గా, తూర్పు,పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలు రెండవ జోన్‌గా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు మూడవ జోన్‌గా, చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు నాల్గవ జోన్‌గా ఏర్పడ్డాయి. అలాగే తెలంగాణలో ఐదు, ఆరవ జోన్లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ నగరాన్ని ఆరవ జోన్ కిందకు తెచ్చారు. దీని వల్ల తెలంగాణలో ఐదవ జోన్, ఆంధ్రాలో నాలుగు జోన్లకు చెందిన యువకులు సొంత రాజధానిలోనే స్థానికేతరులుగా పరిగణించబడడం వల్ల మళ్లీ రాష్ట్రంలో అశాంతికి బీజం నాటినట్లయింది. 371 డీ అమలులో ఉన్నందు వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అసాధ్యమని చాలా మంది నిపుణులు వాదించినా, రాజ్యాంగంలోన 368వ అధికరణ కింద పార్లమెంటుకు ఉన్న విశేషాధికారాలతో రాష్ట్రాన్ని 2014లో విభజించారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలుగా విభజన జరిగినా, 371డీ అధికరణ కొనసాగుతోంది. దీని జోలికి వెళ్లే సాహసం ఏ ముఖ్యమంత్రి చేయకపోవచ్చు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ప్రత్యేక రాష్ట్రం అవతరించినందు వల్ల ఇక జోన్లు ఎందుకని, మొత్తం రాష్టమ్రంతా ఒకటిగా ఉంటే బాగుంటుందని భావించారు. వాస్తవానికి ఇది మంచి ఆలోచన అయినా ఆ తర్వాత ఈ ప్రతిపాదనపై వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో జోన్ల రద్దు ప్రతిపాదనకు బ్రేక్ పడింది. జిల్లాల విభజన సమయంలో కూడా జోన్ల హద్దులకు ఆటంకం కలగకుండా చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు చేసినా నిర్దేశించిన జోన్లలోనే కొత్త జిల్లాలు ఉంటే వ్యతిరేకత వ్యక్తం కాదు. లేని పక్షంలో మళ్లీ వివాదం రాజుకునే అవకాశాలు లేకపోలేదు. 371ఈ అధికరణను జై ఆంధ్ర, జై తెలంగాణ ఉద్యమాల తర్వాత కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్శిటీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. ఈ అధికరణ వల్ల హైదరాబాద్‌లో అన్ని హంగులతో సెంట్రల్ వర్శిటీ ఏర్పాటైంది.
371 ఎఫ్ అధికరణను సిక్కిం ప్రయోజనాల కోసం పార్లమెంటు ఆమోదించింది. 1975లో సిక్కిం భారత్‌లో విలీనమైంది. ఈ అధికణం ప్రకారం సిక్కిం శాసనసభలో కనీసం 30 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేందుకు 371 ఎఫ్‌ను 371లో చేర్చారు. 371 జీ అధికరణ మిజోరం ప్రయోజనాలను కాపాడేందుకు నిర్దేశించారు. మిజోరాంలో ప్రజల ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు రాజ్యాంగ బద్ధంగా ఈ అధికరణను పార్లమెంటు ఆమోదించింది. 371 హెచ్ అరుణాచల్ ప్రదేశ్, 371 ఐ అధికరణలను గోవా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటు ఆమోదించింది. తాజాగా నాలుగేళ్ల క్రితం 371జేను పార్లమెంటు ఆమోదించింది. ఈ అధికరణ వల్ల కర్నాటకలో ఉత్తర కర్నాటక ప్రజలకు ఉపయుక్తంగా ఉంటుందని పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేశారు. కాని ఉత్తర కర్నాటక లేదా హైదరాబాద్- కర్నాటక పరిధిలో బళ్లారి జిల్లాను చేర్చడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉత్తర కర్నాటక ప్రాంతంలో రాయచూరు, గుల్బర్గా, యాదగిరి ప్రాంతాలు నిజాం పాలనలో ఉండేవి. వెనకబాటుతనంతో మగ్గిన ఈ ప్రాంతాల పరిధిలోకి బ్రిటీష్ పరిపాలనలో ఒక వెలుగువెలిగిన, ఖనిజ వనరుల కోట బళ్లారి జిల్లాను చేర్చడంపై తొలుత అభ్యంతరాలు వ్యక్తమైనా, కాలక్రమంలో సర్దుకున్నాయి.
ప్రస్తుతం ఆంధ్ర, తెలంగాణలో అమలవుతున్న 371 డీ అధికరణను విశే్లషిస్తే ఒక రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతంలోని వారు, అభివృద్ధి చెందిన జిల్లాల వారితో పోటీని తట్టుకుని నిలబడేందుకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. తమిళనాడు, కేరళ, ఒడిశా, పశ్చిమబెంగాల్, హిందీబెల్ట్‌లోని రాష్ట్రాల్లో 371వ అధికరణ అమలులో లేదు. దీని వల్ల ఒకే రాష్ట్రం, ఒకే భాష, ఒకే సంస్కృతి అనే వాదన బలంగా ఉంటుంది. ఒడిశా, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో రాష్ట్ర రాజధానిలో దిగువస్థాయి నుంచి పై స్థాయి వరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు ఉంటాయి. అదే జోనల్ వ్యవస్థ వల్ల రాజధాని జోన్ పరిధిలోకి రాని ప్రతిభావంతుడైన విద్యార్థి రాజధానిలోని వృత్తి విద్య కాలేజీలు వైద్య, ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్లు పొందలేరు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అందుకే రాజధానిని ఫ్రీ జోన్ చేయాలన్న వాదన తెరపైకి వస్తోంది. మహారాష్టల్రో జోన్లు లేవు. కర్నాటకలో ఉత్తర కర్నాటకకు మాత్రమే జోన్‌ను పరిమితం చేశారు. పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు విభజన అయిన తర్వాత కూడా విద్య, ఉద్యోగావకాశాల్లో జోన్ల వివాదం సర్దుమణగలేదు. ఆంధ్రా రాజధాని అమరావతి పరిధి ఇంకా నిర్ణయం కాలేదు. రాజధాని ప్రాంతాన్ని ఫ్రీజోన్ చేస్తే అన్ని ప్రాంతాల యువతకు తాము రాజధానిలో ప్రభుత్వ ఉద్యోగం చేసే భాగ్యం కలుగుతుందనే భావన కలుగుతుంది. ఇదే అభిప్రాయం తెలంగాణలో కూడా ఉంది. తెలంగాణలోని 33 జిల్లాల యువతకు హైదరాబాద్ రాజధాని పరిధిలో ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు కల్పించే రోజులు రావాలి. మన రాష్ట్ర యువతను మనమే సొంతం చేసుకునే పరిస్థితుల్లో లేకపోతే జాతీయ వాదం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే పొరుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలుగు రాష్ట్రాల్లో భాషాపరంగా సమైక్యత భావన , సాంస్కృతిక భావోద్వేగాలు కనపడవు. గ్రూప్ -2 ఉద్యోగాల వరకు జోన్లు, గ్రూప్-1 ఉద్యోగాల వరకు రాష్ట్రం పరిధిగా రిక్రూట్‌మెంట్ జరుగుతోంది. సున్నితమైన అంశాలు ముడిపడి ఉన్నందున అన్ని రాజకీయ పార్టీలు విశాల దృక్పథంతో చర్చించి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని జోన్ల వ్యవస్థపై సముచిత నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వాస్తవానికి 371వ అధికరణ ఒక తేనెతుట్టె. దీని జోలికి వెళ్లబోమని రాజకీయ చతురుడైన అమిత్‌షా పదే పదే చెబుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల రిక్రూట్‌మెంట్ అంతంత మాత్రమే. కొన్ని నియామకాలను జిల్లా లేదా జోన్‌కు కట్టడి చేయడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో రానున్న కాలంలో 371 డీ కేవలం అలంకార ప్రాయంగా మిగిలిపోయినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.

-కె.విజయ శైలేంద్ర 98499 98097