మెయిన్ ఫీచర్

ముక్కనుంచి.. మూకీకి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వర్తమానం నుంచి భవిష్యత్‌ని చూస్తే -అద్భుతాన్ని చూసినట్టుంటుంది.
వర్తమానం నుంచి గతంలోకి చూడాల్సివస్తే -జ్ఞాపకం నెమరేసుకున్నట్టుంటుంది. రెండూ మనిషికి ఆనందానిచ్చేవే. ముఖ్యంగా సినిమా అనేది మరింత ఆనందం. అధికశాతం జనానికి -ఎంటర్‌టైన్‌మెంట్‌కు సినిమా ఓ సింబాలిక్ డెఫినిషన్. అందుకే సినిమా కబుర్లు ఏం చెప్పినా ఆసక్తిగా వినాలనిపిస్తుంది.
నిజానికి సినిమా భవిష్యత్ ఇంత వేగంగా మారిపోతుందని -గతంలోని తరం ఊహించి ఉండదు. భవిష్యత్ సినిమా ఎలా ఉండబోతోందో -ఈతరం నుంచి ఊహించడమూ కష్టమే. కాకపోతే -ఒకప్పుడు సినిమా ఎలా ఉండేది.. ఎక్కడ నుంచి మొదలైంది.. ఎన్ని కష్టాలకోర్చి, ఎంతమంది కృషి ఫలించి సినిమా ఈ స్థాయికి వచ్చిందన్న చరిత్ర తెలుసుకోవడం కష్టం కాదు. ఇప్పుడంటే సినిమా -డిజిటల్ ఫ్రేమ్‌లోకి వచ్చేసింది. ఒకప్పుడు సినిమా అలా కాదు. ఫొటోల నుంచి కొన్ని ఫొటోలు కలిపిన ముక్కల్లోకి.. అక్కడి నుంచి మూకీలోకి.. క్రమంగా శబ్ధ చిత్రమైనట్టు -సినిమా పరిణామక్రమాన్ని గమనిస్తే అర్థమవుతుంది. ముక్కనుంచి మూకీకి సినిమా ఎలా ప్రయాణం చేసిందన్న పరిశీలనను ఓ ఔత్సాహిక రచయిత రాసిన కథనమిది. వెనె్నల పాఠకుల కోసం.
మనిషి నిరంతరం -ఆనందాన్ని వెతుక్కునే ఆశాజీవి. ఆహారం, నిద్ర, భయం, మైథునం అతని ప్రాకృతిక క్రియలు. వీటితోపాటుగా ఆనందమూ కావాలి. తెరపై బొమ్మలు ఆడడానికి ముందుగా రంగస్థలంపై నాటకాలు ఆడడాన్ని చూసి ఆనందించాడు. అంతకముందు తోలుబొమ్మలాటలు, వీధి బాగోతాలులాంటి అనేక కళా ప్రక్రియలను ఆదరించాడు. ఏ ప్రక్రియ అయినా ఆనందమే పరమావధిగా కొత్త కొత్త కళలను రూపొందించుకున్నాడు. నాటకం తరువాత అతనికి కనిపించిన అద్భుతమైన ఆనంద వజ్రాయుధం ‘సినిమా’!
సినిమా అన్న మాట తొలిసారిగా 1895లో ఫ్రాన్స్‌లో బలంగా వినిపించిందంటారు. ఆనాటి సాంఘిక, రాజకీయ పరిస్థితిని సినిమాలు చిత్రీకరించి చూపేవి. 1895లో లూమీర్ బ్రదర్స్ కదిలే బొమ్మలను ప్రదర్శించి చరిత్రకెక్కారు. దీనికన్నా ముందుగా 1645లోనే కదిలే బొమ్మల కబుర్లు మొదలయ్యాయని చరిత్రకారులు చెబుతున్నా -స్పష్టమైన సమాచారం లేదు. 1880లో ఫ్రెంచ్ శాస్తవ్రేత్త కదిలే బొమ్మల కెమెరాకు ప్రాణం పోశాడు. కదిలే బొమ్మలు కనికట్టు చేయగలవని మొదట విశే్లషించిన వ్యక్తి -స్టిల్ ఫొటోగ్రాఫర్ ఎడ్వర్డ్ మేబ్రిడ్జ్. ఈయనే కదిలే మనుషులు, జంతువులను అనేక కోణాల్లో ఫోటోలు తీసి, వాటిని వరుసక్రమంగా పేర్చి.. ఒకదాని తరువాత ఒకటి చూపితే బొమ్మలు కదులుతున్న భ్రాంతి కలుగుతుందని, అది మనిషికి సరికొత్త ఆనందాన్నిస్తుందని గ్రహించాడు. 1889లో థామస్ అల్వా ఎడిసన్ బొమ్మలను కదిలిస్తూ ‘పీస్ షో’గా నామకరణం చేశాడు. ఆ కెమెరాలో
కదిలే బొమ్మలను ఒక్క మనిషి మాత్రమే చూసే అవకాశం ఉండేది. ఇందుకోసం చిన్న చిన్న సన్నివేశాల రూపకల్పనలు చేశారు. ఇవే ముక్క చిత్రాలన్నది చరిత్రకారుల మాట.
ఇదే పద్ధతి 1960, 70, 80 శతకాలలో బయస్కోప్‌గా ప్రజాబాహుళ్యంలో సాగింది. అలా చిన్న ముక్కల సినిమాలు చూసి కమర్షియల్ సినిమాగా కళను మార్చవచ్చన్న సంగతి లూమీర్ బ్రదర్స్ నిరూపించారు. 1895లో వారు కెమెరా కమ్ ప్రొజెక్టర్‌ను రూపొందించారు. ఆ కెమెరా షూట్ చేస్తుంది. తిరిగి కదిలే బొమ్మలను చూపిస్తుంది. కదిలే బొమ్మల నివేదిక అనే అర్థంతో గ్రీక్ భాషలోవున్న పదాలతో ‘మోషన్ రికార్డర్’ అనే అర్థంవచ్చేలా సినిమాటోగ్రఫీ పేరును నిర్ణయించారని ప్రతీతి. ఈ కెమెరా వస్తువులను రికార్డు చేస్తుంది. తిరిగి తెరపై ప్రదర్శించనూ గలదు. ఇదే మరో వినోద సాధనంగా మనిషికి అందుబాటులోకి రానున్నదని సోదరులిద్దరూ అప్పుడే గ్రహించారు. తొలిసారిగా లండన్‌లో ‘ఎంటర్ ది ట్రైన్’ అనే ముక్క సినిమా ప్రదర్శించారు. పరిగెత్తే రైలు మీదికొస్తుందన్న భ్రమ కలగటంతో -కూర్చున్న చోటునుంచి ప్రేక్షకులు పరుగులు తీశారట. మరోసారి మంటలను చూసి ఎక్కడ అవి మీదికొస్తాయోనని థియేటర్‌ను వదిలి పారిపోయారట కూడా. తొలిసారిగా కదిలే బొమ్మలను చూసి భ్రాంతి చెందిన ప్రేక్షకుల నాడిని లూమీర్ బ్రదర్స్ పట్టుకున్నారు. ఇదే పద్ధతిలో ఇంగ్లాండ్, అమెరికా, డెన్మార్క్, నెదర్లాండ్స్, ఇటలీ తదితర దేశాలు ముక్క మూకీలను రూపొందించి ప్రేక్షకులకు అందించాయి.
భారతదేశానికి వచ్చేసరికి 1896లోనే హరిశ్చంద్ర భట్ వాడేకర్ తొలిసారిగా విదేశాలనుంచి ముక్క మూకీలను తీసుకొచ్చి విదేశాలనుండే దిగుమతి చేసుకున్న చేతితో త్రిప్పే ప్రొజెక్టర్‌ను ఉపయోగించి ప్రదర్శనలిచ్చేవారు. విదేశాలకు సంబంధించిన అనేక మూకీలను ప్రదర్శించి భారతీయత ఉట్టిపడేలా మనమే కొన్ని మూకీలను రూపొందిస్తే ఎలా ఉంటుందని తలపోశారాయన. అలా ముక్క మూకీలను రూపొందించిన వ్యక్తిగా వాడేకర్ నిలిచారు. ఈ ముక్క మూకీలను దక్షిణాదిలోనూ ప్రదర్శనకు విదేశీయులే తీసుకొచ్చారు. 1900లోనే మద్రాసు వౌంట్‌రోడ్‌లో డేరాహాలులా ఎలక్ట్రికల్ థియేటర్‌ను మేజర్ వార్‌విక్ట్ అనే విదేశీయుడు నిర్మించాడు. థియేటర్‌లో మూకీ చిత్రాలతోపాటుగా పాటలు పాడించటం, నాటకాలు ఆడించటం చేసేవారట. ఒకే టిక్కెట్టుపై సినిమా, నాటకం అన్నదే అప్పటి ప్రచారం. మద్రాస్‌లో లిరిక్ థియేటర్‌ను ఏర్పాటు చేసినట్టుగా చరిత్ర చెబుతోంది. హైదరాబాద్‌లో తొలిసారిగా నెగెటివ్ రీల్ తిరిగింది 1908లో. అపుడు వచ్చిన మూసీ వరదల చిత్రీకరణను బొంబాయినుంచి వచ్చిన ఓ కంపెనీ చిత్రీకరించింది. 1909లో స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా వున్న రఘుపతి వెంకయ్యనాయుడు కదిలే బొమ్మల పట్ల ఆసక్తి పెంచుకున్నారు. తొలిసారిగా విదేశీ మూకీ ముక్కలను తీసుకొచ్చి విక్టోరియా హాల్‌లో ప్రదర్శించారు. ఆయనే బర్మా, సిలోన్ తదితర ప్రాంతాల్లోనూ తిరిగి మూకీలను ప్రదర్శించినట్టు తెలుస్తోంది. సినిమా కళ భవిష్యత్తులో అభివృద్ధి చెందుతోందన్న ఆలోచనతో తొలిసారిగా థియేటర్‌ను మద్రాస్‌లో నిర్మించారు. కొన్ని సంస్థలు రూపొందించిన భారతీయ మూకీలతోపాటుగా విదేశీ చిత్రాలను కూడా ఆయన ప్రదర్శించేవారు. అప్పటిదాకా విదేశీయులు రూపొందించిన భారతీయ చిత్రాల్లో విదేశీయులే నటించేవారు. తొలిసారిగా భారతీయ మూకీని దాదా తోర్ని 1912లో రూపొందించారు. ఆ చిత్రం పేరు ‘పుండలీక్’. ఆ చిత్రం ఏదో తీయాలన్నట్లు తీసినట్టుంది కానీ, దానిలో ఏ ప్రత్యేకతా లేకపోవడంతో గుర్తింపునకు నోచుకోలేదు.
1913లో దాదా సాహెబ్ ఫాల్కే ‘రాజా హరిశ్చంద్ర’ చిత్రాన్ని విదేశీ చిత్రాలకు ధీటుగా విలువలతో రూపొందించారు. అందుకే ఆయన భారతీయ చిత్రానికి ఆద్యుడయ్యాడు. అప్పట్లో మూకీ చిత్రాలలో సంభాషణలు వినిపించవు కనుక నాటకీయ పద్ధతిలోనే రూపొందించేవారు. ముఖ్యంగా మైమ్ చేస్తున్నట్లుగా వాళ్ల మాటలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా నటించడానికి ప్రయత్నించేవారు. ప్రదర్శన జరుగుతుంటే మైకులో ఓ వ్యక్తి తెరపై జరుగుతున్న సన్నివేశానికి వ్యాఖ్యానం చెప్పేవారు. కథనం అర్థమయ్యే రీతిలో అతను చెప్పడంతో ప్రేక్షకుడికి తెరపై జరుగుతున్నదేంటో తెలిసేది. అలనాటి హాస్య నటులు కస్తూరి శివరావు, రేలంగి తొలినాళ్లలో ఇలా మూకీ సినిమాలకు వ్యాఖ్యానం చెప్పన వారే. ఒకటి రెండు చిత్రాలుగా ఓ వ్యక్తికి మరో వ్యక్తి చిరునామా తెలియజేయడం, ఓ మేకను తీసుకువెళుతున్న వ్యక్తిని అది కుక్కని భ్రమింపజేసేలా చెప్పడంలాంటి అంశాలను రూపొందించారు. ఈ చిత్రాలకు మాటలు అవసరం లేకపోవడం ఆయా దర్శక నిర్మాతలకు పనికివచ్చింది.
విదేశీయులు నటించిన అనేక పౌరాణిక చిత్రాలు విజయవంతమయ్యాయి. సత్యవాన్ సావిత్రి, యాన్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రేమ్ రామాయణ, డాన్సర్ ఆఫ్ శివ, గాడ్ ఆఫ్ ది సన్, మోహినీ భస్మాసుర లాంటి చిత్రాలను విదేశీయులే రూపొందించి విడుదల చేశారు. మద్రాస్‌లోనే పర్మినెంట్ సినిమా థియేటర్స్ గెయిటీ, క్రౌన్ నిర్మించారు. తెలుగునుండి రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా నిర్మాణానికి పూనుకున్నట్లుగా తమిళం నుంచి ఆర్ నటరాజ మొదలియార్ ‘కీచకవధ’ చిత్రాన్ని రూపొందించారు. 1918లో లంకాదహనం, శ్రీకృష్ణజన్మ, సత్యవాది రాజా హరిశ్చంద్ర చిత్రాలతోపాటుగా దాదా సాహెబ్ ఫాల్కే మరో హరిశ్చంద్ర చిత్రాన్ని రూపొందించారు. ద్రౌపది వస్త్రాపహరణం, కాళీయమర్దన్, మహాసతి అనసూయ, భక్తవిదురలాంటి పౌరాణిక నేపథ్య కథనాలతోనే చిత్రాలు రూపొందించారు.
1919లో బాబూరావ్ పెయింటర్ అనే కలల బేహారి వచ్చాడు. ఆయన సైరంధ్రీ, కచ దేవయాని, కబీర్ కమల్, బిల్వమంగళ, శకుంతలలాంటి చిత్రాలను రూపొందించారు. మరోవైపు మొదలియార్ మైరావణ, మార్కండేయ, లవకుశ, సురేఖా హరణ్, నలదమయంతి, శివరాత్రి చిత్రాలను రూపొందించారు. ఈ సురేఖాహరణ్ చిత్రమే ఆ తరువాత మాయాబజార్‌గా పలు అందచందాలను, నగిషీలను ఏర్పాటు చేసుకుని తెలుగు, తమిళ ప్రజలకు గొప్ప చిత్రంగా పరిచయమైంది. రఘుపతి వెంకయ్య నాయుడు కుమారుడు రఘుపతి ప్రకాష్ దక్షిణభారత సినిమా ప్రపంచానికి ఆద్యుడు. తండ్రి ప్రోత్సాహంతో నిర్మాణ రంగంలోకి దిగాడు. లండన్ వెళ్లి సినీ స్టూడియోలో అప్రెంటీస్ చేశాడు. జర్మనీలో సినీ నిర్మాణ పద్ధతులను పర్యవేక్షించారు. ప్రపంచ సినిమా మరోవైపు ఉద్ధృతంగా మూకీలతో తన ప్రభంజనాన్ని చూపిస్తోంది. ఇదే సమయంలో చార్లీ చాప్లిన్ కూడా తన మూకీలతో ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాడు.
రఘుపతి ప్రకాష్ విదేశాలనుండి వచ్చాక 1921లో 12వేల ఖర్చుతో భీష్మ ప్రతిజ్ఞ చిత్రాన్ని రూపొందించాడు. ఇదే తెలుగు వ్యక్తి తీసిన తొలి మూకీ చిత్రం. నాటకంలాగానే సినిమా వినోదంతో ప్రేక్షకులను సమ్మోహనపరుస్తుండడంతో జనబాహుళ్యానికి దగ్గరైంది. కలకత్తానుండి పలువురు దర్శక నిర్మాతలు రత్నావళి, లైలామజ్ను, పతిభక్తి, రామాయణం లాంటి సీరియల్స్ రూపొందించారు. మద్రాసు, బొంబాయిలనుండి కూడా అనేక చిత్రాలు వచ్చాయి కానీ అవన్నీ ఇప్పుడు అందుబాటులో లేవు. రఘుపతి ప్రకాష్ రూపొందించిన గజేంద్ర మోక్షం, భక్తనందనార్, సముద్ర మథనం లాంటి చిత్రాలు ప్రేక్షకుల ఆదరణ లేకపోవడంతో నష్టాలు వచ్చాయి. బాబూరావ్ పెయింటర్ ఛత్రపతి శివాజీ కథనంతో ‘సింహగఢ్’ను ఫాల్కే ‘లైఫ్ ఆఫ్ లార్డ్ బుద్ధ’, ‘మహానంద’ చిత్రాన్ని రూపొందిస్తే, కలకత్తా నుండి జెజె మదన్ నూర్జహాన్, సోల్ ఆఫ్ లవ్ చిత్రాలను రూపొందించారు. సోల్ ఆఫ్ లవ్‌లో ఓ ధనికుడైన యువకుడు పేదింటి అమ్మాయిని ప్రేమించి, ఆమెకోసం ఆమె ఇంటికి వెళ్లి వారింట్లో పనులు చేసి మెప్పించి పెళ్లి చేసుకోవడమే ప్రధాన కథ. ఈ కథ వింటే మనకి సిద్ధార్థ, త్రిష జంటగా నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రం గుర్తొస్తోంది కదా!
(మిగతా వచ్చే వారం)

-జి రాజేశ్వర రావు