మెయన్ ఫీచర్

రాహుల్‌కు చెలగాటం.. కాంగ్రెస్‌కు ప్రాణసంకటం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అయ్యవారు ఏమి చేస్తున్నారు అంటే ... చేసిన తప్పులు దిద్దుకుంటున్నారు’ అనేది మనందరికీ తెలిసిన సామెత. ఈ సామెత ఎలా పుట్టిందో ఏమో గానీ, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యవహారం చూస్తుంటే అది ఆయన కోసమే పుట్టిందేమో అనిపిస్తుంది. అయితే, ఈ సామెతలోని పుణ్య పురుషునికి రాహుల్ గాంధీకి మధ్య కొంచెం చాలా తేడా వుంది. సామెతలోని పెద్దాయన కనీసం చేసిన తప్పులు దిద్దుకునే ప్రయత్నం అయినా చేస్తున్నారు, రాహుల్ గాంధీ మాత్రం దిద్దుబాటు చర్యలను పక్కన పెట్టి కొత్త తప్పులతో పాత తప్పులను వెనక్కి నెడుతున్నారు. రాహుల్ చేసిన తప్పులకు కాంగ్రెస్ పార్టీ చెంపలేసుకోవలసి వస్తోంది. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లుగా సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా రాహుల్ గాంధీ తీరు మారలేదు. ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ‘సంకట’ పరిస్థితిని ఎదుర్కొంటోంది. భారీ మూల్యం చెల్లించింది. ఇంకా చెల్లిస్తూనే వుంది... సరే అది వేరే విషయం. కాంగ్రెస్ పార్టీ సొంత వ్యవహారం. కానీ, రాహుల్ గాంధీ అపరిపక్వ, అహంకార పూరిత రాజకీయాల విపరీత ధోరణి ప్రమాదకరంగా ’పరిణతి’ చెందుతోందనేది ఇప్పుడు చర్చనీయ అంశంగా మారింది. రాహుల్ రాజకీయ ‘పరిణితి’ పార్టీ గీత దాటి దేశానికి హెచ్చరికలు చేసే స్థాయికి చేరుతోంది. అందుకే ఇప్పుడు రాహుల్ గాంధీ దేశం ముందు ఒక ప్రశ్నగా నిలిచారు.
జమ్మూ కశ్మీర్’ రాష్ట్ర పునర్విభజన, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంగా సాగుతున్న పరిణామాలలో రాహుల్ గాంధీ వ్యవహరించిన, వ్యవహరిస్తున్న తీరు ఆయన అపరిపక్వ, అనాలోచిత రాజకీయ ధోరణికి అద్దం పడుతోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేష్ పేర్కొన్నట్లుగా, కేవలం ప్రధాని మోడీ పట్ల వ్యతిరేకతతో, మంచి చెడులు మరిచి రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి మాత్రమే కాదు, దేశానికి తలవంపులు తెచ్చే విధంగా ఉంటున్నాయి. సమస్యలు సృష్టించే విధంగా సాగుతున్నాయి. రాహుల్ గాంధీ ఒక జాతీయ పార్టీకి, అది కూడా సుదీర్ఘకాలంపాటు ఈ దేశాన్ని పాలించిన పార్టీకి మాజీ అధ్యక్షుడు. అది అదృష్టమో, దురదృష్టమో, వారసత్వంగా వచ్చిన అనర్థమా అనే విషయాన్ని పక్కన పెడితే రాహుల్ గాంధీ దేశంలో ఒక కీలక నేతగా చెలామణి అవుతున్నారు అనేది కాదనలేని వాస్తవం. ఆయన, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత కూడా పార్టీలో ఆయన ప్రాధాన్యత తగ్గలేదు, మీడియా, చివరకి రాజకీయ ప్రత్యర్థులు కూడా ఆయన్ని ఉపేక్షించడం లేదు. కానీ, దురదృష్టవశాత్తు ఆయన ఆ విషయాన్ని మరిచిపోయినట్లున్నారు. అందుకే బాధ్యతారహితంగా శత్రు దేశానికీ మేలు చేసే విధంగా ప్రకటనలు చేసి, తమకు తాము సమస్యలు సృష్టించుకోవడంతో పాటుగా దేశానికి సమస్యలు సృష్టిస్తున్నారు.
నిజానికి, ఏదో విధంగా మన దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలపెట్టేందుకు పాకిస్థాన్ సాగిస్తున్న ప్రయత్నాలకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ వంతపాడుతూనే ఉన్నారు. అసలు ఆర్టికల్ 370 రద్దునే కాంగ్రెస్ పార్టీ సాంకేతిక కారణాలు చూపి తప్పు పట్టింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లును వ్యతిరేకించింది. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో పాక్ ప్రమేయాన్ని పరోక్షంగానే అయినా సమర్థించింది. అయితే, అవ్వన్నీ ఒకెత్తు అయితే, ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రకటనతో ఆ ధోరణి పరాకాష్టకు చేరింది. కశ్మీరులో ప్రజలు చనిపోతున్నారు. పరిస్థితి ప్రభుత్వం చెబుతున్నట్లు మామూలుగా అంటూ రాహుల్ గాంధీ చేసిన ప్రకటన సహజంగానే ఇలాంటి అవకాశం కోసం ఎదురుచూస్తున్న పాకిస్థాన్ తనకు అనుకూలంగా మలచుకుంది. జమ్మూ కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలికి పాకిస్థాన్ చేసిన ఫిర్యాదులో, రాహుల్ గాంధీ చేసిన ‘ట్వీట్’ను సాక్ష్యంగా చూపింది.
నిజానికి, ఒక్క కశ్మీర్ విషయంలోనే కాదు అనేక ఇతర విషయాల్లోనూ రాహుల్ గాంధీ విపరీత ధోరణినే ప్రదర్శిస్తున్నారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినప్పటికీ, తనని తాను పార్టీ కంటే ఉన్నతుడిగా ఊహించు కోవడం వలన అయితేనేమీ, కుటుంబమే సర్వస్వం అనుకునే కాంగ్రెస్ నాయకుల మానసిక దౌర్భాల్యం కారణంగా అయితేనేమి, రాహుల్ గాంధీ కేంద్ర బిందువుగా హస్తం పార్టీ సంకట పరిస్థితిని ఎదుర్కొంటోంది. మరోవంక రాహుల్ గాంధీ ఒంటెద్దు పోకడల కారణంగా జాతీయ ప్రాధాన్యతగల కీలకమైన అంశాల విషయంలోనూ పార్టీ విధానం ఏమిటో ఎవరికీ అంతు చిక్కడం లేదు. రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ ‘‘విచారధార’’ని ఏదేదో చెప్పారు కానీ, చివరకు ‘విచారం’ మాత్రమే మిగిలి ‘్ధర’ ఓటమి ప్రవాహంలో కొట్టుకు పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేసే సమర్థ నాయకత్వం లేదు. రాహుల్ గాంధీ కాడి వదిలేసి పలాయనం చిత్తగించిన తర్వాత పార్టీ భారాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో సోనియా గాంధీనే మళ్ళీ భుజానికి అయితే ఎత్తుకున్నారు. కానీ, ఆమె వయోభారం లేదా ఇతర కారణాల చేత ముందుండి పార్టీ నడిపించే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే, పార్లమెంట్ లోపలా వెలుపలా కూడా కీలక అంశాల విషయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పార్టీ విధానం ఇదీ అని చెప్పే నాథుడే లేక స్పష్టత లోపించి నాయకులు తలకో మాట మాట్లాడి నాయకులు అభాసు పాలవుతున్నారు. పార్టీ నవ్వుల పాలవుతోంది. జమ్మూ కశ్మీర్ విషయానే్న తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటో ఈనాటికి కూడా ఎవరికీ స్పష్టం కాని పరిస్థితే కనిపిస్తోంది. ఈ విషయంలో కీలక నేతల్లోనే కొందరు ప్రభుత్వాన్ని సమర్థిస్తే, గాంధీ నెహ్రూ పరివార భజన బృందం మాత్రం ఏవో సాకులు చూపి వ్యతిరేకించింది. ఫలితంగా పార్లమెంట్ లోపలా వెలుపలా కూడా కాంగ్రెస్ పార్టీలో విభజన రేఖలు స్పష్టమయ్యాయి.
యూపీఏ -2 ప్రభుత్వం ‘పాలసీ పెరాలసిస్’ (విధాన వైకల్యం/ పక్షవాతం) ఆరోపణలు ఎదుర్కుంది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ముఖ్యంగా రాహుల్ గాంధీ, ఆయన కోటరీ ప్రభుత్వాన్ని, మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని విమర్శించడం ఒక్కటే పార్టీ విధానంగా భావిస్తూ అయిన దానికి కానీ దానికీ ప్రధానమంత్రి టార్గెట్‌గా విమర్శలు చేస్తున్నారు. ఇది పార్టీలో గందరగోళానికి దారితీస్తోంది. ఈ గందరగోళం నుంచి పార్టీలో విబేధాలు మరింతగా బహిర్గతం అవుతున్నాయి. సీనియర్ నాయకుల మధ్య పరస్పర అభిప్రాయ బేధాలు తారాస్థాయికి చేరాయి. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ సీనియర్ నాయకులు మోదీ అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలిపోయారు. నిజానికి ఏదో ఒక విషయం, ఒక వివాదం అని కాదు, పార్టీ అధ్యక్ష ఎన్నిక ప్రహసనం మొదలు ప్రతి విషయంలోనూ పార్టీ నాయకుల మధ్య చీలిక ప్రస్ఫుటమవుతోంది. అంతేకాదు ఇప్పటికే పూర్తిగా మసకబారిపోయిన కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఇప్పుడు మరింత ప్రశ్నార్థకంగా మారింది. అందుకే కాంగ్రెస్ నాయకులే, పార్టీ పరిస్థితి కొడిగట్టిన దీపంలాగా ఇప్పుడా ఇంకాసేపటికా అన్నట్లుగా మినుకు మినుకు మంటోందనే నిర్ణయానికి వచ్చారు. అందుకే, చాలా మంది సీనియర్ నాయకుల స్వరాల్లో మార్పు స్పష్టమవుతోంది.
అదలా ఉంటే, ఇలా రాహుల్ గాంధీ తప్పులు చేయడం, కాంగ్రెస్ పార్టీ చెంపలు వేసుకోవడం ఒక విధంగా ఒక అలవాటుగా మారిపోయింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రోజుల్లో, కేంద్ర కేబినెట్ ఆమోదించిన ఆర్డినెన్సును, ‘కంప్లీట్ నానె్సన్స్’ అంటూ, విలేకరుల సమావేశంలో చించివేయడం మొదలు లోక్‌సభలో ప్రధాని నరేంద్ర మోదీని కౌగిలించుకోవడం, ఆ వెంటనే కన్ను గీటడం వరకు అనేక సందర్భాలలో రాహుల్ గాంధీ ప్రవర్తించిన తీరు, అయన రాజకీయ అపరిపక్వ స్థితిని ప్రతిబింబించాయి. అదే విధంగా పుల్వామా దాడులకు ప్రతీకారంగా మన సేనలు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ’బాలాకోట్’లో గల ఉగ్రస్థావరాల పై జరిపిన దాడులకు సంబంధించి, రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేసిన వ్యాఖ్యలు, ప్రస్తుతం ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంగా సాగుతున్న పరిణామాల వరకు అనేక విషయాల్లో రాహుల్ గాంధీ ప్రవర్తన, ప్రకటనలు ఆయన చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు పార్టీకి మేలుకంటే కీడు ఎక్కువ చేస్తున్నాయనే అభిప్రాయం బలపడుతోంది.
సార్వత్రిక ఎన్నికల్లో రఫెల్ ఒప్పందం విషయంలో ‘చౌకీదర్ చోర్ హై’ అంటూ వేసిన చిందులు. పార్లమెంట్ సాక్షిగా చేసిన అసత్య ప్రకటనలు, న్యాయస్థానం చేయని వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొని, చివరకు న్యాయస్థానం ఎదుట క్షమాపణలు చెప్పుకోవల్సి రావడం వంటి రాహుల్ గాంధీ అపరిపక్వ రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ భారీ మూల్యం చెల్లించింది. ఎన్నికల ఓటమి తర్వాత అయినా, ఆయన ఎక్కడ పారేసుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే విజ్ఞత, వివేకం ప్రదర్శించారా అంటే అదీ కనిపించడం లేదు.
ఎవరైనా ఒక తప్పును ఒక సారి చేస్తే అది పొరపాటు అనుకోవచ్చును, రెండవ సారి చేస్తే అది గ్రహపాటు అని సరిపెట్టుకుంటాం, కానీ మూడవసారి, నాల్గవ సారి... అలా లెక్కలేనన్ని సార్లు చేసిన తప్పులే చేసుకుంటూ పోతే అది అలవాటుగా మారిపోతుంది. రాహుల్ గాంధీ విషయంలో ఇదే జరిగింది. తప్పులు చేయడం ఆయనకు చెంపలు వేసుకోవడం కాంగ్రెస్ నాయకులకు అలవాటుగా మారిపోయింది.
సరే, ఏదో అంతగా ప్రాధాన్యత లేని చిన్న చిన్న విషయాలలో రాహుల్ గాంధీ గానీ, మరొకరు గానీ తప్పులు చేశారంటే సరే అని సరిపెట్టుకోవచ్చును. అలాంటి వ్యవహారాల్లో ఆయన ఎన్నిసార్లు అడుసుతొక్కినా... అంతగా అభ్యంతరం ఉండక పోవును. కానీ, రాను రానూ రాజు గుర్రం అన్నట్లుగా రాహుల్ గాంధీ రాజకీయ విన్యాసాలు, వికృత చేష్టలు ప్రమాదకరంగా దిగజారుతున్నాయి. గతంలో రఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు విషయంలో పార్లమెంట్‌లో ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు తనకు ఏదో చెప్పారని ప్రకటించారు, ఆ వెంటనే ఫ్రాన్స్ రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అలాగే, ఇప్పుడు జమ్మూ కశ్మీర్ విషయంలోనూ రాహుల్ గాంధీ మన దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలిపేందుకు శత్రు దేశం పాకిస్థాన్‌కు పరోక్షంగా సహాయం చేశారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన యూ టర్న్ తీసుకున్నారు. ఇంతవరకు, జమ్మూ కశ్మీర్ విషయంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పలుకులే పలుకుతూ వచ్చిన రాహుల్, ఇతర కాంగ్రెస్ నాయకులు స్వరం మార్చారు. కశ్మీర్‌లో 370 రద్దు తమ అంతర్గత వ్యవహారమని, ఇందులో పాక్ జోక్యం అవసరం లేదంటూ రాహుల్ గాంధీ ట్వీట్’ చేస్తే కాంగ్రెస్ నాయకులు సుదీర్ఘ వివరణలు ఇచ్చే ప్రయత్నం చేశారు.
నిజానికి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అనంతరం రాహుల్ గాంధీకి ఎలాంటి ప్రత్యేకతా లేదు. ఆయన ఇప్పుడు ఒక సాధారణ ఎంపీ మాత్రమే. అయినా ఎంత చెడ్డా సుమారు 60ఏళ్ళు దేశాన్ని పాలించిన పార్టీకి మాజీ అధ్యక్షుడు, దేశానికి ముగ్గురు ప్రధానులను అందించిన, సుమారు 40 సంవత్సరాలు దేశాన్ని పాలించిన నెహ్రూ - గాంధీ కుటుంబం నాలుగోతరం వారసుడు. అంతే కాదు, ఆయన కూడా ప్రధాని పీఠం కోసం పోటీపడ్డారు. ఆయనకు కాలం కలిసి రాలేదు కాబట్టి సరిపోయింది గానీ లేదంటే ప్రధాని అయ్యే వారేమో కూడా. సరే, ప్రజలు విజ్ఞత చూపారు కాబట్టి, ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది కానీ రాహుల్ గాంధీ అపరిపక్వ, అనాలోచిత రాజకీయాల ప్రమాదం మాత్రం ఇంకా పూర్తిగా తొలిగి పోలేదు. అందుకే, రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు... దేశం కూడా జాగ్రత్త పడవలసిన సమయం ఆసన్నమైంది ... తస్మాత్ జాగ్రత్త అనవలసి వస్తోంది.

- రాజనాల బాలకృష్ణ 99852 29722