మెయిన్ ఫీచర్

వాయిదా పద్ధతుంది దేనికైనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ లైన్‌ని ఓ రిథమ్‌లో చదవగానే -తెలుగు సినిమా నడకను ఠక్కున మలుపుతిప్పిన శివ సినిమా గుర్తొచ్చింది కదూ! పాట.. పదాల అల్లిక.. పంక్తుల్లో భావం.. సముచిత సందర్భం అన్నీ అలా కుదిరి ఎప్పటికీ గుర్తుండే పాటైంది. అందుకే -పనికైనా, పరీక్షకైనా ఒకింత ఊరడింపుగా ‘వాయిదా పద్ధతుంది దేనికైనా’ అంటుంటాం. ఇప్పుడీ ఊరడింపు -సినిమాకు అప్లై అవుతోంది.
***
ప్రతి వ్యాపారానికీ ఓ సీజనున్నట్టే -సినిమాకూ సీజన్ కామన్. సంప్రదాయ సంక్రాంతి సీజన్.. సమ్మర్ వెకేషన్.. మళ్లీ దసరా, దీపావళి, క్రిస్మస్ ఇవన్నీ సినిమా సీజనే్ల. ఏడాది పొడవునా సినిమాలొస్తున్నా, వచ్చే అవకాశమున్నా.. కాస్త రేంజ్‌వున్న హీరోలో, ఓస్థాయి బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న సినిమాలో -ఈ సీజన్లలో విడుదలకు తాపత్రయపడటం సహజం. పండగ సెలవుల్లో థియేటర్లు కళకళలాడతాయన్నది నిర్మాతల ఆశ. ఒకప్పుడు ఈ సెంటిమెంట్ బలంగానే ఉండేది. కాలక్రమంలో చూసేవాళ్లెప్పుడైనా చూస్తారన్న ధీమాతో సినిమాలు వచ్చేస్తున్నాయి. పైగా పండుగల ఇంపార్టెన్స్ క్రమంగా తగ్గుతుండటం, జీవన శైలిలో చోటుచేసుకుంటున్న మార్పులు.. వెరసి -‘సెలవు.. సినిమా’ అన్న కానె్సప్ట్ దాదాపుగా మాయమైంది. దాంతో సినిమాల మధ్య క్లాష్ కూడా తగ్గింది. చెప్పుకోదగ్గ సినిమా వస్తుందంటే -చిన్నా చితకా సినిమాలు భయంతోనో, గౌరవరంతోనో దారిచ్చేస్తున్నాయి. నిర్మాతల ఉద్దేశాలు ఎలావున్నా -పరిశ్రమకు అది శుభపరిణామమే అనాలి. గతంలోనూ చాలా సందర్భాల్లో ఇలా ‘సినిమా క్లాష్’ వచ్చినపుడు -అప్పుడూ నిర్మాతలు సంయమనంతోనే వ్యవహరించారు. ఈ సీజన్‌లో పెద్ద సినిమాల మధ్య క్లాష్ తలెత్తే పరిస్థితి కనిపిస్తుండటంతో -ఇప్పుడూ ముందస్తు సంయమనంతో వ్యవహరించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది.
సినిమాకు అతి పెద్ద సీజన్‌గా చెప్పుకునే -సంక్రాంతిని తీసుకుందాం. ఇప్పటివరకూ ఉన్న సమాచారం ప్రకారం వచ్చే సంక్రాంతి రేసులో ఐదు పెద్ద సినిమాల మధ్య క్లాష్ వచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
ప్రధానంగా సంక్రాంతిని టార్గెట్ చేస్తూ వస్తోన్న సినిమా -సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి తెరకెక్కిస్తోన్న మహేష్‌బాబు 26వ సినిమాలో తొలిసారి సైనికుడి పాత్ర పోషిస్తున్నాడు. మహేష్‌తో తొలిసారి రష్మిక జోడీ కట్టింది. అనిల్ సుంకర, దిల్‌రాజు సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. విడుదలకు సంక్రాంతి ముహూర్తాన్ని ముందే ఫిక్స్ చేసుకున్నారు కనుక -తేదీ మారొచ్చుగానీ సీజన్ మారే చానే్స లేదు. అందుకు తగినట్టుగా నిర్మాతలద్వయం ముందే బిజినెస్ ఏర్పాట్లు చూసుకుంటుంది. అటు డిస్ట్రిబ్యూటర్లను, ఇటు ఎగ్జిబిటర్లను ముందే చక్కబెట్టుకుంటుంది. ఎక్కువ థియేటర్లు దక్కించుకుని -్భరీగా విడుదల చేసే ప్రణాళికలకు నిర్మాతలు పదును పెడుతున్నారు. అదే సంక్రాంతిని టార్గెట్ చేస్తూ త్రివిక్రమ్ -అల్లు అర్జున్ సినిమా అల.. వైకుంఠపురం సైతం రాబోతోంది. పోతన భాగవతంలోని ‘గజేంద్రమోక్షం’ కథాసారాన్ని సోషల్ కానె్సప్ట్‌లో త్రివిక్రమ్ చెప్పబోతున్నాడన్న ప్రచారం జరుగుతోంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలాంటి హిట్లిచ్చిన త్రివిక్రమ్ -ఈసారి బన్నీకి హ్యాట్రిక్ హిట్టవ్వనున్నాడన్న ఆసక్తి కనిపిస్తోంది. బన్నీ సరసన పూజా హెగ్దె, నివేదా పేతురాజ్ కనిపించనున్నారు. నాపేరు సూర్య.. సినిమా సరైన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో బన్నీ సుదీర్ఘ విరామమే తీసుకున్నాడు. కథ విషయంలో ఆచితూచి అడుగులేసిన బన్నీ -సక్సెస్‌పై భరోసానిచ్చిన త్రివిక్రమ్‌కే ప్రాజెక్టు ఇచ్చాడు. గ్యాప్ తరువాత బన్నీ చేస్తున్న ప్రాజెక్టు కావడంతో -అటు ఫ్యాన్స్‌లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. ఇదిలావుంటే, ప్రతి సంక్రాంతికీ ఓ సినిమాతో అభిమానుల్ని అలరించే బాలయ్య సైతం పూర్తిగా రంగంలోకి దిగిపోయాడు. ప్రచారంలోవున్న సమాచారం మేరకు బాలయ్య చేస్తున్న ప్రాజెక్టు -రూలర్. ‘జైసింహ’లాంటి ఫ్లాప్‌నిచ్చినా దర్శకుడు కెఎస్ రవికుమార్‌ను నమ్మి బాలకృష్ణ ప్రాజెక్టు అప్పగించాడు. ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్టులతో సరైన ఫలితం అందుకోలేకపోయిన బాలకృష్ణ -సంక్రాంతి సినిమాపై మాత్రం పెద్ద నమ్మకంతోనే ఉన్నాడు. ఈ మూడూ ఖాయంగా సంక్రాంతి సీజన్‌లో వచ్చే సినిమాలే. తేదీలు కాస్త అటూ ఇటూ కావొచ్చేమోగానీ, ఫెస్టివల్ సీజన్‌లో మూడు సినిమాలూ థియేటర్లకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. గత సంక్రాంతికి ‘పేట’తో సెనే్సషనల్ హిట్టందుకున్నాడు రజనీకాంత్. ఈసారీ సంక్రాంతిని టార్గెట్ చేస్తూ ‘దర్బార్’గా వస్తున్నాడు. రజనీ స్టైల్‌కి తెలుగు ఆడియన్స్ బాగా కనెక్టై ఉంటారు. ఆ నమ్మకంతోనే -దర్బార్‌ను ఈసారి తెలుగు థియేటర్లలో భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇక పనిలో పనిగా కళ్యాణ్‌రామ్ సైతం ‘ఎంత మంచి వాడవురా’ అనిపించుకోవడానికి -సంక్రాంతినే టార్గెట్ చేశాడు.
ఐదు సినిమాలు సంక్రాంతి రేసులో ఉండటంతో -ఏ సినిమాకు ఎంత ధర పలుకొచ్చన్న లెక్కలు అప్పుడే మొదలయ్యాయి. అందుబాటులో ఐదు సినిమాలు ఉండటంతో -డిస్ట్రిబ్యూటర్ల నుంచి డిమాండ్ వచ్చే అవకాశం తక్కువ కనిపిస్తోంది. ఇప్పటికే బిజినెస్ డీల్స్ మొదలెట్టిన సరిలేరు నీకెవ్వరు చిత్రానికే పెద్దగా డిమాండ్ రావడం లేదన్న వాదన వినిపిస్తోంది. సినిమాలకు క్లాష్ తలెత్తినపుడు.. నిర్మాతకు నష్టం వాటిల్లకుండా పరిశ్రమ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని పరిష్కార మార్గాలు అనే్వషిస్తామంటూ ఈమధ్యే నిర్మాతల మండలి ప్రకటించింది. ‘తెలుగు హీరోలు, దర్శకులు, నిర్మాతలు బంగారాలు. పరిస్థితిని అర్థం చేసుకుంటారు’ అంటూ మండలి వ్యాఖ్యానించింది కూడా. అయితే, ఇక్కడే చిన్న మెలిక ఉంది. పండుగలు, ఎక్కువ సెలవులు వచ్చిన సందర్భాల్లో సినిమాలు విడుదల చేయాలని అంతా అనుకుంటారు కనుక.. అలాంటి సందర్భాల్లో కూర్చుని మాట్లాడుకోవడం కుదరదు అన్న విషయాన్నీ స్పష్టం చేసేశారు. సో, ఇప్పుడు సంక్రాంతిని టార్గెట్ చేస్తూ సినిమాలు తెస్తున్న నిర్మాతలే -సీజన్‌లోనే సినిమా తేవాలా? లేక సినిమా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసుకోవాలా? అన్నది నిర్ణయించుకోవాలి.
ఆగస్టు 15కి రావాల్సిన సాహో ఆగస్టు 30కి జరగడంతో -పెద్ద సినిమాకు దారిచ్చేస్తూ రెండు మీడియం రేంజ్ సినిమాలు విడుదలను వాయిదా వేసుకున్నాయి. ఒకటి గ్యాంగ్‌లీడర్, ఇంకోటి వాల్మీకి. రెండూ ఆడియన్స్‌లో ఆసక్తిరేపుతోన్న చిత్రాలే. వాయిదా తరువాత -రెండూ సెప్టెంబర్ 13న థియేటర్లకు వచ్చేందుకు నిర్ణయించుకున్నాయి. అన్ సీజన్‌లో ఈ క్లాష్ ఎంతమాత్రం మంచిది కాదంటూ నిర్మాతల మండలిలో చర్చించుకున్న నిర్మాతలు -సంయమనంతో వారం గ్యాప్‌తో సినిమాలను తెస్తున్నారు. నానీస్ గ్యాంగ్‌లీడర్ సెప్టెంబర్ 13న థియేటర్లకు వస్తుంటే, వరుణ్‌తేజ్ వాల్మీకి సెప్టెంబర్ 20న థియేటర్లకు వస్తోంది. ఈ క్లాష్ ఇప్పటికి పరిష్కారమైనా -క్రిస్మస్‌కు మరో కిరికిరి తలెత్తనుంది. అది ఫెస్టివల్ సీజన్ కావడంతో -క్రిస్మస్‌ను టార్గెట్ చేసుకుని వస్తోన్న చిత్రాలు ముందు వెనుకలకు జరుగుతాయా? లేదా? అన్నది పెద్ద మిస్టరీగా మారింది. డిసెంబర్ 20న నాలుగు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రకటించుకున్నాయి. -రవితేజ ‘డిస్కోరాజా’, నితిన్ ‘్భష్మ’, సాయిధరమ్‌తేజ్ ‘ప్రతిరోజు పండగే’, శర్వానంద్ ‘96’ చిత్రాలు ఒకేరోజు విడుదలయ్యే అవకాశముందా? ఉంటే ఏ సినిమాకు ఎంత లాభం? ఎంత నష్టం? పరిశ్రమకు ఇది ఆరోగ్యకరమైన వాతావరణమేనా? అన్న చర్చ మొదలైంది. ఒకే సీజన్‌లో నాలుగు సినిమాలు వస్తే, అటు డిస్ట్రిబ్యూటర్లనుంచీ పెద్దగా డిమాండ్ ఉండకపోవచ్చు. మరోపక్క ఆడియన్స్ బడ్జెట్‌కనుగుణంగా సినిమాలు చూస్తారు కనుక -ప్రాధాన్యతాక్రమంలో కనీసం రెండు సినిమాలు దెబ్బతినొచ్చన్న భయాలు లేకపోలేదు. సో, కనీసం రెండు సినిమాలైనా వాయిదా వేసుకోక తప్పని పరిస్థితి. వచ్చే సినిమాలన్నీ పెద్ద నిర్మాతల ప్రొడక్షన్ హౌజ్‌ల నుంచి వస్తున్నవే కనుక, -ఎవరు రాజీపడతారు? ఎవరు మొండిగా ముందుకెళ్తారోనన్న ఆసక్తి లేకపోలేదు. ఒకవేళ సంయమనంతో వ్యవహరించి ఏ నిర్మాతైనా సినిమా వాయిదాకు అంగీకరిస్తే, జనవరి చివరి వారం వరకూ జరగాల్సి ఉంటుంది. అంటే, సంక్రాంతి సీజన్ దాటిపోవాలన్న మాట. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్ని సినిమాలు వాయిదా పడతాయి? ఎన్ని సినిమాలు విడుదల సీజన్లను మార్చుకుంటాయి అన్నది వెండితెరపై చూడాలి.

-ప్రవవి