మెయిన్ ఫీచర్

ఇంద్రగంటి ‘గౌతమీ’ అక్షర చిత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధునికాంధ్ర సాహిత్య లోకంలో క్రొత్తపాతల మేలుకలయికతో క్రొమ్మెఱుంగులను చిమ్మిన రచయితలలో ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారు ఒకరు. కథా-కవితా-విమర్శల ముక్కంటి శ్రీ హనుమదింద్రగంటి. సుమారుగా 1980 ప్రాంతాలలో శ్రీ పురాణం సుబ్రహ్మణ్యశర్మగారి కోరికమేరకు ఆంధ్రజ్యోతి వారపత్రికకోసం శాస్ర్తీగారు ఈ ‘‘గౌతమీగాథల’’ను వెలువరించారు. సత్యం శంకరమంచిగారి ‘‘అమరావతి కథల’’ ప్రేరణతో ఇది రచింపబడింది. ఇది ఒక రకంగా శాస్ర్తీగారి అంతరంగ ఛాయాచిత్రం. గోదావరీ పరీవాహక ప్రాంతంలోని సాహిత్య గోష్ఠులను కథలూ- గాథలుగా మలిచిన గ్రంథమిది. ఆయన సాహిత్యపరంగా అభ్యుదయం చెందే వేళల్లో ఈ దేశపు అంతరంగాలూ, ఆవేశాలూ, ఆకాంక్షలూ ఎలా ఉండేవో ఈ గ్రంథాన్నిబట్టి తెలుస్తుంది. రకరకాల ఉద్యమాల ప్రభావాల పనితీరు కనిపిస్తుంది. అంతర్గతంగా ఈ రచయిత ఆత్మచరిత్ర కూడా ఉంది. నవోదయ వారు దీన్ని గ్రంథరూపంలోనికి తెచ్చారు.
ఈ గౌతమీ గాథలులో ప్రధానంగా తెలుగు సాహిత్యలోకంలో కథావశిష్టులుగా మిగిలిపోయిన సర్వశ్రీ గుడిపాటి వెంకటచలం, శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్ర్తీ, కందుకూరి, భమిడిపాటి కామేశ్వరరావు, గిడుగు రామమూర్తి పంతులు, చెళ్లపిళ్ల వెంకటశాస్ర్తీ, కాటూరి వెంకటేశ్వరరావు, జమ్ములమడక మాధవరావుశర్మ, విశ్వనాథ, అడివి బాపిరాజు, దేవులపల్లి మున్నగువారి వ్యక్తిత్వాలు అక్షర చిత్రాలుగా కనిపిస్తాయి. వీటిని చిత్రించేటప్పుడు కొన్నిచోట్ల ఇంద్రగంటివారు స్వభావోక్తి సౌందర్యాన్ని నిలిపారు. మరికొన్నిచోట్ల చమత్కారాన్ని మెరిపించారు. మరికొన్నిచోట్ల ఉపమా రుచులతో నోరూరించారు. తద్వారా నేటి సాహితీ యువతరం- ఆ పెద్దల సాహిత్య వ్యక్తిత్వాలను అంచనావేసుకొని పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి వీలవుతుంది. ‘గౌతమీ గాథలు’లోని ఆ అక్షర చిత్రాలను కొన్నిటిని అవలోకిద్దాం.
‘‘చేతులు లేని బనియను- గళ్లలుంగీ- పెద్ద కుంకం బొట్టు. బనియన్ జేబులో పెద్ద దువ్వెన. ఎగదువ్విన క్రాఫు. విశాలమైన నుదురు. ఆ పెద్ద కళ్లుచూస్తే ఆయన పేరు తెలియకుండానే ఈయనెవరో అసాధారణ వ్యక్తి అనిపిస్తుంది’’. ఇది గుడిపాటి వెంకటచలంగారి బొమ్మ. స్వభావోక్తి సుందరంగా గావింపబడిన బాహ్యవ్యక్తి స్వరూపమిది. ‘‘తర్వాత మరో ఆరేళ్లకు ఒక్కణ్ణీ చలంగారిని చూసి, నాలుగుగంటలు ఆయనతో గడిపాను. ఆయన చలం కాడు. అచలం అనిపించింది-’’ ఈ వాక్యాల్లో చలం ఆంతర వ్యక్తిత్వం సుస్పష్టంకావడం చెప్పుకోదగ్గ విశేషం. ఇది ‘‘గౌతమీ గాథలు’’ లోని ‘‘ప్రారంభ దశ’’ అన్న శీర్షికలోనిది. ‘‘పెద్దపులి లాంటి తల. దానిమీద తీర్చి చుట్టిన తలపాగా. మెడలో పట్టుపట్టీతో ‘కైజర్‌హింద్’ పతకం మెరుస్తోంది. ఎవరికీ ఎదుటపడి మాట్లాడడానికి దమ్ములు లేవు. ‘‘ఇంతవరకు గిడుగు రామమూర్తి పంతులుగారిని గూర్చి కట్టిన బొమ్మ సామాన్యంగానే ఉంది. కానీ- ఇంద్రగంటివారు అంతటితో ఆగక ‘‘మాట్లాడినా చెవిదాకా వెళ్లదు’’ అని పలికి వర్ణనలో చమత్కారాన్ని సాధించారు. గిడుగువారికి చెవుడన్న విషయాన్ని చమత్కారంగా పై వాక్యంలో చెప్పకయే చెప్పారు.
‘‘మల్లెపూవు లాంటి ధోవతి ధరించి, ఖండువా కప్పుకొని ముఖం నిండా విభూతితో- శివావతారంలా ఒక పీటమీద కూర్చుని మాకోసం ఎదురుచూస్తున్నారు. ఆయన నాగేశ్వరులు కారు. నగేశ్వరుడిలా కనిపించారు-’’ అని కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారిని శివునితో పోల్చి, చక్కని ఉపమా రుచులను ఘుమఘుమలాడించారు- ఇంద్రగంటి వారు.
ఇక సాహిత్యమూర్తుల అక్షర చిత్రాలు సంఘటనాత్మకంగా, సంభాషణాత్మకంగా గూడా కనిపిస్తాయి. ‘‘సాయంత్రం అయిదింటికి సభ ప్రారంభమై జరుగుతోంది. కార్యక్రమంలో అంతకుముందు ఎవరు మాట్లాడారో తెలియదుగాని- సభలో అడుగుపెట్టేటప్పటికి జ.మా.శర్మగారు తెలుగులో కొంతసేపు, సంస్కృతంలో కొంతసేపు జమాయించి ప్రసంగించారు. తెలుగయినా, సంస్కృతమయినా అది ఒక వరద గోదావరి. తెలుగుకంటే సంస్కృతమే బాగా అర్థమయినట్టు సభ్యుల వదనాలు చెబుతున్నాయి.’’ ‘తీగ తెగింది’ అన్న శీర్షిక కల్గిన ప్రకరణంలోని వాక్యాలివి. ఇవి జమ్ములమడక మాధవరావుశర్మగారి వ్యక్తిత్వానికి వర్ణనాత్మకమైన అక్షరాకృతి.
‘‘వేదులవారు తరువాత వక్త. వేదులను చూస్తే నవ్వొచ్చింది. కొంటెతనమంతా పెదవుల్లో బిగించి అమాయకంగా ఏమీ ఎరుగనట్లు మొదలెట్టాడు. ‘‘కవితా ప్రవాహంలో కొట్టుకుపోయాను. నేను భద్రాచలం వాణ్ణి. ఈత బాగా వచ్చు. అయితేయేం, ఆవలి యొడ్డు కనపడందే? ఒకసారి దుగ్గిరాల గోపాలకృష్ణయ్య ఒక ప్రశ్న వేశాడట. ‘‘మంచినీళ్లకు, సోడాకు తేడా ఏమిటి?’’ అని. చట్టున ఒకడు సమాధానం చెప్పాడు ‘గ్యాస్’ అని. నా ఉపన్యాసం ఆ రెండో రకం. కొంచెం ఘాటు విశేషం: క్షమించండి’ అని కూర్చున్నాడు. సభ పకపకలతో నిండిపోయింది. - ‘‘పై రెండు సంభాషణాత్మక సన్నివేశాలలోనూ మొదటి దానిలో వేదులవారి హాస్యప్రవృత్తి ప్రత్యక్షంగా వ్యక్తవౌతుంటే, వేదుల వారే చెప్పిన రెండవ సన్నివేశంలో దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారి వ్యక్తిత్వాన్ని చాటడంద్వారా తమ హాస్యప్రవృత్తిని పరోక్షంగా చాటుకోవడం స్పష్టవౌతుంది.
ఇక సంభాషణాత్మక సన్నివేశాలలో హాస్యప్రవృత్తి చోటుచేసుకొని గాంభీర్య వాతావరణం సంతరించుకున్న అక్షర చిత్రాలు కూడా ‘‘గౌతమీ గాథలు’’లో ఉన్నాయి. ఉదాహరణకు ‘‘తీగ తెగింది’’ అనే శీర్షికలోని శ్రీ కాటూరి వేంకటేశ్వరరావుగారి బొమ్మ పేర్కోదగింది.
‘‘... తదుపరి కాటూరివారు రంగంమీదకు అవతరించారు. ఆజానుబాహువు. నిలువునా ఖద్దరు మనిషి. కొన్ని తరాలనుంచి కవిత్వం మా సొమ్ము అనే ఠీవీ, సాహిత్యంలో నిల్పుకున్న పెద్దతనం, వెంటబడి వచ్చినట్టున్నాయి. కూర్చుని, కొంచెం సర్దుకుని నెమ్మదిగా ఉపన్యాసానికి ఉపక్రమించారు. ...ఆ చెప్పే ఒడుపులో అంతా తన్మయులై వింటున్నారు. హఠాత్తుగా కార్యనిర్వహకులలో ఒక విద్యార్థి. రంగు పువ్వుల బాడ్జీకలవాడు వచ్చి ఆయన చేతికి ఒక చీటీ అందిచ్చాడు. ‘‘...వెంటనే శ్రీ ద్వారం వెంకటస్వామినాయుడుగారి వయొలిన్ కచేరీ ఉంది. దయచేసి త్వరగా ముగించండి’’ అని ఉంది. ఆ చీటీలో- అంతవరకూ కులాసాగా కథ చెప్పే వెంకటేశ్వరరావుగారి ముఖం గంభీర ముద్ర వహించింది. చీటీ చూడడమేమిటి? - స్విచ్ వేసినట్టు టక్కున ఆపెయ్యడమేమిటి- కత్తిరించినట్టు ఎత్తుకున్న వాక్యమైనా ముగించకుండా సభ్యులతో ‘‘ఇది సాహిత్య సభ అనుకున్నాను. పొరపాటు. సంగీత సభ అని ఇప్పుడే తెలిసింది. దానికి ముందు మా ప్రసంగాలు మంగళవాద్యాలు అనుకోలేదు. క్షమించండి’’ అని చట్టున మైక్ ముందునుంచి లేచి తిరిగి చూడకుండా రోడ్డుమీదకు వెళ్లిపోయారు. అందరూ నిశే్చష్టులయ్యారు.
‘‘ఈ సందర్భంలో ముగింపును చాలా అర్థవంతంగా చేశారు- ఇంద్రగంటివారు ఇలా - ‘‘శ్రావ్యంగా పలికే వీణతీగ టప్పున తెగిపోయినట్టయింది.’’ ఇలా ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీగారి ‘‘గౌతమీ గాథలు’’ లోని అక్షర చిత్రాలు నిజంగా సు-వర్ణ ఛత్రాలు. ఆయా వ్యక్తుల వ్యక్తిత్వాలను సంక్షిప్త సుందరంగా అందజేసే ఆనందవర్ధన సూత్రాలు. ప్రశంసా పాత్రలు.
*
(29-8-2019న ఇంద్రగంటి హనుమచ్ఛాస్ర్తీ 109వ జయంతి సందర్భంగా -)

- డా. రామడుగు వేంకటేశ్వరశర్మ, 9866944287