మెయిన్ ఫీచర్

ప్రేమే కృష్ణుని తత్త్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూలోకంలోని దుష్టులను సంహరించి పాపభారం తగ్గించడానికి అవతరించిన విష్ణువు రూపమే శ్రీకృష్ణుడు. భాద్రపద మాస కృష్ణపక్షం అష్టమి రోజున దేవకీ వసుదేవుల పుత్రునిగా జన్మించిన కృష్ణుడు లోకంలో ప్రేమతత్వం నింపాడు. అవతారమెత్తడానికి భూమిమీద అన్నిప్రదేశాలు సమానమేనని లోకానికి రుజువు చేయడానికే చెరసాలలో జన్మించాడు. జన్మించిన కద్దిక్షణాలకే కన్నతల్లికి దూరమైనా, యశోదానందుల సంరక్షంలో పెరిగినా ఉత్తముడై ఉన్నత స్థానాలు అధిరోహించి, జన్మస్థానం కారాగారమైనా, ఖజానా అయినా ఒక్కటేనని నిరూపించాడు. పుట్టుకలో గొప్పతనం కాకుండా ఎదిగే తీరులో నిలిచేస్థానంలో గొప్పతనం అవసరమని చాటాడు. తల్లిదండ్రుల పెంపకమే మనిషి ఉన్నతికి తోడ్పడుతుందని, బాల్యంలో అలవరచుకున్న మంచిగుణాలు జీవితంలో ఎదుగుదలకు తోడ్పడతాయని బోధించాడు.
కంసుడి కారణంగా శ్రీకృష్ణుడు మృత్యువుతో అనేకమార్లు పోరాడాడు. జన్మించిన కొన్ని రోజులకే విషం నింపిన చనుబాలను త్రాగించి కృష్ణుడి ప్రాణాలు తోడెయ్యాలని పూతన ప్రయత్నించింది. మొదటిసారి బోర్లాపడిన కృష్ణుడిని చూసి ఉత్సాహంగా ఉత్సవం నిర్వహించింది యశోద. ఆ సమయంలో ఒక బండి క్రింద ఊయలలో శ్రీకృష్ణుడిని పరుండబెట్టగా శకటాసురుడు సంహరించాలని ప్రయత్నించాడు. సుడిగాలి రూపంలో కృష్ణుని ఆకాశంలోకి తీసుకుపోయి చంపబోయాడు తృడావర్తుడు. ఆవులను పచ్చిక బయలలో మేపుతూ ఆటలాడుకుంటున్న కృష్ణున్ని హతమార్చబోయాడు వత్సాసురుడు. ఆ ప్రయత్నాలన్నీ చేయించిన కంసుడు తనవాళ్ళని సంహరిస్తున్న కృష్ణునిమీద మరింత పగబట్టాడు.
మడుగులో కొంగలా బకాసురుడు, కొండచిలువలా అఘాసురుడు, గాడిదల్లా ధేనుకాసుర బృందం, గోపబాలకుల్లా ప్రలంబాసుర, వ్యోమాసురులు, శంఖచూడుడు, వృషభంలా అరిష్టాసురుడు, అశ్వంలా కేశాసురులు ప్రయత్నించగా వారి ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొని అంతమొందించి కంసుడికి సవాల్ విసిరాడు కృష్ణుడు. ముందుచూపుతో ప్రవర్తించి ఎదురయ్యే ప్రమాదాలనుండి బయటపడాలని మానవులకు సందేశమిచ్చాడు కృష్ణుడు.
అరువదివేల ఏనుగుల బలమున్న కువలాయపీడమనే ఏనుగును, మల్లవీరులైన చాణురుడు, ముష్టికుడు, కూటుడు, శలుడు, తోశలులను మట్టికరిపించాడు. మామ కంసుడిని అతడి ఎనిమిది మంది సోదరులను తన అన్న బలరామునితో కలిసి సులభంగా ఎదుర్కొని యమలోకానికి సాగనంపి భూభారాన్ని తగ్గించిన కృష్ణుడు, తల్లిదండ్రులను, తాత ఉగ్రసేనులను చెరనుండి విడిపించి ఆనందం కలిగించాడు
కంసుడి మరణానికి కారకుడైన శ్రీకృష్ణుడి మీద పగ పెంచుకుని పద్దెనిమిది సార్లు దండయాత్ర చేశాడు కంసుడి మామ జరాసంధుడు. జరాసంధుడి పక్షం వహించి శిశుపాలుడు, సాళ్వుడు, నరకాసురుడు, బాణాసు రుడు, శాల్వుని మిత్రుడు దంతవక్త్రుడు, దంతవక్త్రుని సోదరుడు విదురధులు కృష్ణుడితో యుద్ధం చేశారు. వారందరినీ సమర్థంగా ఎదుర్కొన్నాడు కృష్ణుడు. కృష్ణుడి సమయస్ఫూర్తి అనితర సాధ్యం. మహాబలశాలి కాలయవనుని శక్తి ముందు నిలవడం కష్టమని భావించిన కృష్ణుడు తెలివిగా ఒక గుహవైపు పరుగుతీశాడు. ఆ గుహలో నిద్రిస్తున్న ముచికుందుడి తీక్షణ దృష్టికి కాలయవనుడు భస్మమయ్యేలా చేశాడు.
యమునానది నీరు త్రాగి మరణిస్తున్న గోపాలుర మరణానికి కాళియుడి విషమే కారణమని గ్రహించిన కృష్ణుడు యమునలోకి దూకి 101 శరస్సులు గల కాళియుని శిరస్సుపై పాదతాడనం చేసి గర్వం అణిచి యమునా నది నుండి తరిమాడు. తన మిత్రులను సజీవులను చేసాడు. మంజూరణ్యములో దావాగ్నిలో చిక్కుకున్న గోవులను, గోపబాలురను రక్షించిన కృష్ణుడు స్వజనాన్ని కాపాడడం కోసం ఎంతటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవాలని పాలకులకు సూచించాడు.
తనని పూజించలేదన్న కోపంతో ఏడు దినములు ఎడతెరిపి లేకుండా వడగండ్ల వర్షం కురిపించిన ఇంద్రుడి గర్వం అణచి, కళ్ళుతెరిపించడంకోసం తనవారిని కాపాడుతూ గోవర్థనగిరి పర్వతాన్ని ఎడమ చేతి చిటికెన వేలుతో గొడుగులా పైకెత్తి బృందావన వాసులను రక్షించాడు కృష్ణుడు. స్వజన పరివారాన్ని ఎల్లవేళలా ఎండ వేడి, వర్షం నుండి కాపాడే గొడుగులా రక్షించాలని నాయకులకు సూచించాడు.
విద్య నేర్పిన గురువులను గౌరవించి పూజించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. తనకు విద్య నేర్పి ఉన్నతుడిగా తీర్చిదిద్దిన గురువు సాందీపుడు, మృతుడైన పుత్రుని బ్రతికించమని గురుదక్షిణ కోరగానే సంతోషంగా అంగీకరించాడు కృష్ణుడు. సముద్రంలో నివసించే పాంచజన్యుడి కారణంగా మరణించాడని భావించి రాక్షసుని సంహరించాడు. గురుపుత్రుడు దొరకకపోవడంతో యముని ఒప్పించి గురుపుత్రుని సజీవునిగా తెచ్చి గురుభక్తి చాటుకున్నాడు కృష్ణుడు. గురువులను గౌరవించేస్థాయికి లోకానికి చాటి చెప్పాడు.
కృష్ణుడు అనేక ఘనకార్యాలను అవలీలగా పూర్తిచేసి ఘనత చాటాడు. నలకూబర మణిగ్రీవులకు శాపవిముక్తి, సుదర్శనుడనే గంధర్వుడికి చిలువ రూపం నుండి విముక్తి, దాసీ అయిన కుబ్జను అతి సౌందర్యవతిగా మార్చడం, ఊసరవెల్లి రూపంలో బావి అడుగున పడి వున్న నృగమహారాజుకి శాపవిమోచనం కలిగించి స్వర్గప్రాప్తి కలిగించడం సహా మరెన్నో మధురమైన ఘట్టాలను భాగవతం వివరించింది.
కృష్ణుడితో స్నేహం చేసిన మిత్రులు అనేకమార్లు ప్రయోజనం పొందగా నమ్మి ఆరాధించినవారు సులభంగా విజయాలు సాధించారు. జరాసంధునితో యుద్ధం చేస్తున్న భీముడికి ఒక సలహాతో విజయం అందించాడు. ఖాండవ దహన సమయంలో మయుడను రాక్షసుని రక్షించాడు. నిండు సభలో వస్త్రాపహరణం జరుగుతుండగా ‘అన్నా!’ అని పిలిచిన ద్రౌపదిని అవమానభంగం నుండి గట్టెక్కించాడు. వనవాసంలో వున్న పాండవులు దుర్వాసముని ఆగ్రహానికి గురికాకుండా అక్షయపాత్ర అడుగున వున్న ఒక్క మెతుకుతోనే భుక్తాయాసం కలిగించి పారిపోయినట్లు చేసాడు. బాల్యమిత్రుడు కుచేలుడి దారిద్య్రం పారద్రోలి సంపదలతో అనుగ్రహించడం, అర్జునుడికి రథసారధిగా కురుక్షేత్రంలో సహాయం అందించడం, స్వజనాన్ని సంహరించలేనని కురుక్షేత్రానికి ముందు పలికిన అర్జునుడికి భగవద్గీత బోధించి కార్యోన్ముఖుని చేయడం, విజయుడిగా నిలపడం, కురుక్షేత్ర యుద్ధానంతరం వచ్చిన భీముని కౌగిలించుకోవాలన్న దృతరాష్ట్రుడి పన్నాగం గ్రహించి కాంస్య విగ్రహం నిలబెట్టి భీముని రక్షించడం మొదలైన ఎన్నో సంఘటనలు కృష్ణుడి సహాయ గుణాన్ని తేటతెల్లం చేశాయి. అందరికీ మేలు చేసిన కృష్ణుడు తల్లిని మరువలేదు. దేవకీదేవి కోరిక ప్రకారం కంసుడు సంహరించగా మృతులైన ఆరుగురు సోదరులను స్వర్గం నుండి వెనక్కు తెచ్చి తల్లికి చూపించి ఆమె మోములో ఆనందం నింపాడు.
అష్టపత్నులకు తోడు పదహారువేల మంది గోపికలను వివాహం చేసుకున్నాడని లోకంలో అపోహ ఉంది. నరకాసురుడు చెరబట్టిన గోపికలే కృష్ణుని శరణువేడగా దయతలచి పత్నులుగా స్వీకరించి న్యాయం చేశాడు కృష్ణుడు.
కృష్ణుడు పడినన్ని కష్టాలు, ఎదుర్కొన్న మరణగండాలు మరెవరూ పొందలేదనేది సత్యం. కృష్ణుడు ఎన్నడూ ధైర్యం వీడక, మోముపై చిరునవ్వు చెదరనీయకుండా పరోపకారం, సహాయ గుణాలను ప్రదర్శించాడు. శ్రీకృష్ణుడిలోని సద్గుణాలను నేర్చుకోవాలి మానవులు. కష్టాలలో కృంగిపోకుండా, సుఖాలలో పొంగిపోకుండా స్థితప్రజ్ఞత్వం చూపాలని భగవద్గీతలో చెప్పిన ప్రకారం తమ ధర్మాలను ఆచరిస్తూ ధర్మమార్గంలో పయనించాలి మానవులు.

- నారంశెట్టి ఉమామహేశ్వరరావు 9490799203