మెయిన్ ఫీచర్

భద్రతకు భరోసా.. ఆటో అక్క

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘జీవితం ప్రత్యర్థి కనిపించని ఓ యుద్ధరంగం. ఇందులో మనందరం సైనికులం. అందుకే నిత్యం పోరాడుతూనే ఉండాలి. యుద్ధరంగంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యాన్ని ఎలా కోల్పోమో.. అలాగే జీవితంలో కూడా ధైర్యాన్ని కోల్పోకూడదు. ఒక్కోసారి కింద పడిపోవచ్చు. కానీ తిరిగి లేచి పోరాడడానికి శక్తిని కూడకట్టుకోవాలి. వీలైనంతవరకూ కింద పడకుండా ఉండటానికి చూడాలి. దీనికోసం పోరాటం చేయాలి. ఈ పోరాటం విజయం అంచుల వరకూ తీసుకెళ్లేలా ఉండాలి’ అని చెబుతుంది రాజేశ్వరి. రాజేశ్వరి అనే పేరు చెబితే ఎవరికీ తెలియదేమో కానీ.. ‘రాజీ అక్క లేదా ఆటో అక్క లేదా ఆటో రాజీ’గా ఈమె అందరికీ సుపరిచితురాలే. రాజీ లేని పోరాటం ఆమె నైజం. వివరాల్లోకి వెళితే..
రాజేశ్వరిది కేరళలోని పాలక్కాడ్. బి.ఎ. ఫిలాసఫీ చేసింది. పాలక్కాడ్‌లో బి.ఎ. చదువుతున్నప్పుడే ఆమెకి అశోక్ పరిచయమయ్యాడు. అశోక్ ఆటో నడుపుతాడు. ఇద్దరి మధ్యా స్నేహం కుదిరింది. కొద్దిరోజులకు స్నేహం కాస్తా ప్రేమగా మారింది. తరువాతి కాలంలో వాళ్ల ప్రేమ పెళ్లి పీటలెక్కింది. ప్రేమ నుంచి పెళ్లి వరకూ సమాజం నుంచి చాలా సమస్యలు ఎదురయ్యాయి. అలాగని పెళ్లి తరువాత కూడా ఆ దంపతులు సుఖంగా ఉండింది లేదు. ఎన్నో ఆటంకాలు.. ఎనె్నన్నో సమస్యలు.. ఈ సమస్యలను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడదు రాజేశ్వరి. పెళ్లి తర్వాత కొద్ది రోజులకు కోయంబత్తూర్‌లో వారి జీవనాన్ని మొదలుపెట్టారు. రాజేశ్వరి ఓ ట్రావెల్ ఏజెన్సీలో అకౌంటెంట్‌గా చేరితే.. ఆమె భర్త అశోక్ ఆటో నడిపేవాడు. అలా ఇద్దరి కొద్దిపాటి రాబడితో బతుకు బండి గాడిన పడింది అనుకునేలోపే ఊహించని పెను ఉత్పాతం బాంబు రూపంలో ఎదురైంది. అది 1998, ఫిబ్రవరి 14.. కోయంబత్తూర్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కే అద్వానీ మీటింగ్ రోజు. ఆయనను లక్ష్యంగా చేసుకున్న కొందరు దుండగులు నగరంలో పలుచోట్ల బాంబులు పేల్చారు. ఆ పేలుళ్లలో 58 మంది మరణించగా, రెండు వందలకు పైగా అమాయకులు గాయాలపాలు అయ్యారు. వారిలో రాజీ దంపతులు కూడా ఉన్నారు. ఆ దుర్ఘటన తర్వాత రాజేశ్వరి దంపతులు కోయంబత్తూర్‌లో నివసించడం కష్టమైంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నారు. అలా రాజేశ్వరి సోదరుడు చెన్నైలో ఉంటే.. అతని అండతో రాజేశ్వరి కుటుంబం చెన్నైకి చేరింది.
రాజేశ్వరి దంపతులకు కోయంబత్తూర్ చేసిన బాంబు గాయాలైతే మానాయి కానీ చెన్నైలో రాజేశ్వరికి ఉద్యోగం దొరకడం చాలా కష్టమైంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం మాత్రం ఆమెకు దొరకలేదు. చేతిలో బి.ఎ. ఫిలాసఫీ డిగ్రీ ఉంది. అంతకుముందు కోయంబత్తూర్‌లో ఉద్యోగం చేసిన అనుభవం కూడా ఉంది. కానీ ఆ అనుభవం ఆమెకు ఏమాత్రం ఉపయోగపడలేదు. ఇంటర్వ్యూలకు వెళ్లడం, వెనక్కి రావడం ఆమెకు రొటీన్ అయ్యింది. దాంతో ఆమె విసుగు చెందింది. ఉద్యోగం తెచ్చుకునే బతకలా.. జీవితంలో బతకడానికి, విజయం సాధించడానికి ఏదో ఒక మార్గం తప్పకుండా ఉంటుంది అనుకుంది. తనకు తానే ఓ ఉపాధిని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. ఆమెకు బాగా పరిచయం ఉన్న ఉపాధి మార్గం ఆటో నడపడం ఒక్కటే.. కోయంబత్తూర్‌లో భర్తతో సరదా నేర్పించుకున్న డ్రైవింగ్‌తోనే చెన్నైలో జీవించాలి అనుకుంది రాజేశ్వరి. ఆమె తనకు తానుగా సొంత ఆటో కొనుక్కునే వరకు అశోక్‌ను పగలు ఆటో నడపని, తాను రాత్రి ఆటో నడుపుతానని చెప్పింది. అందుకు అశోక్ అడ్డు చెప్పలేదు. సరేనన్నాడు. అప్పుడు ఆమెకు ఇరవై ఎనిమిది సంవత్సరాలు. ఇది జరిగి ఇప్పటి ఇరవై సంవత్సరాలు దాటింది.
కోయంబత్తూర్‌లో ఆటోనడపడం ఒక ఎతె్తైతే.. చెన్నైలో ఆటో నడపడం ఒక ఎత్తు. చెన్నైలో ట్రాఫిక్ వలయం. అక్కడ ఆటో నడపడం తేలిక కాదు. చాలా కష్టం. అంతేకాదు నగరంలో రూట్‌లు తెలుసుకోవడం మరో ఇబ్బంది. ఇప్పటిలా జీపీఎస్‌లు ఉన్న రోజులు కావవి. మ్యాప్ ఎదురుగా పెట్టుకుని చెన్నైలోని అన్ని ప్రదేశాలనూ తెలుసుకుంది రాజేశ్వరి. ఆటోలో తిరుగుతూ దూరాలను తెలుసుకుంది. ఇప్పుడు రాజేశ్వరికి ఒక్క అడ్రస్ చెబితే చాలు తుర్రుమని తీసుకెళ్లిపోతుంది. మ్యాప్ అవసరం లేదంటే.. ఆలోచించండి.. ఆమె ఎంతలా చెన్నై రోడ్లపై తిరిగి తెలుసుకుందో.. రాత్రి తొమ్మిది గంటలకు రాజేశ్వరి ఆటో వేసుకుని బయలుదేరుతుంది. ఒక అమ్మాయిని పికప్ చేసుకుని ఇంటి దగ్గర దింపుతుంది. ఈలోగానే రాజేశ్వరికి మరో ఫోను వస్తుంది. వారిని ఎక్కించుకుని గమ్యానికి చేర్చగానే మరో ఫోన్.. ఇలా ఆమె ఫోన్‌కు అంతుండదు. ఎవరు ఫోన్ చేసినా వెంటనే స్పందించి వెళుతుంది.
ఆమె రైడ్ కోసం వెళుతున్నప్పుడు కానీ, ఫోన్‌కాల్ ద్వారా పికప్‌కి వెళ్తున్నప్పుడు.. రోడ్డుపై బస్ కోసం ఎదురుచూస్తున్న అమ్మాయిలు, ముసలివాళ్లు కనిపిస్తే వాళ్లను ఆటోలో ఎక్కించుకుంటుంది రాజేశ్వరి. రాత్రి డ్యూటీ తొమ్మిది-పది గంటలకు వరకు ఉండి, ఆటోల్లో ఇళ్లకు వెళ్లలేని అమ్మాయిలను ఆటోలో ఎక్కించుకుని వెళ్లే రూట్లో వారికి అనువైన చోట దించుతుంది. వాళ్లకు అరకొర జీతాలు వస్తాయి కాబట్టి ఆటోలో వెళ్లే స్థోమత వారికి ఉండదు. అందుకని ఆమె ఇలా చేస్తుంది. ఈ విషయాన్ని గురించి ఆమెను అడిగితే.. ‘ఇదేం పెద్ద సామాజిక సేవ కాదు.. నేను చేయగలిగే చిన్న సాయం మాత్రమే’ అని చెబుతుంది. ఆడవాళ్లపై జరుగుతున్న అత్యాచారాలను చూసిన తర్వాత రాత్రిపూట ఆటో నడపాలనే నిర్ణయానికి వచ్చానని చెబుతుంది రాజేశ్వరి. రాత్రి ఎనిమిది గంటల నుంచి ఆమెకు ఫోన్‌కాల్స్ వస్తూనే ఉంటాయి. మహిళలు ఆ సమయంలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మగవాళ్లు నడిపే క్యాబ్‌లు, ఆటోలంటే కొంచెం సందేహిస్తారు. వారు సేఫ్‌గా ప్రయాణం చేయడానికి రాజేశ్వరి ముందుకొచ్చింది. రోజుకు రాజేశ్వరి 30 ట్రిప్పులు నడుపుతుంది. నెలకు ముప్ఫై నుంచి నలభై వేల వరకు సంపాదిస్తుంది. అలాగే మహిళలకు మోటివేషనల్ క్లాసులు కూడా చెబుతోంది రాజేశ్వరి. ఇప్పటి వరకు 13 కాలేజీల్లో కూడా లెక్చర్స్ ఇచ్చింది రాజేశ్వరి. విద్యార్థి దశలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలను పెద్ద సమస్యలుగా భావించి జీవితాలను అంతం చేసుకోవడం అర్థరహితం అని విద్యార్థులను హెచ్చరిస్తోంది రాజేశ్వరి. అలా రాజేశ్వరి డ్రైవింగ్‌ను వృత్తిగా మలచుకుని పదిమందికీ సహాయం చేస్తూ ముందుకు సాగిపోతోంది. అలాగే డ్రైవింగ్‌ను వృత్తిగా మలచుకోవాలనుకునేవారికి కూడా రాజేశ్వరి శిక్షణనిస్తోంది. సమాజంలో ఆడవాళ్ల భద్రత బాధ్యత ప్రభుత్వానిదే అయినప్పటికీ.. సాటి ఆడవాళ్లు కూడా ఆ బాధ్యతను కొంత పంచుకుంటే అనర్థాలు జరగకుండా ఉంటాయని విశ్వసిస్తోంది రాజేశ్వరి. అందుకే అందరికీ ఆమె ‘ఆటో అక్క’ అయ్యింది.