మెయిన్ ఫీచర్

పెళ్లికి తొందర పడాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాములమ్మ కూతురు జాహ్నవి జాలా అందంగా ఉంటుంది. ప్రస్తుతం మంచి పొజిషన్‌లో వుంది. పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సిఏగా పనిచేస్తోంది. లక్షల్లో జీతం.. కానీ పెళ్లిచేసుకోమంటే చాలు చికాకుపడుతుంది. సంసారం, పిల్లలు వద్దా అనడిగితే.. నీకు మనవలు కావాలా చెప్పండి.. అనాధ పిల్లలను దత్తత తీసుకుందాం.. లేదా సరోగసీ ఉండనే ఉంది కదా.. నేను మాత్రం ఇపుడే పెళ్లి చేసుకోను అంటోంది. ఇలా జాహ్నవి ఆలోచనలతో వున్న వారి సంఖ్య పెరిగిపోతోంది.
వెంకటేశ్వర్‌రెడ్డి కూతురు హిమబిందు ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తోంది. ఇప్పటివరకు ఇరవై ముప్ఫై పెళ్లిచూపులు అయినప్పటికీ ఒక్క సంబంధం కూడా నచ్చడంలేదు. హిమబిందుతోపాటుగా పనిచేసే రజని పెళ్లి చేసుకుని ఆరు నెలలు కూడా పూర్తికాకముందే విడాకులతో విడిపోయిన సంఘటనను తనను కృంగదీస్తోంది. హిమబిందులో ఆ ప్రభావం బాగా పనిచేసింది. హిమబిందుకంటూ కొన్ని వ్యక్తిగత లక్ష్యాలున్నాయి. వాటిని కాబోయేవాడు అర్థం చేసుకుని అండగా ఉంటాడా అనే ప్రశ్న నిద్దుర పట్టనీయడంలేదు. సంబంధాల్ని దాటేస్తుంటే అందరూ మరోరకంగా అనుకుంటారనే ఒత్తిడి.. పోనీ ధైర్యం చేసి ఓకె చెబుదామంటే ఇన్నాళ్లు పడిన శ్రమంతా వ్యర్థమైపోతుందేమో అనే ఒత్తిడి.. ఇలా పెళ్లిళ్ళు దాటేస్తున్నవారు ఉన్నారు.
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి, ఏవేవో అభిప్రాయాలకు, అభిరుచులకూ అలవాటుపడ్డ రెండు జీవితాలను కలిపేది పెళ్లి. అయితే.. పెళ్లి గురించి కలలు కంటూ ఊహల్లో తేలిపోయే రోజులు పోయాయి. నేటి యువతరం పెళ్లికానిప్రసాదుల్లా మిగిలిపోవడానికైనా ఇష్టపడుతున్నారు తప్ప పెళ్లి మాటే ఎత్తడంలేదు. పెళ్లి.. పిల్లలు వంటి బాదర బందీకి దూరంగా ఉండేందుకే ఇష్టపడుతున్నారు. తప్పనిసరై పెళ్లిచేసుకున్నా.. పిల్లలను కనడం, అప్పుడే వద్దనుకుని జీవితాన్ని కొనసాగిస్తున్నారు.
డబ్బు సంపాదనే లక్ష్యమా..?
ప్రపంచీకరణ ప్రభావంతో నేడు జీవన విధానంలోనూ వేగం పెరిగింది. పరుగెడుతున్న కాలాన్ని అందుకోవాలంటే.. కాలంతోపాటు మనమూ పరుగెత్తాల్సిందే. దీంతో జీవితం ఉరుకులు పరుగులమయంగా మారింది. చిన్నతనం నుంచి పెద్ద చదువు చదవాలి.. పెద్ద ఉద్యోగం చెయ్యాలి.. బాగా డబ్బు సంపాదించాలి అన్న కోరికలు మనసులో బలంగా నాటుకుపోవడమే దీనికి కారణం. దీనిలో తల్లిదండ్రుల పాత్ర గణనీయమైనదే. చదువు తర్వాత ఉద్యోగంలో నెట్టుకురావాలంటే లక్ష్యాలను చేరుకోవాల్సిందే. ఇందుకోసం కాలంతో పోటీపడాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఉద్యోగానికి ముప్పు తప్పదు. దీంతో ఉద్యోగాల్లో ప్రతి ఒక్కరూ ఒత్తిడికి గురవుతున్నారు. జీవనశైలిలోనూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పోటీ ప్రపంచంలో నెగ్గుకురావడం కోసం ఉదయం నుంచి అర్థరాత్రి వరకూ కుస్తీపడుతున్నారు. లాప్‌టాప్, కంప్యూటర్లముందు గంటల తరబడి కూర్చుంటున్నారు. ఇంటికి చేరాక ఫేస్‌బుక్, యూ ట్యూబ్, వాట్సాఫ్ చాటింగ్‌లో మునిగితేలుతున్నారు.
యువత ఎందుకిలా తయారవుతోంది?
చేతినిండా డబ్బు.. లగ్జరీ జీవితం.. కారు, షికారు.. పబ్‌లు, డ్రింక్‌లు, రాత్రి విందులు. బాయ్‌ఫ్రెండ్, గర్ల్‌ఫ్రెండ్ ఇలా అన్ని అవసరాలు తీరిపోతున్నాయి. ఇంక ఫ్యామిలీ లైఫ్ ఎందుకు? అనే భావన పెరిగిపోతోంది. పెళ్లిచేసుకుంటే ఆ బాధ్యతలకు, బంధాలకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సోషల్ లైఫ్‌లో ఆ అవసరం లేదు. ఒకరికోసం ఒకరు పట్టించుకోని బిజీ జీవితాలు అయిపోతున్నాయి. ఆఫీసు పరిచయాలు, కొలీగ్‌లు, కాలేజీ స్నేహితులు బంధువులుగా మారిపోతున్నారు. తమకంటూ కుటుంబాన్ని ఏర్పర్చుకోవాలన్న వైఖరి నుంచి వారికి తెలియకుండా వారే దూరమైపోతున్నారు. కానీ జీవితం సగభాగం ముగిసాక అప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే తను అనుకునేవారెవరూ వారికి ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో వారిని నైరాశ్యం ఆవహించక మానదు. మగవారైనా, ఆడవారైనా.. వారికి జీవితపు చివరికాలం వరకూ ఒక తోడు ముఖ్యమన్న విషయాన్ని వారు తెలుసుకునేసరికి జీవితం ముగిసిపోతుంది. అందుకే పెద్దలు కుటుంబం గురించి, వివాహవ్యవస్థ ఎందుకు నిర్మించారో వాటిని పునరుద్ధరించే దిశగా నేటియువత ఆలోచనలు ఉండాలే కాని వెర్రిపుంతలు వేసే విధంగా ఉండకూడదు.
సతమతమయ్యే దశ..
యుక్త వయస్సులో హార్మోన్ల కారణంగా శరీరంలో అనేక రసాయన చర్యలు జరుగుతుంటాయి. శారీరకంగా మానసికంగా చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. తొందరపాటు నిర్ణయాలతో అప్పుడప్పుడు అభాసుపాలు అవుతుంటారు. ఎదుటి వ్యక్తిపై కలిగే ఆకర్షణను కొందరు ప్రేమగా భ్రమిస్తుంటారు. ఏది మంచో ఏది చెడో తెలియక మాయమాటలను నమ్మి మోసపోతున్నవారు కూడా మన కళ్లముందు కనిపిస్తు ఉన్నారు. ప్రస్తుత సమాజంలో మార్పులు.. ఉమ్మడి కుటుంబాల కొరత.. పిల్లలపట్ల తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం.. సామాజిక మాధ్యమాల ప్రభావం- ఇవన్నీ పిల్లల ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
సొంత వ్యక్తిత్వం
ప్రస్తుతం అమ్మాయిలలో, అబ్బాయిలలో సొంత వ్యక్తిత్వం చిన్నవయసునుంచే అలవడుతోంది. అందుకు కారణం విద్య కావచ్చు. ఆర్థిక స్థోమత కావచ్చు. తమ తల్లిదండ్రులు కూడా చీటికిమాటికి గొడవలు పడుతూ ఏ ఆనందం లేకుండా గడపడం చూసి కావచ్చు. ఇలాంటివన్నీ పిల్లలకు చిన్న వయసులోనే వివాహ వ్యవస్థమీదున్న అభిప్రాయాలను చెడుగా మార్చే అవకాశం చాలా ఎక్కువగా ఉండి.. ఆర్థిక స్వాతంత్య్రం ఉంటే చాలదా ఇంకేం అక్కర్లేదు అన్న ధోరణి నేటి యువతరంలో పెరిగిపోతోంది. వంశపారంపర్యంగా వచ్చిన జన్యువులతోపాటుగా, పెరిగిన వాతావరణం కూడా మనిషి యొక్క ప్రవర్తన మరియు వ్యక్తిత్వం రూపుదిద్దుకోవడంలో దోహదంచేస్తాయి.
యువత ఛాయిస్
పెళ్లికి సంబంధించి ఆశ్చర్యకరమైన వివరాలు సర్వే రిపోర్టుల ద్వారా వెల్లడవుతున్నాయి. చదువు.. ఉద్యోగం.. పెళ్లి విషయాల్లో మొదటి రెంటికే ప్రాధాన్యత ఇస్తున్న యువతీ యువకులు మూడోదాన్ని పక్కన పెట్టి నాలుగో అంశాన్ని ముందుకు తెస్తున్నారు. అదే.. కెరీర్. చదువుకోవడం, మంచి ఉద్యోగం సంపాదించడం.. ఆపై స్థిరపడటం. అంతే తప్ప ఎక్కువశాతంమంది పెళ్లి గురించి ఆలోచించడంలేదు. చివరికి ఒక్కటే లక్ష్యంగా మిగులుతోంది.. స్థిరపడాలి.. అంతే. దీనికోసం రేయింబవళ్ళు కష్టపడి పనిచేయడం.. కాలంతో పోటీపడి పరుగెత్తడం దినచర్యగా మారిపోతోంది. ఈ క్రమంలో వయస్సు దాటిపోతోందనే ఆలోచన కూడా రావడంలేదు.
రెండు మనసులను దగ్గరచేసి అనురాగ ఆప్యాయతలతో అలుముకున్నదే వివాహ బంధం. అమ్మతనం జీవితానికి తీపి గుర్తు. ఆడవారి జీవితానికి పరమార్థకత చేరేదే తల్లి కావడం. ఆ మధురానుభూతులతోటే ఆడవారికి ప్రెగ్నెన్సీ నొప్పులను సైతం లెక్కచేయని మానసిక దృఢత్వం సిద్ధిస్తుంది.

- డా. శ్రీనివాస్‌రెడ్డి అట్ల 97039 35321