మెయిన్ ఫీచర్

వారందరూ ఆమె పిల్లలే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేజీలో ఓ కథనం వచ్చింది. అది త్రివేణి అనే జర్నలిస్ట్‌కు సంబంధించినది. దీన్ని ఆమే స్వయంగా రాసుకుంది. ఆమె దయార్ద్ర హృదయాన్ని ఎంతమంది మెచ్చుకున్నారో, ఎన్ని లైకులు, ఎన్ని కామెంట్లు, ఎన్ని షేరింగులో.. లెక్కేలేదు. మరి మనమూ ఆ మానవత్వ హృదయం గురించి తెలుసుకుందామా..
త్రివేణి భర్త ఆర్మీలో పనిచేసేవాడు. త్రివేణి పాత్రికేయవృత్తిలో ఉండేది. త్రివేణి భర్త ఆర్మీలోంచి బయటకు వచ్చేశాక ఇద్దరూ ముంబై చేరారు. అక్కడ అతను సొంతంగా చిన్న వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. త్రివేణి జర్నలిస్ట్‌గా పనిచేసేది. ఒకరోజు త్రివేణి వృత్తిలో భాగంగా.. వ్యభిచారానికి దేశంలోకెల్లా అతి పెద్ద అడ్డాగా ఉన్న రెడ్‌లైట్ ఏరియాకి వెళ్లాల్సి వచ్చింది. అక్కడ జరిగే ఓ కార్యక్రమానికి ఓ పెద్ద మనిషి వస్తాడు.. దాన్ని త్రివేణి కవర్ చేయాల్సి ఉంది. త్రివేణి అక్కడికి వెళ్లింది. ప్రోగ్రాం ఇంకా మొదలు కాలేదు. అక్కడ త్రివేణికి ఓ అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయికి 13-14 సంవత్సరాలు ఉంటాయి. ఆమెతో త్రివేణి మాట్లాడింది. ఆ అమ్మాయిని నేపాల్ నుంచి ఎత్తుకొచ్చి రెడ్ లైట్ ఏరియాకి అమ్మేశారట. వ్యభిచారం ఆ అమ్మాయి వృత్తి. ఆ అమ్మాయి త్రివేణితో మాట్లాడుతుండగానే.. కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ అమ్మాయిని తీసుకెళుతూ.. త్రివేణిని అక్కడి నుంచి వెళ్లిపొమ్మన్నారట. త్రివేణి తన వివరాలు, అక్కడికి వచ్చిన పని గురించి చెబుతున్నా సరే.. వారు ఏమీ వినకుండా గట్టిగట్టిగా మాట్లాడుతూ మీదమీదకు వస్తుంటే.. చేసేదేమీలేక త్రివేణి అక్కడి నుంచి వచ్చేసింది. తరువాత ఆమె తన భర్తకు విషయం చెప్పింది. ఇద్దరూ కలిసి ఆ ఇంటి అడ్రస్‌ను పోలీసులకు ఇస్తూ.. ఆ అమ్మాయిని రెస్క్యూ చేయమని కోరారు. కన్విన్స్ చేశారు. కుదరదు.. ఇక్కడ ఇవన్నీ మామూలే.. అని పోలీసులు చెబుతున్నా ఆ దంపతులు వినిపించుకోలేదు. బాగా రిక్వెస్ట్ చేయడంతో అయిష్టంగానే ఒప్పుకున్నారు. తీరా అందరూ కలిసి ఆ ఇంటికి వెళ్లారు. అక్కడికి వెళ్ళాక తెలిసింది.. ఆ ఇంట్లో దాదాపు 15 మంది ఉన్నారు. అందరినీ ఎత్తుకొచ్చి ముంబైలో అమ్మేసారట. అందరికీ సొంతూళ్లకి వెళ్లాలని ఆశ.. వారిని చూశాక ఆ భార్యాభర్తల్లో మార్పు వచ్చింది. బాగా ఆలోచించి చివరకు ఒక నిర్ణయానికి వచ్చారు.
ఆ పిల్లలకు చేతనైనంత సాయం చేద్దాం. ఎంతమందిని వీలైతే అంతమందిని ఆ రాకెట్ నుంచి తప్పిద్దాం అని అనుకున్నారు ఆ భార్యాభర్తలు. కానీ అంత పెద్ద మాఫియాని వారిద్దరూ ఎదుర్కోగలరా? అని కూడా ఆలోచించారు. కానీ వెనకడుగు మాత్రం వేయలేదు. అడుగు ముందుకే పడింది. వెంటనే త్రివేణి భర్త తన వ్యాపారాన్ని మూసేశాడు. ఇల్లు గడవక తప్పదు కాబట్టి త్రివేణి జర్నలిస్టుగానే కొనసాగుతుండేది. ఆమె భర్త మాత్రం కస్టమర్‌లా, డీలర్(అంటే అమ్మాయిల వ్యాపారి)లా నటిస్తూ ఎక్కడెక్కడ అలాంటి అమ్మాయిలను తీసుకొచ్చి పెడుతున్నారో, ఎక్కడ నుంచి ఎత్తుకొస్తున్నారో, ఇలాంటి ఇళ్లకు ఓనర్లు ఎవరో తెలుసుకునేవాడు. ఒక్కొక్క ఆపరేషన్ ఎంత రిస్కో తెలిసినా కూడా అతను చేసేవాడు. లక్కీగా అతనికి సహకరించే పోలీసుల గ్రూపు ఒకటి దొరికింది.. వారి సహాయంతో త్రివేణి భర్త వారిని విడిపించేవాడు. అలా మొదటి సంవత్సరంలో దాదాపు 300 అమ్మాయిల్ని వ్యభిచార గృహాల నుంచి రక్షించారు. వారిలో కొందరు సొంత ప్రాంతాలకు వెళ్లిపోయారు. మరికొందరు.. అక్కడికి వెళ్లినా నిరాదరణ ఎదురవుతుందని భయపడేవాళ్లు అక్కడే ఉండి.. ఏవేవో పనులు చేసుకుంటూ.. చదువుకుంటూ గడిపేవాళ్లు. ఈ క్రమంలో త్రివేణి, ఆమె భర్తా కలిసి ఓ ఫౌండేషన్‌ను మొదలుపెట్టారు.
అమ్మాయిలను రక్షిద్దామని ఆ దంపతులిద్దరూ కలిసి కీలకమైన అడ్డాకు వెళ్లారు. వివరాలు తెలుసుకున్నారు. పోలీసులు కూడా వచ్చారు. ఒక అమ్మాయి అంతకుముందు రోజే ఆత్మహత్య చేసుకుందట. చాలా ఆత్మహత్యలు, మరణాలు అసలు బయటి లోకానికి తెలియవు. ఆ ఇంటి యజమానులు ఇంట్లోనే ఇలాంటి విషయాలను సమాధి చేసేస్తారు. చనిపోయిన అమ్మాయికి అప్పటికే ఒక పాప. పాపను త్రివేణీ దంపతులే పెంచుకుందామనుకున్నారు. ఇంటికి తెచ్చేసుకున్నారు. రెండు రోజుల తరువాత వారికి ఒక లేఖ వచ్చింది. ‘మాతో చేతులు కలపండి.. సుఖంగా ఉండండి.. లేకపోతే మీకు సమాధులు సిద్ధం’ అని దాని సారాంశం. ఆ లేఖకు ఆ దంపతులు అస్సలు భయపడలేదు. ఆ లేఖ వచ్చిన రెండు రోజుల్లోనే ఇంకో వ్యభిచార గృహంపై దాడి జరగాల్సి ఉంది. ఎందుకో త్రివేణి భయపడింది. భర్తకు వద్దు అని చెప్పింది. కానీ ఆమె భర్త మాత్రం ‘అన్నింటికీ సిద్ధపడే ఈ పనిని ఎంచుకున్నం కదా.. నువ్వేం భయపడకు’ అని నవ్వుతూ వెళ్లాడట. ఇంటికి తిరిగి వస్తుండగా ఓ ట్రక్కు వెనుకనుంచి డ్యాష్ ఇచ్చిందట. అక్కడే త్రివేణి భర్త చనిపోయాడు. అది హత్య అని త్రివేణికి తెలుసు.. అది నిరూపించడానికి ఆమె చాలాచోట్లకి తిరిగింది. కానీ ప్రయోజనం లేకపోయింది. చేసేదేమీలేక వారు మొదలు పెట్టిన ఫౌండేషన్‌ను మూసేద్దామనుకుంది. కానీ ఆ ఫౌండేషన్ ద్వారా రక్షింపబడిన వారు మాత్రం వద్దన్నారు. ‘తలా కొంత డబ్బు వేసుకుందాం. దీన్ని ఆపొద్దు. ఇన్ని సంవత్సరాలు సారు చేసిన పోరాటానికి, తను కోల్పోయిన ప్రాణాలను విలువ ఉండదు. కాబట్టి ఎంత కష్టమైనా అందరం కలిసి ఈ ఫౌండేషన్‌ను నడుపుదాం’ అని త్రివేణికి చెప్పారు. అప్పుడు త్రివేణి ఆలోచించింది. తన భర్త ప్రాణాలు పోగొట్టుకున్నాడు. తన జీవితాన్ని కూడా ఆ ఫౌండేషన్‌కే అంకితమివ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పటికి 12 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఆటుపోట్లు ఆమెకు ఎదురవుతూనే ఉన్నాయి. అయినా బెదరలేదు. దాడి ప్రయత్నాలు అనేకం.. కానీ వెనుకంజ వేయలేదు. ఇప్పటివరకైతే ఆమెను ఆమె కాపాడుకుంది. ఈ క్రమంలో రక్షించిన పిల్లలను కూడా ఎత్తుకుపోయే ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఆమె ఎత్తుకుపోనివ్వలేదు. తట్టుకుంది. ఇప్పుడు ఆమె నాలుగు షెల్టర్ హోమ్స్‌ను కూడా నడిపిస్తోంది. ఇలాంటి పిల్లలకు అక్కడ కౌన్సిలింగ్ చేయిస్తారు. ఆరోగ్య పరీక్షలు చేయిస్తారు. చదివిస్తారు. న్యాయం జరిగేలా చూస్తారు. తల్లిదండ్రులు ఆదరించిన కొందరు అక్కడి నుంచి వెళ్లి చక్కగా పెళ్లిళ్లు కూడా చేసుకున్నారు. కొందరు చదువులకోసం విదేశాలకు వెళ్లారు. మరికొందరు అక్కడే ఉండి రకరకాల పనులు చేసుకుంటూ ఇలాంటి పిల్లలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు త్రివేణికి భర్త లేకపోవచ్చు. కానీ వందలమంది పిల్లలున్నారు. ఆమెకు ఇప్పటికీ తన భర్తే పక్కనుండి ఏవో సలహాలు ఇస్తూ ఆమెతో పనిచేయిస్తున్నట్టే, నడిపిస్తున్నట్లే అనిపిస్తుందట. ఇప్పటికి ఈ బిడ్డల్ని.. ఇంకా కొత్తగా వచ్చే బిడ్డల్ని కూడా కాపాడుకుంటూ.. వారి కొత్త జీవితానికి కలలు కంటాను.. కంటూనే ఉంటాను అని చెబుతోంది త్రివేణి.

-మహి