మెయిన్ ఫీచర్

ఈ ‘లేడీ సింగా’నికి సెల్యూట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతదేశంలో తప్పులు చేయడం.. వెనువెంటనే విదేశాలకు వెళ్లిపోవడం.. ఇక్కడికి వచ్చి ఎవరు పట్టుకుంటారులే.. అన్న ధీమాతో ఆనందంగా విదేశాల్లో జల్సాలు చేసుకోవడం నేడు పరిపాటి అయిపోయింది. భారతదేశం నుండి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా విదేశాలకు వెళ్లి నేరస్తుల్ని పట్టుకోవడం వంటి విషయాలు మనం సినిమాల్లోనే చూస్తుంటాం.. నిజ జీవితంలో అలాంటివి జరగవు. కానీ అచ్చంగా ఇలాంటి ఘటనే కేరళలోని కొల్లాంలో జరిగింది. కానీ కొల్లాం కమిషనర్ అయిన మెరీన్ జోసెఫ్ ఊరుకోలేదు. విదేశాలకు వెళ్లి అతడిని పట్టుకుని ఇండియాకు తీసుకువచ్చింది. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడమే తన లక్ష్యంగా పోరాడుతున్న ఐపీఎస్ ఆఫీసర్ మెరీన్ గురించి, ఆ కేసు గురించిన వివరాలను చూద్దాం..
మెరీన్ జోసెఫ్ 1990, ఏప్రిల్ 20న కేరళలోని ఎర్నాకుళంలో పుట్టింది. ఆమె తల్లిదండ్రులు వృత్తిరీత్యా దిల్లీలో ఉండటంతో ఆమె విద్యాభ్యాసమంతా దిల్లీలోని జరిగింది. ఆరో తరగతిలో ఉండగానే సివిల్స్‌పై మక్కువ పెంచుకుంది మెరీన్ జోసెఫ్. చిన్నప్పుడు ఎంతోమంది నేను అది అవుతాను, ఇది అవుతాను అంటూ ఉంటారు. కానీ మెరీన్ మాత్రం చిన్నప్పటి నుంచి భవిష్యత్తులో తాను సివిల్స్‌నే కెరీర్‌గా ఎంచుకుంటానని చెప్పేదట. దానిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కష్టపడింది. చిన్నప్పటి నుంచీ చదువంటే ప్రాణంపెట్టే మెరీన్.. బి.ఎ. ఆనర్స్ పట్టా అందుకున్న తరువాత సివిల్స్ పరీక్ష రాసింది. 2012 సివిల్స్‌లో 188 ర్యాంకు సాధించి ఐపీఎస్‌ను ఎంచుకుంది. హైదారాబాద్‌లో ఐపీఎస్ ట్రైనింగ్ తరువాత మెరీన్ తొలుత ఎర్నాకుళంలో ఎ.ఎన్.పి. అండర్ ట్రైనింగ్ ఆఫీసర్‌గా బాధ్యతలను చేపట్టింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడెమీలో శిక్షణ తీసుకుంటున్నప్పుడే ‘యూత్ 20 సదస్సు’లో పాల్గొనబోయే భారత ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించింది మెరీన్. కాలేజీలో చదువుకునే రోజుల్లో స్నేహితుడైన క్రిన్ అబ్రహాంను ప్రేమించిన మెరీన్.. 2015లో అతడిని పెళ్లి చేసుకుంది. క్రిన్ డాక్టరుగా పనిచేస్తున్నాడు. పనే దైవంగా భావించే ఈ లేడీ పోలీస్ ఆఫీసర్.. ఎంతో పట్టుదల, అంకిత భావాలతో పనిచేసేది. ఎప్పుడూ నవ్వుతూ, హుందాగా ఉండే ఈ డేరింగ్ ఆఫీసర్ పటుదల, పనితనంతో చిన్నవయస్సులోనే కమిషనర్ స్థాయికి ఎదిగింది. అలా కేరళలోని కొల్లాంకు 2019లో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టింది. ఆ సమయంలోనే రెండు సంవత్సరాలకు ముందు ఉన్న కేసుల్ని తిరగతోడిందామె. అలా పదమూడు సంవత్సరాల అమ్మాయి ఆత్మహత్య కేసు బయటపడింది. ఆ కేసు వివరాల్లోకి వెళితే..
కేరళలోని కొల్లాంకు చెందిన 38 సంవత్సరాల వ్యక్తి సునీల్‌కుమార్ భద్రన్. అతను సౌదీలో టైల్ వర్కర్‌గా పనిచేసేవాడు. 2017లో సెలవులకోసమని సొంతూరికి వచ్చాడు. అప్పుడు తన స్నేహితుడి మేనకోడలైన పదమూడు సంవత్సరాల అమ్మాయిని బెదిరించి మూడు నెలల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని, చెబితే చంపేస్తానని బెదిరించాడు. తరువాత అతను మళ్లీ సౌదీకి వెళ్లిపోయాడు. అతడు వెళ్లిపోయిన తరువాత ఆ అమ్మాయి ఇంట్లో తనకు జరిగిన అన్యాయాన్ని వివరించింది. వారు పోలీసు కేసు పెట్టారు. తరువాత ప్రభుత్వం జోక్యం చేసుకుని చొరవ తీసుకోవడంతో ఆ బాలికను అక్కడి ప్రభుత్వ మహిళా మందిరానికి తరలించారు. తనకు జరిగిన అన్యాయాన్ని తట్టుకోలేకపోయిన ఆ బాలిక ఆ రెస్క్యూహోమ్‌లోనే ఆత్మహత్య చేసుకుంది. దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం నిందితుడిపై ‘రెడ్ కార్నర్(ఇంటర్నేషనల్ అరెస్ట్ వారెంట్)’ నోటీసులు జారీ చేశారు. అయినా కేసులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఈ నోటీసులు జారీ చేసి కూడా రెండు సంవత్సరాలైంది. అలా కేసు నానుతూనే ఉంది. ఈ సమయంలోనే మెరీన్ వచ్చి కేసు పూర్వాపరాలను తెలుసుకుంది. వెంటనే సి.బి.ఐ.ను సంప్రదించింది. దాంతో అధికారులు సౌదీలోని ఇంటర్‌పోల్ పోలీసుల్ని ఆరా తీయగా.. సునీల్ సౌదీలోనే ఉన్నాడని నిర్ధారించుకున్నారు. అరెస్ట్ చేశారు. ఇటీవలే మెరీన్ తన టీమ్‌తో కలిసి సౌదీ వెళ్లి, అక్కడ స్థానిక పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడిని బంధించి ఇండియాకు తీసుకువచ్చింది. అలా 2013లో భారత్, సౌదీ చేసుకున్న ‘ఎక్స్‌ట్రాడిషన్ అగ్రిమెంట్ (నిందితుల్ని అప్పగించే ఒప్పందం)ను మొదటిసారి ఉపయోగించింది మెరీన్. ఈ ఒప్పందం జరిగిన ఆరు సంవత్సరాల తర్వాత ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆ దేశం నుంచి నిందితుడిని స్వదేశానికి తీసుకురావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు నిందితుడికి సరైన శిక్ష పడేలా చేసి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయడమే తన ముందున్న లక్ష్యం అంటోంది మెరీన్. ఇప్పుడు ఆమె మహిళలు, పిల్లలకు సంబంధించిన కేసులపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. కారణం మహిళలుకానీ, పిల్లలు కానీ తమకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకోలేరు. దాంతో వారికి సరైన న్యాయం జరగదు. వారు ఒంటరిగా కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు. వారికి ఎలాంటి ఆసరా ఉండదు. సమాజం కూడా వారు చేసే పనులను అంగీకరించదు. అందుకే అలాంటి వారికి అండగా ఉంటూ, న్యాయం చేయాలని నిర్ణయించుకుందట మెరీన్. అంతేకాదు మెరీన్ లింగ అసమానతల గురించి మాట్లాడుతూ.. ‘నేడు లింగ వివక్ష అన్ని చోట్లా పాతుకుపోయింది. చాలామంది మహిళలు తాము పనిచేసేచోట లింగవివక్షకు గురవుతున్నారు. మహిళా ఆఫీసర్లు కూడా ఫీల్డ్ పోస్టింగ్‌లో లింగ అసమానతలకు గురవుతున్నారు. ఇందుకు కారణం.. మహిళలు ఇలాంటి కఠినమైన పనుల్ని చేయలేరు అని పురుషులు భావించడమే.. ఇది చాలా తప్పు. మహిళలు ఎలాంటి పనులనైనా అలవోకగా చేయగల సమర్థులు. పైగా ఒక పనే కాదు, పలు రకాల పనులను ఏకకాలంలో పూర్తిచేస్తారు. మల్టీటాస్కింగ్ అనేది వారికి వెన్నతో పెట్టిన విద్య. అంతేకాదు అంతటి పట్టుదల, సత్తా వారికి స్వతహాగానే ఉంటాయి. అందుకే ప్రస్తుత మహిళలు ఏ రంగంలోనైనా తమ సత్తా చాటుతున్నారు. నా చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా, ఏదైనా విషయంలో నన్ను నిరుత్సాహపరిస్తే.. దాన్ని సవాలుగా స్వీకరించి అది సాధించేదాకా నిద్రపోని మనస్తత్వం నాది. నేనే కాదు.. చాలామంది మహిళల్లో ఈ సత్తా ఉంటుంది.. కాకపోతే వారు పరిస్థితులకు అనుగుణంగా మారిపోతున్నారు. అది జరగకూడదు. ప్రతి మహిళా ధైర్యంగా, పట్టుదలగా ముందడుగు వేసినప్పుడే లింగ అసమానతలు తొలగిపోతాయి’ అని చెబుతోంది ఈ లేడీ సింగం.

- సన్నిధి