మెయన్ ఫీచర్

ద్రవ్య కొరత తీవ్రతకు సాక్ష్యం.. సిద్ధార్థ ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుటుంబ వారసత్వంగా వస్తున్న కాఫీ తోటలలో కాలం గడపకుండా ఉన్నత చదువులకు వెళ్లి, స్టాక్ మార్కెట్ వ్యాపార రహస్యాలను ఛేదించి, టీ ని ఎక్కువగా ప్రేమించే భారత్‌లో కాఫీకి ఒక హోదా కల్పించి, అంతర్జాతీయ మార్కెట్ సృష్టించి, బహు ముఖంగా వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి కార్పొరేట్ రంగంలో ఆదర్శంగా నిలిచిన వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు పాల్పడటం విషాదకరం. దేశ ఆర్థిక వ్యవస్థను 5 ట్రిలియన్ డాలర్లకు తీసుకు వెళతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒక స్వప్నాన్ని దేశ ప్రజల ముందుంచిన సమయంలో ఇటువంటి విషాదం చోటుచేసుకోవడం విచారకరం.
ప్రధాని కలలకు, క్షేత్రస్థాయి వాస్తవాలకు మధ్య పెద్ద అగాధం ఏర్పడినట్లు స్పష్టం అవుతున్నది. అయితే సిద్ధార్థ మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకొనే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి. పన్నుల ఉగ్రవాదం.. అంటూ నిందించే ప్రయత్నం చేస్తున్నాయి. మరణానికి రెండు రోజుల ముందు సిద్ధార్థ తన కంపెనీ డైరెక్టర్లు, వాటాదారులు, ఉద్యోగులకు రాసినట్టు చెప్పబడుతున్న లే ఖలో- రుణదాతలు, ఈక్విటీ వాటాదారులు, పన్ను అధికారుల నుండి వస్తున్న వత్తిడులకు తట్టుకోలేక పోతున్నట్లు పేర్కొన్నారు. రుణదాతలు సకాలంలో అప్పులు చెల్లించమని కోరడం, పెట్టుబడులు పెట్టినవారు తగు రాబడి చూపమని అడగడం, పన్ను అధికారులు ఆదాయంపై పన్ను వసూలు చేసే ప్రయత్నాలు చేయడం నేరం కాబోవు. ఆ విధంగా చేయలేని పక్షంలో, మరోదారి కనబడనప్పుడు దివాలా చట్టం క్రింద న్యాయస్థానాలకు వెళ్లి రుణ విముక్తి పొందే ప్రయత్నం చేయవచ్చు. పైగా సిద్ధార్థకు రుణాల కన్నా ఆస్తులు ఎక్కువగానే ఉన్నట్లు చెబుతున్నారు. అయనా ఆయన ఎందుకు ఇటువంటి దారుణమైన మృత్యువుకు గురయ్యారు? నేడు మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న కీలకమైన సవాళ్ళను ఈ సందర్భంగా పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం ఒక గుణపాఠంగా స్వీకరించాలి. లేనిపక్షంలో వృద్ధిరేటు ఏమోగానీ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం లేకపోలేదు.
అమెరికా, ఐరోపా దేశాలలో ఆర్థిక సంక్షోభాల కాలంలో బ్యాంకులు వరుసగా కుప్పకూలి పోతున్న సమయంలో మన రిజర్వు బ్యాంకు మాత్రం పటిష్టంగా ఉండటం, మనదేశంలో అటువంటి పరిస్థితి ఏర్పడక పోవడానికి కారణం ఏమిటో గ్రహించాలి. అటువంటి బలమైన పునాదులను కూల్చివేసే ప్రయత్నం తాత్కాలిక ప్రయోజనాల కోసం చేయరాదు. ఆర్థిక శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ ను తప్పించడం ఈ సందర్భంగా ప్రభుత్వంలో నెలకొన్న అసహన ధోరణిని వెల్లడి చేస్తుంది.
నేడు దేశం ఆర్థికాభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా ఉన్న అంశం ద్రవ్యలోటు. ప్రభుత్వం ఎంతగా ప్రయత్నం చేస్తున్నా పెట్టుబడులు దొరకడం లేదు. ఆర్థిక వనరులు సమకూరడం లేదు. సుమారు రెండు నెలలుగా విఫల ప్రయత్నాలు చేసిన అనంతరమే సిద్ధార్థ ఇటువంటి తీవ్రమైన నిర్ణయానికి వచ్చిన్నట్లు తెలుస్తున్నది. కార్పొరేట్ దిగ్గజాలే కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహితం తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నాయి. రోజువారీ ఖర్చులకే ఇబ్బంది పడవలసి వస్తున్నది. తీవ్రంగా పరిణమించిన ద్రవ్య కొరతను ఎదుర్కోవడం కోసమే కేంద్రం రిజర్వు బ్యాంకు నుండి రూ 3.5 లక్షల కోట్ల మేరకు రిజర్వు నిధులను ప్రభుత్వం ఖాతాలలోకి బదలాయించాలని ఒక విధంగా తీవ్రమైన వత్తిడి తీసుకు వస్తున్నది. అందుకు సహకరించక పోవడంతోనే గార్గ్ పై ఆగ్రహం కలిగింది.
రిజర్వు బ్యాంకు నిధులను కైవసం చేసుకొనే ప్రయ త్నం ఒక వంక చేస్తూనే మరోవంక ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను విపరీతంగా అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. నష్టాలలో ఉన్న సంస్థలను అమ్మడం వేరు. లాభాలలో నడుస్తున్న సంస్థలను సహితం వేగంగా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద రెండు శాతం నిధులను ఖర్చు చేయని పక్షంలో మేనేజర్లను అరెస్ట్ చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పేర్కొనడం ప్రభుత్వంలో నెలకొన్న అసహనాన్ని వెల్లడి చేస్తున్నది. ఆర్థికాభివృద్ధికి ప్రోత్సాహకాలు కల్పించాలి గాని జైళ్లకు పంపుతామనడం ప్రతికూల పరిణామాలకు దారితీస్తుందని గ్రహించాలి.
తీవ్రమైన నిధుల ఎదుర్కొంటున్న భారత ఆర్థిక వ్యవస్థకు సిద్ధార్థ మరణం ఒక విధంగా గగుర్పాటు కలిగించే అంశం. ఆసియాలో మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్‌లో వరుసగా నాలుగో క్వార్టర్ లో వృద్ధి రేటు మందగించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. దేశంలో అనేక కార్పొరేట్ సంస్థలు సహితం ఇటువంటి ప్రమాదాల అంచున ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద కేంద్ర బ్యాంకు అయిన మన రిజర్వు బ్యాంకు ద్రవ్యలోటును అధిగమించడం కోసమే ఈ సంవత్సరం వడ్డీ రెట్లను తగ్గించింది. అయితే చెప్పుకోదగిన ఫలితం లభించిన్నట్లు కనబడటం లేదు. వ్యాపార అభివృద్ధికి ఎంతటివారైనా రుణాలను సమకూర్చుకొనక తప్పదు. అయితే భారీ వడ్డీలను చెల్లించవలసి వస్తూ ఉండడంతో వాయిదాలు చెల్లించడం కోసం పలు చట్టాలను ఉల్లంఘించక తప్పడం లేదు. ఉద్యోగుల భవిష్యత్ నిధి సహా ఇతర పన్నులు, రుణ వాయిదాలు చెల్లించడంలో జాప్యం చేయవలసి వస్తున్నది. ఇటువంటి సమస్యల నుండి బైట పడేందుకు లెక్కలను తారుమారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటివి బైట పడితే మరిన్ని సమస్యలు వెంటాడుతున్నాయి.
భారతీయులు స్వభావరీత్యా నిజాయతీ గల వారైనప్పటికీ మన చట్టాలు వారిని అవినీతిపరులుగా మారుస్తున్నాయని ఒక ప్రముఖ ఆర్థిక వేత్త చెప్పారు. మన చట్టాలలో ఉన్న గందరగోళం సహితం వ్యాపారుల ఇబ్బందులను మరింత జటిలం చేస్తుంది. ఇటువంటి ఆర్థిక అక్రమాలు అన్నింటికీ సిద్ధార్థ పాల్పడినట్లు చెప్పలేం. అయితే ఇబ్బందుల నుంచి బైట పడటం కోసం తాను చాలా ప్రయత్నాలు చేశానని, ఈ ప్రయత్నాలు తన బృందానికి, ఆడిటర్లకు, బోర్డు సభ్యులకు కూడా తెలవదని ఆ లేఖలో ఆయన పేర్కొనడం గమనార్హం. రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉండటం కారణంగా ఇటువంటి ఆర్థిక ఇబ్బందుల నుండి బైట పడటం అంత సులభం కాకపోవచ్చు. కొన్ని సమయాలలో అటువంటి సంబంధాలే కొత్త సమస్యలకు దారితీయవచ్చు. కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ వ్యాపారాలపై దాడులు జరిపినప్పుడే సిద్ధార్థ వ్యాపారాలపై కూడా ఐటీ అధి కారులు దాడులు జరపడం గమనార్హం. విజయ్ మాల్యాకు అన్ని రాజకీయ పార్టీలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. జేడీ ఎస్, భాజపాల మద్దతుతోనే రాజ్యసభకు ఆయన ఎన్నికయ్యారు. మొదటి సారి ఎన్నికైనప్పుడు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇప్పటికి మాల్యాపై ఒక రాజకీయ నాయకుడు కూడా ప్రతికూలంగా మాట్లాడే సాహసం చేయడం లేదు. నేడు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీతో పాటు దాదాపు అన్ని పార్టీల ప్రముఖుల ఆయన విమానాలను సొంత వాహనాలుగా వాడుకున్న వారే. అయితే కొన్ని పరిస్థితులలో చట్టం నుండి తప్పించుకోవడం కోసం దేశం నుండి మాల్యా పారిపోవలసి వచ్చింది. రాజకీయ అనుబంధాలు లేని పక్షంలో విజయ్ మాల్యా బ్యాంకులతో రుణాలను సర్దుబాటు చేసుకొని ఉండేవారేమో?
పన్నుల వసూలు ఆర్థిక వ్యవస్థలో కీలక అంశమే అయినా ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా సహనంతో వ్యవహరించాలి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు సిద్ధార్థ ఆత్మహత్యకు, ఐటీ అధికారుల దాడులకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం అవుతున్నది. కేవలం పన్నుల లక్ష్యాలను పెంచుకొంటూ పోతూ, వసూళ్ల కోసం వడ్డీ వ్యాపారులవలే ప్రభుత్వం వ్యవహరించడం తగదు. ఎంపికచేసిన రీతిలో పన్ను ఎగవేతదారులపై దాడులు జరిపి, వేధింపులకు గురిచేయడం కూడా ఆమోదయోగ్యం కాబోదు. ఈ విషయంలో ఐటీ, సంబంధిత శాఖలు పారదర్శకంగా వ్యవహరించాలి. తాము జరుపుతున్న దా డులపై జవాబుదారీతనం వహించాలి. నేడు బ్యాంకులకు భారీగా రుణాలు ఎగవేస్తున్న వారి పేర్లు వెల్లడి చేయడానికి ఇష్టపడని ప్రభుత్వం ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరిస్తుందని ఆశించలేం. పన్నుల వసూళ్లకు ని బద్ధతతో కృషి చేస్తూనే వ్యాపార వాతావరణం మెరుగుపరిచే ప్రయత్నం చేయాలి. ఇక్కట్లకు గురవుతున్న వ్యాపార సంస్థలకు చేయూత ఇచ్చేలా విధానాలు చేపట్టాలి. నిజాయతీతో ఆర్థిక ఇబ్బందుల నుండి బైటపడి వారిని, దురుదేశపూర్వకంగా పన్నులను, రుణాలను ఎగవేస్తున్నవారిని స్పష్టంగా గుర్తించి, తగు విధంగా వ్యవహరించాలి.
దేశంలో ఒక వంక బ్యాంకులు మొండి బకాయలు వసూలు కాక పోవడంతో దివాలా పరిస్థితులు ఎదు ర్కొంటున్నాయి. మరోవంక కంపెనీలు ఆర్థిక వనరుల వెసులుబాటు కల్పించలేక రుణాలు చెల్లించలేక సంక్షోభంలో చిక్కుకొంటున్నాయి. అటు బ్యాంకులు, ఇటు కంపెనీలు ఈపరిస్థితుల నుండి బైట పడగలిగితే గానీ దేశ ఆర్థిక వ్యవస్థ ముందడుగు వేయలేదు. అందుకు విధానపరమైన చొరవను ప్రభుత్వం చూపాలి. సిద్ధార్థ వంటి కార్పొరేట్ ప్రముఖులు గాని, ఆత్మ హత్యలకు పాల్పడుతున్న రైతులు గాని తమ ఆర్థిక అవసరాల కోసం బ్యాంకులపై ఆధారపడలేని పరిస్థితులు నెలకొన్నాయి. బ్యాంకింగేతర సంస్థల నుండే ఎక్కువగా ఆర్థిక వనరులు సమకూర్చుకోవలసి వస్తున్నది. సిద్ధార్థ ఆర్థిక సమస్యలు ఏమిటో ఇంకా స్పష్టంగా వెల్లడి కాలేదు. అయితే తనకు, కుటుంబానికి గల వాటాలలో 76 శాతాన్ని హామీలుగా ఉంచే పరిస్థితి ఏర్పడింది. వాణిజ్య రంగంలో ద్రవ్య కొరత ఎంత తీవ్రంగా ఉన్నదో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. ప్రధాని మోదీ ఆశిస్తున్న 5 ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధించడం కోసం విధానపరమైన చొరవ కీలకం కాగలదు. యూపీఏ హయాంలో పక్షవాతానికి గుర య్యామని భావిస్తుంటే ఇప్పుడు విధానపరమైన శూన్య తను ఎదుర్కొంటున్నామా? అనే అనుమానం కలు గు తున్నది. ఆర్థిక సంస్కరణల ద్వారా లైసెన్స్ పర్మిట్ రాజ్‌కు స్వస్తి పలికామని అనుకొంటూ ఉంటే ఇప్పుడు ఇన్‌స్పెక్టర్ రాజ్ వేధింపులకు గురికావలసి వస్తున్నదని ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త వ్యక్త పరచిన ఆందోళన పరిగణనలోకి తీసుకోవలసిందే.

-చలసాని నరేంద్ర 98495 69050