మెయన్ ఫీచర్

తాజాతీర్పు కోరితే తప్పేంటి..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓటమి చెందినా, బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా సంక్షోభం పూర్తిగా సమసిపోలేదు. కర్నాటక అసెంబ్లీలో మొత్తం సీట్లు 229కాగా, బీజేపీకి 105, జేడీఎస్‌కు 37, కాంగ్రెస్‌కు 78 సీట్లు, రెండు చోట్ల ఇండిపెండెంట్లు, బీఎస్పీకి ఒక సీటు ఉన్నాయి. గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105 సీట్లను సాధించి అతి పెద్ద పార్టీగా అవతరించింది. ఎన్నికల ముందు పరస్పరం దూషించుకున్న జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు- బీజేపీకి అధికార దక్కరాదన్న పట్టుదలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జేడీఎస్ నేత కుమార స్వామి సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన పాలన దినదిన గండంగా నడచి చివరికి ప్రభుత్వం కుప్పకూలింది.
కేంద్రంలో బీజేపీ భారీ మెజారిటీతో రెండోసారి అధికారంలోకి రావడంతో ఏ క్షణమైనా కుమారస్వామి సర్కారు పతనం కావడం ఖాయమని అంతా భావించారు. అనుకున్నట్లుగానే మోదీ ప్రభుత్వం వచ్చిన 60 రోజులకు కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వం పతనమైంది. 14 నెలల కుమార స్వామి పాలనలో కర్నాటక రాజకీయాలంటేనే ప్రజలకు అసహ్యం పుట్టింది. కాంగ్రెస్‌కు చెందిన 13 మంది, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. విశ్వాస పరీక్షలో కుమారస్వామి ఓటమి చెందడంతో, యడ్యూరప్ప నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసే ముందు- 17మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వారు ప్రస్తుత అసెంబ్లీ పదవీ కాలం పూర్తయ్యే వరకు పోటీ చేయకుండా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎమ్మెల్యేల్లో పది మంది స్పీకర్ ఆదేశాల మేరకు హాజరై తమ రాజీనామాలను ఆమోదించాల్సిందిగా కోరారు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరాయి. ప్రస్తుతానికి బీజేపీ సర్కార్‌కు వచ్చే ముప్పు ఏమీ లేదు. మరో ఆరు నెలల వరకు అవిశ్వాస తీర్మానం గొడవ ఉండదు.
కాంగ్రెస్, జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించి ఉంటే ఉప ఎన్నికలు వచ్చి ఉండేవి. ఉప ఎన్నికల్లో వీరికి బీజేపీ టిక్కెట్లు ఇచ్చి నెగ్గించుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో అస్థిరత పోవాలంటే, బీజేపీకే ప్రజలు పట్టం కట్టే పరిస్థితి నెలకొంది. ఉప ఎన్నికల్లో 12 సీట్లను గెలుచుకుంటే మేజిక్ ఫిగర్ అయిన 115 సీట్లు బీజేపీ ఖాతాలో ఉండేవి. రాజీనామాలను ఆమోదించకుండా, తమపై అనర్హత వేటు వేసిన స్పీకర్ నిర్ణయంపై సుప్రీం కోర్టులో ఈ ఎమ్మెల్యేలు సవాలు చేయనున్నారు. దీనిపై కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి. సాధారణంగా ఎమ్మెల్యే పదవి ఖాళీ అయినప్పటి నుంచి ఆరు నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహించాలి. జనవరి 28వ తేదీలోగా కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించి తీరాలి. ఆ లోగా సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది.
స్పీకర్ నిర్ణయంపై సుప్రీం సమీక్షిస్తుందా? అనర్హత వేటును తొలగిస్తుందా? తాము జోక్యం చేసుకోలేమని తేల్చేస్తుందా? కొత్త స్పీకర్ అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేల దరఖాస్తులను స్వీకరించి పునఃసమీక్షించి రాజీనామాలను స్వీకరించి, అనర్హత వేటును తొలగిస్తారా? అనే అంశాలకు రాజ్యాంగపరంగా జవాబులు లభించాల్సి ఉంది. అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలు ఉద్దేశపూర్వకంగా రాజీనామాలు చేశారనే విషయం సర్వ విదితమే. వీరు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు రాజీనామా చేశారా ? ఈ ఎమ్మెల్యేలకు తమ తమ పార్టీల్లో కొనసాగాలని లేనప్పుడు రాజీనామా చేయడం మినహా గత్యంతరం లేదు. రాజీనామా చేయడం వల్ల కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలుతుందనే విషయం అందరికీ తెలిసిన అంశం. రాజీనామాలు చేయకముందు, చేసిన తర్వాత వీరు ఎక్కడ ఉన్నారనే విషయం అందరికీ తెలిసిందే. రాజీనామా పత్రాలను ఆమోదిస్తూ అనర్హత వేటు వేయడం వెనక స్పీకర్‌కు కూడా ఒక లక్ష్యం ఉంటుంది. తనకు పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వంలో అయి ఉండడం వల్ల స్పీకర్ హోదాలో రమేష్ కుమార్ వారిపై అనర్హతవేటు వేశారని భావించక తప్పదు.
శాసన వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్య సున్నితమైన విభజన రేఖ ఉంది. కాని పరిస్థితులు సంక్లిష్టంగా మారినప్పుడు ఏ అంశంపైన అయినా రాజ్యాంగ సమీక్ష చేసే అధికారం సుప్రీం కోర్టుకు ఉంటుంది. కర్నాటకకు చెందిన ముఖ్యమంత్రి బొమ్మై కేసులో 25 ఏళ్లక్రితం గవర్నర్ అధికారాలు, ముఖ్యమంత్రి ఎంపిక తదితర అంశాలపై చారిత్రాత్మకమైన తీర్పును సుప్రీం కోర్టు ఇచ్చింది. ఈ తీర్పుతో గవర్నర్ బంగ్లాలో మెజారిటీ సభ్యులు తన వెంట ఉన్నారని ప్రదర్శన చేసే పార్టీనేతలకు చెక్ పెట్టినట్లయింది. ఏ పార్టీకీ మెజారిటీ రాని పక్షంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే నేతకు మద్దతు ఉందని నిర్థారించేందుకు సుప్రీం కొన్ని విధి విధానాలను పేర్కొంది. కర్నాటక స్పీకర్ రమేష్ కుమార్ విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు సంచలనం కాబోతోందా? అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు విప్‌లు జారీ చేసినా, అప్పటికే తాము రాజీనామాలు చేయడం వల్ల తమకు విప్ వర్తించదని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు వాదించారు. నిర్ణీత ఫార్మాట్‌లో ఇచ్చినందున తమ రాజీనామాల ఆమోదం సాఫీగా జరుగుతుందని వారు భావించారు. కాని కథ అడ్డం తిరిగింది. అంతకుముందు ఆ ఎమ్మెల్యేలు సుప్రీంకు వెళ్లి తమ రాజీనామాలు ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. స్పీకర్‌ను కలిసి రాజీనామాలు ఇవ్వాలని కోర్టు సూచించింది.
స్వల్ప మెజారిటీతో గట్టెక్కిన బీజేపీ సర్కారు కూడా పదవుల పంపకంలో అసమ్మతి ఎమ్మెల్యేల నుంచి తిరుగుబాటును ఎదుర్కొనకతప్పదు. దీనికి తోడు సుప్రీం కోర్టు తీర్పు ఎలా ఉంటుందో తెలియదు. ఖాళీ అయిన అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలల్లో జరుగుతాయా? ఎన్నికల సంఘం అనుసరించే వైఖరి ఎలా ఉంటుంది ? బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనే మాటే కాని, ఉప ఎన్నికలు జరిగి, 12 సీట్లు గెలుచుకుంటే తప్ప అధికారంలో పూర్తికాలం కొనసాగదు. జేడీఎస్‌కు 26 మంది ఎమ్మెల్యేలు వేరే కూటమిని ఏర్పాటు చేసుకుంటే బీజేపీ ప్రభుత్వానికి వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు.
కర్నాటక ప్రహసనం నుంచి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. 1989, 1991, 1996, 1998లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ ఇవ్వనందు వల్ల పార్లమెంటుకు మధ్యంతర ఎన్నికలు వచ్చాయి. 1991లో పీవీ నరసింహారావు ప్రధాని అయినా మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపారు. పీవీ రాజనీతిజ్ఞత వల్ల ప్రభుత్వాన్ని నడపడం సాధ్యమైంది. ఎంపీలను కొనుగోలు చేసిన కేసులో కోర్టులు విచారణ జరిపాయి. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి 91వ రాజ్యాంగ సవరణ తేవడం వల్ల గతంలో మాదిరిగా పార్టీలు మారడం సాధ్యం కాదు. మెజారిటీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి బయటకు రారు. దీనికి విరుగుడుగా తమకు అవసరమైన మెజారిటీ సాధించేలా డజను మంది ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించడం, ఆ ఖాళీలకు ఉప ఎన్నికలను నిర్వహించి ఏదో విధంగా గెలిచి అధికారాన్ని నిలబెట్టుకునే కొత్త పద్ధతికి రాజకీయ పార్టీలు శ్రీకారం చుట్టాయి.
కర్నాటక ప్రజలు సరైన తీర్పు ఇవ్వలేదని కొంతమంది రాజనీతిజ్ఞులు విమర్శిస్తున్నారు. ప్రజలు తమ తీర్పును ఫలానా విధంగా ఇవ్వాలని శాసించే హక్కు ఎవరికీ ఉండదు. కాని ప్రజల తీర్పులోని స్ఫూర్తిని రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ప్రభుత్వాలు నిలబడుతాయి. రాజకీయ పార్టీల మధ్య సిద్ధాంత వైరుధ్యాలు ఎలా ఉన్నా, ప్రజలకు సుపరిపాలన ఇవ్వడం వారి లక్ష్యంగా ఉండాలి. ఏ పార్టీకైనా అధికారం లేకపోతే బతకడం కష్టం. కర్నాటకలో జేడీఎస్, కాంగ్రెస్ పార్టీలు పరస్పర శత్రువులుగా ఎన్నికల ముందు వరకు వ్యవహరించాయి. కాంగ్రెస్ పార్టీ తనకు లభించిన 78 సీట్లతో ప్రతిపక్షంలో కూర్చోకుండా, 37 సీట్లున్న జేడీఎస్‌కు మద్దతు ఇచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 105 సీట్లు గెలిచిన బీజేపీని ఏకాకిని చేసేందుకు అన్ని రకాల దివాలాకోరు విధానాలకు కాంగ్రెస్ పాల్పడింది. 2013 నుంచి 2018 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో హుందాగా కూర్చుని ఉంటే, ఈ రోజు పరిస్థితి మరొక విధంగా ఉండేది. జేడీఎస్‌కు తప్పనిసరి పరిస్థితుల్లో భాజపా బయటి నుంచో ప్రభుత్వంలో చేరో మద్దతు ఇచ్చి ఉండేది. 105 సీట్లు తెచ్చుకున్న పెద్దపార్టీగా అవతరించిన బీజేపీ ప్రతిపక్షంలో కూర్చుని ఉంటే, రెండు జిల్లాలకు పరిమితమైన పార్టీ నేతను సీఎం చేసి, ఆ ప్రభుత్వంలో తాను భాగస్వామిగా చేరిన కాంగ్రెస్ చర్యను ప్రజలు ఈసడించుకున్నారు. అందుకే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు రెండు, బీజేపీకి 25 సీట్లు, ఇండిపెండెంట్‌గా ఒకరిని కర్నాటక ప్రజలు గెలిపించారు.
ప్రజాస్వామ్యంలో ఓటింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రజల మనోభావాలను శాసించే అధికారం ఎవరికీ ఉండదు. వారు ఇచ్చిన తీర్పును అర్థం చేసుకుని వ్యవహరించడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. కర్నాటకలో అస్థిరత్వ పాలనకు తాత్కాలికంగా తెరపడింది. బీజేపీ సర్కార్ వచ్చే ఆరు నెలల్లోగా మెజారిటీని నిలబెట్టుకునేందుకు అడ్డమైన దారులు తొక్కే పరిస్థితులు లేకపోలేదు. సంక్షోభాల మధ్య ప్రభుత్వాన్ని నడిపే బదులు అసెంబ్లీని రద్దు చేసి తాజాగా ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే పరిష్కారం.

-కె.విజయ శైలేంద్ర 98499 98097