మెయిన్ ఫీచర్

బహుముఖీన ప్రజ్ఞకు భాష్యం సినారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వదనం మధురం... వచనం మధురం
కవనం మధురం... గానం మధురం
- ఇలా చెప్పుకుంటూ పోతుంటే అవన్నీ ఓచోట ఆగిపోతాయి. అక్కడో దీపస్తంభం వెలుగులు చిమ్ముతూ కనిపిస్తుంది. ఆ దీప స్తంభానికి మువ్వలుంటాయి. అవి ‘‘దివ్వెల మువ్వలు’’. అవే సినారె కవితాక్షరాలు.
‘‘సుకవితా యద్యస్త రాజ్యేనకిమ్?’’ అనేది ఒక ఆర్యోక్తి. నిజమే! సత్కవిత్వం ముందు సామ్రాజ్యమెందుకు? అసలు ఆయనే ఒక సాహితీ సామ్రాజ్యం. సానదీసిన వజ్రం. తెలుగు కవితా ప్రపంచంలో ఎవరినీ వరించని వైభవం బహుముఖీన గతులలో సినారెను వరించింది. ఆనాటి శ్రీనాధుని విభవం గురించి మనం ముచ్చటించుకుంటాం. కానీ, ఆ కవిసార్వభౌముని జీవితంలో కూడా కొన్ని భంగపాట్లు లేకపోలేదు. అవేమీ అంటుకోకుండా- అంచెలంచెలుగా అందలాలెక్కి అన్ని గౌరవాలూ బ్రతికుండగానే అందుకొన్న పుంభావ సరస్వతి ‘‘పద్మభూషణ్’’ డా.సింగిరెడ్డి నారాయణరెడ్డి.
తొలి రోజుల్లో శ్రీశ్రీ, కృష్ణశాస్ర్తీ కవుల ప్రభావం సినారెపై ఉన్నా- అది రెండుమూడడుగులు వేసేవరకే పనిచేసింది. ఆ తరువాత సొంత గొంతు సవరించుకోవడం మొదలయింది. ఒక్కమాటలో చెప్పాలంటే పలుకు‘బడి’కి ప్రధానాచార్యుడు సినారె. ఆ ప్రసంగంలో సెలయేటి గలగలలు చెంగలించేవి. మధురిమలూ, మధూలికలూ మంతనాలాడేది. ఛలోక్తులు చక్కిలిగింతలు పెట్టేవి. ఇవన్నీ ప్రసంగాంశాన్ని మరుగుపరచి ఏనాడూ విహరించలేదు. ఏది ఉపన్యాస విషయమో దాని చుట్టూ అవన్నీ రంగులు రాట్నాలై హొరంగులు సృష్టించేవి. ఉపనదులై ఉపన్యాసానికి ఉత్తేజాన్ని తెచ్చిపెట్టేవి. పెదవి నుండి బయటపడిన ప్రతి పదం స్పష్టతనూ, ఆప్తతనూ, భావనాపటిమనూ మోసుకొచ్చేవి. ఆయన మాట్లాడుతున్నప్పుడు అక్షరం మీద అక్షరం దాడి చేసేది కాదు. ఏ పదమూ మరో పదంవల్ల గాయపడేది కాదు. ఎక్కడా ఏ మాటా నలిగేదికాదు. ఇన్ని జాగ్రత్తలతో శ్రోతల్ని ఆకట్టుకోవటంలో అందెవేసిన చేయిగా సినారె ఎనలేని కీర్తిని సముపార్జించుకోగలిగారు. ప్రసంగం కొనసాగుతున్నప్పుడు సినారె ముఖ కవళికలు, సభా పరిశీలనం, స్వరస్థాయి- త్రి‘వాణీ’ సంగమాలై కనిపించేది.
ముఖ్యంగా ముచ్చటగొలిపే చతురోక్తులు- అటు ప్రసంగాలలోనూ, ఇటు వ్యక్తిగత సంభాషణలలోనూ గజ్జెకట్టి నడయాడుతుండేవి. అటువంటి ఛలోక్తులలో కొన్ని పుస్తక రూపంలో పాఠకుల ముందుకొచ్చాయి.
‘‘సినారె ఛలోక్తులు’’ పేరుతో డా.ఎన్.గోపి సంకలనం చేసిన పుస్తకం తెరిస్తే- నారాయణరెడ్డిగారి సమయస్ఫూర్తి ఎంతటిదో బోధపడుతుంది. అందులో ‘చమత్కారికలు’అనేకం ఉన్నాయి. పుస్తకంలో లేని ఛలోక్తులు మూడింటిని ఇక్కడ ప్రస్తావిస్తే మీరూ ఆనందిస్తారు. ఏ సందర్భంలో చెప్పినా ఆ ఛలోక్తులు జీవనదిలో తెల్లటి తెరచాపల్ని ఎగరేసుకెళ్లే నౌకల్లా గోచరిస్తాయి. కవిత్వాన్ని కనక సింహాసనంపై కూర్చోపెట్టిన కారణజన్ముడాయన. కీర్తి పతాకను వినువీధుల్లో ఎగరేసిన దీప్తిమంతుడాయన. ఇక్కడొక విషయం చెప్పాలి. ఆయన దేనికోసమూ ప్రాకులాడలేదు. తలవంచలేదు. దైన్యంముందు దాసోహమనలేదు. తన గమ్యం అక్షరమే!
‘‘రాస్తూ రాస్తూ పోతాను- సి / రా ఇంకేవరకు / పోతూ పోతూ రాస్తాను- వ / పువు వాడేవరకు’’ అనగలిగిన అక్షర ప్రేమికుడు సినారె. ‘‘వపువు’’ అంటె శరీరం. ఇందులోనే ‘‘పువు’’ కూడ ఇమిడి ఉంది. రెండూ వాడి పోయేవే! పద ప్రయోగ కౌశలంలో సినారె నిష్ణాతులు. ఇది నాలుగు పాదాలుగా వ్రాసిన కవితా ఖండికే అయినా- రెండేసి పాదాలకు మొదటి అక్షరంగా యతి నియమం పాటించటం గమనార్హం. ముప్పాతిక మువీసం ఆయన కవితలలో ఇలా ఏదో ఛందోలక్షణం కనిపిస్తూనే ఉంటుంది.
ఆత్మాభిమానానికి ఆయనే ఆనవాలు. ఆయనకు కొన్ని పరిధులుండేవి. ఆ గీతాలు దాటి ఆయనెప్పుడూ ముందడుగు వేయలేదు. తమతమ పార్టీలలో చేరమని బ్రహ్మానందరెడ్డి, ఎన్టీయార్ ప్రభుత్వాలు కోరినా- ఆ దరిదాపులకే ఆయన పోలేదు. అయితేనే! రాజ్యసభా లక్ష్మి సినారెను కావాలని వెతుక్కుంటూ వచ్చింది. అక్కడ కూడ తన గళముద్రను బలంగానే వేశారు. ఇదంతా ఒక ఎత్తు. ఆయన సినీ శిఖరం మరొక ఎత్తు. సినీ గీత రచయితగా ప్రవేశించినప్పుడు కూడ సింహద్వారం లోంచే ఆయన లోనికి అడుగుపెట్టారు. పాటలన్నీ తన కలంనుండే వెలువడాలన్నది ఆయన అభిమతం. సినిమా పరి భాషలో చెప్పాలంటే దాన్ని ‘‘సింగిల్ కార్ట్’’ అంటారు. ఎన్టీయార్ వంటి మహోన్నత వ్యక్తి ఆయనను అలాగే గౌరవించి అన్ని పాటల్నీ సినారెతోనే వ్రాయించుకున్నారు. ‘‘గులేబకావళి కథ’’ సినిమా ద్వారా ‘నన్ను దోచుకొందువటే...’ గీతం ప్రథమంగా రికార్డయింది. అక్కణ్ణుంచి అప్రతిహతంగా చివరి పాట ‘‘జయజయహే భరతావని’’ (మనసైనోడు సినిమా) వరకు సుమారు 3,500 పాటలు సినారె కలంనుండి జాలువారాయి. అమృత సరసిలో అక్షర హంసలై ఈదులాడాయి. ఒక మాటలో చెప్పాలంటే సినారె రచనలు శ్రేష్ఠ వాచకాలై శ్రేయోదాయకాలై ప్రభాసించాయి.
తొలి రోజుల్లో పద్యం ఆయనను పలుకరించింది. ఆ కాలంలో ఎక్కువమంది ఆ తోటలో విహరించిన వారే! అలాగే సినారె కూడా ఆ తోటలో పాదం మోపారు. అయితే ఆయన ప్రజ్ఞ అసాధారణమైనది. కాబట్టి పద్యానికి ప్రారంభ దశలోనే పరిమళాన్ని అద్దగలిగారు. తక్కువ వ్రాసినా అవి కొలికి పూసలై పాఠకులకు విందు చేశాయి. కేవలం ఛందస్సును సరిపెట్టేలా పద్యం వ్రాస్తే అందులో జిగి, బిగి కనిపించవు. ధారాశుద్ధికి దర్పణం పట్టాలి. భావానికి పాగా చుట్టాలి. ఆ కోవకే చెందిన సినారె పద్యం ఇక్కడ గమనించగలం.
‘‘కలకాలమ్ములు నీవు, నేనిటులె స్నిగ్ధస్నేహ బంధాన బ
ద్ధులమై యుందము, ఏకగీతి నిరుగొంతుల్ విప్పి విన్పింతమాం
ధ్రుల చైతన్య విపంచికా వళులు, విద్యున్నాదముల్ సేయగా
జలపాతమ్ముల వోలె దూకుదము విష్వక్సాహితీ శృంగముల్!’’
ఎక్కడ కొండపై ఉండటం కాదు. అడుగునున్న వారికోసం జలపాతంలా చైతన్యనాదంతో దూకి రావాలి. ‘‘తెలుగు వెలుగును’’ కలసి పాడాలి. మన చెలిమిని సదా అలా కాపాడుకోవాలి. అంటూ స్నేహపయోనిధి దాశరథిపై చెప్పిన పద్యమిది. పద్యంలో ‘‘పనితనం’’ ఏమిటో ఆద్యంతం దీనిని గమనిస్తే తెలుస్తుంది. పదానికి మధ్య భాగంలో ‘‘యతి’’ ఉండటం పాదాంత పదాన్ని విరిచి, తరువాత పాదంలోకి ప్రాసాక్షరంగా తీసికొని రావటం, మొత్తం పద్యాన్ని తీగ సాగినట్లుగా నడిపించటం- వీటన్నిటి వెనుక ఎంతో అధ్యయనం, భాషా సంపద, నేర్పూ ఉండాలి. భావ ప్రదర్శనలో ఒక ఔన్నతి ద్యోతితం కావాలి. ఇవన్నీ ఈ పద్యంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఆధునిక పద్య రచనలో జాషువాను ఆయన బాగా మెచ్చుకొనేవారు. మానవీయ మూల్యాలంటే సినారెకు ఇష్టం. ఆయన రచనలు ఆ దిశగానే నడక సాగించాయి. అంతేకాదు! ఉన్నది ఉన్నట్లు చెప్పటంలో ఎట్టి మొగమాటాలకు ఆయన తావీయలేదు. విశ్వనరుణ్ణి పడిపోకుండా నిలబెట్టటమే సినారె కవితాశయం. స్వార్థపరుల్ని వ్రేలెత్తి చూపించటంలో ఏమాత్రం సందేహించలేదాయన కలం.
ఒకటేమిటి? రకరకాల సాహితీ ప్రక్రియలు ఆయనతో కరచాలనం చేశాయి. అందులో ‘‘గజల్’’ కూడ ఒకటి. అరబ్బీలో పుట్టి పారశీకంలో నడక నేర్చిన గజల్, తెలుగు పరిమళాన్ని అద్దుకోవడంలో సినారె పాత్ర బహుశా శ్లాఘనీయం. దాశరథి గజల్‌కు దారి చూపిస్తే- సినారె దాని చేయి పట్టుకొని ముందుకు నడిపించారు. ప్రతిభ ఉండాలే కాని, వస్తువేదైనా పండుతుంది. ఏదైనా పతాకనెత్తుకుంటుంది. మేల్కొలుపుతుంది. సినారె గజల్‌లో మొదటి షేర్ (రెండు పాదాల కలయిక) ఇలా ప్రారంభమవుతుంది. ‘‘పరులకోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగుదేనికని’’ ఈ షేర్‌లో ఒక కర్తవ్యం ప్రబోధింపబడింది. ‘మూగనేల’ ప్రయోగం ఎంత బాగుంది. సరస సల్లాపాలలో సాగే గజల్‌ను సందేశపథం వైపు మలుపుతిప్పటం ఒక విశేషం.
అమ్మపై వ్రాసిన గజల్- ‘‘అమ్మ ఒకవైపు.. దేవతలంతా ఒకవైపు / సరితూచమంటే నేను ఒరిగాను అమ్మవైపు’’ అంటూ అమ్మకు సినారె ఇచ్చిన స్థానం ఎంత గొప్పదో ఈ షేర్‌లో వ్యక్తమవుతుంది.
పద్యాలెక్కువగా వ్రాయకపోయినా ఆ ముద్రతో మాత్రాఛందస్సుతో నడిపించిన గేయ కావ్యాలు సినారెను శిఖరం మీద నిలబెట్టాయి. ‘‘కర్పూర వసంత రాయలు’’ ఎప్పుడో ఇరవై ఆరోయేట సినారె వ్రాశారు. అదిప్పటికీ ‘‘ఇగిరిపోని గంధమే’’! ఆ నడక, ఆ హొయలు, భావం, కథనం, దేనికదే నువ్వా- నేనా అంటూ పోటీపడుతూ పఠితను పాల సముద్రంలో విహరింపజేస్తాయి. 1967లో వెలువడ్డ గేయకావ్యం ‘‘జాతిరత్నం’’. సినారె రచనలలో ఇదొక అనర్ఘరత్నం. నెహ్రూను సభక్తికంగా సంస్మరించిన ఈ కావ్యం పాఠకుల్ని ఆద్యంతం హత్తుకుంటుంది. శివారెడ్డిగారన్నట్లు ‘‘జాతిరత్నం’’తో ఆయన ఎన్ని పోకడలు పోయారో చెప్పడం కష్టం.
‘‘విశ్వంభర’’ కావ్యంతో సినారె శిఖరాగ్రాలకు చేరుకొన్నారు. ఈ కావ్యమే వారిని జ్ఞానపీఠంపై కూర్చోపెట్టింది. నాటినుండి నేటివరకు మనిషి సాగించిన ప్రయాణాలు ఈ కావ్యంలో మైలురాళ్లై కనిపిస్తాయి. తనలోకి తనను చూపించే కవిత్వం- ఇందలు ‘ప్రకృతి’ని ఆలంబనంగా చేసికొని పాఠకుని ముందు ప్రత్యక్షమవుతుంది. అంతర్నేత్రాలను తెరపించే ఈ పంక్తుల దగ్గర కాసేపు ఆగుదాం.
‘‘ఎంత బాగా మెరుగుపెట్టాను / ఈ పసిడి పంజరానికి / ఎన్ని ముత్యాల గింజలు తినిపించాను / ఈ ప్రాణ విహంగానికి / ఇది ఒరిగిపోతుందా లోయలోకి / అది ఎగిరిపోతుందా శూన్యంలోకి / మళ్లీ ప్రసవిస్తుందా శూన్యం / మరో జన్మకు తీగలా ప్రాకి...’’ తాత్త్వికతకు దర్పణం పట్టిన పంక్తులివి. ఛేదించలేని ఏదో ఒక రహస్యం ఇక్కడ దూర దూరంగా సాగిపోతూ కనిపిస్తుంది.
స్వర పాండిత్యమే కాదు.. ధ్వన్యనుకరణాత్మకమైన స్వర పాండిత్యం (మిమిక్రీ కళ) కూడ సినారెలో ఉండేది. గానం సరేసరి. ముఖ్యంగా ఆయన రాగజ్ఞాని. తన గజళ్లలో కొన్నింటిని తానే ఆలపించారు. నటనలో కూడ అభినివేశం ఉంది. వ్యాఖ్యాతగా సరేసరి. సభలకే ఒక సోయగాన్ని సమకూర్చి పెట్టిన అందాల హరివిల్లు సినారె. ఇలా బహుముఖీన ప్రజ్ఞాపాటవాలకు భాష్యమై సినారె అసంఖ్యాక హృదయాలను దోచుకోగలిగారు. ఎనుబదారు వసంతాల జీవిత కాలంలో ఆయనొక సాహితీ చైత్రరథమై ఊరూవాడా ఊరేగారు.

- రసరాజు, 9440388659