మెయిన్ ఫీచర్

ఆడపిల్లలూ .. తస్మాత్ జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిలో మానవ జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కుటుంబమనేది సహజ సిద్ధమైనదే కదా! ప్రతి కుటుంబంలో తల్లి, తండ్రి, కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు అనే బంధంతో సహజీవనం చేస్తుంటారు. బీదవారైనా, శ్రీమంతులైనా, ఆగర్భశ్రీమంతులైనా తమ కుటుంబంలో జన్మించిన ఆడకూతురిని పరాయి కుటుంబంలోని పిల్లవాని కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం తమ భాగ్యం భావిస్తారుకదా! ఇది మానవ జీవనంలో సామాజిక, సాంస్కృతిక, సంస్కారములో భాగమే కదా! అలాగే తమ కుటుంబంలోని మగ పిల్లవానికి పరాయి ఇంటినుండి ఇల్లాలు తెచ్చుకుంటారు గదా! ఒక ఇంటినుండి మరో ఇంటికి వెళ్లిన ఆడపిల్ల సంతానాన్ని కని తన మెట్టినింటి వంశాన్ని అభివృద్ధి చేస్తుంది. సమాజంలో వివాహ వ్యవస్థ పేరుతో రెండు వేరు వేరు కుటుంబాల మధ్య బాంధవ్యాన్ని ఏర్పాటుచేస్తున్నారు. ఆడపిల్లను కన్నవారు అమ్మాయికి వివాహ సమయంలో వారి వారి ఆర్థిక స్థాయిని బట్టి మగ పిల్లవారి అంగీకారం మేరకు వరకట్నం పేరుతో స్థిరచరాస్థులను ముట్టచెప్పి గౌరవంగా వివాహ వేడుక జరుపుకుంటారు కదా! వరకట్న నిషేధం చట్టం ఉన్నప్పటికీ మన సమాజంలో వరకట్నం ఇవ్వని తల్లిదండ్రులుగానీ, తీసుకోని అత్తింటివారు గానీ ఎవరైనా ఉన్నారా? అలాగే నను కన్నవారు నీ కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన సమయంలో వారి స్థాయిలో మీరు కోరుకున్నంత సొమ్ము ముట్టచెప్పి గౌరవంగా వివాహ వేడుక జరిపించారు కదా! వివాహానంతరము కూడా పండుగలు, పబ్బాల సమయంలో కూడా వారికున్నంతలో మనకు ఏదో ఒక రూపంలో ముట్టజెప్పుతున్నారు కదా! మన కుటుంబంలో వున్న మీ తాతయ్యకు, నాయనమ్మకు వారు జీవించినంతకాలం నాతో సేవలు చేయించినారు కదా! వారి కోడలు ఆరోగ్యవంతంగా వుండగానే తన బాధ్యతను నా బాధ్యతగా చిత్రీకరించి వారికి సేవలు చేయించినారుకదా! ఇది నా తెలివితక్కువతనమా? లేదా అతి వినయమంటారా? వారితోపాటు ఈనాటివరకు మీ నాయనకు, మీ అమ్మకు కూడా సేవలందించుచున్నాను. ఏదో చిన్నపాటి ఉద్యోగం చేస్తున్నా నా ఖర్చులు నేను చక్కబెట్టుకుంటూ మీరు చేసే అప్పులు కూడా తీర్చవలసి వస్తుంది. మనకు సంతానం లేకున్నప్పటికీ మీరు ఎవరికోసం అప్పులు చేస్తున్నారో చెప్పరు. మామూలుగా అడిగితే నోరు మెదపరు. గట్టిగా అడిగితే చస్తానని బెదిరిస్తారు.
భార్యతో సఖ్యతగా వుంటే తన కొడుకు తన మాట వినడేమోననే నెపంతో మన మధ్య వుండే దాంపత్య జీవితానికి అడ్డుగోడవేసిందిగదా మీ తల్లి. మీ తల్లిదండ్రులు నీకు పెళ్ళెందుకు చేసినారు. తల్లిదండ్రులకే అంకితం కావాలనుకున్న నీవు ఎందుకు పెళ్ళిచేసుకున్నావు? కొడుకుకు పెళ్లిచేస్తే భార్యకు ప్రాధాన్యత ఇస్తే నా మాట ప్రాధాన్యత తగ్గుతుందని నీ తల్లికి తెలియదా? నేను పెళ్లి చేసుకొంటే తల్లి మాటతోబాటు భార్య మాటకు ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుందేమో, అపుడు నా తల్లిదండ్రుల మాటకు ప్రాధాన్యత ఇవ్వలేనేమో అనే తెలివి మీకు లేకపోయిందా? ఈ విషయాన్ని నీకు అయినవాళ్ళకుగాని, నాకు అయినవాళ్ళకుగాని చెపుతానంటే నేను చస్తాను అని మీ అమ్మ అంటుంది, నీవు అంటావు. భార్యాభర్తలమధ్య ఉండే ఆనందాన్ని నాకు పంచలేకపోతున్నావు, నీవు పొందలేకపోతున్నావు. మరి ఈ జీవితాలు ఎందుకు?
సమాజంలో గౌరవం కొరకు నీకు భార్యగా ఇంకెంతకాలం గడపమంటావు. నీవు నీ తల్లిదండ్రులను వదలిపెట్టమని చెపుట లేదు. కాని సమాజంలో పుట్టిన ప్రతి స్ర్తికి మాతృత్వం పొందాలనే కోరిక వుంటుంది. అలాంటి కోరికను నేను ఆశించటం నేరమా? అంతెందుకు నీ నాయనమ్మకు, అమ్మమ్మకు, నిన్ను కన్న నీ తల్లికి మాతృత్వం పొందాలనే తపన లేకుంటే నీ కుటుంబంలో నీ అయ్య, అమ్మ, నీవు వచ్చేవారా? ఆ మాత్రం ఇంగితజ్ఞానం నీకు గానీ, నిన్ను కన్న తల్లిదండ్రులకుగానీ లేదంటే ఏమనాలి?
నాతో కాపురం చేయటం నీకుగానీ నీ తల్లిదండ్రులకుగానీ ఇష్టం లేకుంటే నిర్మొహమాటంగా చెప్పండి, నీ జీవితంనుండి తప్పుకుంటాను. అంతేగానీ నీకు, నీ తల్లిదండ్రులకు, నీ ఇంటికి వచ్చే బంధువులకు చారికీ చేయడానికి నీ భార్య రూపంలోని పనిమనిషిని కాను. సహనం దాటిన స్ర్తి భద్రకాళియై విజృంభిస్తుంది. నేను చస్తానని బెదిరించి కాలం గడుపుకొనే నీలాంటి భర్త వుంటే ఏమిటి లేకుంటే ఏమిటి? ప్రతి విషయంలో చస్తానని బెదిరించేవాడివి పెళ్ళెందుకు చేసుకున్నావు?
భార్యాభర్తల మధ్య వివాదం ఏర్పడితే వారి మధ్య ఏర్పడిన వివాదాన్ని పరిష్కరించి వారి భావి జీవితాలకు మార్గదర్శనం చేసే తల్లి వుంటుంది. తన స్వార్థం కొరకు కోడలుకు కొడుకును దూరం చేసే నీ తల్లి.. తల్లి కాదు. ఇలాంటి అత్తలున్న కారణంగానే మన సమాజంలో విడాకుల పర్వం తారాస్థాయికి పెరిగింది. ప్రేమవివాహాలు జోరందుకున్నాయేమోననిపిస్తుంది.
మన మధ్యనున్న విషయం మీ అమ్మమ్మకు చెపితే పుట్టెడు పిల్లలను కన్న తల్లి అయినప్పటికీ చెవికెక్కించుకోదు. ఆడపిల్లగా పుట్టడం నాది నేరమా లేదా నీకు భార్య కావడం నేరమా?
కొడుకు తన మాట వినడేమో అనే అనుమానంతో భార్యాభర్తలను విడదీసే తల్లులున్నారనే విషయాన్ని, ఆడపిల్లలను కన్నవారికి దేవుడు కనువిప్పు చేస్తున్నాడేమో. అందుకే తల్లిదండ్రులున్న కుటుంబానికి తమ బిడ్డలను కోడలిగా పంపటానికి ప్రస్తుత సమాజంలో ఇష్టపడుట లేదేమో. నాకు ఆడపిల్లలు లేరు, నా ఇంటికి వచ్చే కోడలే నాకు కూతురు, నీ కూతుర్ని కళ్ళల్లో పెట్టి చూసుకుంటాననే మాయమాటలు చెప్పే మాయదారి తల్లులు, వివాహానికి ముందు సన్నాయి నొక్కులు నొక్కుతారు. కూతురికి పెళ్లిచేయడం ముఖ్యమేకాని తల్లిదండ్రులకు దూరంగా ఉండేవాడికి మాత్రమే ఆడపిల్లలను ఇవ్వాలి. అంత మాత్రాన కని పెంచిన తల్లిదండ్రులను దూరం చేయాలనేది నా భావన కాదు. దూరంగా ఉండి వారి బాగోగులు చూడడం, వారి అవసరాలు తీర్చడం కొడుకు కోడలు బాధ్యతగా స్వీకరించాలి. పెళ్ళికావలసిన ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులు గుర్తించాల్సిన విషయం.
ఈనాటి సమాజంలోని మగపిల్లలు తల్లిదండ్రుల ఆలోచన కొత్త పుంతలను తొక్కుచున్నది. అమ్మాయిలు దొరకడంలేదని కట్నకానుకలకు మేము ప్రాధాన్యత ఇవ్వడంలేదు. మీకు నచ్చినంత బంగారం మీ పిల్లకు పెట్టుకోండి, ఘనంగా పెళ్లి చేయండి అంటుంటారు. బిడ్డమీది ప్రేమతో, అనాదిగా వస్తున్న ఆచారంలో భాగంగా బంగారు ఆభరణాలు, బట్టలు, మంచం, పరుపులు ఇత్యాదులు ఇస్తూనే ఉన్నారు.
అమ్మాయితోబాటు అన్నీ ముట్టిన తరువాత అమ్మాయిని కట్టుబానిసగా చూడడం మొదలవుతుంది. చివరకు భార్యాభర్తలకు సంబంధం లేకుండా చేస్తున్నారు. ఈ కారణం చేతనే కావచ్చు, హిందూ సమాజంలో ప్రాధాన్యత సంతరించుకున్న ఉమ్మడి కుటుంబాలు కనుమరుగౌతున్నాయి. ఉమ్మడి కుటుంబాన్ని గౌరవించే కోడళ్ళు అత్తమామలకు సేవలు చేసే కోడళ్ళు తమ సుఖాన్ని పణంగా పెట్టాల్సి వస్తోంది. ఈనాటి సమాజంలో ఒంటరి కుటుంబాలకు ప్రాధాన్యతనివ్వడమే ఆడపిల్లలకు ఆనందాన్ని ఇస్తున్నదనేది వాస్తవమనిపిస్తుంది.
అమ్మాయిలు గౌరవంగా, సుఖంగా ఉండాలంటే ఈ సమాజంలో భవిష్యత్తులో ఇల్లరికం వివాహాలకు ప్రాధాన్యత పెరుగుతుందేమో అనిపిస్తుంది. ప్రతి ఆడపిల్ల భవిష్యత్తు తనపైననే ఆధారపడి ఉంటుంది తప్ప పుట్టినిల్లు, మెట్టినిల్లు ఎండమావిగా మారే అవకాశమే అధికమనిపిస్తుంది. ‘ఆడపిల్ల’ తస్మాత్ జాగ్రత్త!

-బలుసా జగతయ్య 90004 43379