మెయిన్ ఫీచర్

చిత్ర‘పురి’.. విప్పేదెవరో!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క సమస్యకు వంద పరిష్కారాలు. ఇది -హీరోయిజం. ఒక్క పరిష్కారానికి వంద సమస్యలు. ఇది -విలనిజం. 80ఏళ్ల తెలుగు సినీ చరిత్రలో ఏ కథను తడిమినా స్పర్శగా తగిలే సింపుల్ సూత్రమిదే.

తెరపై కథల్లో -సమస్యకు పరిష్కారాలు చూపే హీరోలుంటారు. తెరవెనుక నిలబడి -అలాంటి సినిమాను పుట్టించే శ్రామికులకు మాత్రం హీరో దొరకడం లేదు. అయనా -చిత్రపురిలోని సమస్యల ‘పురి’విప్పే హీరో లేకపోతాడా? రాకపోతాడా? అని కార్మికులు చాలాకాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. విజ్ఞప్తులు చేస్తున్నారు. ఉద్యమాలకు దిగుతున్నారు. ఏదోకరోజు -వాళ్ల కలల్ని నెరవేర్చే హీరో ఒకడొస్తాడని వాళ్ల నమ్మకం.

ఈ -కథ (వ్యధ) కామన్ ఆడియన్‌కు అర్థంకాకపోవచ్చు. కనీసం చూసి ఉండకపోవచ్చు. కాని -హైదరాబాద్ కేంద్రంగా ఏళ్లకు ఏళ్లు నడుస్తోన్న ఈ సినిమాను ఎన్నో ప్రభుత్వాలు చూసేశాయి. పట్టించుకున్న పాపానే పోలేదు. కాని -ఇప్పుడు నడుస్తున్నది ఉద్యమ తెలంగాణ. ఉద్యమానికి నడుంగట్టిన నాయకత్వమే -మళ్లీ గద్దెమీదుంది. బిడ్డలెక్కడివారైనా తన గడ్డమీద ఉన్నంతకాలం తన బిడ్డలేనని గట్టిగా చెబుతోన్న ప్రభుత్వమే పగ్గాలుపట్టింది. అందుకే -ఏళ్ల తరబడిన తమ ఎదురు చూపులకు పరిష్కారం చూపగలిగే హీరో ఈ ప్రభుత్వమేనన్న కొండంత ఆశతో కార్మికులున్నారు. తమ సమస్యను సర్కారు దృష్టికి తీసుకెళ్లేందుకు రోడ్లెక్కి ఎదరు చూస్తున్నారు. సర్కారు చల్లని చూపు తమవైపు ప్రసరించకపోతుందా? చిత్రపురి చెట్టునీడలో తమకూ వాటా దక్కకపోతుందా? అన్న గంపెడాశతో తిండీ తిప్పలు మానేసి నెల రోజులుగా నిరవధిక దీక్షలతో ఎండలో బతుకీడుస్తున్నారు. ఈ సస్పెన్స్ సినిమా అర్థంకావాలంటే -పూర్వాపరాలను కొంతైనా తడిమి చూడాలి.
***
ప్రేక్షకుడిని చలువ థియేటర్లకు ఆహ్వానించగలిగే సినీ కార్మికుడు మండుటెండలో బతకడాన్ని చూసి చలించిపోయాడు -ఒకనాటి భయంకర స్క్రీన్ విలన్. ఆయనే డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి. విలక్షణ నటుడిగా, వైవిధ్యమైన విలన్‌గా తెరపై ప్రేక్షకులను మెప్పించిన ప్రభాకర్ రెడ్డి నిజ జీవితంలో మెత్తటి మనీషి. అందుకే -గూడులేని కార్మికులను చూసి చలించిపోయాడు. ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర రెడ్డి హయాంలో ఓ సాత్విక ఉద్యమానికి నడుంగట్టాడు. అప్పటి కార్మిక శాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణను ఒప్పించి గుమ్మడి వెంకటేశ్వర రావులాంటి ఆదర్శనీయ నటులను సభ్యులుగా చేసుకుని -కార్మిక సంక్షేమానికి తనవంతు పాత్ర పోషించాడు. ఆ కృషి ఫలితమే -ప్రస్తుత చిత్రపురి కాలనీ. కులం, మతం, ప్రాంతంతో సంబంధం లేకుండా ఎక్కడెక్కడినుంచో బతుకుదెరువు కోసం వచ్చి -సినిమా ప్రపంచంలోని 24 శాఖల్లో కుదురుకున్న కార్మికులకు నీడనిచ్చే ప్రయత్నం అలా మొదలైంది. ఆ కృషి ఫలితంగా -కార్మికుల ఇళ్లకోసం అప్పటి ప్రభుత్వం 67 ఎకరాల పైచిలుకు స్థలాన్ని కేటాయించింది. భావి హైదరాబాద్ భవిష్యత్‌ను ముందే ఊహించిన ప్రభాకర్‌రెడ్డి సారథ్యంలోని కార్యవర్గం -అప్పటికి కొండలు, గుట్టలుగావున్న స్థలానే్న నివాసంగా ఇమ్మంటూ ఎంపిక చేసుకుంది. నిజాయితీగా కార్మిక సభ్యత్వాలు మొదలయ్యాయి. ఆ క్రమంలోనే -తన బాధ్యత తాను నిర్వర్తించానన్న సంతృప్తితో ప్రభాకర్ రెడ్డి కన్నుమూశాడు. సినీలోకంలోని కార్మిక సంక్షేమానికి ఇక తిరుగుండదన్న ఆత్మసంతృప్తితో ఆయన వెళ్లిపోయాడు. ఇది గతం.
తరువాత -సీన్ మారింది. తాజాగా ‘చిత్రపురి హిల్స్’గా పేరు మార్చుకున్న ఆ ప్రాంతం క్రమంగా బంగారమైంది. కొండలు, గుట్టలు కరిగాయి. వాటిపై మహా సౌథాలు మొలిచాయి. అక్కడినుంచే -ఆగడాలూ పుట్టుకొచ్చాయి. ట్వెంటీఫోర్ క్రాఫ్ట్స్‌లో అసలు సభ్యులకు ఆ కొండలపై గుత్త్ధాపత్యం క్రమంగా తగ్గింది. పెత్తందార్ల ప్రాబల్యం పెరిగింది. బంగారమైన కొండల్ని పిండుకోడానికి బినామీలు ముందుకొచ్చారు. కార్యవర్గాల కరుణ కటాక్షాలూ తోడవ్వడంతో -క్రమంగా బంగారం బినామీల పరమవుతూ వచ్చింది. అసలు ఎవరికోసం కాలనీ పుట్టిందో.. ఆ కార్మికులకు కొండపై చోటులేకుండా పోయందన్న వేదన వినిపిస్తోంది. ఇదీ వర్తమానం.
ఏళ్ల తరబడి సాగుతోన్న సమస్య పరిష్కారానికి ఏ ఒక్క హీరో ముందుకు రాలేదు. సమస్యను ఎలా అధిగమించాలో బడుగు బలహీన శ్రామిక వర్గాలకు తెలీలేదు. కడుపు మండినపుడు -రోడ్డెక్కారు. నీరసం వచ్చినపుడు -నీడ దక్కకపోతుందా? అని ఎదురు చూస్తూ కూర్చున్నారు.
తాజాగా చిత్రపురి పోరాట సమితి ఒకటి మళ్లీ రోడ్డెక్కింది. ఇళ్లు దక్కని అర్హులంతా సమూహమయ్యారు. కాలనీలో ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకల నిగ్గు తేల్చాలంటూ నిరవధిక నిరాహార దీక్షలకు దిగారు. మన భూమి, మన ఇల్లు, మన హక్కు నినాదంతో పోరాటం చేస్తున్నారు. సినీ కార్మికులకు ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల్లో 70 శాతం బినామీలే ఆక్రమించారన్నది వాళ్ల ఆరోపణ. అందుకు -ఒక్కో బినామీ నుంచి లక్ష నుంచి 20 లక్షల వరకూ లంచాలు చేతులు మారాయన్నది ఆవేదన. జూనియర్ ఆర్టిస్ట్, మ్యూజీషియన్, డైలాగ్ ఆర్టిస్ట్, డైరెక్టర్స్, రైటర్స్ అసోసియేషన్ల నుంచి సభ్యత్వాలు సృష్టించి -ఎన్నారైలు, ఇంజనీర్లు, బ్యాంక్ ఉద్యోగులు, బిల్డర్లు, డాక్టర్లకు అడ్డదారిలో ఇళ్లు కేటాయించి, కోట్లు గడిచారన్నది ఆగ్రహం. చిత్రపురి కాలనీలో సాగుతోన్న తంతుపై విచారణ జరిపించాలంటూ చిత్రపురి పోరాట సమితి డిమాండ్ చేస్తోంది. అడ్డదారుల్లో ఇళ్లను ఆక్రమించుకున్న సినిమాయేతరులను వెంటనే ఖాళీ చేయించి, నిలువనీడలేక ఎండలో మగ్గుతోన్న అసలు కార్మికులకు ఇళ్లివ్వాలని డిమాండ్ చేస్తోంది. చిత్రపురి పోరాట సమితికి తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ మద్దతు దొరికింది. ఉద్యమం ఊపందుకుంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, అర్హులైన లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చాడు అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్. సో, కథ రసకందాయంలో పడింది. స్క్రీన్‌మీద హీరోయిజాన్ని చూపిస్తూ -సామాజిక అంశాలపై సందేశాలిస్తున్న హీరోలంతా.. సొంతింటి సమస్యపై కదలాల్సిన సమయం ఆసన్నమైంది. తెరపై స్టార్‌హీరోలుగా ఎదిగేందుకు.. తెరవెనుక నలిగిపోతున్న కార్మిక సమస్యను సామాజిక సమస్యగా పరిగణించి మద్దతు పలుకుతారో లేదో చూడాలి. అలాగే పరిశ్రమలో ‘పెద్దల’ గౌరవాన్ని అందుకుంటున్న వివిధ విభాగాధిపతులు ఈ సమస్యపై ఎంతమేర దృష్టి కేంద్రీకరిస్తారన్నదీ చూడాలి. కోట్ల రూపాయల్లో అవినీతి జరుగుతోందంటూ నిరాశ్రయ కార్మికులు గగ్గోలు పెడుతోన్న నేపథ్యంలో -ప్రభుత్వం తన బాధ్యతను ఎంతవరకూ నిర్విర్తిస్తుందన్నదీ వెండితెరపైనే చూడాలి మరి.
*
సర్కారుకు వివరిస్తా
చిత్రపురి పోరాట సమితి ఉద్యమానికి అగ్రభాగాన నిలుస్తా. వాళ్ల ఆరోపణల్లో వాస్తవముంది. 24 క్రాఫ్ట్స్‌లోని కార్మికులు కానివాళ్లు బినామీలుగా రాజ్యమేలుతున్నారన్నది నిజం. ఐదువేల పైచిలుకు నిజమైన కార్మికులకు ఇళ్లు దక్కాల్సి ఉంది. కార్మికులు దీక్షలకు దిగినా -చిత్రపురి హౌసింగ్ సొసైటీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించటం దారుణం. అందుకే అవకతవలను సర్కారు దృష్టికి తీసుకెళ్లాలనే నిర్ణయించుకున్నా. కాలనీలో ఎల్‌ఐజి, ఎంఐజి, హెచ్‌ఐజి, డూప్లెక్స్‌లు ఉన్నాయి. హోదానుబట్టి, ఆర్థిక స్థోమతనుబట్టి కేటాయించాలన్నది ఒక విధానం. దానికి విరుద్ధంగా వ్యవహారం సాగుతోంది. ఎంతోమంది అసలైన కార్మికులు లబ్దిదారులుగావున్న ఎంఐజీలను ఏళ్ల తరబడి కొనసాగిస్తున్నారే తప్ప, పూర్తి చేయడం లేదు. ఎందుకో కమిటీనుంచి సమాధానం లేదు. బినామీ సభ్యుల ఇళ్లు మాత్రం పూర్తి చేసేశారు. వాళ్లకు అప్పగించేశారు. ఇంతకంటే దారుణం ఏముంటుంది?. సినీ కార్మికుల నివాసాలకు ఇచ్చిన స్థలాన్ని ఓ గ్లోబల్ స్కూల్‌కి కేటాయించడం చట్టవిరుద్ధం. కైరోస్ పేరిట సాగుతోన్న ఆ స్కూల్లో -కార్మికుల పిల్లలు చేదివే పరిస్థితి లేదు. అందుకే కైరోస్‌ను తొలగించి -కార్మికుల స్థోమతుకు అనువైనదైన స్కూల్‌ను అక్కడ ఏర్పాటు చేయాలి. అంతేకాదు, ప్రభుత్వం మరో తొమ్మిది ఎకరాలు సినీ కార్మికుల కోసం కేటాయించాలని చిత్రపురి పోరాట సమితి డిమాండ్ చేస్తోంది. ఈ విషయాన్నీ సానుకూలంగా పరిశీలించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. ప్రధానంగా మూడు అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. జరుగుతోన్న అవకతవకలపై చట్టబద్ధమైన విచారణ జరగాలి. కార్మిక పిల్లలు చదవుకోడానికి వీలులేని కైరోస్ స్కూల్‌ను తప్పించి -పిల్లల స్థోమతుకు తగిన స్కూలు ఏర్పాటు చేయాలి. ఏళ్ల తరబడి ఆగిపోయిన ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసి -అర్హులైన లబ్దిదారులకు అందచేయాలి. ఈ మూడు అంశాలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లేందుకు నావంతు ప్రయత్నం నేను చేస్తా.
-ప్రతాని రామకృష్ణ గౌడ్,
తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్
*
చిత్రాలు.. సినీ కార్మికులను ఏళ్ల తరబడి ఊరిస్తున్న ఎంఐజి రో.
*చిత్రపురి కాలనీలో నిర్మించిన కైరోస్ గ్లోబల్ స్కూల్
*అనుమతులు లేకుండా నిర్మించారని కార్మికులు చెబుతోన్న డూపె లక్స్‌లు